Share News

AP Irrigation: ఇంజనీర్ల సలహా మండలి తక్షణావసరం!

ABN , Publish Date - Apr 29 , 2025 | 05:38 AM

కూతురు పెళ్లి, గంగ జాతర, పంట నూర్పిళ్లు, కుమ్మూ దుమ్మూ అన్నీ ఒకేసారి వచ్చి పడ్డాయనే సామెత ఉంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో సాగునీటి రంగం– ప్రధానంగా అంతర్ రాష్ట్ర జల వివాదాలు– ఇలాంటి దురవస్థనే ఎదుర్కొంటున్నాయి....

AP Irrigation: ఇంజనీర్ల సలహా మండలి తక్షణావసరం!

కూతురు పెళ్లి, గంగ జాతర, పంట నూర్పిళ్లు, కుమ్మూ దుమ్మూ అన్నీ ఒకేసారి వచ్చి పడ్డాయనే సామెత ఉంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో సాగునీటి రంగం– ప్రధానంగా అంతర్ రాష్ట్ర జల వివాదాలు– ఇలాంటి దురవస్థనే ఎదుర్కొంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా అంతర్ రాష్ట్ర జల వివాదాలపై అవసరమైన మేరకు దృష్టి పెట్టడం లేదు. రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో అంతర్ రాష్ట్ర జల వివాదాల్లో సమగ్ర అవగాహన గల ఇంజనీరింగ్ వింగ్ ఉండాలి. సాధారణంగా ఇటువంటి వింగ్ జల వనరుల శాఖ కన్నా ముఖ్యమంత్రి అధీనంలో వుండాలి. కేసీఆర్ వ్యవహార సరళి అందరికీ నచ్చకున్నా గతంలో తెలంగాణలో అటువంటి వింగ్ ముఖ్యమంత్రి అధీనంలో పని చేసేది. ఆ సమయంలో మన రాష్ట్రంలో జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా కేసీఆర్‌తో చెట్టాపట్టాలేసుకు తిరిగినా ఆయన హయాంలోనూ ఈ విధానం అమలులో లేదు. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు వద్దా ఇది లేదు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో గోదావరి బనకచర్ల అనుసంధానం లాంటి భారీ సాగునీటి పథకం అమలుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సకల యత్నాలు చేస్తున్నా ఇటువంటి ఏర్పాటు లేకపోవడంతో కొన్ని ఇబ్బందులు తప్పడం లేదు.


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ తదుపరి రాష్ట్ర జల వనరుల శాఖలో పని చేసి ఉద్యోగ విరమణ చేసిన పలువురు నిపుణులైన ఇంజనీర్లు మనకు ఉన్నారు. వీరి సేవలు రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించుకొంటే మెరుగైన సత్ఫలితాలు పొందవచ్చు. వాస్తవంలో గోదావరి బనకచర్ల అనుసంధాన పథకాన్ని నవ్యాంధ్ర రిటైర్డ్ ఇంజనీర్స్ అసోసియేషన్ ప్రప్రథమంగా తెరమీదకు తెచ్చింది. గోదావరి కృష్ణ అనుసంధానం అంటూ కేసీఆర్, జగన్మోహన్‌రెడ్డి డ్రామాలాడిన సమయంలో అసోసియేషన్ తరపున ఈ ప్రతిపాదనతో జగన్మోహన్‌రెడ్డికి లేఖ రాశారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గోదావరి బనకచర్ల అనుసంధానం ప్రముఖంగా తెర మీదకు తెచ్చినపుడు కూడా ఈ అసోసియేషన్ విలువైన సూచన చేస్తూ ముఖ్యమంత్రికి లేఖ రాసింది. ఇలా మనకు గతంలో ఇరిగేషన్ శాఖలో పని చేసి ఉద్యోగ విరమణ చేసిన ప్రముఖులైన ఇంజనీర్లు ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవ తీసుకొని ఇలాంటి వారితో సలహా మండలి ఏర్పాటు చేస్తే ఎంతో ఉపయుక్తం. కొత్త పథకాలకు డీపీఆర్‌లు రూపొందించే సమయంలోనూ, ట్రిబ్యునల్ వద్ద గాని గ్రీన్ ట్రిబ్యునల్ సుప్రీంకోర్టుల్లో కేసుల విచారణ సందర్భంలో సలహా మండలి సభ్యుల సేవలు ఉపయోగపడతాయి.

కూటమి ప్రభుత్వం తన హయాంలో ఎన్నెన్నో భారీ సాగునీటి ప్రాజెక్టులు చేపట్టినా బచావత్ ట్రిబ్యునల్ అవశేష ఆంధ్రప్రదేశ్‌కు చేసిన కేటాయింపులు కాపాడుకోవడంపైనే రాష్ట్ర సాగునీటి రంగం భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఇందులో ఏం తప్పిదం జరిగినా రాష్ట్ర ప్రభుత్వం నింద మోయవలసి ఉంది. పైగా జగన్మోహన్‌రెడ్డి, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల ముందు ముద్దాయిలుగా నిలబడవలసి ఉంటుంది. గోదావరి బనకచర్ల అనుసంధానం, పోలవరం లాంటి పది ప్రాజెక్టులు కూడా బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపుల ముందు దిగదుడుపే.

ఇప్పటివరకు వెలువడిన వార్తల మేరకు ట్రిబ్యునల్‌లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు సమర్థవంతంగా వినిపించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి స్థాయిలో సమీక్షా సమావేశం జరగలేదు. అవతల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు సమావేశాలు, జలవనరుల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి రెండు సమీక్షా సమావేశాలు నిర్వహించారు. తుదకు ఆంధ్ర ప్రదేశ్‌లో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రైనా అలాంటి సమావేశం నిర్వహించినట్లు వార్తలు వెలువడలేదు. మరోవేపు అసలు ట్రిబ్యునల్ నియామకాన్నే సుప్రీంకోర్టులో సవాల్ చేసిన కేసు ఆ మధ్య విచారణకు వచ్చింది. కాని తర్వాత ఏమైనదీ తెలియదు. రాష్ట్ర విభజన చట్టం మేరకు రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలు పరిష్కారం కావలసి వుండగా 1956 అంతర్ రాష్ట్ర జల వివాద చట్టం కింద ట్రిబ్యునల్ నియామకం సరికాదనే వాదనతో కేసు నడుస్తోంది. అతి ముఖ్యమైన ఈ కేసులను ఢిల్లీ స్థాయిలో పర్యవేక్షణకు నిపుణులైన ఇంజనీరింగ్ అధికారులు నియమింప బడినట్లు కించిత్తు సమాచారం కూడా లేదు.


ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న గోదావరి బనకచర్ల అనుసంధాన పథకాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని ఇటీవల తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ప్రకటించారు. ముఖ్యమంత్రి ఇంత పట్టుదలగా ఉన్న ఈ పథకం గురించి సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం కెవియట్ వేయవలసి ఉంది.

వంశధార ట్రిబ్యునల్ తీర్పు గురించి ఇటీవల కేంద్ర జలశక్తి శాఖకు చెందిన ఒక డాక్యుమెంట్ సరికొత్త సమాచారం తెలియజేసింది. వంశధార ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టులో కేసులు నడుస్తున్నాయి. గాని సుప్రీంకోర్టు స్టే ఇవ్వలేదు. అయినా ట్రిబ్యునల్ తీర్పు గెజెట్ నోటిఫికేషన్ జరగలేదు. ఒకింత ఆశ్చర్యమే. 2010లో నియమింపబడిన ట్రిబ్యునల్ 2017 సెప్టెంబర్‌లో మధ్యంతర తీర్పు ఇచ్చింది. 2018లో ఒడిషా సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. కాని స్టే ఇవ్వలేదు. తిరిగి ట్రిబ్యునల్ తన తీర్పుకు వివరణ ఇస్తూ 2019లో మరో తీర్పు ఇచ్చింది. ఆ వెంటనే ఒడిషా మరో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. అంతిమంగా ట్రిబ్యునల్ 2021 జూన్‌లో తుది తీర్పు ఇస్తే ఒడిషా ప్రభుత్వం మరో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. కాని సుప్రీంకోర్టు స్టే ఇవ్వలేదు. 2021లో ట్రిబ్యునల్ తుది తీర్పు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా జగన్మోహన్‌రెడ్డి కేంద్ర జల వనరుల శాఖ మంత్రికి సెప్టెంబర్‌లో లేఖ రాసి చేతులు దులుపుకున్నారు. ఇప్పటికీ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. వంశధార ట్రిబ్యునల్ ఆంధ్రప్రదేశ్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. నేరెడి వద్ద బ్యారేజీతో పాటు సైడ్‌వేర్ నిర్మాణానికి అనుమతి ఇచ్చింది. ఈ తీర్పు అమలు జరిగితే స్వల్ప వ్యయంతో వంశధార నాగావళి నదుల అనుసంధానం సులభతరమౌతుంది. రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ కెవి సుబ్బారావు ద్వారా తెలిసిన (ఆర్టికల్‌లో) సమాచారమేమంటే తీర్పు వెలువడిన అనంతరం చీఫ్ సెక్రటరీ ఒడిషా వెళ్లి ఒక కమిటీ తీర్పుకు అంగీకరించారని అనంతరం ఎవరూ దీని విషయం పట్టించుకోలేదట.


కాని జగన్మోహన్‌రెడ్డి హయాంలో జరిగిన ఒక సమీక్ష సమావేశంలో సుప్రీంకోర్టులో కేసు పరిష్కారమైతే తప్ప ముందుకు వెళ్లలేమని రాష్ట్ర జల వనరుల శాఖాధికారులు తెలియజేశారు. ఇందులో ఏది వాస్తవమో కొమ్ములు తిరిగిన నేతలు శ్రీకాకుళం జిల్లాలో ఉన్నా ఎవరూ పట్టించుకోలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన వారి సేవలు ఈ సందర్భంగా ఉపయోగించుకొంటే ఇలాంటి మరుగు పడిన అనేక అంశాలు వెలుగుచూస్తాయి.

వి. శంకరయ్య

విశ్రాంత పాత్రికేయులు

ఇవి కూడా చదవండి

Jagga Reddy: జగ్గారెడ్డి మాస్ డైలాగ్.. రాజకీయాల్లో విలన్ మేమే, హీరోలం మేమే

Meta AI Chatbot: అశ్లీలతకు అడ్డాగా మారిన మెటా ఏఐ చాట్ బాట్స్

Updated Date - Apr 29 , 2025 | 06:58 AM