Share News

Pahalgam Attack: సమాధానాలులేని ప్రశ్నలు

ABN , Publish Date - Jul 31 , 2025 | 06:01 AM

పహల్గాం దాడి, ఆపరేషన్‌ సిందూర్‌లపై లోక్‌సభలో 19గంటలకుపైగా జరిగిన ప్రత్యేక చర్చకు సమాధానంగా మంగళవారం సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్రమోదీ 102 నిముషాలు మాట్లాడారు. ఆయన వాగ్ధాటి మనకు కొత్తేమీ...

Pahalgam Attack: సమాధానాలులేని ప్రశ్నలు

పహల్గాం దాడి, ఆపరేషన్‌ సిందూర్‌లపై లోక్‌సభలో 19గంటలకుపైగా జరిగిన ప్రత్యేక చర్చకు సమాధానంగా మంగళవారం సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్రమోదీ 102 నిముషాలు మాట్లాడారు. ఆయన వాగ్ధాటి మనకు కొత్తేమీ కాదు కానీ, టెలివిజన్‌చానెళ్ళలో ప్రత్యక్షంగా చూసినవారు మారోమారు పరవశులైపోయి ఉంటారు. విపక్షాలు లేవనెత్తిన ఏ ప్రశ్నకూ నేరుగా సమాధానం చెప్పకపోయినా అభిమానులనూ, పార్టీ ప్రేమికులను ఆయన ప్రసంగం కచ్చితంగా కుదిపేసివుంటుంది. గంటన్నరకుపైగా మాట్లాడి కూడా ఉగ్రదాడి, ప్రతీకార దాడులమీద దేశప్రజల్లో రేగిన అనుమానాలను నివృత్తి చేయకపోగా, విపక్షాలమీద విరుచుకుపడటంలోనూ, ప్రధానంగా కాంగ్రెస్‌ను పాక్‌ప్రేమిగా, చైనా దూతగా ముద్రవేయడంలో ఆయనదే పైచేయి. యుద్ధంమీద చర్చతో ప్రజలకు సంబంధం లేదని, వారికి చెప్పాల్సింది కూడా ఏమీ లేదనీ, ఇది ప్రజాక్షేత్రంలోనూ, నిండుసభలోనూ కాంగ్రెస్‌–బీజేపీ రాజకీయ పోరాటమేనని దేశప్రధాని సైతం భావించినట్టుంది. చర్చ తొలిరోజున, సభలో కూర్చొని విపక్షాల వాదన వినడం కంటే, ఎన్నికలక్షేత్రం తమిళనాడుకు పోయి, బృహదీశ్వరాలయంలో ప్రార్థనలు చేయడం బహుళ ప్రయోజనకరంగా ఉంటుందని ఆయన అనుకొని ఉంటారు. అత్యంత ప్రమాదకరమైన, ఉగ్రదాడులకు నిలయమైన పహల్గాంలో ఐదువేలమంది పర్యాటకులు చేరినప్పుడు, ఒక్క పోలీసు కూడా ఎందుకు లేడు, నిఘావ్యవస్థ ఏం చేస్తోంది, సహాయం ఎందుకు అందలేదన్న ప్రశ్నలకు అధికారపక్షంనుంచి బాధ్యతాయుతమైన సమాధానాలు వచ్చివుంటే బాగుండేది. ప్రత్యేక ప్రతిపత్తిని కోసేసిన కశ్మీరంలో ఉగ్రవాదం దుంపనాశనమైపోయిందన్న పాలకుల ప్రచారాన్ని నమ్మి, ఛప్పన్నారు ఇంచీల ఛాతీ గల చౌకీదార్‌ మనలను భద్రంగా కాపాడతాడని విశ్వసించి, నిర్భయంగా వినోదానికి వెళ్ళిన అమాయక ప్రజలను ఓ ఉగ్రమూక అంత సునాయాసంగా ఎలా ఊచకోతకోయగలిగిందో చెప్పివుంటే బాగుండేది. దాడిజరిగిన వందరోజుల తరువాత, అదీ ప్రధానమంత్రి సమాధానానికి కాస్తముందు ఉగ్రవాదులను మట్టుబెట్టడమేమిటని విపక్షాలు ఆశ్చర్యపోవడం కూడా మహాపాపమైపోయింది. ఇలా ముహూర్తం చూసుకొనే ఆ పనిచేసినట్టుగా దేశప్రజలకూ అనిపించింది కనుకనే, ఆ రాక్షసులను ఎప్పుడు పట్టుకున్నారు, ఇప్పుడు ఎందుకు కాల్చారన్న సందేహం కలిగింది. నేరుగా సమాధానాలు చెప్పడం ఇబ్బంది కాబట్టే, ఎప్పటిలాగానే చరిత్ర తవ్విపోతలు, నెహ్రూ తప్పిదాల ఎత్తిపోతలు, కాంగ్రెస్‌మీద నేరాభియోగాలు ఈ మారూ మనం వినకతప్పలేదు.


ఇది ఆపరేషన్‌ సిందూర్‌ మీద కాక, నెహ్రూ విదేశాంగ విధానంమీద చర్చలాగా విశ్లేషకులకు అనిపించిందట. చైనాకు కాంగ్రెస్‌ భారీగా భూమిని ధారాదత్తం చేసిందని విమర్శిస్తున్న మోదీ, మొన్నటి యుద్ధంలో పాకిస్థాన్‌కు ఆయుధసాయం చేసినందుకు కూడా చైనాను గట్టిగా అనలేకపోతున్నారు. వాణిజ్యాయుధాన్ని ప్రయోగించి నేనే యుద్ధం ఆపానని ట్రంప్‌ ముప్పైసార్లు చెప్పుకున్నారు. చివరకు నిండుసభలో మోదీ ప్రసంగం ముగిసిన మరుక్షణంలోనే మళ్ళీ ట్రంప్‌ పాతపాటే పాడటం చూస్తే, వీళ్ళిద్దరి మధ్యా బాగా చెడిందేమోనన్న అనుమానం కూడా కలుగుతుంది. ఏ దేశాధినేతా తనను యుద్ధం ఆపమనలేదని, అమెరికా ఉపాధ్యక్షుడు ఫోన్‌చేసినా తాను తగ్గలేదని మోదీ చెప్పుకున్నారు. ట్రంప్‌ పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని నిండుసభలో ప్రకటించడానికి మోదీకి ఇబ్బందులు ఉండవచ్చు. మరి, ఏ కారణంగా, ఎవరి నిర్ణయం మేరకు, ఏ ప్రకటిత లక్ష్యాల సాధనతో ఈ యుద్ధం ఆగిందో ఆయనే ఓ నాలుగుముక్కలు వివరంగా చెప్పివుంటే ఎంతో బాగుండేది. యుద్ధం కొనసాగనందుకు సంతోషించాల్సిందే. కానీ, బహూత్‌ మారా, బస్‌ కరో అని పాకిస్థాన్‌ డీజీఎంవో ప్రాధేయపడటంతోనే మనం యుద్ధాన్ని ఆపేశామన్న అభిప్రాయం మాత్రం మోదీ సమాధానం తరువాత కలుగుతోంది. మన ధాటీకి తట్టుకోలేక విలవిలలాడిన పాకిస్థాన్‌నుంచి ఇందుకు ప్రతిగా దక్కిన హామీలు ఏమిటో తెలియదు. ఉగ్రవాదాన్ని సమూలంగా పెకిలించివేయాలన్న లక్ష్యం కోసం పొరుగుదేశంలోకి యుద్ధవిమానాలతో చొరబడిన మనం కేవలం శత్రువు ఏడ్చినందుకే ఇలా విరమించుకున్నపక్షంలో ప్రయోజనం ఏమిటన్నది ప్రశ్న. అటు, బీజేపీ వీరాభిమానులు ఆశించిన పీవోకే స్వాధీనం, బెలూచిస్థాన్‌ విముక్తి ఇత్యాది లక్ష్యాలూ ఆకాంక్షలూ నెరవేరకుండా, ఇటు పాక్‌ భూభాగంనుంచి భారత్‌మీద భవిష్యత్తులో ఏ ఉగ్రదాడీ జరగదన్న కనీస హామీ కూడా దక్కకుండా పాలకులు వెనకడుగువేయడం ఆశ్చర్యం. యుద్ధదేశం కాదు, బుద్ధదేశం అన్న మోదీ వ్యాఖ్య పాకిస్థాన్‌కు ఇప్పుడు కొత్తగా ఇచ్చే సందేశం ఏమిటో చూడాలి.

ఇవి కూడా చదవండి

చనుబాలు అమ్మి లక్షలు సంపాదిస్తున్న మహిళ..

ప్రాణం మీదకు తెచ్చిన ప్రేమ వ్యవహారం.. ఏం జరిగిందో తెలిస్తే..

Updated Date - Jul 31 , 2025 | 06:01 AM