COP30 Analysis: అవని ఆర్తి
ABN , Publish Date - Nov 25 , 2025 | 12:56 AM
‘మన శీతోష్ణస్థితి మారుతోంది. మన ధరిత్రి సంక్షోభంలో ఉన్నది. భవిష్యత్తు భయం గొల్పుతోంది, అనిశ్చితంగా ఉంది. అయినా ఈ మహా అస్తవ్యస్తత నడుమ భావిని ముందే సూచించే శక్తిని కనుగొన్నాను. తుఫానులు ప్రచండమవుతున్న...
‘మన శీతోష్ణస్థితి మారుతోంది. మన ధరిత్రి సంక్షోభంలో ఉన్నది. భవిష్యత్తు భయం గొల్పుతోంది, అనిశ్చితంగా ఉంది. అయినా ఈ మహా అస్తవ్యస్తత నడుమ భావిని ముందే సూచించే శక్తిని కనుగొన్నాను. తుఫానులు ప్రచండమవుతున్నవేళ రక్షణనిస్తుందది. ఈ ప్రపంచాన్ని మరింత మెరుగ్గా రూపొందించే స్థిరమైన, నిరంతర కృషితోనే అది మనకు సురక్షిత ప్రదేశంగా ఉంటుంది’– 2007లో నోబెల్ శాంతి పురస్కారాన్ని పొందిన ఐపీసీసీ నివేదిక ప్రధాన రచయిత, వాతావరణ శాస్త్రవేత్త ప్రొఫెసర్ జగదీష్ శుక్లా తన జీవిత కథకు ముక్తాయింపుగా అన్న ఆ మాటలు ఆవశ్యక ఫలితాలను సాధించడంలో విఫలమవుతున్నప్పటికీ వాతావరణ మార్పుపై ఐక్యరాజ్యసమితి వార్షిక సదస్సులు కొనసాగవలసిన ఆవశ్యకతను నొక్కి చెప్పుతున్నాయి. శనివారంనాడు, బ్రెజిల్‌లో అమెజాన్ మహారణ్యం ముంగిట ఉన్న బెలెమ్ నగరంలో ముగిసిన కాప్ 30 సదస్సు సైతం ఆ వార్షిక చర్చల ప్రధాన లక్ష్యాన్ని సాధించడంలో విఫలమయింది.
కాప్ (కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్) సదస్సులుగా ప్రసిద్ధి పొందిన ఐక్యరాజ్యసమితి వార్షిక వాతావరణ సదస్సులు మూడు దశాబ్దాల క్రితం ప్రారంభమయినప్పుడు, వాతావరణంలో కర్బన ఉద్గారాల సాంద్రత 360.67 పార్ట్స్ పర్ మిలియన్‌గా ఉండగా ఇప్పుడు అది, శాస్త్రవేత్తలు చెప్పిన భద్రమైన పరిమితి (350 పీపీఎమ్) కంటే చాలా అధికంగా 426.68 పిపిఎమ్‌గా ఉన్నది! వాతావరణ మార్పుకు కారణమవుతున్న కర్బన ఉద్గారాలకు ప్రధాన వనరు అయిన శిలాజ ఇంధనాల వినియోగాన్ని దశల వారీగా తగ్గించేందుకు ఒక మార్గదర్శక ప్రణాళికను రూపొందించడం కాప్ 30 అజెండాలో ప్రధానాంశంగా ఉన్నది.
పారిశ్రామిక విప్లవకాలంలో రికార్డయిన గరిష్ఠ ఉష్ణోగ్రతకు మించి 1.5 డిగ్రీ సెల్సియస్‌కు పరిమితం చేయాలని పారిస్ కాప్ సదస్సు నిర్దేశించింది. చారిత్రకంగా శిలాజ ఇంధనాలను ఉపయోగించుకుని అభివృద్ధి చెందిన దేశాలు ఇప్పుడు తమ అభివృద్ధికి వాటిపై ప్రధానంగా ఆధారపడి ఉన్న దేశాలకు, పునర్వినియోగ ఇంధన వనరులకు మళ్లేందుకు అవసరమైన సహాయాన్ని అందించడంలో ఉదాసీనత చూపుతున్నాయి. ఆర్థిక సహాయం, అధునాతన సాంకేతికతల బదిలీ లేకుండా వర్ధమాన దేశాలు శిలాజ ఇంధనాల వినియోగాన్ని త్యజించడమనేది అసాధ్యం. ఇది జరగనంతవరకు కర్బన ఉద్గారాలు భారీ స్థాయిలో కొనసాగుతూ వాతావరణ మార్పు తీవ్రమవుతూనే ఉంటుంది. వాతావరణ మార్పును నిరోధించాలనే ఉమ్మడి లక్ష్యం కంటే సంపన్న దేశాలు తమ జాతీయ ప్రయోజనాలకు ప్రాధాన్య మిస్తున్నంతవరకు శిలాజ ఇంధనాల వినియోగం దశల వారీ తగ్గింపుపై ప్రతిష్టంభన కొనసాగడం ఖాయం. కాప్ 30 ‘ది కాప్ ఆప్ ట్రూత్’ అని బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డి సిల్వా అభివర్ణించారు. సత్యసదస్సు! నిజమే, అవని ఆర్తరావాన్ని ప్రతిధ్వనించింది. అంతే.
మానవాళిని మనుగడ ముప్పు నుంచి కాపాడేందుకు ఉద్దేశించిన కాప్ సదస్సులు ‘వార్షిక వాతావరణ ప్రహసనాలు’ అని ఒక విజ్ఞురాలు అసహనం వ్యక్తం చేశారు. మరొకరు ‘వాతావరణ సంత’ అని చిరాకు పడ్డారు. ఈ అభియోగాలు పూర్తిగా అసత్యాలు కావు. ఈ కారణంగానే వాతావరణ మార్పుతో మానవాళి మనుగడకు ముంచుకువస్తున్న ముప్పుపై ఆందోళన చెందుతున్న దేశ దేశాల వైజ్ఞానికులు, మేధావులు కొత్త ఆలోచనలు చేస్తున్నారు. ఏటా ఒక దేశంలో నిర్వహించడానికి బదులుగా (ప్రతి ప్రధాన ఖండానికి ఒక్కోటి చొప్పున) ఐదు శాశ్వత వేదికలుగా రూపొందించాలని ఇటాలియన్ సామాజిక శాస్త్రవేత్త ఫ్రాన్సెస్కో గ్రిల్లో ప్రతిపాదించారు. క్లైమేట్ అడాప్టేషన్, క్లైమేట్ మిటిగేషన్, గవర్నెన్స్ ఆఫ్ ప్లేసెస్ (మహాసముద్రాలు, ఆర్కిటిక్, అంటార్కిటిక్ట్) ఏఐ అండ్ క్లైమేట్, జియో ఇంజినీరింగ్ అంశాలకు సంబంధించిన సమస్యల పరిష్కార బాధ్యతలను ఆ ఐదు వేదికలకు అప్పగించాలని గ్రిల్లో సూచించారు. వాతావరణ మార్పు వైపరీత్యాలను అనుభవపూర్వకంగా తెలుసుకుంటున్న సామాన్యులలో పర్యావరణ సమస్యల పరిష్కారంపై అవగాహనను పెంపొందించేందుకు కాప్ చర్చల గురించి సమగ్రంగా తెలియజేయవలసిన అవసరమున్నది. ఇందులో భాగంగా గతంలో గాంధీ విజ్ఞాన పరిషత్ రూపొందించిన ‘ఆంధ్రప్రదేశ్ పర్యావరణ పరిస్థితి : ప్రజానివేదిక– 1990’ లాంటి నివేదికలను ఏటా వెలువరించేందుకు తెలుగు రాష్ట్రాలలోని పర్యావరణ ఉద్యమకారులు పూనుకోవాలి.
ఇవి కూడా చదవండి..
అయోధ్యలో పర్యటించనున్న మోదీ.. రామాలయంపై పతాకావిష్కరణ
ఢిల్లీలో డీకే విధేయులు.. సీఎం మార్పుపై సిద్ధరామయ్య ఆసక్తికర వ్యాఖ్యలు
మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి.