Share News

The Constitutional Tug of War: ఫిరాయింపు చిక్కులు

ABN , Publish Date - Aug 03 , 2025 | 01:51 AM

సుప్రీంకోర్టు తీర్పుతో పార్టీ ఫిరాయింపులకు అడ్డుకట్ట పడుతుందా? పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న పది మంది తెలంగాణ ఎమ్మెల్యేల విషయంలో మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలన్న సుప్రీం తీర్పును శాసనసభ స్పీకర్‌ ఔదాల్చుతారా...

The Constitutional Tug of War: ఫిరాయింపు చిక్కులు

సుప్రీంకోర్టు తీర్పుతో పార్టీ ఫిరాయింపులకు అడ్డుకట్ట పడుతుందా? పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న పది మంది తెలంగాణ ఎమ్మెల్యేల విషయంలో మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలన్న సుప్రీం తీర్పును శాసనసభ స్పీకర్‌ ఔదాల్చుతారా? చట్ట సభల స్పీకర్లు ఇకపై సుప్రీంకోర్టు పరిధిలోకి వెళతారా? ఈ ప్రశ్నలకు సమాధానాలు లభించాలంటే ఏం చేయాలి? జ్యుడీషియరీ, లెజిస్లేచర్‌ వ్యవస్థలలో ఎవరిది పై చేయి? చట్ట సభల స్పీకర్ల వ్యవహారాలపై తరచూ వివాదాలు ఎందుకు వస్తున్నాయి? ఈ ప్రశ్నలకు సుప్రీంకోర్టు తాజా తీర్పు సమాధానం చెప్పిందా? అంటే అవుననిగానీ, కాదనిగానీ చెప్పలేని పరిస్థితి! పార్టీ ఫిరాయింపు చట్టం లోపభూయిష్టంగా ఉండటంతోపాటు నిర్ణయాలు తీసుకోవడంలో చట్టసభల స్పీకర్లకు నిర్దిష్ట కాలవ్యవధి లేకపోవడమే వివాదాలకు కారణం అవుతోంది. ఒకప్పుడు చట్ట సభల స్పీకర్లు పార్టీలకు అతీతంగా, న్యాయబద్ధంగా నిర్ణయాలు తీసుకొనేవారు. కాలక్రమంలో స్పీకర్లు చట్టసభల్లో తాము ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీల ప్రయోజనాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం మొదలుపెట్టారు. దీంతో వివాదాలు న్యాయస్థానాలకు చేరుతున్నాయి. అయితే స్పీకర్ల అధికారాల్లో జోక్యం చేసుకొనే విషయంలో సర్వోన్నత న్యాయస్థానానికి సైతం పరిమితులు ఉన్నందున వివాదాలు వివాదాలుగానే మిగిలిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే భారత రాష్ట్ర సమితికి చెందిన ఎమ్మెల్యేల ఫిరాయింపు వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు అనర్హత వేటు వేస్తుందని బీఆర్‌ఎస్‌ ఆశించింది. అప్పటికే పార్టీ ఫిరాయించిన వారిపై సుప్రీంకోర్టు చర్యలు తీసుకుంటుందని బలంగా చెప్పడం ద్వారా మరికొందరు పార్టీ ఫిరాయించకుండా బీఆర్‌ఎస్‌ అడ్డుకోగలిగింది. అయితే సుప్రీంకోర్టు తీర్పు ఆ పార్టీకి ఆశాభంగం కలిగించిందని చెప్పవచ్చు. ‘ఆపరేషన్‌ సక్సెస్‌–పేషెంట్‌ డెడ్‌’ అన్నట్టుగా తమ తీర్పు ఉండకూడదని భావించిన సుప్రీంకోర్టు... ఫిరాయింపుల విషయంలో నిర్ణయం తీసుకోవడానికి స్పీకర్‌కు మూడు నెలల గడువు విధించింది. ఈ గడువుకు లోబడి స్పీకర్‌ నిర్ణయం తీసుకోని పక్షంలో పరిస్థితి మళ్లీ మొదటికి వస్తుంది. ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా ఉండాలన్నా, చట్టసభలు–న్యాయ వ్యవస్థ మధ్య ఘర్షణ తలెత్తరాదన్నా నిర్ణయాలు తీసుకోవడంలో స్పీకర్‌కు పార్లమెంటు గడువు విధించాలని సుప్రీంకోర్టు తన తాజా తీర్పులో పేర్కొంది. స్పీకర్‌ వద్ద వివాదాలు ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉంటున్నాయి. ఫలితంగా ఫిరాయింపుల నిరోధక చట్టం అపహాస్యం పాలవుతోంది. ఆ చట్టాన్ని మరింత పకడ్బందీగా సవరించడంతోపాటు స్పీకర్లకు కాలవ్యవధి నిర్ణయిస్తూ పార్లమెంటు చర్యలు తీసుకున్నప్పుడే ఈ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. అప్పటివరకు జ్యుడీషియరీ, లెజిస్లేచర్‌లలో ఎవరిది పైచేయి అన్న అకడిమిక్‌ చర్చలు సాగుతూనే ఉంటాయి.


అధికారంలో ఒకలా.. విపక్షంలో మరోలా!

అధికార పార్టీ ప్రయోజనాలు కాపాడటానికే ఆయా చట్టసభల స్పీకర్లు అధిక ప్రాధాన్యం ఇస్తున్నందున సకాలంలో నిర్ణయాలు వెలువడటం లేదు. పార్టీ ఫిరాయింపుల విషయమే తీసుకుందాం. అధికారంలో ఉన్నప్పుడు ఫిరాయింపులను ప్రోత్సహించని పార్టీ లేదంటే అతిశయోక్తి కాదు. ప్రతిపక్షంలోకి వెళ్లాక అవే పార్టీలు అన్యాయం అంటూ ఆక్రోశిస్తుంటాయి. తెలుగు రాష్ర్టాలే ఇందుకు నిదర్శనం. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన కొంత మంది ఎమ్మెల్యేలను నాటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్‌ రాజశేఖరరెడ్డి కాంగ్రెస్‌లో చేర్చుకున్నారు. ఇలా చేయడం అనైతికం, అక్రమం అని టీఆర్‌ఎస్‌ అధినేతగా ఉన్న కేసీఆర్‌ ఆక్రోశించారు. ఒక పార్టీ తరఫున గెలిచిన వారిని మరో పార్టీలో ఎలా చేర్చుకుంటారని ప్రశ్నించారు? సీన్‌ కట్‌ చేస్తే... తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయ్యారు. తాను ఒకప్పుడు తప్పుపట్టిన పనినే ఆయన అధికారంలోకి వచ్చాక దర్జాగా చేశారు. కాంగ్రెస్‌–తెలుగుదేశం –కమ్యూనిస్టు పార్టీలకు చెందిన సభ్యులను తమ పార్టీలో కలుపుకొన్నారు. అప్పట్లో శాసనసభలో కేసీఆర్‌కు బొటాబొటి మెజారిటీ మాత్రమే ఉన్నందున ఈ చర్యను ప్రజలు కూడా పెద్దగా ఆక్షేపించలేదు. ఆయన రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు సభలో సొంతంగా కావల్సినంత మెజారిటీ ఉండింది. అయినా కాంగ్రెస్‌, తెలుగుదేశం సభ్యులను చేర్చుకున్నారు. కాంగ్రెస్‌ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా లభించకుండా చేశారు. ఇందులోని నైతికతను పక్కనపెడితే కేసీఆర్‌ చర్యను ప్రజలు కూడా ఆక్షేపించారు. ప్రభుత్వ మనుగడకు ముప్పు లేకపోయినా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమైంది. అప్పట్లో తన చర్యను సమర్థించుకునేందుకు... బంగారు తెలంగాణ సాధనకోసం వారంతా తనతో చేతులు కలిపారని కేసీఆర్‌ చెప్పుకొన్నారు. 2023లో భారత రాష్ట్ర సమితి అధికారం కోల్పోయింది. గతంలో కేసీఆర్‌ చేసిన విధంగానే తన ప్రభుత్వ సుస్థిరతకోసం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా ఫిరాయింపులను ప్రోత్సహించారు. బీఆర్‌ఎస్‌ తరఫున గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌తో జట్టుకట్టారు. దీంతో బాధితుడిగా మిగిలిన కేసీఆర్‌, తమ పార్టీ తరఫున గెలిచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన వారిపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు ఫిర్యాదు చేయించారు. స్పీకర్‌ ఎంతకీ నిర్ణయం తీసుకోకపోవడంతో ముందు హైకోర్టును, ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేసీఆర్‌ అధికారంలో ఉన్నప్పుడు పార్టీ ఫిరాయింపులపై అప్పటి స్పీకర్లు కూడా నిర్ణయాలను పెండింగ్‌లోనే ఉంచారు.


రాజీనామాలూ ‘పెండింగ్‌’లోనే...

ఫిరాయింపుల విషయంలోనే కాదు, సభ్యుల రాజీనామాల విషయంలో కూడా స్పీకర్లు నిర్ణయాలు తీసుకోకుండా పెండింగ్‌లో పెడుతున్నారు. రాష్ట్ర విభజనకు ముందు ఉమ్మడి రాష్ట్రంలో స్పీకర్‌గా ఉన్న నాదెండ్ల మనోహర్‌ సభ్యుల రాజీనామాలను ఆమోదించకుండా కోల్డ్‌ స్టోరేజ్‌లో పెట్టారు. అప్పుడు కాంగ్రెస్‌ పార్టీ తరఫున కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ముఖ్యమంత్రి పదవి తనకు కట్టబెట్టడానికి కాంగ్రెస్‌ అధిష్ఠానం నిరాకరించడంతో జగన్మోహన్‌రెడ్డి సొంత పార్టీ పెట్టుకున్నారు. కాంగ్రెస్‌కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు ఆయనతో చేతులు కలిపారు. వారితో రాజీనామాలు చేయించి ఉప ఎన్నికలు తీసుకురావడం ద్వారా తన బలం ప్రదర్శించుకోవాలని జగన్‌రెడ్డి తలపోశారు. ఉప ఎన్నికలు వస్తే గెలుపు జగన్‌దే అని తేలిపోవడంతో సదరు రాజీనామాలు ఆమోదం పొందకుండా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నాటి స్పీకర్‌ మనోహర్‌పై ఒత్తిడి తీసుకువచ్చారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలిలో కూడా ఇలాంటి పరిస్థితి పునరావృతం అవుతోంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ తరఫున శాసనమండలికి ఎన్నికైన కొందరు రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో తమ సభ్యత్వాలకు రాజీనామా చేశారు. సదరు రాజీనామాలు ఆమోదం పొందితే వారి స్థానాలు కూటమికి దక్కుతాయి. కూటమికి శాసనసభలో తిరుగులేని మెజారిటీ ఉన్నప్పటికీ శాసనమండలిలో వైసీపీకే మెజారిటీ ఉంది. చైర్మన్‌గా కూడా ఆ పార్టీకే చెందిన మోషేన్‌ రాజు ఉన్నారు. దీంతో ఆయన సదరు రాజీనామాలను ఆమోదించకుండా పెండింగ్‌లో పెట్టారు. చట్టసభల ప్రిసైడింగ్‌ అధికారులు ఈ విధంగా తమ అధికారాలను దుర్వినియోగం చేస్తున్నారు. 2019లో జగన్‌రెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడు శాసనమండలిలో తెలుగుదేశం పార్టీకి మెజారిటీ ఉండేది. అప్పుడు బిల్లులు ఆమోదం పొందడంలో జగన్‌రెడ్డి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో శాసనమండలిని రద్దు చేయాలని ఆయన కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేశారు. ఎన్టీరామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి ఎదురుకావడంతో శాసనమండలిని రద్దు చేయించారు. 1983లో ఎన్టీఆర్‌ అధికారంలోకి వచ్చినప్పుడు శాసనమండలిలో కాంగ్రెస్‌ పార్టీకి మెజారిటీ ఉండేది. దివంగత రోశయ్య వంటి హేమాహేమీలు కాంగ్రెస్‌లో ఉండేవారు. వారిని ఎదుర్కోవడం ఎన్టీఆర్‌కు సమస్యగా మారింది. ఆ దశలో ‘పెద్దల గలభా’ పేరిట ఈనాడు పత్రిక పెట్టిన ఒక శీర్షిక సభా హక్కులను ఉల్లంఘించేదిగా ఉందని కాంగ్రెస్‌ పార్టీ హక్కుల తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదం పొందింది. ‘పెద్ద’లు అని పెట్టిన శీర్షిక తమను అవమానించేదిగా ఉందనేది అభియోగం.


హక్కుల తీర్మానానికి ఆమోదం లభించడంతో ఈనాడు పత్రికకు అప్పుడు చీఫ్‌ ఎడిటర్‌గా ఉన్న రామోజీరావు శాసనమండలికి రావాలని మండలి చైర్మన్‌ తాఖీదు ఇచ్చారు. దీనిపై రామోజీరావు సుప్రీంకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. తమ ఆదేశాలపై స్టే ఇచ్చే అధికారం కోర్టుకు లేదని భావించిన శాసనమండలి రామోజీరావును అరెస్టు చేసి తీసుకురావాలని అప్పటి పోలీస్‌ కమిషనర్‌ విజయరామారావును ఆదేశించింది. దీనిపై కూడా కోర్టు స్టే ఇచ్చినందున... స్టే ఇచ్చిన న్యాయమూర్తిని కూడా సభకు రప్పించి మందలించాలని శాసనమండలి భావించింది. రాజ్యాంగపరంగా ఇదొక చిక్కుముడిగా మారింది. అటు కోర్టు ఆదేశాలను పాటించాలా? ఇటు శాసనమండలి ఆదేశాలను పాటించాలా? అన్న సందిగ్ధంలో పోలీసు కమిషనర్‌ విజయరామారావు చిక్కుకున్నారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన ఎన్టీఆర్‌ శాసనమండలి రద్దుకు శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. తెలుగునాట శాసనమండలి రద్దు వెనుక జరిగిన కథ ఇది. ఆ తర్వాత కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చినప్పుడు శాసనమండలిని పునరుద్ధరించింది. చట్టసభలు–న్యాయ వ్యవస్థలలో ఎవరిది పైచేయి? అన్న వివాదం ఏర్పడినప్పుడు ఇలాంటి రాజ్యాంగపరమైన సంక్షోభాలు తలెత్తుతాయి. ఆయా వ్యవస్థలు తమ పరిధికి లోబడి చట్టాలు అపహాస్యం కాకుండా నిర్ణయాలు తీసుకుంటే ఇలాంటి వివాదాలు తలెత్తవు. గతంలో చట్టసభల స్పీకర్లు, చైర్మన్లుగా ఎన్నికైనవారు అప్పటివరకు తాము ప్రాతినిధ్యం వహించిన రాజకీయ పార్టీకి రాజీనామా చేసేవారు. వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతిగా ఎన్నికైనప్పుడు భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేశారు. చట్టంలో లేకపోయినా ఇలాంటి ఉన్నత సంప్రదాయాలను పాటించినవారు ఎందరో ఉన్నారు. ఇప్పుడా పరిస్థితి లేదు. చట్టసభల అధిపతులు పార్టీ సభ్యుల్లా వ్యవహరిస్తున్నారు.


రాజకీయ వ్యూహాలు...

ఇప్పుడు మళ్లీ పార్టీ ఫిరాయింపుల విషయానికి వద్దాం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత తీవ్రంగా ఉందని, ఈ పరిస్థితుల్లో ఉప ఎన్నికలు వస్తే గెలుపు తమదే అన్న ధీమాతో ఉన్న భారత రాష్ట్ర సమితి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీకి సహజంగానే ఉప ఎన్నికలు రావడం ఇష్టం ఉండదు. ఈ కారణంగానే ప్రస్తుత వివాదం. పార్టీ ఫిరాయిస్తే అనర్హత వేటు పడుతుందన్న భయం లేకపోతే భారత రాష్ట్ర సమితికి చెందిన మరో పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ పార్టీతో జట్టు కట్టేవారు. ఈ నేపథ్యంలో ఎన్నికైన సభ్యులు చేజారిపోకుండా కాపాడుకోవడంతో పాటు, పార్టీకి ఉజ్వల భవిష్యత్తు ఉందని పార్టీ శ్రేణులలో భరోసా కల్పించేందుకు బీఆర్‌ఎస్‌ ఉప ఎన్నికలు కోరుకుంటోంది. ఈ కారణంగానే మూడు నెలల తర్వాత ఉప ఎన్నికలు రావడం ఖాయమని ఆ పార్టీ ప్రచారం చేసుకుంటోంది. రెండు మూడు నెలల క్రితం బీఆర్‌ఎస్‌ విజయావకాశాలు మెరుగుపడిన విషయం వాస్తవం. అయితే, రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఇటీవలి కాలంలో తీసుకున్న నిర్ణయాల వల్ల క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్‌ పరిస్థితి మెరుగుపడింది. రైతుబంధు నిధులు విడుదల చేయడం, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టడం, కొత్త రేషన్‌ కార్డులు మంజూరు చేయడంతో పాటు రేషన్‌ కార్డుపై సన్న బియ్యం సరఫరా చేయడం వంటి నిర్ణయాలు కాంగ్రెస్‌ పట్ల ప్రజల ధోరణి మారడానికి దోహదపడ్డాయి. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడి ఉప ఎన్నికలు వస్తాయో రావో అప్పుడే చెప్పలేంగానీ మాగంటి గోపీనాథ్‌ అకాల మరణంతో జూబిలీహిల్స్‌ అసెంబ్లీ స్థానానికి మాత్రం త్వరలో ఉప ఎన్నిక జరుగుతుంది. ఈ ఎన్నిక ఫలితంతో తెలంగాణ రాజకీయాలపై కొంత స్పష్టత వస్తుంది. ఈ స్థానాన్ని నిలబెట్టుకోవడం ద్వారా హైదరాబాద్‌ మహానగరంపై తమ పట్టు సడలలేదని నిరూపించుకోవడానికి భారత రాష్ట్ర సమితి ప్రయత్నాలు మొదలెట్టగా... బీఆర్‌ఎస్‌ స్థానాన్ని హస్తగతం చేసుకోవడం ద్వారా నగరంలో కూడా తమ బలం పెరిగిందని రుజువు చేసుకోవడానికి కాంగ్రెస్‌ సర్వశక్తులూ ఒడ్డనుంది. సాధారణ ఎన్నికలకు మరో మూడేళ్లకు పైగా వ్యవధి ఉన్నప్పటికీ తెలంగాణ రాజకీయాలు ఇప్పటికే వేడెక్కాయి. జన నేతగా ప్రచారం చేయించుకుంటున్న కేటీఆర్‌ బీఆర్‌ఎస్‌లో అంతా తానై వ్యవహరిస్తున్నారు. ఆయనకు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి మధ్య ఉప్పు–నిప్పు అన్నట్టుగా ఉంది. రేవంత్‌రెడ్డిని ముఖ్యమంత్రిగా గుర్తించడానికి కూడా కేటీఆర్‌ నిరాకరిస్తున్నట్టుగా ఉంది. హౌలాగాడు, లొట్టపీసుగాడు అని కేటీఆర్‌ ముఖ్యమంత్రిని సంబోధిస్తున్నారు. ఒక నికృష్టుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు అంటూ తనలోని అక్కసును వెళ్లగక్కుతున్నారు. ఈ ఇరువురి మధ్య ఉండాల్సిన రాజకీయ వైరం వ్యక్తిగత వైరంగా మారుతోంది. రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ పార్టీలో తిరుగుబాటు రాబోతోంది అన్నట్టుగా తన చేతిలోని మీడియా ద్వారా కేటీఆర్‌ ప్రచారం చేయిస్తున్నారు. రేవంత్‌రెడ్డి స్థానంలో కాంగ్రెస్‌ పార్టీ తరఫున మరొకరు ముఖ్యమంత్రి అయితే కేటీఆర్‌ శాంతించవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు– జగన్‌ మధ్య నెలకొన్న పరిస్థితి తెలంగాణలో రేవంత్‌రెడ్డి– కేటీఆర్‌ మధ్య నెలకొంది. తమ అంచనాలకు భిన్నంగా రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడాన్ని కేసీఆర్‌ కుటుంబం జీర్ణించుకోలేకపోతోంది. ఈ కారణంగానే పార్టీ ఫిరాయించిన వారిపై అనర్హత వేటు పడి ఉప ఎన్నికలు రావాలని ఆ కుటుంబం బలంగా కోరుకుంటోంది. ఉప ఎన్నికల్లో విజయం సాధిస్తే కాంగ్రెస్‌ ప్రభుత్వం కుప్పకూలిపోయే అవకాశం ఉందని బీఆర్‌ఎస్‌ నాయకులు అంచనా వేస్తున్నారు. ఏ కారణం వల్లనైనా రేవంత్‌రెడ్డి నాయకత్వం మారితే ఆ తర్వాత కాంగ్రెస్‌ ప్రభుత్వం పరిస్థితి దినదిన గండం నూరేళ్ల ఆయుష్షు అన్నట్టుగా ఉంటుంది. ఇలాంటి అంచనాలతోనే ఉప ఎన్నికలకోసం భారత రాష్ట్ర సమితి ఉబలాటపడుతోంది.


అయితే సుప్రీంకోర్టు ఆదేశించిన విధంగా శాసనసభ స్పీకర్‌ మూడు నెలల్లోగా అనర్హత పిటిషన్‌పై నిర్ణయం తీసుకుంటారా? ఒకవేళ తీసుకుంటే ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు? అనర్హత వేటు వేయని పక్షంలో పరిస్థితి ఏమిటి? వంటి శేష ప్రశ్నలు మిగిలే ఉన్నాయి. సుప్రీంకోర్టు కంటే పార్లమెంటే సుప్రీం అని ఇటీవలే ఉప రాష్ట్రపతి పదవికి రాజీనామా చేసిన జగదీప్‌ ధన్‌ఖడ్‌ మాటలను స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ ఉటంకించడం గమనార్హం. రాష్ర్టాలు ఆమోదించిన బిల్లుల విషయంలో రాష్ట్రపతికి గడువు విధిస్తూ సుప్రీంకోర్టు జారీచేసిన ఆదేశాలను ప్రస్తావిస్తూ జగదీప్‌ ఆ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రపతి విషయంలో గడువు విధించే అధికారం సుప్రీంకోర్టుకు లేని పక్షంలో స్పీకర్‌కు కూడా గడువు విధించే అధికారం సుప్రీంకోర్టుకు ఉండదన్నది స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ అభిప్రాయం కావొచ్చు. దీంతో అధికార పరిధి విషయంలో మళ్లీ పేచీ తలెత్తుతుంది. ఒకటి మాత్రం నిజం. పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని అన్ని పార్టీలూ అపహాస్యం చేస్తున్నాయి. 2018 తర్వాత కాంగ్రెస్‌ లెజిస్లేచర్‌ పార్టీ భారత రాష్ట్ర సమితిలో విలీనమయిందని ప్రకటించారు. ఆ తర్వాత కూడా భట్టి విక్రమార్క నాయకత్వంలో పది మంది వరకు కాంగ్రెస్‌లోనే కొనసాగారు. వారిని కాంగ్రెస్‌ సభ్యులుగానే పరిగణించారు. అయినా కాంగ్రెస్‌ లెజిస్లేచర్‌ పార్టీ బీఆర్‌ఎస్‌లో విలీనమయిందని ప్రకటించుకున్నారు. ఇంతకంటే హాస్యాస్పదం మరొకటి ఉంటుందా? ఈ నేపథ్యంలో ఫిరాయింపులను తప్పుపట్టే నైతికత బీఆర్‌ఎస్‌కు లేదని చెప్పవచ్చు. రాజకీయ పార్టీలు నైతిక విలువలకు తిలోదకాలు ఇచ్చినప్పుడు రాజ్యాంగపరమైన మౌలిక ప్రశ్నలు తలెత్తుతాయి. ఫిరాయింపులు, రాజీనామాల విషయంలో స్పీకర్లు ఏళ్ల తరబడి నిర్ణయాలు తీసుకోకుండా కాలయాపన చేస్తే న్యాయస్థానాలు జోక్యం చేసుకోకూడదా? అన్న ప్రశ్నకు ఎవరు సమాధానం చెప్పాలి? ఒక పార్టీ తరపున ఎన్నికైన వ్యక్తి మరొక పార్టీలోకి మారడం అనైతికం అవుతుంది. అన్ని రాజకీయ పార్టీలూ ఈ అనైతిక చర్యలను ప్రోత్సహిస్తున్నాయి.


పరిష్కారం ఏది?

సుప్రీంకోర్టు తాజా తీర్పుతో చిక్కు ముడులు అన్నీ విడిపోతాయని చెప్పలేం. మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని నాకు గడువు ఎలా విధిస్తారు? అని స్పీకర్‌ ఎదురు తిరగవచ్చు. లేదా అలా ఆదేశించడం సమంజసం కాదని మళ్లీ సుప్రీంకోర్టునే ఆశ్రయించవచ్చు. అదే జరిగితే వివాదం కొనసాగుతూనే ఉంటుంది. ఒకవేళ స్పీకర్‌ సదరు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటిస్తే వారు కోర్టులను ఆశ్రయించవచ్చు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్‌ చర్య తీసుకోని పక్షంలో బీఆర్‌ఎస్‌ కూడా మళ్లీ అన్యాయం జరిగిందని తిరిగి సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు. ఇలాంటి సందేహాలు ఎన్నో ఉన్నాయి. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ నేతృత్వంలోని బెంచ్‌ ఇచ్చిన తాజా తీర్పులో చేసిన సూచనలను అమలు చేయడమే ఈ చిక్కుముడులకు ఏకైక పరిష్కారం. ముందుగా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని పకడ్బందీగా సవరించాలి. ఫిరాయింపులకు పాల్పడే వారికి దొడ్డిదారులు లభించకుండా చట్టాలను సవరించాలి. ప్రస్తుత చట్టంలో ఉన్న లొసుగులను సవరించాలి. ఈ చట్టం అమలులోకి వచ్చాక అది ఎంతగా దుర్వినియోగం అయిందో అందరికీ తెలిసిందే. అందుచేత లోపాలను గుర్తించి సరిచేయడం పెద్ద సమస్య కాదు. కాకపోతే రాజకీయ పార్టీలకు చిత్తశుద్ధి ఉండాలి. ఇక స్పీకర్లు రాజ్యాంగం తమకు కల్పించిన వెసులుబాట్లు, విచక్షణాధికారాలను దుర్వినియోగం చేయకుండా ఉండాలంటే సుప్రీంకోర్టు సూచించిన విధంగా నిర్ణయాలు తీసుకోవడంలో స్పీకర్లకు పార్లమెంటు ద్వారానే గడువు విధించాలి. ఈ సూచన చేయడం ద్వారా స్పీకర్లకు తాము గడువు విధించలేమని సుప్రీంకోర్టు పరోక్షంగా అంగీకరించినట్టు అయింది. ‘నా సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను’ అని ఒక సభ్యుడు మొత్తుకుంటున్నా సదరు రాజీనామాను ఆమోదించకపోవడం ఏమిటి? అదే రాజకీయంగా అవసరం అయినప్పుడు గంటలు, రోజుల వ్యవధిలోనే ఆమోదించడం ఏమిటి? ఇలాంటి చర్యల వల్ల చట్టసభలపైన, స్పీకర్లపైన ప్రజల్లో గౌరవం సన్నగిల్లదా? గౌరవ సభ అని పిలుచుకొనే సభలు తమ గౌరవాన్ని నిలుపుకొనే విధంగా వ్యవహరించాలి కదా? కార్యనిర్వాహక వ్యవస్థపై ప్రజలు ఇప్పటికే విశ్వాసం కోల్పోయారు. న్యాయ వ్యవస్థ, చట్టసభలపై కూడా నమ్మకం సన్నగిల్లుతున్నప్పటికీ వాటికి రాజ్యాంగం కల్పించిన రక్షణల వల్ల ప్రజలు బహిరంగంగా విమర్శలు చేయలేని పరిస్థితి. చట్టాలు చేస్తున్న చట్టసభలే సదరు చట్టాలను సక్రమంగా అమలు చేయకపోవడాన్ని ఏమనాలి? ఫిరాయింపుల బెడదకు శాశ్వత పరిష్కారం లభించని పక్షంలో ప్రభుత్వాలు కూడా సుస్థిరంగా ఉండలేవు. సభ్యుల ఒత్తిళ్లకు ప్రభుత్వాలు లొంగిపోవాల్సిన పరిస్థితి ఇప్పుడుంది. ఈ నేపథ్యంలో అధికార పరిధుల గురించి కాకుండా రాజకీయ పార్టీలన్నీ ఆత్మపరిశీలన చేసుకోవాలి!

ఆర్కే

ఈ వార్తలు కూడా చదవండి...

అమర్నాథ్ దిగజారి మాట్లాడుతున్నారు.. ఎంపీ శ్రీభరత్ ఫైర్

ఏపీ లిక్కర్ స్కామ్‌ కేసులో బిగ్‌బాస్‌ అరెస్ట్ ఖాయం

Read Latest AP News and National News


4-edit.jpg

యూట్యూబ్‌లో ‘కొత్త పలుకు’ కోసం

QR Code scan

చేయండి

Updated Date - Aug 03 , 2025 | 01:51 AM