Share News

Telugu Poetry: తుమ్మెద రెక్కల మీద మువ్వన్నెవిల్లుల ఆకాశం

ABN , Publish Date - Aug 04 , 2025 | 05:43 AM

ఏ పాలపుంతల్ని దాటొచ్చావో కాని– ఇంతకుముందెన్నడూ మేమెరుగని పిల్లనగ్రోవులపంటవు నువ్వు..

Telugu Poetry: తుమ్మెద రెక్కల మీద మువ్వన్నెవిల్లుల ఆకాశం

1. ఏ పాలపుంతల్ని దాటొచ్చావో కాని–

ఇంతకుముందెన్నడూ మేమెరుగని

పిల్లనగ్రోవులపంటవు నువ్వు..

లోకం వెంట లోకాన్ని దించి

మాకు పల్లకీలు కట్టించిన మెరుపులచెండువు నువ్వు...

మడతలు విప్పుకున్న

పద్యాలుగా మమ్ము విప్పార్చిన మొగలీసంపెంగల మహోత్సవానివి కదూ నువ్వు


2. ఆ అనిమేష వీక్షణాల నిండా

విరగబూచే తీగ సంపెంగల పందిరి పరిచి

ఆ పందిళ్ల నిండా

నన్నొక చిన్నిచిన్ని పిట్టలగుంపును చేసి–

తీరొక్కరాగాల కోలాటాలాడించి

పాడడమే ఎరుగని

నన్నెంత మహాగాయకుణ్ణి చేసి

ఆహో.. ఎన్ని కచేరీలు చేయిస్తున్నావో


3. నీ ఆ పెదవి అంచున విరుపులో దోగాడే పసిసిగ్గున

వేలవేల కలువరాయళ్లను దూసిపోస్తూ

ఆకాశాల్ని అరచేతికందిస్తుంటే

కొత్తపాటల్ని కట్టుకుంటూ ఎన్నిసార్లు కొత్తమొదళ్లమైపోతున్నా

ఇంకేదో వెలితిలో– ఈ చిన్నిగుండెల్ని జోలెలుగా పట్టి

నీ కనురెప్పలవాకిట భిక్షకులం కావడం

ఎంతటి మహదానందంగా ఉందో


4. నువ్వే దేవభాషను మాట్లాడుతుంటావో తెలీదుకానీ,

నీతో సంభాషించడానికి మా వర్ణమాలనంతా మరచిపోయి

లిపికందని ఏదో మధురభాషతో నీతో పోటీపడుతున్నా–

నీ కేరింతలు, ఉంగా, ఊ లతో దేహాన్నంతా చిత్రభాషగా మలచి

చిత్తుగా ఓడించేస్తుంటే

మనసును చెంగుపట్టి

రోజూ వంద ఓటముల్ని ఎత్తుకోవడానికైనా మేం తయారే.


5. ఈ ప్రపంచమింకా బతికుందనడానికి

ఈ నేల ఇంకా నవ్వుతూనే ఉందనడానికి

ఈ గాలి ఇంకా కలల తొక్కిసలాటలో పండుతూనే ఉందనడానికి

కాలం ఇంకా మమ్మల్ని పలకరిస్తూనే ఉందనడానికి

ఒకే ఒక్క నిదర్శనం– చివుళ్లుతొడిగే కొత్తలోకాల్ని కుక్కి కుక్కి మోసుకొచ్చిన ను.. వ్వే.. గా.


6. మేమూ, కాలం అదిగో ఆ రైలుపట్టాల్లా

ఎప్పుడూ ఎడమెడమే అదిగో అక్కడెక్కడో మలుపులో

మా దూరాల్ని బద్ధలుకొడుతున్నట్లున్న ఆ దవ్వుల్లో–

ఇప్పటికైతే– మా జుగల్‌బందీకి వేదికా నువ్వే , వాద్యమూ

నువ్వే గాత్రమూ నువ్వే, గానమూ నువ్వే

ముగింపన్నదే లేని కచేరీ నువ్వే


7. ఇసుకకొండల్లా ఎండకాగుతున్న మమ్మల్ని మళ్లీ నదుల్ని చేసిన

చిలుకపాటల చిరుజలపాతం లాంటి నీ జలతారునవ్వులు,

నేరుగా చందమామలోంచి రాలి

సెలయేళ్లలో ఈత కొట్టొచ్చిన సమీరాల్లాంటి

నీ తేనెచూపులు తుంచిపోస్తున్న కాశ్మీరాల్లో తూలీ, సోలీ

చుక్కల్ని కోసుకున్న మైకంలో– ఓ కొండపల్లిబొమ్మా.. నీకెంత కవిత్వాన్ని బాకీ పడిపోతున్నానో!

-యార్లగడ్డ రాఘవేంద్రరావు

& 99854 11099

Updated Date - Aug 04 , 2025 | 05:43 AM