Share News

ఎవరు బాధ్యులు?

ABN , Publish Date - Jul 03 , 2025 | 03:58 AM

హైదరాబాద్‌కు కూతవేటుదూరంలో ఉన్న పాశమైలారంలోని సిగాచీ ఫార్మస్యూటికల్‌ పరిశ్రమలో సంభవించిన ప్రమాదం ఊహకు అందనిది. మృతుల సంఖ్య అతివేగంగా పెరగడం, గాయపడినవారు అధికంగా...

ఎవరు బాధ్యులు?

హైదరాబాద్‌కు కూతవేటుదూరంలో ఉన్న పాశమైలారంలోని సిగాచీ ఫార్మస్యూటికల్‌ పరిశ్రమలో సంభవించిన ప్రమాదం ఊహకు అందనిది. మృతుల సంఖ్య అతివేగంగా పెరగడం, గాయపడినవారు అధికంగా ఉండటం, ఆచూకీ తెలియనివారు అనేకులు మిగిలిపోవడం ఈ ప్రమాదం తీవ్రతకు నిదర్శనాలు. పేలుడు ధాటికి మూడంతస్థుల భవనం పేకమేడలా కూలిపోవడంతో శిథిలాల కింద కన్నుమూసినవారే అధికం. పేలుడు సంభవించిన సమయంలో ఎక్కువమంది కార్మికులు ఫ్యాక్టరీలో ఉన్నందున మరణాలు గణనీయంగా ఉన్నాయి. శరీరాలు ఛిద్రమై అక్కడికక్కడే మరణించినవారు, మంటల్లో కాలిపోయినవారితో మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా మారిపోయాయి. ఖాకీబట్టలేసుకొని, లంచ్‌ బాక్సుతో ఫ్యాక్టరీకి వెళ్ళిన కార్మికుడు డీఎన్‌ఏ పరీక్షతో తప్ప పోల్చలేని విధంగా క్షణాల్లో మాంసపు ముద్ద అయిపోవడం అత్యంత విషాదం.

ప్రమాదం జరిగినవెంటనే ఉలకని కంపెనీ యాజమాన్యం ఇప్పుడు స్టాక్‌ ఎక్స్‌ఛేంజ్‌కు రాసిన లేఖలో, మీడియా ప్రచారం చేస్తున్నట్టుగా రియాక్టర్‌ పేలలేదని, మృతులు నలభైమందేనని అంటోంది. ప్రమాద కారణాలేమిటన్నది దర్యాప్తులో తేలుతుందని అంటున్న సిగాచీ యజమాన్యానికి తమ లోభత్వమో, పేరాశో ఈ ప్రమాదానికి కారణమని తెలియకపోదు. నాలుగుదశాబ్దాల నాటి ఫ్యాక్టరీలో మిషనరీని ఆధునికీకరించడం కానీ, కనీస ప్రమాణాలు పాటించడం కానీ జరగనప్పుడు పట్టెడన్నం కోసం వచ్చే కార్మికుడు ఇలా ప్రాణాలు వదిలేయవలసి వస్తుంది. ఈ ప్రమాదం ఎందుకు జరిగింది, అన్ని భద్రతాప్రమాణాలకు, నిబంధనలకు లోబడి ఈ ఫ్యాక్టరీ నడుస్తున్నదా అన్న విషయాలు నిర్థారించడానికి నలుగురు నిపుణులతో తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటుచేసి, నెలరోజుల్లో నివేదిక ఇవ్వమన్నది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో కూడా ఈ నిపుణుల కమిటీ ప్రభుత్వానికి చెబుతుందట. కమిటీలో ఉన్నవారంతా ప్రతిభగల శాస్త్రవేత్తలు, భద్రతానిపుణులు. రాబోయే కాలంలో ఈ కమిటీ నివేదిక ఆధారంగా సిగాచీని ప్రభుత్వం ఎంత గట్టిగా శిక్షించగలదో చూడాలి. అలాగే, ఆ నివేదిక ఆధారంగా పాలకులు తీసుకొనే చర్యల దెబ్బకు ఇకపై ఏ ఒక్క ఫ్యాక్టరీలోనూ ఏ ప్రమాదమూ జరగకూడదు మరి. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అన్న సామెత ఇటువంటి సందర్భాల్లో గుర్తుకు వస్తుంది కానీ, చేతులు కాలూతూనే ఉంటాయి, పసరు మందు మాత్రం పనిచేయదు.


పాత మిషనరీతో పనిచేస్తున్న ఈ ఫ్యాక్టరీ నిబంధనలను పాటించే అవకాశం సహజంగానే తక్కువ. సంబంధిత అధికారులు ఈ ఫ్యాక్టరీని ఎప్పుడు సందర్శించారు, ఏ లోపాలు గుర్తించారు, వారు ఆదేశాలను అమలు చేయనిపక్షంలో యాజమాన్యానికి ఏ శిక్షలు వేశారన్నది ప్రధానం. అధికారులు ఏమాత్రం బాధ్యతగా ఉన్నా ఈ ప్రమాదం జరిగివుండేదికాదు. యాజమాన్యం పాత మిషనరీని మార్చకపోగా, దాని నిర్వహణలో సైతం రాజీపడింది.

ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ పేరిట పరిశ్రమలకు రాయితీలు, ప్రోత్సాహాలతో ఎర్రతివాచీ పరవటాన్ని ఎవరూ కాదనడం లేదు. కానీ, ఆ పరిశ్రమలు భద్రతాప్రమాణాలు పాటించకపోయినా పట్టించుకోని, ప్రశ్నించని వ్యవస్థ ఉండటమే ఆందోళన కలిగిస్తున్నది. పరిశ్రమల యజమానుల మాదిరిగానే ప్రభుత్వాలు కూడా అధికారుల పర్యవేక్షణను పెత్తనంగా చూడటంతో చట్టాలు బలహీనపడుతున్నాయి, నిబంధనలు సడలిపోతున్నాయి, నియంత్రణలు తొలగి, తనిఖీలు తగ్గుతున్నాయి. ఫ్యాక్టరీలోకి ఇనస్పెక్టర్‌ కాలూనకుండా, అంతసవ్యంగా ఉన్నదని యజమాని ఆన్‌లైన్‌లో ధృవీకరిస్తే చాలనే పాడుకాలం దాపురించింది. అత్యంత ప్రమాదకరమైన పరిశ్రమల్లో సైతం నైపుణ్యం లేని కార్మికులతో యజమానులు నెట్టుకురాగలుగుతున్నారంటే ప్రభుత్వాల అలసత్వం, చేతగానితనమే కారణం. యాజమాన్యాలను కార్మికులు నిలదీసే కాలం గతించి, తమ ప్రాణాలకు కాస్తంత భద్రతనివ్వమని ప్రాధేయపడినా ఫలితం లేని రోజులు వచ్చాయి. ఎంతటి ఘోరప్రమాదం జరిగినా కాస్తంత పరిహారం విదిలిస్తే చాలనుకొనే దుస్థితికి దిగజారిపోయాం తప్ప, యాజమాన్యాలను న్యాయస్థానాలకు ఈడ్చి, జైళ్ళలోకి నెట్టే దృశ్యాలే లేకపోయాయి.

ఇవి కూడా చదవండి..

క్యాట్ ఆదేశాలను హైకోర్టులో సవాలు చేసిన కర్ణాటక సర్కార్

నాకు మరో దారి లేదు.. డీకే ఆసక్తికర వ్యాఖ్యలు

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 03 , 2025 | 03:58 AM