Peace Paradox: యుద్ధోన్మాదుల శాంతి
ABN , Publish Date - Jul 10 , 2025 | 04:22 AM
అనేక యుద్ధముల నారియు తేరిన అమెరికా అధ్యక్షుడే నోబెల్ శాంతిని ఆశిస్తుంటే, తామూ అర్హులమేననీ, తమకూ ఓ నోబెల్ దక్కితే బాగుండునని మిగతావారికీ అనిపించడం సహజం. తాను అధికారంలోకి వచ్చిన మరుక్షణంనుంచే...

అనేక యుద్ధముల నారియు తేరిన అమెరికా అధ్యక్షుడే నోబెల్ శాంతిని ఆశిస్తుంటే, తామూ అర్హులమేననీ, తమకూ ఓ నోబెల్ దక్కితే బాగుండునని మిగతావారికీ అనిపించడం సహజం. తాను అధికారంలోకి వచ్చిన మరుక్షణంనుంచే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, అది నియమించిన లెఫ్ట్‌నెంట్ గవర్నర్ తనను రాచిరంపానబెట్టడం ఆరంభించారని, అన్ని ఒత్తిళ్ళనూ ఎదుర్కొని ఢిల్లీని అద్భుతంగా తీర్చిదిద్దినందుకు తనకు పరిపాలనలో నోబెల్ దక్కాల్సిందేనంటున్నారు ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. ‘మీకంటే ఈ అవార్డుకు అర్హులెవరు?’ అంటూ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమీన్ నెతన్యాహూ సోమవారం అమెరికా అధ్యక్షుడిని కీర్తించిన దృశ్యం కేజ్రీవాల్ మీద బాగా ప్రభావం చూపినట్టుంది. తన ఎదురీతలూ అర్హతల గురించి కేజ్రీవాల్ చెప్పుకున్న విషయాలను అటుంచితే, శ్వేతసౌధంలో భోజనవేళ బల్లకు ఆవల ఉన్న అమెరికా అధ్యక్షుడికి నోబెల్ శాంతి నామినేషన్ పత్రాన్ని అందిస్తూ నెతన్యాహూ గద్గదస్వరంతో ఇచ్చిన ఆ సందేశం, ఆశ్చర్యం, ప్రేమ ఒలుకుతున్న మొఖంతో ట్రంప్ ఆ పత్రాన్ని స్వీకరించడం ప్రపంచం అంతసులభంగా మరిచిపోలేని ఓ అద్భుత దృశ్యం.
తన ఎదురుగా కూర్చున్న ఆ శాంతిదూత ఈ ప్రపంచానికీ, మానవాళికీ చేసినదేమిటో చక్కగా వివరించారు నెతన్యాహూ. ఈయన ఒక దేశం తరువాత ఒకదేశం, మరోదేశం, ఇంకో దేశంలో వరుసపెట్టి శాంతిస్థాపనలు చేసుకుంటూపోతున్నారు... అధ్యక్షా, ఇదిగో నేను మీ పేరు ప్రతిపాదిస్తూ నోబెల్ ప్రైజ్ కమిటీకి పంపిన లేఖ. మీరు ఇందుకు సంపూర్ణంగా అర్హులు, అది మీకే చెందాలి అంటూ నెతన్యాహూ ఆ లేఖను ట్రంప్‌కు అందించారు. కొద్దివారాల కిందటే ఇరాన్‌మీదకు బీటూ స్టెల్త్ బాంబర్లతో సహా వందలాది యుద్ధవిమానాలను పంపిన అమెరికా అధ్యక్షుడు ఈ ప్రేమకు కరిగిపోయారు. మదర్ తెరీసా, నెల్సన్ మండేలా వంటివారు అందుకున్న అవార్డుకు తనను ఇజ్రాయెల్ పాలకుడు ప్రతిపాదించినందుకు కదిలిపోయారు. ‘నీనుంచి ఈ ప్రతిపాదన రావడం ఎంతో అర్థవంతంగా ఉంది’ అని నెతన్యాహూను ఉద్దేశించి ఆయన ఏ అర్థంలో అన్నారో తెలియదు కానీ, విశ్లేషకులు మాత్రం నానార్థాలూ తీస్తున్నారు.
గాజాలో పాలస్తీనియన్లను ఊచకోతకోస్తున్న ఓ పాలకుడు, ఆ మారణకాండకు ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ సమస్తవిధాలా సాయపడుతున్న మరో యుద్ధపిపాసిని శాంతిదూతగా ప్రతిపాదించడం అందరికీ వింతగానే ఉంది మరి. కానీ, ఇజ్రాయెల్ తన లక్ష్యాన్ని పరిపూర్తి చేయడంకోసం తన వద్ద ఉన్న సమస్త ఆయుధాలనూ అందిస్తానని మార్చిలోనే ప్రకటించి, అమెరికా పక్షాన ఇరాన్‌లోకి ఇజ్రాయెల్ చొరబడేట్టు చేసి, ఇజ్రాయెల్ పూర్తిచేయలేని ఆ ఆఖరుపనిని సైతం తానే స్వయంగా పూనుకొని చేసిన ట్రంప్ కంటే శాంతికి అర్హులెవ్వరని నెతన్యాహూకు అనిపించింది. ఆయుధాలనే కాదు, ఆకలిని కూడా అస్త్రంగా ప్రయోగించి, గాజానుంచి ఆఖరు మనిషిని కూడా తరిమికొట్టి, పూర్తిగా ఖాళీచేయించి, దానిని మధ్య ఆసియాలో మహాద్భుతమైన రిసార్టుగా మార్చాలన్న తన కలని నెరవేర్చబోతున్న నెతన్యాహూ కంటే అర్హులెవరుంటారని ట్రంప్‌కూ అనిపించింది.
ఇరాన్‌తో బరాక్‌ఒబామా కుదర్చుకున్న ఒక అంతర్జాతీయస్థాయి ఒప్పందం చక్కగా అమలవుతూ యావత్ ప్రపంచం ప్రశాంతంగా ఉన్న తరుణంలో, దానినుంచి తనదేశాన్ని తప్పించినవాడు ట్రంప్. మలివిడత రాకడలో మళ్ళీ తానే ఒప్పందం కోసం ఇరాన్‌మీద ఒత్తిడితెచ్చి, అనేక హెచ్చరికలూ బెదిరింపుల మధ్య చర్చలకు రప్పించి, అవి సజావుగా సాగుతున్న తరుణంలో వాటిని భగ్నం చేసిందీ ఆయనే. ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు లేవని అమెరికా నిఘాసంస్థలే చెప్పినా ఇరాన్‌లోకి ఇజ్రాయెల్‌ను చొరబడేట్టు చేసి, అనంతరం తానే స్వయంగా బాంబులు కురిపించి ఇజ్రాయెల్ ప్రధాని దీర్ఘకాలిక ఆశయాన్నీ, ఉమ్మడి లక్ష్యాన్నీ ఎట్టకేలకు నెరవేర్చాడు. అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ ఇవ్వనంత మద్దతు నెతన్యాహూకు ట్రంప్ ఇచ్చాడు. ఇరాన్ అణుస్థావరాలు ముట్టుకోవద్దన్న గతకాలపు హద్దుల్ని కూడా ట్రంప్ చెరిపివేసి, కొన్ని ఆయుధాల సరఫరాల మీద ఉన్న ఆంక్షలను కూడా ఎత్తివేశాడాయన. తద్వారా పలు ఏకకాల యుద్ధాలతో తన రాజకీయమనుగడ కొనసాగించాలన్న నెతన్యాహూ రాజకీయ ఎజెండాకు కూడా ట్రంప్ సహకరించారు. హద్దుల్లేని ఈ అభిమానానికి నెతన్యాహూ ఆనందం అవధులు దాటివుంటుంది. అంతర్జాతీయ న్యాయస్థానం అరెస్టువారెంట్ జారీచేసిన ఒక వ్యక్తి చేతులమీదుగా అమెరికా అధ్యక్షుడు నోబెల్‌శాంతి ప్రతిపాదనను అందుకోవడం చూడముచ్చటగా ఉంది.
ఇవి కూడా చదవండి..
వాట్సాప్‌లో రెండు కొత్త ఫీచర్స్.. వీటి స్పెషల్ ఏంటంటే..
యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి