Share News

Intermediate Education Policy: తెలుగును తప్పనిసరిగా ఉంచాలి

ABN , Publish Date - Apr 30 , 2025 | 03:45 AM

ఇంటర్మీడియట్‌లో సంస్కృతానికి ప్రాధాన్యం ఇచ్చే నిర్ణయం వెనుక కేంద్ర ప్రభుత్వ భాషా విధానాల కుట్ర దాగి ఉందని పోటు రంగారావు ఆరోపించారు. తెలుగు భాషను తప్పనిసరిగా కొనసాగించేందుకు ఉద్యమం అవసరమైందని ఆయన హితవు పలికారు.

Intermediate Education Policy: తెలుగును తప్పనిసరిగా ఉంచాలి

ఇంటర్మీడియట్‌ విద్యలో రెండవ ఆప్షన్‌గా సంస్కృతాన్ని తీసుకోవచ్చని ఇటీవల ఇంటర్‌ బోర్డు జీఓ జారీ చేసింది. విద్యార్థులు మార్కులు సాధన అనే కారణం పైకి కనిపిస్తున్నా, దీని వెనుక పెద్ద కుట్ర ఉంది. ఇది ఇంటర్‌ బోర్డు అధికారుల నిర్ణయం కాదు, నూతన విద్యా విధానంలో భాగంగా వచ్చిన రాజకీయ నిర్ణయం. సంస్కృతం ప్రాచీన భాష. కొద్ది మందికే చదువు అనే వివక్ష పాటించిన కాలంలో బ్రాహ్మణాధిక్య వర్గాలు, పాలకులు సొంతం చేసుకున్న భాష. వేదాలు, ఉపనిషత్తులు, భారతం, రామాయణం తదితర కావ్యాలు ఆ భాషలోనే ఉన్నాయి. సామాన్య ప్రజానీకం వాటిని చదువుకోవడానికి వీలులేని పరిస్థితి ఉండేది. సామాన్య ప్రజలు తమ వ్యావహారిక భాషలలో మాట్లాడుకునేవారు. సంస్కృత భాషా పండితుల ఆధిపత్యం కింద ప్రజల భాషలు నలిగిపోయాయి. ఈ ఆధిపత్యాన్ని ధిక్కరిస్తూ ప్రజల భాష కోసం అనేక ఉద్యమాలు వచ్చాయి. ముఖ్యంగా తెలుగు వ్యావహారిక భాషలో రచనల కోసం గిడుగు రామ్మూర్తి, గురజాడ తదితరులు ఉద్యమించారు. భాషా ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. కందుకూరి, శ్రీశ్రీ, చలం ఒకరేమిటి ఎంతో మంది రచయితలు, కవులు భాషోద్యమం చేపట్టారు. ఒక్క తెలుగు భాషా ఉద్యమమే కాదు. తమిళ భాషోద్యమం విస్తారంగా సాగింది, తమిళలందరినీ ఏకతాటి మీద నడిపింది.


అది హిందీ వ్యతిరేక ఉద్యమంగా వెల్లువెత్తింది. అన్నాదురై, రామస్వామి నాయకర్‌ తదితరులు ఎంతో మంది తమిళాన్ని రక్షించుకోవడానికి తెగించి కొట్లాడారు. ఇటీవల మోదీ–షా ఆధ్వర్యంలోని బీజేపీ ప్రభుత్వం త్రిభాషా సూత్రం పేరుతో హిందీని జాతీయ భాషగా రుద్దాలని చూస్తే.. తమిళ ప్రజలు ఉద్యమించారు. అలాగే కన్నడం, మలయాళం, మరాఠి, అస్సామీ, ఒరియా, బెంగాలి, భోజ్‌పురి, బిహారి, పంజాబీ, గుజరాతి ఇత్యాది భాషలన్నీ ఆస్తిత్వం కోసం పోరాటాలు చేస్తున్నాయి. వీటన్నిటిపై హిందీని రుద్దాలని, సంస్కృతాన్ని మళ్ళీ తేవాలని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా యత్నిస్తోంది. ఈ విధానాలతో ఆయా జాతుల భాషలు కనుమరుగయ్యే ప్రమాదముంది. అందుకే భాషాధిపత్యానికి వ్యతిరేకంగా, ప్రాంతీయ భాషలు అస్తిత్వ పోరాటాలు చేయాల్సిన అనివార్య పరిస్థితులు ఏర్పడ్డాయి. దేశంలో 22 అధికార భాషలున్నాయి. ప్రాంతీయ భాషలు 1200కు పైగా ఉన్నాయి. ఎవరి భాష వారికి అమృతం. దానిని గుర్తించాలి. ఇప్పటికే ఒక పక్క అంతర్జాతీయ భాష అని ఆంగ్లం, జాతీయ భాష అని హిందీ, సనాతన భాష అని సంస్కృతాన్ని రుద్దడం తెలుగును మరణశయ్య మీదకు నెట్టడమే. విద్యాశాఖ మంత్రిగా కూడా ఉన్న రేవంత్‌రెడ్డికి తెలిసి జరుగుతున్నదో, కేంద్రం కుట్రలో భాగంగా జరుగుతుందో కానీ ఇంటర్‌ బోర్డు నిర్ణయం శరాఘాతం. తెలుగు నేలపై తెలుగు భాషను సమాధి చేసే నిర్ణయాన్ని ఇంటర్‌ బోర్డు అధికారులు తక్షణమే ఉపసంహరించుకోవాలి. తెలుగును కంపల్సరీ సబ్జెక్టుగా ఉంచాలి. భావితరాలు తెలుగుదనంతో, తెలుగు భాషతో వెలిగేలా నిర్ణయాలు ఉండాలి. ఇంటర్‌ బోర్డు నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమించాలి.

– పోటు రంగారావు కార్యదర్శి,

సీపీఐ(ఎం.ఎల్‌) మాస్‌లైన్‌

Updated Date - Apr 30 , 2025 | 03:45 AM