Share News

G20 South Africa Summit: అమెరికాలేని జీ20

ABN , Publish Date - Nov 26 , 2025 | 12:49 AM

జీ20 సదస్సు నిర్వహణ ఎంతో కష్టమని మాతో ఓ మాట ముందే చెప్పవచ్చు కదా... అని భారత ప్రధాని నరేంద్రమోదీతో దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామ్‌ఫోసా అన్నారట. సదస్సు నిర్వహణలో భారత్‌...

G20 South Africa Summit: అమెరికాలేని జీ20

జీ20 సదస్సు నిర్వహణ ఎంతో కష్టమని మాతో ఓ మాట ముందే చెప్పవచ్చు కదా... అని భారత ప్రధాని నరేంద్రమోదీతో దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామ్‌ఫోసా అన్నారట. సదస్సు నిర్వహణలో భారత్‌ సహకారం మరువలేనిదని కూడా ఆయన మోదీతో అన్నారట. రెండేళ్ళక్రితం జీ20 సదస్సును ఘనంగా నిర్వహించిన అనుభవం భారత్‌కు ఉన్నది కనుక, రామ్‌ఫోసా సరదాగా ఈ మాటలు అనివుంటారు. నిజానికి, ఆఫ్రికాఖండంలో జరిగిన ఈ తొలి జీ20 సదస్సు కూడా చక్కగా జరిగింది. దక్షిణాఫ్రికామీద అప్పటికే కక్షకట్టివున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఈ సదస్సుకు రాకపోవచ్చునన్న అంచనాలు ఎప్పటినుంచో ఉన్నవే. దక్షిణాఫ్రికాలో శ్వేతజాతివారిని నల్లవారు ఊచకోత కోస్తున్నారంటూ ఆర్నెల్లక్రితం శ్వేతసౌధం సమావేశంలో, అంతర్జాతీయ మీడియా సమక్షంలో రామ్‌ఫోసాను ట్రంప్‌ తీవ్రంగా అవమానించిన ఆ దృశ్యం విస్మరించలేనిది. వందలమంది శ్వేతజాతీయులు హత్యలకు గురైనారంటూ ట్రంప్‌ మీడియాకు చూపిన ఆ చిత్రాలు సైతం అసత్యాలని అమెరికా పత్రికలే అప్పట్లో విమర్శించాయి. సోషల్‌ మీడియా ప్రచారాన్ని శ్వేతసౌధం అధికారికం చేస్తున్నదని తప్పుబట్టాయి. ఈ ఆరోపణలను సిరిల్‌ ఖండిస్తూ, తనది పేదదేశమని, అమెరికా అధ్యక్షుడికి ఖరీదైన విమానాలను బహుమతిగా ఇచ్చుకోలేనంటూ ఓ నర్మగర్భమైన వ్యాఖ్య కూడా చేశారు. ఖతార్‌ మాదిరిగా బోయింగ్‌ ఇచ్చి ట్రంప్‌ను ప్రసన్నం చేసుకోగల ఆర్థికస్తోమత తనకు లేదన్న ఆ వ్యాఖ్యలో హాస్యం కంటే అదిమిపట్టిన ఆగ్రహమే అధికం. శ్వేతజాతి పరిరక్షకుడుగా అవతారమెత్తి, దక్షిణాఫ్రికామీద కాలుదూస్తున్న ట్రంప్‌ ఈ జీ20 సదస్సుకు రాకపోవడం ఒకందుకు మనకూ మంచిదైంది. ట్రంప్‌తో దోస్తీ పూర్తిగా చెడి, ఎడమొఖం పెడమొఖంగా ఉన్న తరుణంలో, ట్రంప్‌కు ఎదురుపడకూడదన్న ఉద్దేశంతో ఇప్పటికే నరేంద్రమోదీ పలు అంతర్జాతీయ సదస్సులను వదులుకున్నారు. ఇలా వరుసబెట్టి ప్రపంచవేదికల మీద కనిపించకుండా పోవడం దేశానికి మంచిదికాదని విపక్షాలు సైతం వ్యాఖ్యానిస్తున్న నేపథ్యంలో, ట్రంప్‌ గైర్హాజరీతో అందివచ్చిన జీ20 అవకాశాన్ని మోదీ సద్వినియోగం చేసుకున్నారు. దేశాధినేతలతో ఆయన చిరునవ్వులు, కరచాలనాలు, హాస్యసంభాషణలు మన మీడియా విస్తృతంగా ప్రచారం చేసింది. సదస్సుకు సంబంధించిన అన్ని సెషన్స్‌లోనూ మోదీ పాల్గొనడమే కాక, అద్భుతమైన ప్రసంగాలు, అనేక వినూత్న ప్రతిపాదనలు చేశారు.


ప్రధానంగా వాతావరణ మార్పులమీద చర్చించనున్న జొహెన్నెస్‌బర్గ్‌ సదస్సుకు ట్రంప్‌ రాకపోవడంలో ఆశ్చర్యమేమీ లేదు. డ్రిల్‌ బేబీ డ్రిల్‌ అంటూ శిలాజ ఇంధనాలను తవ్విపోసే పనిలో ఆయన ఉన్నాడు. వాతావరణ మార్పు, పర్యావరణ క్షీణత, భూగోళం వేడెక్కడం వంటి మాటలకు చెవొగ్గితే ఈయన వంటి పారిశ్రామికవేత్తలకు మనుగడ ఉండదు కనుక, ఈ తరహా సదస్సులకు ట్రంప్‌ రారు. ఎజెండా మార్చుకోమని ట్రంప్‌ ఒత్తిడిచేశారని, అది సాధ్యపడకపోడంతో రావడమే మానుకున్నారని కొందరు అంటారు. శిఖరాగ్ర సదస్సు సంయుక్త ప్రకటన విషయంలోనూ అమెరికా అడ్డుపడినా దక్షిణాఫ్రికా లొంగలేదు. ట్రంప్‌కోసం కేటాయించిన కుర్చీ ఖాళీగా కనిపించడం రామ్‌ఫోసాకు బాగా చిరాకు కలిగించినట్టు ఉంది, అధ్యక్షపదవి బదిలీకి సైతం దక్షిణాఫ్రికా నిరాకరించింది. అమెరికా ఈ సదస్సుల్లో పాల్గొనకపోయినా జీ20 కొనసాగుతుందని దక్షిణాఫ్రికా అంతర్జాతీయ వ్యవహారాల మంత్రి చేసిన వ్యాఖ్య వినడానికి బాగుంది. కానీ, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మేక్రాన్‌ మాత్రం జీ20 ప్రమాదపుటంచుల్లో ఉన్నదని హెచ్చరిస్తున్నారు. అమెరికా గైర్హాజరీతో ప్రధాన సంక్షోభాల పరిష్కారానికి సమష్టిపోరాటం కష్టమవుతుందన్న ఆయన అంచనా కొట్టిపారేయలేనిది. వాతావరణ సమస్యలు, అసమానతల పరిష్కారాలు ఇత్యాది కీలకాంశాలమీద జీ20 ఒక్కమాటగా ఉండటం బాగుంది. ఉగ్రవాద చర్యలను ముక్తకంఠంతో ఖండించడం ఎర్రకోట దాడి నేపథ్యంలో భారత్‌కు మంచి ఊరట. మాదకద్రవ్యాలపై పోరాటం వంటి భారత్‌ ప్రతిపాదిత అనేక అంశాలకు డిక్లరేషన్‌లో స్థానం దక్కింది. కృత్రిమమేధ దుర్వినియోగం మీద దృష్టిపెట్టాలంటూ మోదీ చేసిన హెచ్చరికలు సముచితమైనవి. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఇండియాలో జరగబోయే ఏఐ ఇంపాక్ట్‌ సదస్సుకు జీ20 దేశాలను ఆహ్వానించడమూ బాగుంది. అనేకానేక అంశాలపై గ్లోబల్‌ సౌత్‌ ఘోషను వినిపిస్తున్న ఈ ముప్పై పేజీల ప్రకటన అమెరికా భాగస్వామ్యం లేకుండా ముందుకు తీసుకువెళ్లడం నిజంగా సాధ్యమేనా? అన్నది విలువైన ప్రశ్న, సరైన అనుమానం.

ఇవి కూడా చదవండి

ప్రాక్టీస్ మొదలుపెట్టిన శ్రేయస్!

లిక్కర్ స్కామ్‌లో.. జోగి రమేష్‌కు పోలీస్ కస్టడీ..

Updated Date - Nov 26 , 2025 | 12:49 AM