Delhi Pollution Protest Political Arrests: గాలి రాజకీయం
ABN , Publish Date - Nov 27 , 2025 | 01:01 AM
భయానకమైన కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఢిల్లీని రక్షించాలంటూ ఇండియాగేట్ దగ్గర సోమవారం నిరసన నిర్వహించి, అరెస్టయిన వారిని ఢిల్లీకోర్టు మూడురోజుల పోలీసు కస్టడీకి...
భయానకమైన కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఢిల్లీని రక్షించాలంటూ ఇండియాగేట్ దగ్గర సోమవారం నిరసన నిర్వహించి, అరెస్టయిన వారిని ఢిల్లీకోర్టు మూడురోజుల పోలీసు కస్టడీకి అప్పగించింది. ఈ కాలుష్య వ్యతిరేక ప్రదర్శనలో హిడ్మా ఫోటో ప్రదర్శన, పోలీసులపై దాడి ఇత్యాది పలు చర్యలకు వీరంతా పాల్పడినందున, వారి పుట్టుపూర్వోత్తరాలతో సహా సర్వమూ తవ్వితీయాలని ఢిల్లీ పోలీసులు నిర్ణయించుకున్నారు. భారత న్యాయ సంహితలో కొత్తగా చేరిన 197వ సెక్షన్ సైతం ప్రయోగించడం ద్వారా హిడ్మా అనుకూల నినాదాలు చేయడమంటే దేశభద్రత, సమగ్రత, సమైక్యతలకు విఘాతం కలిగించడమేనని పోలీసులు చాటిచెప్పదల్చారు. ఢిల్లీ కాలుష్య తీవ్రతను ఎత్తిపడుతున్న, ప్రభుత్వాల వైఫల్యాన్ని ప్రశ్నిస్తున్న నినాదాలు, చిత్రాలు అనేకం ఆ ప్రదర్శనలో ఉన్నప్పటికీ, హిడ్మా రేఖాచిత్రం మాత్రమే పాలకులనూ పోలీసులనూ కదిలించింది. బిర్సాముండా నుంచి హిడ్మా వరకూ అడవులు, పర్యావరణ పరిరక్షణకోసం నిరంతరంగా పోరాటం సాగుతూనే ఉందనీ, పర్యావరణ అనుకూల అభివృద్ధి విధానాలు కావాలనీ నిరసనకారులు నినదించారు. కాస్తంత కట్టుతప్పినప్పటికీ, కాలుష్యాన్ని నియంత్రించలేని పాలకుల అసమర్థతను ఈ ప్రదర్శన గట్టిగానే ప్రశ్నించింది.
మాకు ఊపిరాడడం లేదు, మమ్మల్ని బతకనివ్వండి, గొంతులో విషం పోయకండి వంటి నినాదాలతో ఒక ప్రధాన ప్రజాసమస్యనూ, పరిష్కారంలో పాలకుల వైఫల్యాన్ని గుర్తుచేస్తున్న ఈ ప్రదర్శనను పోలీసులు తీవ్రంగా తీసుకోవడం విచిత్రం. నిరసన కార్యక్రమం హింసాత్మకంగా మారడానికి ఎవరు కారకులన్న ప్రశ్నకు అటు పోలీసులూ, ఇటు ప్రదర్శనకారుల దగ్గర కావాల్సినన్ని జవాబులున్నాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలను అటుంచితే, ప్రజాగ్రహాన్ని శాంతిభద్రతల సమస్యగా పోలీసులు మార్చివేసిన మాట వాస్తవం. పోలీసులు ఎంత రాక్షసంగా వ్యవహరించారో ఆ దృశ్యాలు తెలియచెబుతాయి. ప్రదర్శనను విచ్ఛిన్నం చేయడంతో సరిపెట్టకుండా, అరెస్టులు, నిర్బంధాలు, కఠిన చట్టాలతో దానిని కొనసాగించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. స్వచ్ఛమైన గాలిని కోరుతున్నవారిని సైతం దేశద్రోహులుగా చిత్రీకరిస్తారా అనీ, జీవించే హక్కును కాపాడుకోవడమూ నేరమేనా? అనీ విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.
నిత్యం కాలుష్యాన్ని దిగమింగుతున్న ఢిల్లీ వాసుల పక్షాన ఈ యువత వీధుల్లోకి వచ్చింది. దీనిప్రభావమే కాబోలు, ప్రధానమంత్రి కార్యాలయం రంగంలోకి దిగి, విద్యుత్ వాహనాల వినియోగం స్థాయి, సౌకర్యాలు ఇత్యాది కాలుష్యనియంత్రణ చర్యలను సమీక్షించి, సకలవ్యవస్థలనూ హెచ్చరించింది. ఎక్యూఐ నాలుగువందలు దాటిపోయిన స్థితిలో, ఊపిరాడని ఢిల్లీవాసులను నేరుగా ప్రధాని కార్యాలయమే రక్షించబూనుకుంది కనుక, పరిస్థితులు మెరుగుపడవచ్చు. ఇప్పటికే, గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (గ్రాప్)ను సవరించి, స్థాయిని పెంచి, తదనుగుణమైన చర్యలు అమలవుతున్నాయి. స్కూళ్ళకు విడతలవారీ సెలవులు, ఉద్యోగుల వర్క్‌ఫ్రమ్ హోమ్ వంటివి మొదలైనాయి. దశాబ్దాలుగా ఉన్న సమస్యే కనుక, ఇప్పటికే ఏర్పడిన నిర్దిష్టమైన విధానాలను తూచ తప్పకుండా అమలు చేస్తే సరిపోతుంది. కాలుష్యం వేగంగా హెచ్చుతున్న స్థితిలోనే ఢిల్లీ ప్రభుత్వం, కేంద్రం కలిసికట్టుగా సుప్రీంకోర్టులో పోరాడి దీపావళి టపాసుల విక్రయం, వినియోగంమీద సానుకూల తీర్పు సాధించిన విషయం తెలిసిందే. ఆమ్‌ఆద్మీపార్టీ ఏలుబడిలో, సుప్రీంకోర్టు చొరవతో దీపావళి టపాసులపై వచ్చిన పూర్తిస్థాయి నిషేధాన్ని డబుల్ ఇంజన్ సర్కార్ తన రాజకీయప్రయోజనాలకోసం వమ్ముచేసింది. గ్రీన్‌క్రాకర్స్, అవీ కొద్దిగంటలు కాల్చడానికి మాత్రమే సుప్రీంకోర్టు అనుమతించినా, నియంత్రణలేమీ లేక ఢిల్లీ కాలుష్యమయమైపోయింది. ప్రధాని వెనుక ఎయిర్‌ప్యూరిఫైర్‌లు అమర్చివున్న చిత్రాలు అప్పట్లో మాధ్యమాల్లో చక్కెర్లు కొట్టాయి. ఆమ్‌ఆద్మీపార్టీ అధికారంలో ఉన్నంతకాలం కాలుష్యాన్ని సైతం రాజకీయంగా వాడుకున్న బీజేపీ నుంచి ఢిల్లీ ప్రజలు శాశ్వత పరిష్కారాలు ఆశిస్తున్నారు. ఢిల్లీలోనే కాదు, ఇరుగుపొరుగు రాష్ట్రాల్లోనూ అదేపార్టీ అధికారంలో ఉన్నందున, నేరం నాది కాదంటూ వేరొకరిమీదకు నెట్టేయడం కష్టం. ప్రపంచంలో అత్యంత కాలుష్యమయమైన రాజధానికి కాస్తంత ఆక్సిజన్ అందించడం పాలకుల విధి.
ఇవి కూడా చదవండి
5 బీసీ కార్పోరేషన్లకు ఛైర్ పర్సన్లను నియమించిన ప్రభుత్వం
అయోధ్యలో జెండా ఎగరవేయడంపై పాక్ కారుకూతలు.. ఎడాపెడా వాయించేసిన భారత్