Share News

శుభాభినందనలు

ABN , Publish Date - Jun 26 , 2025 | 04:58 AM

భారత అంతరిక్ష చరిత్రలో కొత్త అధ్యాయం ఇది. మరో ముగ్గురు వ్యోమగాములతో కలసి శుభాన్షు శుక్లా అంతరిక్ష ప్రయాణం ఆరంభమైంది. నాలుగు దశాబ్దాల తరువాత మనవాడు రోదసిలో అడుగిడుతున్న ఈ సందర్భం దేశాన్ని...

శుభాభినందనలు

భారత అంతరిక్ష చరిత్రలో కొత్త అధ్యాయం ఇది. మరో ముగ్గురు వ్యోమగాములతో కలసి శుభాన్షు శుక్లా అంతరిక్ష ప్రయాణం ఆరంభమైంది. నాలుగు దశాబ్దాల తరువాత మనవాడు రోదసిలో అడుగిడుతున్న ఈ సందర్భం దేశాన్ని ఆనందోత్సాహాల్లో ముంచెత్తుతోంది. ప్రధాని నుంచి పామరుడి వరకూ అంతా శుభాన్షుకు శుభాకాంక్షలు చెబుతున్నారు. 140 కోట్ల మంది భారతీయుల ఆశలనూ ఆశయాలనూ శుక్లా తీసుకువెళుతున్నారని ప్రధాని వ్యాఖ్యానించారు. 1984లో సోవియట్‌ యూనియన్‌ వ్యోమనౌకలో రాకేశ్‌ శర్మ అంతరిక్షంలోకి వెళ్ళిన ఆ ఆద్భుత ఘట్టం మళ్ళీ అందరికళ్ళలోనూ కదలాడుతోంది. అక్కడనుంచి భారత్‌ ఎలా కనిపిస్తోందన్న ఇందిరాగాంధీ ప్రశ్నకు ‘సారే జహాసే అచ్ఛా’ అని శర్మ మనసులు ఉప్పొంగిపోయే సమాధానం ఇచ్చిన ఇంతకాలానికి రోదసిలో కాలూనిన రెండవ భారతీయుడు శుక్లా. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)లో అడుగిడిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించబోతున్న శుభాన్షుతో ప్రధాని మోదీ ముచ్చటించబోతున్నారట.


ఫ్లోరిడాలోని కెనడీ స్పేస్‌ సెంటర్‌ నుంచి, ఇంకా చెప్పాలంటే, 1969లో నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌ చంద్రుడి మీద కాలూనడానికి ప్రయాణం కట్టిన ప్రదేశంనుంచి శుక్లా బయలుదేరారు. వాతావరణం, సాంకేతిక సమస్యలు, ఆఖరు క్షణాల్లో వచ్చిపడిన అనేక రకాల అడ్డంకులతో మే 29 నుంచి ఇప్పటివరకూ ఈ మిషన్‌ ఆరు పర్యాయాలు వాయిదాపడుతూ వచ్చింది. ఇప్పుడూ ఓ చిన్న సాంకేతిక సమస్యని దాటి ఎట్టకేలకు ఈ ప్రయాణం మొదలైంది. ఇప్పటికే పదహారుసార్లు తన శక్తిసామర్థ్యాలను నిరూపించుకున్న పునర్వినియోగ ఫాల్కాన్‌ రాకెట్‌ ఈమారు కూడా తన కర్తవ్యాన్ని చక్కగా నిర్వహించి, వెనక్కువచ్చి కూర్చుంది. నలుగురు వ్యోమగాములను భద్రంగా దాచుకున్న డ్రాగన్‌ కాప్సూల్‌ 28 గంటల ప్రయాణం తరువాత ఐఎస్‌ఎస్‌కు చేరుకుంటుంది. పద్నాలుగురోజులపాటు వీరంతా అరవైరకాల పరిశోధనలు చేయబోతున్నారు. మన శాస్త్రవేత్తలు ప్రతిపాదించిన ఏడురకాల మైక్రోగ్రావిటీ పరిశోధనలను శుభాన్షు ప్రత్యేకంగా చేపట్టబోతున్నారు. మిగ్‌, సుఖోయ్‌ ఇత్యాది యుద్ధవిమానాలను నడిపిన అనుభవం ఉన్న శుక్లాకు మిషన్‌ పైలట్‌గా ఈ ప్రయాణాన్ని పర్యవేక్షించడం ఒక కొత్త అనుభవం, ఒక బృహత్తర బాధ్యత. వాస్తవికంగా అనుభవించే భారరహితస్థితి ఆయనకు గగనయాన్‌ మిషన్‌లో ఉపకరిస్తుంది.


భారత్‌–అమెరికా అంతరిక్ష సహకారంలో ఇది మేలిమలుపు. ఉభయదేశాల సంయుక్త, సరికొత్త ప్రయాణానికి నాంది. సరిగ్గా రెండేళ్లక్రితం అమెరికా పర్యటనలో ప్రధాని మోదీ కుదర్చుకున్న ఒప్పందంలో భాగంగా నాసా–ఇస్రో చేయికలిపాయి, భారతీయుడిని అంతరిక్ష కేంద్రానికి తీసుకుపోతామన్న ఆ హామీ ఇప్పటికి నెరవేరింది. సుమారు ఆరువందల కోట్ల రూపాయలు చెల్లించి ఈ పూర్తి కమర్షియల్‌ అంతరిక్ష యాత్రలో మనం చోటుదక్కించుకున్న ఈ సందర్భంలోనే, నలభైయేళ్ళక్రితం సోవియట్‌ యూనియన్‌ కేవలం ఉభయదేశాల సహకారం, సద్భావనలో భాగంగా రాకేశ్‌శర్మను తమ సోయూజ్‌ టి11 వ్యోమనౌకలో వెంటబెట్టుకుపోయిన విషయం గుర్తుకువస్తుంది. అయితే, ఈ యాక్సియం–4 యాత్రలో శుక్లాకు లభించే అపారమైన అనుభవం భారత భవిష్యత్‌ అంతరిక్ష యాత్రలకు ఉపకరిస్తుంది. వ్యోమనౌక నియంత్రణ, నిర్వహణ, వ్యోమగాముల ఆరోగ్యం, సంక్షోభాలను అధిగమించడం, అంతరిక్ష కేంద్రంతో అనుసంధానం ఇత్యాది చాలా అనుభవాలను శుక్లా సంపాదిస్తారు. మన మానవసహిత అంతరిక్ష యాత్రలు, గగనయానాల లక్ష్యానికి శుక్లా ప్రయోగాలు తోడ్పాటునిస్తాయి. మరో పదేళ్ళలో సొంత అంతరిక్ష కేంద్రం కట్టుకోవాలని, మరో పన్నెండేళ్ళకు చంద్రుడిమీద మన వ్యోమగాములు కాలూనాలని లక్ష్యాలు పెట్టుకున్న తరుణంలో శుక్లా ప్రయాణం కీలకమైనది. ప్రయాణం ప్రారంభించి, భూమి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న దశలోనే, జైహింద్‌, జై భారత్‌ అంటూ మన మానవసహిత అంతరిక్ష యాత్రలకు దీనిని శుభారంభంగా శుభాన్షు నిర్వచించింది అందుకే.

ఇవి కూడా చదవండి..

కమాండర్ అభినందన్‌ను బంధించిన పాకిస్థాన్ మేజర్ హతం

ఇరాన్ అణు స్థావరాలపై అమెరికా దాడులు.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

మరిన్ని ఏపీ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 26 , 2025 | 04:58 AM