Share News

India China Tensions దలైలామా ఆకాంక్ష

ABN , Publish Date - Jul 09 , 2025 | 04:06 AM

హిమాచల్‌ప్రదేశ్‌లోని ధర్మశాలలో టిబెటన్ల ఆధ్యాత్మిక గురువు దలైలామా 90వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఎంతోమంది ప్రముఖులు దేశవిదేశాలనుంచి వచ్చి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అమెరికా సహా పలు

India China Tensions దలైలామా ఆకాంక్ష

హిమాచల్‌ప్రదేశ్‌లోని ధర్మశాలలో టిబెటన్ల ఆధ్యాత్మిక గురువు దలైలామా 90వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఎంతోమంది ప్రముఖులు దేశవిదేశాలనుంచి వచ్చి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అమెరికా సహా పలు దేశాల ప్రతినిధులు, నాయకులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న బౌద్ధులు, వేలాదిమంది టిబెటన్లు తరలివచ్చారు. ప్రేమ, కరుణ, సహనం ఇత్యాది సద్గుణాలకు ప్రతిరూపంగా దలైలామాను అభివర్ణిస్తూ 140కోట్లమంది భారతీయుల తరఫున ప్రధాని నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలియచేశారు. కేంద్రమంత్రి కిరణ్‌రిజిజు, అరుణాచల్‌ ముఖ్యమంత్రి పెమాఖండూ ఇత్యాదులు ఈ కార్యక్రమంలో పాల్గొన్న నేపథ్యంలో, ఎప్పటిలాగానే చైనా మరోమారు తన అభ్యంతరాలను, ఆక్షేపణలను తెలియచేసింది. టిబెట్‌తో ముడివడిన వ్యవహారాలమీద చైనా వైఖరి సుస్పష్టం, బీజింగ్‌ అభిప్రాయాలను భారత్‌ కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాల్సిందే అని చైనా వ్యాఖ్యానించింది. ఈ వేడుకలకు కొద్దిరోజుల ముందు, తన వారసుడి ఎంపికకు సంబంధించి దలైలామా వెలువరించిన సందేశం, దానిపై భారతప్రభుత్వ వైఖరి చైనాకు ఆగ్రహం కలిగించిన విషయం తెలిసిందే. చైనాతో ఇప్పుడున్న వివాదాలకు 15వ దలైలామా ఎంపిక అంశం కూడా తోడై రాబోయేరోజుల్లో ఇరుదేశాల మధ్యా మరింత దూరం, వేడీ పెరిగే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

కోరికలు కూడదని చెప్పిన బౌద్ధంలో ఈ వ్యాఖ్యలేమిటని కొందరు ప్రశ్నిస్తున్నారు గానీ, తాను మరో నలభైయేళ్ళు జీవించాలని దలైలామా అనుకుంటున్నారు. అవలోకితేశ్వరుడి ఆశీస్సులతో బౌద్ధానికీ, భక్తులకూ మరిన్ని దశాబ్దాలు సేవ చేసుకోవాలని కోరుకుంటున్నారు. గత ఏడాది కూడా ఆయన తన జీవితకాలం గురించి వ్యాఖ్యలు చేస్తూ, నూటపదేళ్ళకంటే ఎక్కువే జీవిస్తానన్నారు. కచ్చితంగా 113సంవత్సరాలు ఉంటానని ఐదేళ్ళక్రితమే మరో లెక్కగట్టారు. మొత్తానికి తాను అధికకాలం నిండుగా జీవించి బౌద్ధానికి సేవలందించాలన్నది అభిలాష. ఎక్కువకాలం జీవించాలని దేవుడినుంచి సంకేతాలందాయని కూడా అంటున్నందున, ఆయన అభీష్టం నెరవేరాలనే అంతా కోరుకుంటున్నారు. ఇక, తన ఆధ్యాత్మిక వారసత్వ ఎంపిక అంశాన్ని 90వ పుట్టినరోజు సందర్భంలో నిర్ణయిస్తానని పద్నాలుగు సంవత్సరాల క్రితం ఇచ్చిన హామీకి అనుగుణంగానే ఇటీవలి ఆయన ప్రకటన వెలువడిందనుకోవాలి. భారతదేశం కేంద్రంగా పదేళ్ళక్రితం ఆరంభించి, స్విట్జర్లాండ్‌లో రిజిస్టర్‌ చేసిన తన ట్రస్టుకే భావి దలైలామాను నిర్ణయించే అధికారం ఉంటుందని ఆయన విస్పష్టంగా ప్రకటించారు. ఇందులో వేరెవరిపాత్రకూ తావులేదని చైనాను జీరోచేశారు. అనేక సంవత్సరాలుగా ఈ ప్రకటనకోసమే ఎదురుచూస్తున్న చైనా సహజంగానే ఘాటుగా స్పందించింది. భావి దలైలామా చైనా ప్రధాన భూభాగంలో జన్మించినవాడై ఉండాలని, చైనా చట్టాలకు, నిబంధనలకు లోబడి లామా వారసత్వం కొనసాగాలని ఆ దేశం వెంటనే ప్రకటించింది. బంగారు కలశం నుంచి లాటరీతీసి లామాను ఎంపికచేసే రెండువందలయాభై ఏళ్ళనాటి విధానాన్ని చైనా ప్రతిపాదిస్తోంది.


తన మాతృభూమికోసం, ప్రజలకోసం చైనాతో సాగించిన ఏడుదశాబ్దాల పోరాట అనుభవాలతో దలైలామా ఈ ఏడాదిమార్చిలో విడుదల చేసిన గ్రంథంలో, తన పునర్జన్మ చైనా ప్రధాన భూభాగానికి ఆవల జరుగుతుందని తేల్చేశారు. తద్వారా, చైనా భావి ఎంపికని వీసమెత్తు విలువలేనిదిగా మార్చేశారు. 1995లో ఆయన తన తరువాతి స్థానమైన పంచన్‌లామాగా నియమించిన ఆరేళ్ళబాలుడిని చైనా ముప్పయేళ్ళుగా టిబెటన్లకు కనిపించకుండా చేసింది. పోటీగా చైనా నియమించిన వ్యక్తికి టిబెట్‌లో ఏమాత్రం గౌరవాభిమానాలు లేవు. ఈయన టిబెట్‌లో కాక, బీజింగ్‌లో ఉంటూ,. అప్పుడప్పుడు వెళ్ళివస్తూ చైనాపెద్దల ఆదేశాలకు అనుగుణంగా టిబెట్‌ను ఆధ్యాత్మికంగా విలీనం చేసే పనిలో ఉన్నారు. ఈయనను పీఠాధిపతిగా చైనా ప్రతిష్ఠించబోతున్నదని వార్తలు వస్తున్న తరుణంలో వ్యవహారం ముదిరిపాకన పడుతున్నదని అర్థం. పరిణామాలు ఎలా మారినా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న టిబెటన్ల ఆధ్యాత్మిక కేంద్రంగా హిమాచల్‌లోని ధర్మశాల కొనసాగబోతున్నది. ప్రస్తుతానికి భారతప్రభుత్వం ఈ వివాదంమీద ఎక్కువగా మాట్లాడకపోయినప్పటికీ, అవసరమైన తరుణంలో అది ఏ మాత్రం వెనక్కుతగ్గదని ఆశించాలి.

ఈ వార్తలు చదవండి:

అరబ్బు దేశంలో ఆటోమొబైల్ ఇంజినీర్.. ఆంధ్రలో ఆదర్శ రైతుగా..

యూఎస్ఏలో ఆంధ్రా యూనివర్సిటీ పూర్వ విద్యార్థుల సమ్మేళనం

Read Latest and NRI News

Updated Date - Jul 09 , 2025 | 04:06 AM