Language Politics: అనుసంధానభాషగా హిందీని కాదనలేం
ABN , Publish Date - Aug 02 , 2025 | 04:38 AM
భాషాప్రయుక్త రాష్ట్రాలు ఉనికిలోకి వచ్చిన తర్వాత, మన దేశంలో ఆయా భాషల చరిత్ర వికాసం తదితర అంశాల పట్ల ఆసక్తి పెరిగింది.

భాషాప్రయుక్త రాష్ట్రాలు ఉనికిలోకి వచ్చిన తర్వాత, మన దేశంలో ఆయా భాషల చరిత్ర–వికాసం తదితర అంశాల పట్ల ఆసక్తి పెరిగింది. వివిధ భాషల పరస్పర అనువాదాలతో భారతీయ సాహిత్యం విస్తరించింది. కాలక్రమంలో పాలనా సౌలభ్యం దృష్ట్యా ఉత్తరాది, తదితర రాష్ట్రాల విభజన మరోమారు జరిగింది. అయినా ఉమ్మడిగా ఉండి విడిపోయిన రాష్ట్రాల భాష మాత్రం ఒకటిగానే ఉంది. ఇక కొన్ని రాష్ట్రాలలో అక్కడి భాషాభిమానం రాజకీయాల మూలాన దురభిమానానికి దారితీసింది (ఉదాహరణకు తమిళనాడు). కేరళ, కర్ణాటక రాష్ట్రాలు తమ భాషాభిమానాన్ని రాజకీయంగా చాటుకుంటున్నాయి. తెలుగునాట మాత్రమే ఉదారవాద చరిత్ర వల్ల ఇంగ్లీష్ మోజులో మాతృభాష ఉనికికి ప్రమాదం ఏర్పడింది. ప్రస్తుతం దేశంలో త్రిభాషా సూత్రం అమలులో ఉన్నందువల్ల రెండో భాషగా హిందీ బోధన పట్ల వివాదం చోటుచేసుకొంది. ఇంగ్లీషుతో పాటు హిందీ ఒక అనుసంధాన భాషగా ఆరు, ఏడు దశాబ్దాలుగా దేశమంతా వ్యాపించిన తరువాత, ఇప్పుడు కొన్ని రాష్ట్రాలు తమ విద్యాలయాల్లో హిందీని రెండో భాషగా వ్యతిరేకిస్తున్నాయి.
రాజ్యాంగరీత్యా హిందీ ‘రాజ్యభాష’గా అమల్లోకి వచ్చిన తర్వాత కూడా, ఇంగ్లీషుతో పాటు మిగతా 22 భారతీయ భాషలను సమానస్థాయిగా జాతీయ భాషలుగా ఆమోదిస్తున్నారు. అయితే కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ల అత్యుత్సాహ ప్రకటనల వల్ల ఇతర భాషలపై హిందీ పెత్తనం వహిస్తున్నదనే భావన బలపడుతున్నది. అధికార రాజకీయాల వివాదాల మధ్య హిందీ బోధన మరోసారి చర్చనీయాంశంగా మారిపోయింది. హిందీ భాషా రాష్ట్రాలు త్రిభాషా బోధన విషయంలో మాతృభాష హిందీతో పాటు ఇంగ్లీషు, సంస్కృతం తప్ప దక్షిణాది భాషలను బోధించడం లేదు. ఆచరణలో హిందీ భాషీయులకు ఇతర భారతీయ భాషలను నేర్చుకోవాలనే ఉత్సాహం లేదు. పైగా దక్షిణాది భాషల పట్ల ఒక అంతర్గత చులకన భావం హిందీని వ్యతిరేకించే వాతావరణాన్ని రాజకీయంగా పెంచి పోషించింది. భాషాపరమైన రాజకీయాలు, ఇష్టాయిష్టాలను పక్కన పెడితే, జనబాహుళ్యంలో హిందీకి ఉన్న వాడుకను తక్కువగా అంచనా వేయలేము. దేశవ్యాప్తంగా వ్యాపార వాణిజ్య రంగాలలో పర్యాటక క్షేత్రంలో, ముంబై సినీరంగం వల్ల, హిందీ గీతాలు, వెబ్ సిరీస్‌లతో హిందీ భాష ఎంతగానో విస్తరించింది. తమిళనాడు, మహారాష్ట్రలకు అక్కడి రాజకీయ పార్టీల, గ్రూపుల అధికార రాజకీయ ప్రయోజనాల రీత్యా హిందీ పట్ల అభ్యంతరం ఉండొచ్చు. కాని ఆచరణలో ఒక ఆధునికభాషగా హిందీని ఎవరైనా సులువుగా నేర్చుకోగలరనే వాస్తవాన్ని నిరాకరించలేం.
మరోవైపు ఉత్తరాది హిందీ రాష్ట్రాలలో భోజ్‌పురి, మైథిలి, మాగధి, బొందిలి తదితర ప్రాంతీయ (స్థానీయ) భాషలను హిందీ మింగివేసిందనే వాదనలో బలం లేదు. అక్కడి ప్రాంతీయ మాండలికాలకు హిందీ పాలనా భాషగా ఒక చారిత్రక అవసరంగా పరిణమించింది. ఎలాగైతే గోండి, సవర, బంజారా తదితర భాషలకు పరిమితులున్నాయో వాటికీ అంతే! జాతీయోద్యమ కాలం నుంచి, ఈ దేశంలోని వివిధ భాషల మధ్య ఖడిబోల్ హిందీ ఒక అనుసంధాన భాషగా రూపొందింది. ఇంగ్లీష్‌తో పాటు హిందీ ఈ రోజు దేశ ప్రజలను ఏకం చేసే వాహికగా ఉన్నది. బోధన, శిక్షణ పరంగా కేంద్రీయ హిందీ సంస్థాన్, నిదేశాలయ్ తదితర హిందీ విభాగాల ద్వారా కేంద్ర ప్రభుత్వం గత 50 సంవత్సరాలుగా వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. దక్షిణ భారత హిందీ ప్రచారసభతో పాటు ఇతర ప్రాంతాల హిందీ ప్రచార సంస్థలు ఆ భాషా వ్యాప్తికి కృషి చేస్తున్నాయి. ప్రస్తుతం హిందీ కేవలం ఉత్తరాది భాషగా కొన్ని రాష్ట్రాలకే పరిమితం కాకుండా, ఇతర భారతీయ భాషలతో పాటు జాతీయ స్వభావాన్ని సంతరించుకొంది. ఒక లంకెగా, అనుసంధాన భాషగా అభివృద్ధి చెందింది. అయితే ఉర్దూ పదాలను తొలగించి సంస్కృత పదభూయిష్టంగా మారిన మాట వాస్తవం. ఇతరత్రా మణిపురి, సంతాలీ భాషలు తప్ప, ఆయా తెగలకు, గిరిజనులకు చెందిన భాషలు విస్తరించే అవకాశం లేదు. ఉపాధి, ఉద్యోగ అవకాశాల నిమిత్తం ఇంగ్లీషు, ప్రాంతీయ భాషలను నేర్చుకోవలసిందే! మన దేశ కాల పరిస్థితుల్లో జాతీయ– అంతర్జాతీయ అవకాశాలను అందిపుచ్చుకోవాలనుకుంటే ఇంగ్లీషు –హిందీ తప్ప ప్రత్యామ్నాయాలున్నాయా? విదేశాల్లో ఉద్యోగాల కోసం జర్మనీ, ఫ్రెంచి మొదలైన భాషలను నేర్చుకోవడం అతి కొద్దిమందికే సాధ్యం.
-నిఖిలేశ్వర్