Share News

Social Justice: ఉపాధి హామీ పై పరిమితి,పేదలకు నష్టం

ABN , Publish Date - Jul 08 , 2025 | 01:54 AM

తెలుగు రాష్ట్రాలలో ఉపాధి హామీలో అధిక శాతం పనులు వేసవి నెలల్లో జరుగుతాయి. కేంద్రం తీసుకువచ్చిన కొత్త నిబంధనల వల్ల ప్రధానంగా తెలుగు రాష్ట్రాలలోని పేద ప్రజలు నష్టపోయే అవకాశం ఎక్కువ..

Social Justice: ఉపాధి హామీ పై పరిమితి,పేదలకు నష్టం

తెలుగు రాష్ట్రాలలో ఉపాధి హామీలో అధిక శాతం పనులు వేసవి నెలల్లో జరుగుతాయి. కేంద్రం తీసుకువచ్చిన కొత్త నిబంధనల వల్ల ప్రధానంగా తెలుగు రాష్ట్రాలలోని పేద ప్రజలు నష్టపోయే అవకాశం ఎక్కువ. గ్రామీణ పేదల హక్కులను కాలరాసే, వారి జీవనోపాధిని దెబ్బతీసే కొత్త నిబంధనలపై ప్రభుత్వం తిరిగి సమీక్షించాలి. లేకపోతే ప్రధాని నిత్యం వల్లించే ‘మంచి ఉద్దేశంతో కూడిన మంచి పాలన’ నినాదం నీటిమీద రాతగా మిగులుతుంది.ఉపాధి ఆదాయం కోసం మాత్రమే కాదు, అది మానవ గౌరవానికి సంబంధించింది.

– జీన్ డ్రెజ్, ఆర్థిక శాస్త్రవేత్త


ఇలాంటి గౌరవాన్ని కాపాడడమే లక్ష్యంగా మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (నరెగా) రూపొందింది. ఒక కుటుంబానికి సంవత్సరానికి 100 రోజుల పనిని హామీ ఇచ్చే ఈ చట్టాన్ని భారత సుప్రీంకోర్టు సామాజిక న్యాయానికి ఆలంబనగా నిలిచిన చట్టంగా అభివర్ణించగా, ప్రపంచంలో అతిపెద్ద పని హామీ పథకంగా ‘గ్రామీణ ఉపాధి’ని ప్రపంచ బ్యాంకు గుర్తించింది.కానీ గత కొన్ని సంవత్సరాలుగా ఈ పథకాన్ని బలహీనపరిచే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. బడ్జెట్‌ కేటాయింపులు తక్కువగా ఉండటం, వేతనాల చెల్లింపుల్లో కావాలనే ఆలస్యం చేయడం, సాంకేతిక జోక్యాల పేరుతో కార్మికులపై భారం వేయడం... ఇవన్నీ దీని లక్ష్యాలకు వ్యతిరేకంగా ఉన్నాయి. మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా నరెగాకి సంబంధించి ఇటీవల కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయం ఈ పథకాన్ని పూర్తిగా నిస్సారంగా మార్చే ప్రమాదాన్ని కలిగిస్తోంది. ఆ నిర్ణయం ఏమిటి? దాని ప్రభావం కార్మికులపై ఎలా ఉండబోతుంది అనే అంశాలను చర్చిద్దాం. చర్చలోకి వెళ్లేముందు నరెగా ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి కొన్ని ప్రాథమిక విషయాలు మననం చేసుకుందాం.


నరెగా– ప్రధానంగా కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే కార్యక్రమం. అయితే ఆర్థిక సంవత్సరం మొదట్లో ఆ సంవత్సరంలో ఉపాధి హామీలో పని డిమాండ్ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి, కేంద్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్లో అంచనాగా ఆ నిధులు కేటాయిస్తుంది. మునుపటి సంవత్సరపు నిధుల వినియోగం, రాష్ట్రాల నుంచి వచ్చే అభ్యర్థనలు దృష్టిలో ఉంచుకుని ఈ కేటాయింపు జరుగుతుంది. అయితే కేటాయించిన నిధులు ఖర్చు కాగానే, రాష్ట్రాలు అదనపు నిధుల కోసం కేంద్రాన్ని ఆశ్రయిస్తాయి. ఆ అభ్యర్థనలు పరిశీలించి కేంద్రం అదనపు నిధులు విడుదల చేస్తుంది. అంటే సిద్ధాంత పరంగా ఉపాధి హామీ బడ్జెట్ క్షేత్రస్థాయిలో ఉపాధి హామీ పనులకు గల డిమాండ్‌పై ఆధారపడి ఉంటుంది. ఇంకొక రకంగా చెప్పాలంటే అసలు ఉపాధి హామీ బడ్జెట్‌ను కట్టడి చేయడం చట్ట మూల సూత్రాలకు వ్యతిరేకం.


అసలు విషయానికి వస్తే, ఈ సంవత్సరం మే 29న కేంద్ర ఆర్థిక శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖకు ఒక అధికారిక లేఖ (ఆఫీస్ మెమొరాండం) జారీ చేసింది. అందులో 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మొదటి అర్ధ సంవత్సరం (ఏప్రిల్–సెప్టెంబర్)లో నరెగా కోసం కేటాయించిన వార్షిక బడ్జెట్‌లో 60 శాతం వరకే ఖర్చు చేయాల్సిందిగా సూచించింది. ఈ నిర్ణయానికి వెనుక ఉన్న కారణాలను కేంద్రం స్పష్టంగా, బహిరంగంగా వెల్లడించలేదు. అయితే లేఖలో మాత్రం ఇది ఆర్థిక నిర్వహణపరమైన నిర్ణయమని మాత్రమే రేఖామాత్రంగా పేర్కొంది. కానీ ఈ నిర్ణయం పలు సమస్యలకు దారితీయవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు; ఇందుకు క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న అనుభవాలను ఉదాహరణలుగా చూపుతున్నారు.మొదటిగా, ఈ కొత్త విధానంలో ముఖ్యమైన అంశం– క్షేత్రస్థాయి అవసరాలతో సంబంధం లేకుండా, సంవత్సరం ప్రారంభంలోనే అంచనాల ఆధారంగా నరెగా నిధుల వినియోగాన్ని పరిమితం చేయడం. దీని ప్రకారం, నరెగా ఖర్చును ముందస్తుగా నియంత్రించాలనే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి ఉందని అనుమానించక తప్పదు. ఈ అనుమానానికి కారణాలు ఉన్నాయి.


ప్రతి ఆర్థిక సంవత్సరం వార్షిక బడ్జెట్‌లో కేటాయించిన మొత్తం ఖర్చయిన తర్వాత, అదనంగా నిధులు మంజూరు చేయడం సాధారణంగా అనుసరించే విధానం. కానీ గత దశాబ్దంలో తొలిసారిగా, 2024–25లో, కేటాయించిన మొత్తం ఖర్చు అయినప్పటికీ, కేంద్రం అదనపు నిధులు విడుదల చేయలేదు. అంతేకాకుండా, గత సంవత్సరం ఎక్కువగా పనులు నమోదవుతున్న తెలుగు రాష్ట్రాలతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో ‘నియమాల ఉల్లంఘన’ అనే పేరుతో ఉపాధి హామీ పనులకు అడ్డంకులు కలిగించింది. నిజానికి ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో గ్రామీణులు పని కోసం దరఖాస్తు చేసుకున్నా, వారికి పని లభించడం లేదని, పథకం అమలుచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పని డిమాండ్‌ను కృత్రిమంగా తక్కువ చేసి చూపుతున్నారని సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వం 2023–24లో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. ఇప్పుడిక ఆ పరిమితి విధించే పనిలో కేంద్రం కూడా పాలుపంచుకుంటుందని అనిపించక మానదు. అలాగే రెండో అంశానికి వస్తే– 2025–26 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం నరెగాకు రూ.86వేల కోట్లు కేటాయించింది. ఇప్పుడు కేంద్రం తెచ్చిన నియమాల ప్రకారం, తొలుత ఆరు నెలల కాలానికి 60 శాతం మించి అంటే ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు రాష్ట్రాలు రూ.51,600 కోట్ల కన్నా ఎక్కువ ఖర్చు చేయలేవు. ఉపాధి కోరితే ప్రభుత్వం పనిని కల్పించాలి అన్న నిబంధన ఉండగా, ఇప్పుడు కేంద్రం జరిపిన కేటాయింపుల పరిమితిని చూపిస్తూ పనిని నిరాకరించే అవకాశం ఉంది. ఇది నేరుగా చట్టాన్ని ఉల్లంఘించడమే.


ఇక మూడో విమర్శకు వస్తే– ఆరు నెలలకు అందుబాటులో ఉన్న 60 శాతం కేటాయింపు అంటే పైన పేర్కొన్న విధంగా రూ.51,600 కోట్ల నుంచి గత ఏడాది పెండింగ్‌లో ఉన్న రూ.18,300 కోట్ల బకాయిలను తీర్చాల్సి ఉంటుంది. అలా చేస్తే ఈ సంవత్సరంలో కొత్తగా పనికి మిగిలే మొత్తం కేవలం రూ.30,600 కోట్లు మాత్రమే. గత సంవత్సరంలో నరెగాలో ఒక కార్మికునికి ఒక్క రోజు పని కల్పించడానికి రూ.390 ఖర్చు అయ్యింది. అదే లెక్కన ఈ సంవత్సరం మొదటి ఆరు నెలల్లో కేవలం 78 కోట్ల పని దినాలు మాత్రమే కల్పించగలిగే అవకాశం ఉంది. గత సంవత్సరం మొదటి ఆరు నెలల్లో నరెగాలో 161 కోట్ల పని దినాలు నమోదు అయ్యాయి. అంతే కాకుండా ఏప్రిల్ నుంచి సెప్టెంబరు వరకూ ఖర్చు చేయడానికి అవకాశం ఉన్న రూ.51,600 కోట్లలో 56 శాతం జూన్ 29 నాటికే ఖర్చు అయిపోయింది. ఇక మిగిలిన నాలుగు శాతం నిధులతో మిగతా మూడు నెలలు పనులు నడపాలి.


నిజానికి ఈ సంవత్సరమే కాదు, ప్రతి ఏడాది మొదటి ఆరు నెలల్లో బడ్జెట్‌లో దాదాపు 20 నుంచి 25 శాతం వరకు నిధులు గత సంవత్సరపు బకాయిల చెల్లింపునకే ఖర్చవుతున్నాయి. ఈ వాస్తవాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఖర్చులను ముందుగానే పరిమితం చేయడం వల్ల, కార్మికులకు అవసరం అయినప్పుడు పని దొరకకుండా పోయే అవకాశం ఎక్కువగా ఉంది. కేంద్రం ఈ నిర్ణయానికి ‘ఆర్థిక మేనేజ్‌మెంట్’ అనే పేరు పెట్టినా, దీని వెనుక ఉన్న ప్రాతిపదిక పూర్తిగా తప్పు అవగాహనపై ఆధారపడింది. కేంద్రం తీసుకువచ్చిన కొత్త నిబంధనల వల్ల ప్రధానంగా తెలుగు రాష్ట్రాలు నష్టపోయే అవకాశం ఎక్కువ. ఎందుకంటే మొదటి ఆరు నెలల్లో తెలుగు రాష్ట్రాలలో అధికంగా ఉపాధి హామీ పనులు జరుగుతాయి. ఉదాహరణకు 2024–25లో మొదటి ఆరు నెలల్లో తెలంగాణలో 84శాతం పనులు జరగగా, ఆంధ్రప్రదేశ్‌లో 74 శాతం పనులు జరిగాయి. కారణం– మన తెలుగు రాష్ట్రాలలో ఉపాధి హామీలో అధిక శాతం పనులు వేసవి నెలల్లో జరుగుతాయి. వర్షాలు ముమ్మరంగా పడుతూ, వ్యవసాయ పనులు అందుబాటులో ఉన్నప్పుడు నరెగా కార్మికులు వ్యవసాయ పనులకు హాజరవుతారు. నరెగా పనుల్ని వేరే ఉపాధి అవకాశాలు లేనప్పుడు ఉపయోగించుకుంటారు. మొత్తానికి కేంద్ర నిర్ణయం వల్ల ప్రధానంగా ఆదివాసీలు, దళితులతో సహా అణగారిన వర్గాలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఎందుకంటే ఉపాధి పనులలో వాళ్ళే ఎక్కువగా పాల్గొంటున్నారు. ఉదాహరణకు దేశంలో ఆదివాసీల జనాభా కంటే ఉపాధి హామీ పనిదినాలలో వారి వాటా 2.5 రెట్లు ఎక్కువ. ఈ మార్పు ప్రకటించడంలో కేంద్రం తీసుకున్న ధోరణి కూడా గర్హనీయం. రాష్ట్ర ప్రభుత్వాలతో, గ్రామ పంచాయతీలతో, కార్మిక సంఘాలతో ఎటువంటి సంప్రదింపులు జరపకుండా, ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం ఇది. ఉపాధి హామీ వేదికగా గ్రామీణ ప్రజల జీవితాల్లో ఒక సామాజిక భద్రతా వలయాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్న సమయంలో, దీన్ని తగ్గించే చర్యలు వారిపై నైతిక, ఆర్థిక దాడులుగా మారుతున్నాయి. ఉపాధి హామీ పథకం డిమాండ్–ఆధారిత హక్కుగా ఉండాలి. ఇది చట్టబద్ధ హామీ. కానీ కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయం వల్ల ఇది సరఫరా పరిమిత పథకంగా మారే ప్రమాదం ఉంది. ఇది కేవలం పరిపాలనా మార్పు కాదు. గ్రామీణ పేదల హక్కులను కాలరాసే, వారి జీవనోపాధిని దెబ్బతీసే చర్య. ప్రభుత్వం దీనిపై తిరిగి సమీక్షించాలి. లేకపోతే ప్రధాని నిత్యం వల్లించే ‘మంచి ఉద్దేశ్యాలతో కూడిన మంచి పాలన’ (Good governance with good intentions) నినాదం నీటిమీద రాతగా మిగులుతుంది.

-చక్రధర్ బుద్ధ

Updated Date - Jul 08 , 2025 | 01:54 AM