Peace Talks Resurface Amid Ukraine War: మళ్లీ శాంతి దౌత్యాలు
ABN , Publish Date - Nov 28 , 2025 | 05:43 AM
రేపోమాపో ఉక్రెయిన్ యుద్ధం ఆగిపోతుందంటూ మళ్ళీ హడావుడి మొదలైంది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తిరిగి తీవ్రంగా శాంతి ప్రయత్నాలు ఆరంభించారు. ట్రంప్ విరచిత...
రేపోమాపో ఉక్రెయిన్ యుద్ధం ఆగిపోతుందంటూ మళ్ళీ హడావుడి మొదలైంది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తిరిగి తీవ్రంగా శాంతి ప్రయత్నాలు ఆరంభించారు. ట్రంప్ విరచిత ఒప్పందానికి ఇప్పటికే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సరేనన్నారనీ, రష్యా అధినేత పుతిన్‌కూడా తలూపారని ప్రచారం జరుగుతోంది. చర్చలు జరపడానికి అభ్యంతరం అక్కరలేదని అంటూనే, ఉక్రెయిన్ ఏమాత్రం తలెగరేసినా యుద్ధక్షేత్రంలో జవాబు చెప్పడానికి తాను సర్వసన్నద్ధంగా ఉంటానని పుతిన్ అంటున్నారు. ట్రంప్ మధ్యవర్తిత్వంలో, మార్గదర్శకత్వంలో తయారైన శాంతిముసాయిదా ఉభయపక్షాల మధ్య చర్చలకు ఉపకరిస్తుందే తప్ప, అదే పునాది కాబోదని కూడా పుతిన్ అంటున్నారు. అక్రమంగా ఉక్రెయిన్ అధ్యక్షుడైన జెలెన్‌స్కీతో ఒకవేళ తాను ఒప్పందం కుదర్చుకుంటే అది సక్రమమెలా అవుతుందని కూడా పుతిన్ అడుగుతున్నారు. గతంలో శ్వేతసౌధంలో ఇదేవ్యాఖ్యతో అవమానించిన జెలెన్‌స్కీనే ఈమారు ట్రంప్ శాంతిసాధనకోసం ఎక్కువగా నమ్ముకున్నారు.
రేపోమాపో యుద్ధం ఆగుతుందన్న స్థాయిలో ట్రంప్ వ్యాఖ్యలు ఉంటాయి. పుతిన్ మాత్రం ఎప్పటిలాగానే చిరునవ్వుతోనే తాను అన్నదీ, అనుకున్నదే చేస్తారు. ఉక్రెయిన్ బలగాలు తాము ఉన్న, తమ అధీనంలో ఉన్న ప్రాంతాలను విడిచిపెట్టిపోతేనే యుద్ధం ఆగుతుందంటున్నారు పుతిన్. యుద్ధక్షేత్రంలో రష్యా సాధించిన విజయాలు, రేపటిరోజుల్లో దాని ప్రయోజనాల పరిరక్షణ పునాదిగానే ఒప్పందం ఉండాలన్నారు ఆయన. ఒప్పందం కుదరకపోతే ఎంతకాలమైనా చక్కగా యుద్ధం చేసుకుంటానని ఆ వ్యాఖ్యల సారాంశం. ట్రంప్ కొత్త ప్రణాళికకు ఉక్రెయిన్ అంగీకరించిందనీ, ఏవో కొన్ని చిన్నచిన్న అంశాలు తేలడమే మిగిలిందని అమెరికన్ మీడియా అంటోంది. అమెరికాతో చర్చలు జరుగుతున్నాయని, ట్రంప్ కృషి అభినందనీయమైదని జెలెన్‌స్కీ కృతజ్ఞతలు కూడా చెప్పారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో అమెరికా, రష్యా బృందాల మధ్య చర్చలు విజయవంతమైనాయని, ముసాయిదాలో ఉన్న కొన్ని అంశాలమీద ఉక్రెయిన్ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని మార్పుచేర్పులు కూడా జరిగాయనీ వార్తలు వచ్చాయి. వ్యవహారం ముందుకు కదలుతోందని అనుకుంటున్న తరుణంలో ఒక వార్తాసంస్థ వదిలిన కథనం శాంతిప్రణాళికమీద కొత్త వివాదాన్ని రేపింది. ట్రంప్ ప్రతిపాదిత 28 పాయింట్ల ప్రణాళిక సృష్టికర్త రష్యా అనీ, పుతిన్ సన్నిహితుడైన కిరిల్ దిమిత్రివ్ దీని రచయితనీ ఆ కథనం సారాంశం. ఉక్రెయిన్‌తో యుద్ధం ఆపాలంటే ఈ షరతులకు అంగీకరించాల్సిందేనంటూ అక్టోబర్‌లో అమెరికాకు రష్యా అందించినపత్రంలో ఉన్నవే ఈ ప్రణాళికలో చేరాయన్న ఆ కథనాన్ని అమెరికా ఖండించినప్పటికీ, ముసాయిదా పూర్తిగా రష్యాకు అనుకూలంగా ఉన్నదన్న యూరప్ దేశాల విమర్శల నేపథ్యంలో, ఓ తొమ్మిది అంశాలనైతే అందులోనుంచి తొలగించిందట. అయినాకూడా ఇంకా అది రష్యా పక్షానే తూగుతోందని, దానికే తలూపాలంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడిని ట్రంప్ ఒత్తిడిచేస్తున్నారని వార్తలు వస్తున్నాయి.
ఉక్రెయిన్ మిలటరీ గుప్పిట్లో ఉన్న చిన్నాచితకా ప్రదేశాలతో సహా మొత్తం డాన్బాస్ ప్రాంతాన్ని రష్యాకు వదులుకోవడం ఈ ప్రణాళికలో ప్రధానం. ఉక్రెయిన్ సైనికబలం కూడా గతంలో మాదిరిగా కాక పరిమితికి లోబడి ఉంటుంది. లాంగ్‌రేంజ్ మిసైల్స్ వంటి మారణాయుధాలు ఇకమీదట ఉక్రెయిన్ కొనకూడదు, వాడకూడదు. అన్నింటికంటే ముఖ్యంగా, ఎట్టిపరిస్థితుల్లోనూ ఉక్రెయిన్ నాటోలో చేరకూడదు. తదనుగుణంగా ఆ దేశం రాజ్యాంగాన్ని సవరించుకోవాలి, అంతర్జాతీయ సమాజానికి హామీ పడాలి. యుద్ధం మొదలవడానికి అసలు కారణం ఇదే కనుక రష్యా ఈ విషయంలో పట్టుదలపట్టడంలో ఆశ్చర్యమేమీ లేదు. మూడుదశాబ్దాల క్రితం ఇచ్చిన హామీని వమ్ముచేస్తూ నాటో అతివేగంగా తన చుట్టూ విస్తరించడం రష్యాకు అభద్రతను పెంచింది, అవమానం కలిగించింది. ఉక్రెయిన్ అధ్యక్షుడిగా జెలెన్‌స్కీ రాక, పశ్చిమదేశాల తోడ్పాటుతో అతడి వీరంగాలు ఒకదశదాటి సహించలేక రష్యా కయ్యానికి కాలుదువ్వింది. ఇకపై విస్తరించనని నాటో మాట ఇస్తే, రష్యా కూడా అందరి క్షేమానికీ హామీ పడుతుందని పుతిన్ అంటున్నారు. యుద్ధక్షేత్రంలో సాధించిన విజయాలను నిలుపుకోవడంతోపాటు, భవిష్యత్తులో పశ్చిమదేశాలనుంచి తనకు ఏ ప్రమాదమూ ఉండదన్న భరోసా ఏర్పడినప్పుడే రష్యా ఏ ఒప్పందానికైనా సిద్ధపడుతుంది. ఈ విషయంలో ట్రంప్ ముసాయిదా రష్యా పక్షాన ఎంతమేరకు తూగిందన్నది ప్రధానం.
ఈ వార్తలు కూడా చదవండి..
సీఎం చంద్రబాబు అధ్యక్షతన పార్లమెంటరీ పార్టీ సమావేశం
మద్యం కుంభకోణం కేసులో మరో కీలక పరిణామం
Read Latest AP News And Telugu News