Nehru Legacy: చరిత్రతో నరేంద్ర మోదీ పోటీ
ABN , Publish Date - Aug 01 , 2025 | 05:54 AM
నరేంద్ర మోదీ సదా ఒక పరిపూర్ణ ప్రదర్శనకారుడు. ఆయనకు ఒక వేదిక, ఒక మైక్ ఇవ్వండి. ఆయన ఉపన్యాసానికి సభికులు మంత్రముగ్ధులైపోతారు

నరేంద్ర మోదీ సదా ఒక పరిపూర్ణ ప్రదర్శనకారుడు. ఆయనకు ఒక వేదిక, ఒక మైక్ ఇవ్వండి. ఆయన ఉపన్యాసానికి సభికులు మంత్రముగ్ధులైపోతారు. మోదీ మాటలకు తరచు కరతాళ ధ్వనులు మిన్నంటుతాయి. ఆయన సభలలో సాధారణంగా కనిపించే దృశ్యమిది. ఈ వారం లోక్‌సభలో ప్రధాని మోదీ 102 నిమిషాల పాటు ప్రసంగించారు. కాంగ్రెస్‌పై కఠోర విమర్శలు గుప్పించారు. తన పాలనా ఘనతను చాటుకోవడం, కాంగ్రెస్‌పై దాడిచేయడం ఆయన ఎంతగానో ఇష్టపడే, ఆనందించే విషయాలు. లోక్‌సభలో ఆయన ప్రసంగం కొంచెం ఎక్కువగానే సాగింది. అయితే పార్లమెంటులో మోదీ ప్రసంగించడం చాలా చాలా అరుదు గనుక ఆయన సుదీర్ఘ ప్రసంగం పట్ల ఎవరూ అసంతృప్తి చెందలేదు. ఆపరేషన్ సిందూర్ సందర్భంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరును తీవ్రంగా ఆక్షేపించిన వారిపై మోదీ నిర్దయగా తీవ్ర విమర్శలు చేశారు. విశేషమేమిటంటే ఆయన ప్రసంగంలో, సమస్త భారతీయులకు సుపరిచితమైన ఒక పేరు పదే పదే ప్రస్తావితమయింది. తన కంటే ముందు ప్రధానమంత్రిగా ఉన్న వారిలో ఒకరైన జవహర్ లాల్ నెహ్రూ గురించి మొత్తం 14 సార్లు పేర్కొన్నారు. ప్రతిసారీ దేశ పాలకుడుగా నెహ్రూ ‘అపరాధాల’ను మోదీ ప్రస్తావించారు. మోదీ మనసులో నెహ్రూ పట్ల వ్యతిరేకత అంతగా ఎందుకు గూడుకట్టుకుపోయింది? ఆయన ఆలోచనలు నిరంతరం నెహ్రూ పట్ల ఒక తిరస్కారభావంతో ఎందుకు నిమగ్నమవుతున్నాయి? ఇందుకు కారణాలేమిటో చూద్దాం.
నెహ్రూ 1964లో కీర్తిశేషుడు అయ్యారు. మోదీ నవ యవ్వనంలో ఉన్న కాలమది. నెహ్రూ తరవాత, మోదీతో సహా 13 మంది భారత ప్రధానమంత్రి పదవిని అధిష్టించారు. ఇందిరాగాంధీ హయాంలో మోదీ రాజకీయాలలోకి వచ్చారు. 1975లో విద్యార్థి క్రియాశీలిగా ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటంలో పాల్గొనడం ద్వారా మోదీ రాజకీయ జీవితం ప్రారంభమయింది. ఏ ఒక్క ప్రధానమంత్రి వల్లనైనా మోదీ నష్టపోవడం జరిగి ఉంటే ఆ ప్రధాని ఇందిరే కావచ్చు. ఎందుకంటే మోదీతో సహా వందలాది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకర్తలను ఆమె అరెస్ట్ చేయించారు. అయినా ప్రధాని మోదీ హేళనకు గురయ్యే గత ప్రధానమంత్రులలో ఇందిర చాలా అరుదుగా ప్రస్తావితమవుతారు. ఆయన ఎప్పుడూ అపహసించేది జవహర్ లాల్ నెహ్రూనే. తొలుత ఒక విషయాన్ని నొక్కి వక్కాణించవలసి ఉన్నది. నెహ్రూ నిస్సందేహంగా నికార్సయిన లౌకికవాది. దేశ ప్రధానమంత్రిగా జాతి జీవనంలో లౌకిక విలువలు వర్ధిల్లేందుకు ఆయన అంకిత భావంతో కృషి చేశారు. భారత్ ఎట్టి పరిస్థితులలోను ఒక ‘హిందూ రాష్ట్ర’ లేదా ఒక ‘హిందూ పాకిస్థాన్’గా పరిణమించకూడదని నెహ్రూ మనఃపూర్వకంగా విశ్వసించారు, ఆకాంక్షించారు. ఈ కారణంగానే ఆయన తరచు హిందుత్వ శక్తులతో ఘర్షించేవారు. భారతీయ సమాజంలో వారి ప్రభావాన్ని తగ్గించేందుకు, సామాజికంగా బహిష్కరించేందుకు ఆయన ఎన్నో విధాలుగా కృషి చేశారు. మహాత్మా గాంధీని హిందూ మత దురభిమాని ఒకడు హతమార్చడం నెహ్రూను కలచివేసింది. హిందూ మతతత్వ శక్తులను సవాల్ చేయాలని నెహ్రూ దృఢంగా సంకల్పించుకున్నారు. బహుళ మత సమాజంగా భారత్ వర్థిల్లాలని ఆయన ప్రగాఢంగా ఆశించారు. హిందూ మతతత్వం తన రాజకీయ దృక్పథానికి పూర్తిగా విరుద్ధం గనుక ఆయన తుదకంటా దానిపై రాజీలేని పోరాటం చేశారు. మరి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌కు నెహ్రూ ప్రధాన ‘శత్రువు’ కావడంలో ఆశ్చర్యమేమీ లేదు సంఘీయులు ఆయన్ని సైద్ధాంతికంగాను, రాజకీయంగానూ తీవ్రంగా వ్యతిరేకించారు, విద్వేషించారు.
ఆరెస్సెస్ సైద్ధాంతిక శిక్షణతో జీవితంలోకి ప్రవేశించిన వ్యక్తి నరేంద్ర మోదీ. సంఘ్‌ను, ఇతర హిందుత్వ సంస్థల ప్రభావాన్ని కట్టడి చేసేందుకు ప్రయత్నించిన నెహ్రూను ఆయన సదా ఒక దుష్ట స్వభావుడుగానే చూశారు. మోదీ రాజకీయ విశ్వాసాలను మౌలికంగా ప్రభావితం చేసిన వ్యక్తి, సంఘ్‌కు సుదీర్ఘకాలం సర్ సంఘ్ చాలక్‌గా ఉన్న, గురూజీగా సుప్రసిద్ధుడు అయిన ఎమ్‌ఎస్ గోల్వాల్కర్. 1940 నుంచి 1973 దాకా సంఘ్ అధినేతగా ఉన్న గోల్వాల్కర్ , నెహ్రూను తన ప్రధాన ప్రత్యర్థిగా పరిగణించారు. ప్రథమ ప్రధానమంత్రి పట్ల గోల్వాల్కర్‌కు అటువంటి అభిప్రాయం ఉన్నప్పుడు ఆయన ప్రచండ శిష్యుడైన మోదీ, నెహ్రూను వ్యతిరేకించడంలో ఎందుకు వెనుకబడి ఉంటారు?
నెహ్రూ పట్ల మోదీ తీవ్ర వ్యతిరేకతకు రెండో కారణం కాంగ్రెస్ పార్టీ తీరుతెన్నులే. నెహ్రూ మరణానంతరం కాంగ్రెస్ పార్టీ ఆయన్ని ఒక దైవాంశ సంభూతుడుగా ఆరాధించింది. స్వతంత్ర భారతదేశానికి నెహ్రూ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన నాయకుడు అన్న వాస్తవాన్ని అలక్ష్యం చేసింది. ప్రధానమంత్రిగా 17 ఏళ్ల పాలనలో నెహ్రూ సాఫల్య వైఫల్యాలపై నిష్పాక్షిక చర్చను ప్రోత్సహించలేదు. నెహ్రూ సామ్యవాద విధానాలపై విమర్శలను సహించలేదు. ఆయన అనుసరించిన కశ్మీర్, చైనా విధానాలు సరైనవేనని సమర్థించింది. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత నెహ్రూ విధానాల ప్రభావాన్ని, చారిత్రక వారసత్వాన్ని రూపుమాపేందుకు అనేక విధాలుగా ప్రయత్నిస్తూ వస్తోంది. ఇది మూడో వివాదాస్పద విషయాన్ని ప్రస్తావించడాన్ని అనివార్యం చేస్తుంది. దేశ రాజకీయాలలో నెహ్రూ – గాంధీ కుటుంబ ఆధిపత్యమే ఆ అంశం. నెహ్రూ అనంతర కాంగ్రెస్ పార్టీ ప్రస్థానం వంశపారంపర్య రాజకీయాల ప్రాబల్యంతో ప్రధానంగా ప్రభావితమయింది. కాంగ్రెస్‌ను ఒక కుటుంబ జాగీరుగా మార్చి వేసింది ఇందిరాగాంధీయే అయినప్పటికీ ‘వంశ పారంపర్య’ రాజకీయాలకు ఆద్యుడుగా నెహ్రూను తప్పుపడుతున్నారు. ప్రధానమంత్రి పదవిలో ఆయన వారసుడుగా లాల్ బహదూర్ శాస్త్రి ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికయ్యారన్న వాస్తవాన్ని నెహ్రూను విమర్శిస్తున్నవారు విస్మరిస్తున్నారు. ‘నెహ్రూ వారసుల చర్యలు ఆయన పేరు ప్రతిష్ఠలకు తీరని నష్టాన్ని కలిగించాయని’ చరిత్రకారుడు రామచంద్ర గుహ అన్నారు. ఇది పూర్తిగా నిజం.
నెహ్రూ పట్ల మోదీ వ్యతిరేకతకు కారణమైన మరో ప్రధాన విషయాన్ని పేర్కొంటాను. నరేంద్ర మోదీ అసాధారణంగా ఆకట్టుకునే వ్యక్తి అనడంలో ఎవరికీ రెండో అభిప్రాయం లేదు. మోదీ గత ఏడాది తనను తాను ‘జైవికంగా జన్మించని అవతారపురుషుడు’గా అభివర్ణించుకున్నారు. అటువంటి తనకు, భారతదేశ మహోన్నత ప్రధానమంత్రిగా గుర్తింపు పొందాలన్న తన ఆకాంక్షకు మధ్య అడ్డుగా ఉన్న ఏకైక వ్యక్తి నెహ్రూయే అని మోదీ భావిస్తున్నారు. భారత ప్రధానమంత్రి పదవిలో సుదీర్ఘకాలం కొనసాగిన నేతగా మోదీ ఇటీవలే ఇందిరాగాంధీ రికార్డును అధిగమించారు. ఇప్పుడు తనకు, శాశ్వత ప్రభావదాయక గణాంక మైలురాయికి మధ్య నెహ్రూ మాత్రమే అడ్డుగా ఉన్నారు. అయితే ఇది కేవలం ఒక రికార్డు బద్దలుగొట్టే అంకెల క్రీడ కాదు. నెహ్రూవియన్ భారత్ భావనను పూర్తిగా విడనాడి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రబోధాల ప్రాతిపదికన ఒక ‘కొత్త’ భారతదేశాన్ని నిర్మిస్తున్న ప్రప్రథమ ప్రధానమంత్రిని తానేనన్న భావన తన అనుయాయుల మనసుల్లో సుస్థిరంగా నెలకొల్పేందుకు నెహ్రూపై తన దృష్టిని నిరంతరాయంగా కేంద్రీకరించవలసిన అవసరం మోదీకి ఉన్నది. ఒక పురాతన నాగరికత వైభవాన్ని, ప్రాచీన హిందూ మత గ్రంథాల స్ఫూర్తిని ఆరెస్సెస్ కీర్తిస్తుండగా వైజ్ఞానిక దృక్పథం, నవీన సాంకేతికతల ఆలంబనతో ఒక ఆధునిక సమాజాన్ని నిర్మించేందుకు నెహ్రూ కృషి చేశారు. భారత్ భావనపై ప్రభావశీల నెహ్రూవియన్ ఏకస్వామ్యాన్ని బద్దలు గొట్టేందుకు నెహ్రూ కీర్తికాయాన్ని కూల్చివేయాల్సిన అవసరం మోదీకి ఉన్నది. అందుకు ఏకైక మార్గం విదేశాంగ విధానం నుంచి దేశీయ వ్యవహారాల దాకా నెహ్రూ తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని తీవ్రంగా విమర్శించడమే. వ్యక్తిగా, పాలకుడుగా నెహ్రూ లోపాలను ఎత్తి చూపడం ద్వారా చరిత్రలో ఆయన సమున్నత స్థానాన్ని తక్కువ స్థాయికి కుదించివేయడమే ప్రధాని మోదీ ప్రధానలక్ష్యంగా ఉన్నది. ఈ లక్ష్య సాధనలో మోదీ, ఆయన మద్దతుదారులు ఒక మౌలిక తప్పు చేస్తున్నారు: అర్ధ సత్యాలు, అబద్ధాలతో నెహ్రూ ఘనతను కళంకితం చేయడానికి ఎంతగా ప్రయత్నిస్తున్నారో అంతకంటే మరెంతో ఎక్కువగా ఆయన శతాధిక కోట్ల భారతీయుల మనసుల్లో సజీవంగా వెలుగొందుతున్నారు.
తాజా కలం: ఉన్నత పదవుల్లో ఉన్న నాయకులు 75 సంవత్సరాల వయస్సు వచ్చిన తరువాత విధిగా పదవీ బాధ్యతల నుంచి వైదొలగాలన్న సంచలనాత్మక ప్రతిపాదనపై ఇటీవల తీవ్ర చర్చ జరుగుతున్న సమయంలో ‘పదవి నుంచి వైదొలిగే విషయాన్ని ప్రధాని మోదీ పరిశీలనలోకి తీసుకుంటారా?’ అని బీజేపీ నాయకుడు ఒకరిని ప్రశ్నించాను. ‘కనీసం 2031 దాకా మోదీ అటువంటి ఆలోచన చేయరు’ అని ఆ నేత బదులిచ్చారు. కారణమేమిటని ప్రశ్నించగా ‘భారత ప్రధానమంత్రిగా సుదీర్ఘకాలం కొనసాగడంలో నెహ్రూ రికార్డును మోదీ ఆ ఏడాది అధిగమిస్తారని’ ఆ నాయకుడు వివరించారు.