Mettu Ramachandra Prasad: అలుపెరుగని పద్యం ‘మెట్టు’
ABN , Publish Date - Apr 29 , 2025 | 05:33 AM
ఆయనో అలుపెరుగని పద్యం. సింహపురి సాహితీ భీష్ముడు. తన ప్రసంగ గంభీరతతో మృదు మధుర భాషణంతో నెల్లూరు సాహితీలోకంలో ధృవతారగా వెలిగిన నేపథ్యం ఆయన సొంతం. ఆయనే ప్రబంధకర్త...

ఆయనో అలుపెరుగని పద్యం. సింహపురి సాహితీ భీష్ముడు. తన ప్రసంగ గంభీరతతో మృదు మధుర భాషణంతో నెల్లూరు సాహితీలోకంలో ధృవతారగా వెలిగిన నేపథ్యం ఆయన సొంతం. ఆయనే ప్రబంధకర్త, పద్య కళాపరిషత్ సారథి మెట్టు రామచంద్రప్రసాద్. వి.ఆర్. కళాశాల విశ్రాంత ఆంధ్రోపన్యాసకునిగా పేరుగాంచిన ప్రతిభామూర్తి. సినీకవి వెన్నెలకంటి, గాయకుడు గిరీశం వంటివారు శిష్యబృందంలో ఉన్నారు. పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తన గురువు హనుమజ్జానకీరామశర్మ పేర ఇచ్చే అవార్డును ఈ మధ్యనే నెల్లూరు టౌన్ హాలులో వెంకయ్యనాయుడు చేతుల మీదుగా అందుకున్నారు రామచంద్ర ప్రసాద్. 2007లో పద్య కళాపరిషత్ స్థాపించిన నాటి నుంచి గరికపాటి నరసింహారావు, మేడసాని మోహన్ లాంటి ఉద్దండుల చేత ఉపన్యాసధారలో సింహపురీయుల్ని ముంచెత్తిన ఋషితుల్యుడు. తిక్కన పుట్టినగడ్డపై జన్మించి, పద్దెనిమిది పర్వాల మహాభారతాన్ని ఒక్కో ఆశ్వాసం ఒక్కొక్కరి చేత చెప్పించి మెప్పించిన ధీరోదాత్త హృదయుడు రామచంద్రప్రసాద్. పోలూరి హనుమజ్జానకీరామశర్మ పుస్తకాలపై ప్రసంగాలను అలుపెరుగక అందించిన సాహితీ కృషీవలుడు ఆయన.
సుశీల, మహాప్రస్థానం– నవలలు; ఏడుకొండలవాడు, బస్సులో ప్రయాణం, ఒక్క రాత్రి... మొదలైన నాటికలు; చదరంగం, రోగుల గాథలు, సోమరి జీవులు మొదలగు కథానికలు; కలల రాణి, విజ్ఞానదీపాలు అనే గేయాలు రచించి వచించారు ఆయన. అయితే ఇవన్నీ అముద్రితాలు కావడం బాధాకరం. మరో రోగుల గాథలు, విజ్ఞానదీపాలు తప్ప ఆనాటి ఆయన రచనలన్నీ కాలగర్భంలో కలిసిపోయాయి. ఆయన రాసిన శివగామిని ప్రబంధ లక్షణాలతో అలరారిన మహోన్నత పద్యకావ్యం. 1967లో రచించిన ఈ గ్రంథం ప్రథమ ముద్రణ 1971లోను, ద్వితీయ ముద్రణ 2019లోనూ, తృతీయ ముద్రణ 2020లోనూ జరిగి, పండిత కవుల చేత ప్రశంసలనందుకున్నది. ఈ ఏప్రిల్ 22న సెలవంటూ వెళ్ళిపోయిన రామచంద్రప్రసాద్, సాహితీ లోకానికి చేసిన సేవలు చిరస్మరణీయం. ఆయన అముద్రిత రచనల్ని అచ్చువేయడమే ఆయనకు మనమిచ్చే నివాళి.
చిన్ని నారాయణరావు
ఇవి కూడా చదవండి
Jagga Reddy: జగ్గారెడ్డి మాస్ డైలాగ్.. రాజకీయాల్లో విలన్ మేమే, హీరోలం మేమే
Meta AI Chatbot: అశ్లీలతకు అడ్డాగా మారిన మెటా ఏఐ చాట్ బాట్స్