Omar Abdullah: చిచ్చురేపిన నివాళి!
ABN , Publish Date - Jul 16 , 2025 | 12:59 AM
కశ్మీర్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా నివాళులు అర్పించేందుకు నక్ష్‌బంద్‌సాహిబ్ స్మశానవాటికకు వెళ్ళిన జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాను పోలీసులు అడ్డుకోవడంతో ఆయన గేటుదూకి మరీ లోపలకు పోయిన దృశ్యాలు మాధ్యమాల్లో విస్తృతంగా కనిపిస్తున్నాయి.

‘కశ్మీర్ అమరవీరుల దినోత్సవం’ సందర్భంగా నివాళులు అర్పించేందుకు నక్ష్‌బంద్‌సాహిబ్ స్మశానవాటికకు వెళ్ళిన జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాను పోలీసులు అడ్డుకోవడంతో ఆయన గేటుదూకి మరీ లోపలకు పోయిన దృశ్యాలు మాధ్యమాల్లో విస్తృతంగా కనిపిస్తున్నాయి. 22మంది అమరుల సమాధులపై గులాబీరేకులు చల్లి ప్రార్థనలు నిర్వహించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌పై విరుచుకుపడ్డారు. తనను ఆదివారమంతా గృహనిర్బంధంలో ఉంచారని, సోమవారం కూడా అడ్డుకోవడానికి ప్రయత్నించారని ఆరోపించారు. ‘వాళ్ళు’ మమ్మల్ని బానిసలు అనుకుంటున్నారు, మా చేతుల్లో జెండా చింపేయాలని కూడా చూశారు అన్నారాయన. ఈ ఉదంతం వెనుక ఉన్న చారిత్రక ఘట్టాలమీద ఎవరి అభిప్రాయాలు, అభ్యంతరాలు వారికి ఉండవచ్చును కానీ, ఓ ముఖ్యమంత్రికి ఇటువంటి పరిస్థితి ఎదురుకావడం అమితాశ్చర్యం కలిగిస్తుంది.
ఒక్కమాటలో చెప్పుకోవాలంటే, గవర్నర్ అనధికారిక ఆదేశాల మేరకు ఆదివారం కశ్మీర్ లోయలో ఆంక్షలు అమలైనాయి. నివాళిని నిలువరించేందుకు లోయలోని నాయకులను గృహనిర్బంధం చేశారు. పోలీసు కాపలాతో పాటు, గేట్లు లాక్‌చేశారు, బారికేడ్లు పెట్టారు, సీసీ కెమెరాల్లో ప్రతీక్షణం పర్యవేక్షిస్తూ, ఏ నాయకుడూ తమ కళ్ళుకప్పి తప్పించుకోవడానికి వీల్లేకుండా చాలాచర్యలు తీసుకున్నారు. ప్రధానంగా ఒమర్ అబ్దుల్లాను బయటకు రానివ్వకుండా మరిన్ని జాగ్రత్తలు పడ్డారు. దీనితో, అసలు రోజున నివాళులర్పించలేకపోవడంతో మర్నాడు వేర్వేరుమార్గాల్లో అబ్దుల్లాలు బయటకువచ్చి అనుకున్నది చేశారు. ఫరూఖ్ అబ్దుల్లా ఆటోలో వచ్చారని, కొందరు మంత్రులు స్కూటర్లువాడారని వార్తలు వచ్చాయి. కబరస్థాన్‌కు పోయే దారులన్నీ అధికారులు మూసేయడంతో, ముఖ్యమంత్రి కొంతదూరం నడిచి, ఆఖరుకు గేటు ఎక్కాల్సివచ్చింది.
గవర్నర్ పెత్తనానికి హద్దూపద్దూ లేకపోతోందనీ, అర్థంపర్థంలేని చర్యలతో అనవసరపు వివాదాలు రేపుతున్నారని ఒమర్ అంటున్నారు. కానీ, కేంద్రప్రభుత్వ దూతగా, తమ ఎజెండాకు అనుగుణంగానే సిన్హా ఈ చర్యకు దిగారు. మహారాజా హరిసింగ్‌కు చెందిన డోగ్రా బలగాలు ఆయన పాలనకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నవారిపై కాల్పులు జరిపిన 1931జూలై 13ఘటన కశ్మీర్ చరిత్రలో కీలకమైనది. హరిసింగ్ పాలనకు వ్యతిరేకంగా కశ్మీరీలను కూడగడుతున్న అబ్దుల్ ఖదీర్‌ఖాన్‌ను దేశద్రోహం నేరంపై శ్రీనగర్‌జైల్లో విచారిస్తున్నప్పుడు, అక్కడకు చేరిన ఐదువేలమంది ప్రజలపై సైన్యం కాల్పులు జరిపిన ఈ ఘట్టం తరువాతే హరిసింగ్ ఎన్నికలకు సిద్ధపడ్డారని అంటారు. జూలై 13ను అమరుల దినంగా నిర్వహించే సంప్రదాయాన్ని షేక్ అబ్దుల్లా ఆరంభిస్తే, ఎవరు అధికారంలో ఉన్నా కొనసాగింది. ఆర్టికల్ 370రద్దుతో కశ్మీర్ తన స్వయం ప్రతిపత్తినీ, రాష్ట్రహోదానీ కోల్పోయిన ఈ ఆరేళ్ళకాలంలో నివాళి నిలిచిపోయింది, ప్రభుత్వ అధికారిక సెలవుల జాబితానుంచి కూడా ఆ రోజు తొలగిపోయింది. బదులుగా హరిసింగ్ పుట్టినరోజునూ, భారతదేశంతో విలీన ఒప్పందం చేసుకున్నరోజునూ సెలవుదినాలుగా చేర్చారు. ఆరేళ్ళతరువాత, ఇప్పుడు పేరుకైనా ఓ ప్రజాప్రభుత్వం ఉన్నది కనుక, ‘బ్రిటిష్‌వారి తొత్తుమీద సామాన్యుడు తిరుగుబాటు చేసిన ఈ సందర్భాన్ని మా జలియన్‌వాలాబాగ్’ అంటూ ఈ నాయకులు ఆ నివాళి కార్యక్రమం పునరుద్ధరించేందుకు ప్రయత్నించారు, కేంద్రప్రభుత్వ దూతదానిని అడ్డుకున్నారు.
మరో ఆరేళ్ళలో నూరేళ్ళవుతున్న నేపథ్యంలో, మహారాజా హరిసింగ్‌కు వ్యతిరేకంగా సాగిన పోరాటాన్ని ప్రజల మస్కిష్కాల నుంచి చెరిపివేయాలన్న ఇటువంటి ప్రయత్నాలవల్ల ఫలితం ఉండదు. ఎవరిని స్మరించుకోవాలో, ఎవరిని వదిలించుకోవాలో ప్రజలకు తెలుసు. నివాళిని నిరోధించే ఈ ప్రయత్నం వెనుక భద్రతాకారణాల కంటే, చరిత్రను తిరగరాసే ప్రయత్నం ప్రధానంగా కనిపిస్తున్నది. గతవారం శ్రీనగర్‌లో శ్యామాప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి వేడుకలను ఆరంభిస్తూ, రెండేళ్ళపాటు ఆయన సైద్ధాంతిక ప్రచార కార్యక్రమం ప్రభుత్వపరంగా నిర్వహించబోతున్నట్టు ప్రకటించిన గవర్నర్, మరోపక్కన వందేళ్ళనాటి చరిత్రను ప్రజలు మరిచిపోవాలని కోరుకుంటున్నారు. పహల్గాం దారుణాన్ని నివారించక, ఒక యుద్ధానికి పరోక్షంగా కారకుడైన మనోజ్‌సిన్హా ఇటువంటి చిన్నాచితకా వివాదాలకు దూరంగా ఉంటే ఆయన పరువుతోపాటు, కేంద్రప్రభుత్వం గౌరవం కూడా నిలబడుతుంది.