Share News

Jaishankars China Visit: దిద్దుబాట

ABN , Publish Date - Jul 18 , 2025 | 02:00 AM

భారత విదేశాంగమంత్రి జైశంకర్‌ చైనాలో కాలూని, దాని అధ్యక్షుడు జిన్‌పింగ్‌, ఉపాధ్యక్షుడు హాన్‌జెంగ్‌, విదేశాంగమంత్రి వాంగ్‌ యీతో భేటీకావడం ఉభయదేశాల సంబంధాల్లో సానుకూల మార్పుకు...

Jaishankars China Visit: దిద్దుబాట

భారత విదేశాంగమంత్రి జైశంకర్‌ చైనాలో కాలూని, దాని అధ్యక్షుడు జిన్‌పింగ్‌, ఉపాధ్యక్షుడు హాన్‌జెంగ్‌, విదేశాంగమంత్రి వాంగ్‌ యీతో భేటీకావడం ఉభయదేశాల సంబంధాల్లో సానుకూల మార్పుకు దోహదం చేస్తుందని ఆశించవచ్చు. షాంఘై సహకార సంస్థ విదేశాంగమంత్రుల సదస్సుకు హాజరైన సందర్భంలో ఈ భేటీలూ చర్చలూ జరిపినప్పటికీ, ఐదేళ్ళ క్రితం గల్వాన్‌ లోయలో భారత్‌–చైనా ఘర్షణలు జరిగిన తరువాత జయశంకర్‌ అక్కడ పర్యటించడం ఇదే మొదటిసారి. ఇటీవలి భారత్‌–పాక్‌ ఘర్షణలో పాకిస్థాన్‌ పక్షాన చైనా నిలబడి దానికి సమస్త సహకారాన్నీ అందించిందని మన సైనికాధికారులు కుండబద్దలు కొట్టిన తరువాత, అటువంటిదేమీ లేదని చైనా దబాయించిన విషయం తెలిసిందే. ఈ చిన్నస్థాయి యుద్ధం తరువాత చైనాకూ మనకూ మానసికంగా మరింత దూరం పెరిగిన నేపథ్యంలో జయశంకర్‌ పర్యటన కొన్ని దిద్దుబాట్లు, సర్దుబాట్లు చేసుకోవడానికి ఉపకరించవచ్చు. గత ఏడాది అక్టోబర్‌లో రష్యాలో జరిగిన బ్రిక్స్‌ దేశాల శిఖరాగ్ర సదస్సు సందర్భంలో భారత ప్రధాని, చైనా అధ్యక్షుల మధ్య భేటీ జరిగింది. సంబంధాలు మెరుగుపరచుకోవాలని, పూర్వస్థితికి తీసుకుపోవాలని అక్కడ నిర్ణయం జరగడంతో ఉభయదేశాల సరిహద్దు స్థితిగతుల్లోనూ మార్పువచ్చింది. డెమ్‌చోక్‌, డెస్పాంగ్‌ ప్రాంతాల్లో సైన్యాలను ఉపసంహరించుకోవడంతో ఉద్రిక్తతలు చల్లారాయి. జాతీయభద్రతా సలహాదారు అజిత్‌దోవల్‌, రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ ఇత్యాదులు కూడా అనంతరకాలంలో చైనాలో పర్యటనలు చేశారు. నాథూలాపాస్‌ మీదుగా మానససరోవర్‌ యాత్ర ఆరేళ్ళ తరువాత ఆరంభం, విమాన సర్వీసులు పునరుద్ధరించాలని, వీసా ప్రక్రియలను సరళీకరించాలని అనుకోవడం వంటి సానుకూల చర్యలు ఒకపక్కన కనిపిస్తున్నా, చైనా వ్యవహారశైలి ఒక పట్టాన ఊహకు అందదు. సంబంధాలు మెరుగుపడుతున్నాయని అనుకోగానే, పూర్తిగా తిరగబడటం కూడా అనుభవంలో ఉన్నదే. విద్యుత్‌వాహనాల తయారీలో అత్యంత కీలకమైన ఖనిజాలు, హైటెక్‌ యంత్రాల ఎగుమతులపైన ఆంక్షలు విధించి భారత్‌ను ఇబ్బందిపెట్టాలన్న నిర్ణయం ఈ కోవలోనిదే.


మన భారీ ప్రాజెక్టులకు ఆటంకాలు కల్పించడానికీ, టెలికాం, ఫార్మా, ఎలక్ట్రానిక్స్‌ రంగాలను హద్దుల్లో ఉంచడానికీ ఆంక్షలను ఆయుధంగా వాడుతూ, ప్రపంచ వాణిజ్యసంస్థ ఒడంబడికలను సైతం ఉల్లంఘించడానికి చైనా సందేహించడంలేదు. షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) ఆవిర్భావ లక్ష్యాల్లో ఉగ్రవాదం, వేర్పాటువాదంపై ఉమ్మడి పోరాటం కూడా ఒకటి. కానీ, పాకిస్థాన్‌ నొచ్చుకుంటుందన్న ఏకైక కారణంగా మొన్నటి సంయుక్త ప్రకటనలో పహల్గాం దాడి ప్రస్తావనను ఉద్దేశపూర్వకంగా వదిలేసి, బలూచిస్థాన్‌ రైలు దాడిని చేర్చి మిత్రదేశానికి ఆనందాన్ని చేకూర్చిన విషయం తెలిసిందే. పహల్గాం ఊసులేనందుకు మన రక్షణమంత్రి ఆ ప్రకటనపై సంతకం చేయలేదు. ఆపరేషన్‌ సిందూర్‌లో పూర్తిగా పాకిస్థాన్‌ పక్షాన నిలబడి, జె–10సి యుద్ధవిమానాలు, మిసైళ్ళు, డ్రోన్లతోపాటు, కీలకమైన యుద్ధసమాచారాన్ని కూడా చేరవేసిందని మన రక్షణరంగ నిపుణులు నమ్ముతున్నారు. సరిహద్దుల్లో పేరుకు ఉపసంహరణలు జరిగినా, కీలకమైన ఆర్మీ పోస్టుల్లో ఇంకా చైనా సైనికుల అనుమతితోనే మనవారు కాపలా కాయాల్సివస్తున్నదని కాంగ్రెస్‌ దెప్పిపొడుస్తోంది. నా కోయి గుస్‌గయా అంటూ ఐదేళ్ళక్రితమే ప్రధాని మోదీ మన పార్లమెంటులో దబాయించడంతో, అంతర్జాతీయ వేదికలమీద దీనిని ఆయుధంగా వాడుకోవడానికి చైనాకు అవకాశం దక్కిందని కాంగ్రెస్‌ వాదన. గతంలో కొన్ని దశాబ్దాలుగా ఒక్క బుల్లెట్‌ కూడా పేలని భారత్‌–చైనా సరిహద్దు, మనం అమెరికాతో రాసుకుపూసుకోవడం హెచ్చిన తరువాత నిత్య ఘర్షణలకు నిలయమైన మాట నిజం. చైనా, భారత్‌ మధ్య వివిధ రంగాల్లో పోటీ అనివార్యం. కానీ, డోనాల్డ్‌ ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడు అయిన తరువాత భారత్‌–చైనాలకు అనేక కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి. రష్యాతో వాణిజ్యం చేసే దేశాలమీద ఐదురెట్ల సుంకాలు విధిస్తామని అమెరికా–నాటో హెచ్చరికలు చేస్తున్నాయి. భారత్‌–చైనాకు నష్టకరమైన ఈ తరహా నిర్ణయాలు అనేకం జరుగుతున్నాయి, రాబోయే రోజుల్లో ట్రంప్‌ నుంచి మరిన్ని ఎదురవుతాయి. ఈ నేపథ్యంలో భారత్‌ను గుడ్డిగా ద్వేషించడం వల్ల చైనాకు ఒరిగేదేమీ ఉండదు. ఉభయదేశాల ఉమ్మడి ప్రయోజనాలే పునాదిగా దౌత్యసంబంధాలు దృఢ పడాలి.

ఇవి కూడా చదవండి

స్వచ్ఛ సర్వేక్షణ్‎ 2024-25లో ఏపీకి ఐదు ప్రతిష్ఠాత్మక పురస్కారాలు..యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్

మరిన్ని జాతీయతెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 18 , 2025 | 02:05 AM