First Woman World Cup Winner: దివ్య విజయం
ABN , Publish Date - Jul 30 , 2025 | 01:29 AM
ఫిడే మహిళల చెస్ ప్రపంచకప్‌లో చాంపియన్‌గా అవతరించి పందొమ్మిదేళ్ల దివ్యా దేశ్‌ముఖ్ సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. ఫైనల్లో తనకంటే ఎంతో అనుభవజ్ఞురాలైన తెలుగమ్మాయి కోనేరు హంపిపై విజయం సాధించి...

ఫిడే మహిళల చెస్ ప్రపంచకప్‌లో చాంపియన్‌గా అవతరించి పందొమ్మిదేళ్ల దివ్యా దేశ్‌ముఖ్ సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. ఫైనల్లో తనకంటే ఎంతో అనుభవజ్ఞురాలైన తెలుగమ్మాయి కోనేరు హంపిపై విజయం సాధించి చిరుప్రాయంలోనే ప్రపంచకప్ గెలిచిన చరిత్ర సృష్టించింది. టైటిల్ కోసం ఇద్దరు భారతీయులు పోటీపడటం ఇదే మొదటిసారి. ఇక, గతంలో ఆనంద్ రెండు పర్యాయాలు ఈ టోర్నమెంట్‌లో విజేతగా నిలిచినా, మహిళల్లో భారత్ నుంచి మొట్టమొదటి చాంపియన్ దివ్య. నాగ్‌పూర్‌లో వైద్యులైన అమ్మానాన్నల ప్రోత్సాహమే అండగా దివ్య చదరంగ ప్రస్థానం సాగింది. అండర్–7 అమ్మాయిల విభాగం జాతీయ స్థాయి పోటీల్లో బంగారు పతకం సాధించడం ఆమె సహజ ప్రజ్ఞను చాటింది. అండర్–9 విభాగంలో ఆమె జాతీయ చాంపియన్. మరుసటి ఏడాది ఆసియా స్కూల్ చెస్ అండర్–10 విభాగంలో ప్రపంచ టైటిల్ గెలిచి చిచ్చరపిడుగు అనిపించుకుంది. పన్నెండేళ్లకే ఇంటర్నేషనల్ మాస్టర్ హోదా అందుకుంది. వరల్డ్ యూత్ చెస్, ఆసియా టైటిల్, ప్రపంచ జూనియర్ చెస్ చాంపియన్‌షిప్.. ఇలా చిరుప్రాయంలోనే అనేక టైటిళ్లు కొల్లగొట్టింది. నిరుడు సహచర క్రీడాకారిణులతో కలిసి ప్రతిష్ఠాత్మక చెస్ ఒలింపియాడ్‌ను భారత్ అందుకోవడంలో కీలక భూమిక పోషించింది. సీనియర్ టోర్నమెంట్లలో ఆడిన అనుభవం అంతగా లేకున్నా, తాజా ప్రపంచకప్‌లో దూకుడైన ఆటతో గ్రాండ్‌మాస్టర్లను కంగుతినిపించింది. తనకంటే మెరుగైన రేటింగ్ ఉన్న ద్రోణవల్లి హారికను క్వార్టర్స్‌లో, చైనా స్టార్ క్రీడాకారిణి టాన్ జోంగ్యీని సెమీఫైనల్లో ఓడించి దివ్య ఆత్మవిశ్వాసాన్ని ప్రోది చేసుకుంది. ఇక అసలైన ఆఖరి పోరాటంలో తనకంటే రెట్టింపు వయసున్న హంపిపై విజయం సాధించి ప్రపంచకప్ ట్రోఫీని సగర్వంగా అందుకుంది. ఈ క్రమంలోనే చదరంగ క్రీడాకారులకు అత్యంత ప్రాధాన్యమైన గ్రాండ్‌మాస్టర్ హోదాను దక్కించుకుంది. హంపి, హారిక, వైశాలి తర్వాత గ్రాండ్‌మాస్టర్‌గా అవతరించిన నాలుగో భారత క్రీడాకారిణిగా శిఖరాగ్రానికి చేరుకుంది. దివ్య ఫ్యాషన్‌కూ ప్రాధాన్యమిస్తుంది. నవతరం అమ్మాయిలకు తగ్గ దుస్తులు ధరించడం, జట్టును వదిలేయడం ఆమెకు ఇష్టం. వీటిపై గతంలో దివ్య ఎన్నో విమర్శలు ఎదుర్కొంది. ‘అమ్మాయిల ఆటతీరును, వారి బలాలను చూడండి. అంతేకానీ, ఇతర విషయాలను కాదు. నేను వీటిని పట్టించుకోను.
అందరూ నాలా ఉండకపోవచ్చు. కొందరు ఇలాంటి మాటలు భరించలేక ఆటకు దూరమవుతారు. ఇలాంటి పరిస్థితిని ఎవరికీ రానివ్వొద్దు’ అంటూ విమర్శకులకు దీటుగా బదులిచ్చింది ఆమె. తన ఆటతో, ఆత్మవిశ్వాసంతో ఈ తరానికి స్ఫూర్తిగా నిలిచింది. విశ్వనాథన్ ఆనంద్ దశాబ్దాల తరబడి భారత చదరంగానికి చుక్కానిలా నిలిచారు. ఐదు పర్యాయాలు ప్రపంచ చాంపియన్‌గా నిలిచి చెస్‌లో దిగ్గజస్థాయిని అందుకున్నారు. ఆ తర్వాత భారత్ నుంచి కొందరు ఆటగాళ్లు వచ్చినా నిలదొక్కుకోలేకపోయారు. కానీ, గత దశాబ్దకాలం నుంచి పరిస్థితి మారింది. ఆనంద్ మార్గదర్శకత్వంలో ఎందరో క్రీడాకారులు వెలుగులోకి వచ్చారు. 1999 నాటికి దేశంలో ముగ్గురే గ్రాండ్‌మాస్టర్లు ఉంటే.. ఇప్పుడు ఆ సంఖ్య 88కి చేరింది. భారత్‌లో చెస్ ఎదుగుదలకు ఇది సంకేతం. గుకేశ్, ప్రజ్ఞానంద, అర్జున్ ఇరిగేసిలాంటి ఆటగాళ్లు పిన్న వయసులోనే గ్రాండ్‌మాస్టర్లుగా అవతరించారు. అమెరికా, రష్యా, నెదర్లాండ్స్ లాంటి దేశాలను తలదన్నే స్థాయిలో ఎక్కువగా గ్రాండ్‌మాస్టర్లు భారత్‌లో రూపు దిద్దుకుంటున్నారు. ఆనంద్ ఘన వారసత్వాన్ని అందిపుచ్చుకుంటూ జూనియర్ ఆటగాళ్లు తమ మస్తిష్కానికి పదును పెడుతున్నారు. గతేడాది గుకేశ్ ప్రపంచ చాంపియన్‌గా అవతరిస్తే, చెస్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే ఒలింపియాడ్ పురుషులు, మహిళల ట్రోఫీలను భారత జట్లు గెలుచుకున్నాయి. నిరుడు మహిళల ప్రపంచ ర్యాపిడ్ చాంపియన్‌షిప్‌ను హంపి దక్కించుకుంటే, ఇప్పుడు మహిళల ప్రపంచకప్‌ను దివ్యా దేశ్‌ముఖ్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం ప్రపంచ చదరంగంలో మనోళ్ల ఆధిపత్యం సాగుతోందనడానికి ఈ విజయాలే తార్కాణం.
ఈ వార్తలు కూడా చదవండి
సుప్రీంకోర్టులో సీఎం రేవంత్ రెడ్డికి ఊరట
హైదరాబాద్ అభివృద్ధిపై సీఎం రేవంత్‌రెడ్డి స్పెషల్ ఫోకస్
Read latest Telangana News And Telugu News