Share News

Telangana Labour Law: గిగ్‌ వర్కర్లకు భరోసా, భద్రత!

ABN , Publish Date - Apr 29 , 2025 | 05:41 AM

ఎండా, వానా, చలీ అనుకోకుండా రద్దీ ట్రాఫిక్‌లో వేగవంతమైన బైక్ ప్రయాణంతో ఎక్కే గడపా దిగే గడపాగా జీవనోపాధి ఎంచుకున్న వీళ్ళు ఎవరసలు? మన జీవితంలో ఎలా భాగమయ్యారు? వాళ్ళ జీవితాలేమిటి? వాళ్ళ ఆదాయాలేమిటి?....

Telangana Labour Law: గిగ్‌ వర్కర్లకు భరోసా, భద్రత!

ఎండా, వానా, చలీ అనుకోకుండా రద్దీ ట్రాఫిక్‌లో వేగవంతమైన బైక్ ప్రయాణంతో ఎక్కే గడపా దిగే గడపాగా జీవనోపాధి ఎంచుకున్న వీళ్ళు ఎవరసలు? మన జీవితంలో ఎలా భాగమయ్యారు? వాళ్ళ జీవితాలేమిటి? వాళ్ళ ఆదాయాలేమిటి? వాళ్లకున్న సమస్యలేమిటి? వారికున్న హక్కులేమిటి? మనం ఎప్పుడైనా ఆలోచించామా?

సాధారణంగా వీళ్ళను గిగ్ లేదా ప్లాట్‌ఫామ్‌ కార్మికులంటారు. అమెరికా, యూరప్‌లలో ‘gig’ అంటే, డిక్షనరీ అర్థం ప్రకారం, చిన్న స్వతంత్ర పని లేదా ఒప్పంద ఆధారిత ఉద్యోగం. నిజానికి భారత దేశంలో app (ఏప్‌) ఆధారితంగా జరుగుతున్న పనులను అంతా తాత్కాలిక ప్రాతిపదికన ఎవరూ ఎంచుకోవడం లేదు. ఎక్కువమంది ఈ కార్మికులు రోజుకు 12 నుండీ 14 గంటల పాటు పని చేస్తున్నారు. కొన్ని ఏప్‌ ఆధారిత కంపనీలు, ‘‘రోజుకు 14 గంటలు పని చేయండి, కేవలం 6 గంటలు నిద్రపోండి, నెలకు యాభై వేలు సంపాదించండి’’ లాంటి వాణిజ్య ప్రకటనలను అధికారికంగానే విడుదల చేస్తున్నాయి. వీరి విషయంలో 8 గంటల పని దినం అనేది అసలు లేకుండా పోయింది.

ప్లాట్‌ఫామ్‌ అంటే, ఏదో ఒక ఏప్‌ ఆధారంగా పని చేయడం. ఇప్పటికే తెలంగాణలో ఏప్‌ ఆధారిత ప్రధాన కంపనీలు పదికి పైగా ఉన్నాయి. ముఖ్యంగా ఫుడ్ డెలివరీ రంగంలో స్విగ్గి, జొమాటో; రైడ్ షేరింగ్ రంగంలో ఓలా, ఊబర్, రాపిడో, పోర్టర్, ఇతర ఈకామర్స్; గ్రాసరీ డెలివరీ రంగంలో అమెజాన్, బిగ్ బాస్కెట్, బ్లింక్ ఇట్, ఫ్లిప్‌కార్ట్, మంత్ర; ఇతర సర్వీసుల రంగంలో అర్బన్ కంపెనీ లాంటి పెద్ద కంపెనీలు ఉన్నాయి. హైదరాబాద్‌కే పరిమితం కాకుండా కొన్ని కంపెనీలు, కొన్ని టూటైర్ సిటీలకు కూడా తమ వ్యాపార సేవలను విస్తరించాయి. తెలంగాణ రాష్ట్రంలో ఇలా ఏప్‌ ఆధారిత పనులు చేసు కుంటున్న వారి సంఖ్య 4,20,000 వరకూ ఉంటుందని ఒక అంచనా.

ఎంత పని చేసినా, ఈ సేవల కార్మికులు రూ.15వేల నుంచి 18 వేల దాకా, రైడ్ షేరింగ్ కార్మికుల విషయంలో రూ.20వేల నుంచి 25వేల దాకా సంపాదించడం గగనంగా మారింది. వీరికి నిర్దిష్ట వేతనాలు లేవు. కనీస ఆదాయానికి గ్యారంటీ లేదు.


కంపెనీలు ఈ డెలివరీ బాయ్స్‌ను కార్మికులుగా గుర్తించవు కాబట్టి, ఇతర రంగాల కార్మికుల కోసం దశాబ్దాలుగా పని చేస్తున్న కార్మిక సంఘాలు కూడా వీరిని గుర్తించటం లేదు, వీరికోసం పని చేయడం లేదు. కానీ, ఒక హైదరాబాద్ కుర్రాడు మూడేళ్ల పాటు వీరి జీవితాలను పరిశీలించాడు. తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళ కోసం ఒక సంఘమే పెట్టాడు. ఆ కుర్రాడే షేక్ సలావుద్దీన్. తాను పెట్టిన సంఘమే ‘తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్‌ వర్కర్స్ యూనియన్’. హిందీలో, తెలుగులో గలగలా మాట్లాడే ఈ కుర్రాడు ఇప్పుడు దేశంలో, రాష్ట్రంలో గిగ్ అండ్ ప్లాట్ ఫారం వర్కర్స్ సమస్యలపై గొంతెత్తి మాట్లాడుతున్నాడు.

రాహుల్‌గాంధీ సాగించిన భారత్ జోడో యాత్రలో కూడా అతను భాగస్వామిగా చేరి, ఈ కార్మికుల సమస్యలు అర్థమయ్యేలా వివరించాడు. కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోయినా, కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలో ఉన్న చోట ఈ కార్మికులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశాడు. పదివేల మంది సభ్యత్వం కలిగిన ఈ యూనియన్ రాజకీయ నాయకులతో లాబీ చేయడమే కాదు, అనేక ఆందోళనలు, ధర్నాలు కూడా చేసి ఈ కార్మికుల సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తెచ్చింది.

ఈ సందర్భంగా రవాణా, ఆహారం, కొరియర్ డెలివరీ, లాజిస్టిక్స్, గృహ ఆధారిత సేవలు, వృత్తిపరమైన సేవలు, ఆరోగ్య సంరక్షణ వంటి అన్ని రంగాలలోని గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్‌ కార్మికుల హక్కులను రక్షించాలని; ఈ కార్మికులు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కూడా నమోదు చేసుకునే అవకాశం ఉండాలని; ప్రతి ఒక్కరికీ ప్రత్యేక ఐడీ ఇవ్వాలని; రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్మికుల కోసం సంక్షేమ బోర్డు, సంక్షేమ నిధి ఏర్పాటు చేయాలని; ఈ బోర్డు ద్వారా, కార్మికులు సామాజిక భద్రతా పథకాలను పొందే వీలుండాలని; అగ్రిగేటర్లు, ప్లాట్‌ఫామ్‌ సంస్థలు కార్మికుల వర్గీకరణకై ఉపయోగించే అల్గారిథం మేనేజ్‌మెంట్‌లో పారదర్శకత ఉండాలని; ఈ సమాచారాన్ని, అగ్రిగేటర్లు సేకరించిన కార్మికుల వ్యక్తిగత సమాచారాన్ని కార్మికులు యాక్సెస్ చేయగలగాలని యూనియన్ కోరుతున్నది.

కార్మికులు సురక్షితమైన పని వాతావరణాన్ని కలిగి ఉండాలని; అగ్రిగేటర్లు రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన కార్యాలయ భద్రత, ఆరోగ్య ప్రమాణాలను పాటించాలని యూనియన్ కోరింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన కనీస వేతనం పొందే హక్కు కార్మికులందరికీ ఉండాలని; ఏప్ ఆధారిత డ్రైవర్స్‌కు ఏకరూప చార్జీల వంటి చర్యల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఆదాయ భద్రతను నిర్ధారించాలని; ఫిర్యాదులను నివేదించడం, పరిష్కరించడం కోసం ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని; దాని ముందుకు వెళ్ళే హక్కు కార్మికులందరికీ ఉండాలని; కార్మికులు ఆన్‌లైన్‌లో, లేదా నిర్దేశిత అధికారి ముందు ఫిర్యాదు చేసే అవకాశం ఉండాలని; పారిశ్రామిక వివాదాల చట్టం 1947 కింద కార్మికులు పరిష్కారాన్ని పొందగలగాలని యూనియన్ కోరుతున్నది. అగ్రిగేటర్లు సరైన కారణాలను లిఖితపూర్వకంగా ఇవ్వకుండా, పద్నాలుగు రోజుల ముందు నోటీసు ఇవ్వకుండా కార్మికుడిని తొలగించకూడదని; కార్మికులందరికీ న్యాయమైన పని నిబంధనలు, షరతులు ఉండాలని; అగ్రిగేటర్లు కాంట్రాక్టులో ఏవైనా మార్పులు చేయడానికి కనీసం 14 రోజుల ముందు కార్మికులకు తెలియచేయాలని కూడా యూనియన్ కోరుతున్నది.


రాజస్థాన్‌లో ఎమ్‌కెఎస్‌ఎస్‌ సంస్థ బాధ్యులుగా ఉన్న సామాజిక కార్యకర్త నిఖిల్‌డే బృందంతో కలసి సలావుద్దీన్ అక్కడి కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి, ఒక చట్టాన్ని ఆమోదించేలా చేశారు. దేశం మొత్తంలోనే గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్‌ కార్మికుల కోసం వచ్చిన మొదటి చట్టం ఇది. తాజాగా రాహుల్‌గాంధీ సహకారంతో, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి, ఈ కార్మికుల కోసం ఒక ఆర్డినెన్స్ తెచ్చేలా విజయం సాధించారు. తన స్వంత రాష్ట్రం తెలంగాణలో కూడా ఇతర రాష్ట్రాలకు మించి గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్‌ కార్మికుల కోసం ఒక మంచి చట్టం తేవడానికి సలావుద్దీన్, ఇతర సామాజిక కార్యకర్తలతో కలసి చేసిన కృషి కూడా ఒక రూపం దాల్చింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక ముసాయిదా చట్టాన్ని రూపొందించి, ప్రజల అభిప్రాయాల కోసం పబ్లిక్ డొమైన్‌లో ఉంచింది.

మే 1 నుండీ కొత్త చట్టాన్ని అమలు చేయాలనే ప్రయత్నంలో ప్రభుత్వం ఉన్నట్టు కనిపిస్తోంది. చివరి దశలో యాజమాన్యాలు అడ్డుపడకుండా ఉంటే, చట్టంతో పాటు, ఈ కార్మికుల కోసం ఒక సంక్షేమ బోర్డు కూడా ఉనికిలోకి వచ్చే అవకాశం ఉంది. లక్షలాది మంది గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్‌ కార్మికుల సంక్షేమానికి ఉపయోగపడే చట్టం, సంక్షేమ బోర్డు అమలులోకి రావాలనీ, షేక్ సలావుద్దీన్ లాంటి సామాజిక కార్యకర్తల కల నెరవేరాలనీ కోరుకుందాం. రాష్ట్రంలో ఉన్న ఇతర కార్మిక సంఘాలు కోల్పోతున్న కార్మికుల హక్కులను కాపాడుకోవడానికి ఈ కృషిని, చట్టాన్ని స్ఫూర్తిగా తీసుకుంటాయని ఆశిద్దాం.

కన్నెగంటి రవి

తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ

ఇవి కూడా చదవండి

Jagga Reddy: జగ్గారెడ్డి మాస్ డైలాగ్.. రాజకీయాల్లో విలన్ మేమే, హీరోలం మేమే

Meta AI Chatbot: అశ్లీలతకు అడ్డాగా మారిన మెటా ఏఐ చాట్ బాట్స్

Updated Date - Apr 29 , 2025 | 07:00 AM