Share News

Tata Job Cuts: టాటా ఉదంతం ఓ హెచ్చరిక

ABN , Publish Date - Aug 02 , 2025 | 04:18 AM

ప్రముఖ ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఒకేసారి 12,200 మంది ఉద్యోగులను తొలగించబోతున్నట్లు ప్రకటించడం అందరినీ

Tata Job Cuts: టాటా ఉదంతం ఓ హెచ్చరిక

ప్రముఖ ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఒకేసారి 12,200 మంది ఉద్యోగులను తొలగించబోతున్నట్లు ప్రకటించడం అందరినీ షాక్‌కి గురిచేసింది. సంస్థ మొత్తం ఉద్యోగుల సంఖ్యలో ఇది రెండు శాతం. ఈ స్థాయిలో ఉద్యోగాలకు ఉద్వాసన పలకడం భవిష్యత్‌లో జాబ్ మార్కెట్‌లో జరగబోతున్న పరిణామాలకు తొలి సంకేతం. ప్రమాద హెచ్చరిక కూడా. ఉద్యోగాల తొలగింపు అన్నది ఒక ఐటీ రంగానికి లేదా భారత్‌కి మాత్రమే సంబంధించిన కుదుపు కాదు. ప్రపంచవ్యాప్తంగా, అన్ని రంగాల్లో ఎదురవబోయే కీలక మార్పులకు అద్దం పడుతుంది. ఐటీ రంగంలో ఇప్పటికే కృత్రిమ మేధ ప్రభావం వేగం అందుకుంది. కోడింగ్‌లో ముప్పై శాతం మేరకు కృత్రిమ మేధ ఆక్రమించుకున్నట్లు తెలుస్తోంది. మిగతా రంగాల్లో కూడా దాని ప్రభావం విస్తృతమవుతోంది. ఫలితంగా లక్షలాది ఉద్యోగాలకు ఎసరు తప్పదు. అయితే పాత తరహా ఉద్యోగాలకు కాలం చెల్లినా, కొత్త అవకాశాలు, నూతన నైపుణ్యాల అవసరం ఉన్నవి ఆ వాక్యూమ్‌ని భర్తీ చేస్తాయి. కంప్యూటర్లు వచ్చిన మొదట్లో జరిగింది ఇదే.


ప్రభుత్వం కానీ, ప్రైవేట్ రంగ విద్యాసంస్థలు కానీ భవిష్యత్‌కి సరిపడే రీతిలో విద్యావకాశాల్ని పెంచాలి. శిక్షణా కేంద్రాలు నెలకొల్పి ప్రపంచ స్థాయి అవకాశాల్ని అందిపుచ్చుకోవాలి. ప్రస్తుతం మన దేశంలో యువ శక్తి గణనీయంగా ఉంది. ఆ వనరుల్ని బలంగా మార్చుకోవాలంటే అందుకు తగ్గట్టుగా సమాయత్తం కావాలి. ప్రస్తుత ఉద్యోగ సంక్షోభాన్ని ఎదుర్కొనే ప్రణాళికలు ఉండాలి. ఒక్క కృత్రిమ మేధ వల్లనే ఈ సంక్షోభం ఎదురవడం లేదు. అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాల వాణిజ్య నిర్ణయాలు, యుద్ధాలు, రాజకీయాలు... కరోనా అనంతర ప్రపంచాన్ని సమూలంగా మార్చివేశాయి. దేశం ముందున్న దారి ఒక్కటే. ఆర్థికంగా, సామాజికంగా, విజ్ఞాన పరంగా బలోపేతం కావడం. అందులో భాగంగా వ్యవసాయం, పరిశ్రమలు లాభసాటిగా మార్చడం, ఉత్తమ క్వాలిటీ విద్యను అందించడం ద్వారా యువశక్తిని బలోపేతం చెయ్యడం. నిరుద్యోగిత తగ్గించడంతో బాటు ప్రపంచ స్థాయి ఉద్యోగాలకు అర్హులుగా విద్యార్థి దశలోనే తీర్చిదిద్దడం. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌లో జరుగుతున్న భారీ స్థాయి ఉద్వాసనను భారత్ ఓ హెచ్చరికగా భావించాల్సిన తరుణం ఇది.

– డి.వి.జి. శంకరరావు, మాజీ ఎంపీ

Updated Date - Aug 02 , 2025 | 04:18 AM