Share News

Andhra Pradesh Development: దార్శనికులైన నాయకులు లీ క్వాన్ యూ, చంద్రబాబు

ABN , Publish Date - Aug 02 , 2025 | 04:35 AM

మూడో ప్రపంచ వర్ధమాన దేశంగా ఉన్న సింగపూర్‌ను అతి తక్కువ కాలంలో మొదటి ప్రపంచ అగ్ర దేశాల సరసన నిలిపిన దార్శనికుడైన

Andhra Pradesh Development: దార్శనికులైన నాయకులు లీ క్వాన్ యూ, చంద్రబాబు

మూడో ప్రపంచ వర్ధమాన దేశంగా ఉన్న సింగపూర్‌ను అతి తక్కువ కాలంలో మొదటి ప్రపంచ అగ్ర దేశాల సరసన నిలిపిన దార్శనికుడైన నాయకుడు లీ క్వాన్ యూ. అలాగే విభజన గాయంతో విలవిలలాడిన అవశేష ఆంధ్రప్రదేశ్‌ని అచిరకాలంలోనే ప్రతికూలతలకు ఎదురీది, పునర్నిర్మించి శిఖరాగ్రాన నిలబెట్టారు నారా చంద్రబాబు నాయుడు. శక్తిమంతమైన నాయకులైన వీరిద్దరికీ దగ్గరి పోలికలు ఉన్నాయని, ప్రపంచ నగరాల సదస్సులో పాల్గొనేందుకు చంద్రబాబు సింగపూర్ పర్యటనకు వెళ్ళిన సందర్భంగా అప్పటి ఆ దేశ ఆర్థికమంత్రి క్వేట్ ప్రశంసించారు. అక్కడి ప్రముఖులు కూడా దార్శనికుడు లీ క్వాన్ యూతో చంద్రబాబును సరి పోల్చారు. 2014–19 మధ్య ఆంధ్రప్రదేశ్‌ను ప్రగతిపథంలో చంద్రబాబు నడిపిస్తున్న తీరు, రాష్ట్ర బంగారు భవితవ్యాన్ని ఆవిష్కరించిన అద్భుత సందర్భం అది. చంద్రబాబు సమర్థ నాయకత్వం, దార్శనికత, వినూత్న విధానాలతో మెరుగైన పాలన అందిస్తున్న విషయం సింగపూర్ ప్రజలకు తెలుసు అని క్వేట్‌ అన్నారు. ‘దార్శనికుడు లీ క్వాన్ యూ–చంద్రబాబు ఇద్దరు భారీ లక్ష్యాలను ముందు పెట్టుకొంటారు. వాటిని సాధించేందుకు ఎంతో శ్రమిస్తారు. వారి పట్టుదల, దీక్షా దక్షతలే ఉభయ ప్రాంతాలను పతనం అంచుకి చేరకుండా సురక్షితంగా నిలిపాయి’ అన్నారు క్వేట్. రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా, దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా నిలపడానికి చంద్రబాబు చేస్తున్న కృషి నిరుపమానమని, అందుకే ఈ ఇద్దరి సారథ్యాలు, సారూప్యాలు ఒక్కటే అన్నారు క్వేట్.


రాష్ట్రంలో పెట్టుబడుల సాధనే లక్ష్యంగా ఇటీవల సీఎం చంద్రబాబు నాలుగు రోజుల పర్యటనకు సింగపూర్ చేరుకున్నప్పుడు, అక్కడున్న తెలుగు ప్రజలు ఘనస్వాగతం పలికారు. సింగపూర్‌లో నాలుగు రోజులు పర్యటించి విరామం లేకుండా వివిధ సంస్థల ప్రతినిధులతో వరుసగా సమావేశమై ఏపీలో ఉన్న సానుకూల అంశాలను వివరిస్తూ... పెట్టుబడులు పెట్టాలని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని, పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌. అక్కడ జరిగిన దాదాపు 26 కార్యక్రమాలలో వారు పాల్గొన్నారు. అక్కడున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను సందర్శించి, వాటిని మన రాష్ట్రంలో అమలుచేసేందుకు వీలుగా అధ్యయనం చేశారు. సీఎం చంద్రబాబు బృందానికి సింగపూర్‌లో భారత హైకమిషనర్ శిల్పక్ అంబులే సహకరించారు. చంద్రబాబు బ్రాండ్‌తోనే పెట్టుబడుల వరద రాష్ట్రాన్ని ముంచెత్తబోతుంది. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు ఉన్న అపార అవకాశాలు వివరించి, భారీ పెట్టుబడులతో పారిశ్రామిక, వ్యాపార దిగ్గజాలు రాష్ట్రానికి రావడానికి గట్టి ప్రయత్నం చేశారు. రానున్న రోజుల్లో పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ కంపెనీలు ముందుకు వచ్చాయి. పెట్టుబడులను ఆకర్షించి, పారిశ్రామికాభివృద్ధి సాధించి, ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా అయిదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించి యువతకు బంగారు బాటలు వెయ్యడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారు. పెట్టుబడిదారులకు రాష్ట్రంలో ప్రాంతాల వారీగా వర్తక, వాణిజ్య, పరిశ్రమల ఏర్పాటు అవకాశాలు, అందుబాటులో ఉన్న వనరుల గురించి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. పెట్టుబడుల రంగంలో దిగ్గజ కంపెనీగా ఉన్న టెమాసెక్‌ హోల్డింగ్స్‌కు చెందిన పోర్ట్‌ఫోలియో డెవలప్‌మెంట్‌, కార్పొరేట్‌ స్ట్రాటజీ విభాగం జాయింట్‌ హెడ్‌ దినేశ్‌ ఖన్నాతో కీలక చర్చలు జరిపారు. అనేక దిగ్గజ కంపెనీలైన క్యాపిటాల్యాండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ (ఇండియా), మందాయ్‌ వైల్డ్‌ లైఫ్‌ గ్రూప్‌, సుమితోమో మిత్సుయ్‌ బ్యాంకింగ్‌ కార్పొరేషన్‌, టెమ్‌సెక్‌ హోల్డింగ్స్‌ వంటి సంస్థల ప్రతినిధులతో చంద్రబాబు వేర్వేరుగా చర్చలు జరిపారు. పోర్టులు, ఎయిర్‌పోర్టుల ద్వారా అభివృద్ధికి రూపొందించుకున్న ప్రణాళికలను వారికి వివరించారు. సింగపూర్‌ పర్యటన ముగించుకుని రాష్ట్రానికి తిరుగు పయనమైన సీఎం చంద్రబాబుకు అక్కడి తెలుగు ప్రజలు ఘనంగా వీడ్కోలు పలికారు.


జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలతో ఆంధ్రప్రదేశ్ బ్రాండ్‌ దెబ్బతిన్న పరిస్థితుల్లో మళ్లీ ఏపీ బ్రాండ్‌ను నిలబెట్టేందుకు సీఎం చంద్రబాబు, విద్యామంత్రి నారా లోకేశ్‌ సింగపూర్ పర్యటనలో అలుపెరుగకుండా శ్రమించారు. ఏపీ బ్రాండ్‌ ఇమేజ్‌ను తిరిగి తీసుకొచ్చేందుకు వారు చేసిన ప్రయత్నాలు ఫలించబోతున్నాయి. రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి ప్రభుత్వం తెచ్చిన నూతన పాలసీల ఫలితంగా పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ స్వర్గధామంగా నిలవనుంది. నూతన పాలసీలు పారిశ్రామిక వికాసంపై విశ్వాసం కలిగిస్తున్నాయి. విదేశీ కంపెనీలు సైతం పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రానున్నాయి. 15 శాతానికి పైగా వృద్ధిరేటు సాధనే లక్ష్యంగా నూతన పారిశ్రామిక పాలసీలు రూపొందించింది ఏపీ ప్రభుత్వం. రాష్ట్రంలో ‘స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌’ ప్రకటించిన నేపథ్యంలో ఆ దిశగా పెట్టుబడులు బారులు తీరే అవకాశం ఉంది.


స్వర్ణాంధ్ర–2047 లక్ష్యాలను చేరుకునే క్రమంలో రాష్ట్ర పారిశ్రామిక ముఖచిత్రాన్ని మార్చడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు సర్కారు చర్యలు తీసుకుంటున్నది. ఈ క్రమంలోనే విశాఖపట్నం వేదికగా నవంబరు 14, 15 తేదీల్లో భాగస్వామ్య సదస్సు–2025ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దేశం యావత్తూ ఇప్పుడు ఏపీ వైపు చూస్తోంది. అయిదేళ్ల విధ్వంసం తర్వాత పడి లేచిన కెరటంలా రాష్ట్ర అభివృద్ధికి బాటలు పడనున్నాయి. రాష్ట్రాన్ని ఆర్థికంగా పరిపుష్టం చెయ్యడానికి చంద్రబాబు వీలైనన్ని మార్గాలను అన్వేషిస్తున్నారు. పోర్టులు, సుదీర్ఘ తీరప్రాంతం ఏపీ సొంతం. డీప్ పోర్టులు కలిగివున్న ఏపీని లాజిస్టిక్ హబ్‌గా మలచాలన్న ఆశయంతో చంద్రబాబు శతవిధాలా కృషి చేస్తున్నారు. ఏపీ వ్యాపార వాణిజ్య అభివృద్ధిలో దేశానికి తూర్పుతీర ముఖద్వారంగా ఆవిర్భవించనున్నది.


ఆంధ్రప్రదేశ్‌లో ఓడరేవుల అభివృద్ధికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌కి 974 కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతం ఉండటం అత్యంత ప్రాధాన్యతాంశం. ప్రస్తుతం 6 పోర్టులు ఉన్నాయి. కొత్తగా మరో 4 రానున్నాయి. ఈ పోర్టులను అనుసంధానం చేస్తూ రైలు, రోడ్డు మార్గాలు ఏర్పాటు చేయాలని, అంతర్గత జల రవాణా వ్యవస్థ ద్వారా సరకు రవాణాకు ఉపయోగించి, తీరప్రాంతాన్ని అభివృద్ధి చేసి, పోర్టు ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించినట్లు సింగపూర్ పర్యటనలో వివిధ కంపెనీల సీఈవోలకు ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు. పారిశ్రామికవేత్తల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతులు కల్పిస్తామని, పెట్టుబడులతో వచ్చే వారికి సహకరిస్తామని, తీరప్రాంతంలో పెట్టుబడులకు ఇది సరైన సమయం అన్నారు. ఏది ఏమైనా జగన్‌ నిర్వాకంతో దెబ్బతిన్న రాష్ట్ర ఇమేజ్‌ను సరిచేయడంతో పాటు సింగపూర్‌ ప్రభుత్వంతో సంబంధాలను పునరుద్ధరించే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌ అక్కడ నాలుగు రోజుల పాటు విస్తృతంగా పర్యటించి, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పెట్టుబడిదారులను ఆహ్వానించడం హర్షించదగిన విషయం.

-కలిశెట్టి అప్పలనాయుడు పార్లమెంట్ సభ్యులు,

, విజయనగరం

Updated Date - Aug 02 , 2025 | 04:35 AM