Share News

Vemuri Radhakrishna: ఆ ఇద్దరికీ నేనే టార్గెట్‌

ABN , Publish Date - Jul 13 , 2025 | 01:21 AM

పరామర్శల పేరిట ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి జరుపుతున్న పర్యటనలు ఎందుకు వివాదాస్పదం అవుతున్నాయి...

Vemuri Radhakrishna: ఆ ఇద్దరికీ నేనే టార్గెట్‌

రామర్శల పేరిట ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి జరుపుతున్న పర్యటనలు ఎందుకు వివాదాస్పదం అవుతున్నాయి? పరామర్శలతో బాధితులకు సాంత్వన కలిగించాలి గానీ బలప్రదర్శన జరపడం ఏమిటి? పరామర్శల పేరిట జగన్‌రెడ్డి బయలుదేరినప్పటి నుంచి తిరిగి వెళ్లేవరకు ఉద్రిక్తతలు ఎందుకు చోటుచేసుకుంటున్నాయి? పరామర్శ యాత్రలలో వైసీపీ కార్యకర్తలు, అభిమానులు అతిగా ఆవేశపడటం దేనికి సంకేతం? ఇంతకీ ఈ బలప్రదర్శనలు జగన్‌రెడ్డి బలుపా? వాపా? రాష్ట్రంలో ప్రభుత్వం మారి ఏడాది మాత్రమే అయింది. ఇంతలోనే కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో అంత వ్యతిరేకత ఏర్పడుతుందా? ఒకవేళ ప్రజల్లో నిజంగానే వ్యతిరేకత ఏర్పడినా ఎన్నికలకు ఇంకా నాలుగేళ్ల వ్యవధి ఉంది. మరి ఇప్పటి నుంచే ‘సీఎం సీఎం’ అని కార్యకర్తలు, అభిమానులతో నినాదాలు ఇప్పించుకోవడం వల్ల జగన్‌రెడ్డి వెంటనే ముఖ్యమంత్రి అయిపోరు కదా? జగన్‌ పరామర్శ యాత్రలకు వస్తున్న జనం బలుపునకు సంకేతమని ఆయన మద్దతుదారులు సంబరపడిపోతుండగా, అదంతా వాపేనని, ఒక పథకం ప్రకారం కార్యకర్తలు, అభిమానులను పోగేసి గొడవ చేయిస్తున్నారని కూటమి నేతలు భావిస్తున్నారు. జగన్‌రెడ్డి రాజకీయ ఎత్తుగడలను అర్థం చేసుకోలేనివారు తమకు తోచిన విశ్లేషణలు చేస్తున్నారు. ఏడాది క్రితం జరిగిన ఎన్నికల్లో అనూహ్య పరాజయాన్ని చవిచూసిన ఆయన తేరుకోవడానికి ఎంతో సమయం పట్టలేదు. 2019 ఎన్నికల్లో ఓటమి పాలైన తెలుగుదేశం పార్టీ కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. కొవిడ్‌ కూడా వచ్చి పడటంతో 2022 వరకు తెలుగుదేశం నాయకులు బయటకు రాలేదు. దానికితోడు ప్రభుత్వం వేధింపులు పెరిగిపోవడంతో ప్రతిపక్షాలు కకావికలం అయ్యాయి.


తెలుగుదేశం నాయకులు పలువురు కలుగుల్లో దూరిపోయారు. దీంతో ఆ పార్టీ బలహీనత జగన్‌రెడ్డికి తెలిసిపోయింది. ప్రతిపక్షం నుంచి చెప్పుకోదగిన ప్రతిఘటన ఎదురుకాకపోవడంతో అంతా సవ్యంగా ఉందని జగన్‌ అండ్‌ కో భావించారు. ఫలితమే గత ఎన్నికల్లో 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోవడం. తెలుగుదేశం నాయకుల బలహీనతలను గుర్తించిన జగన్‌రెడ్డి.. ఓటమి నుంచి కోలుకొని ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి కూడా అధికార పక్షానికి కంటి మీద కునుకు లేకుండా చేయడం కోసం వ్యూహ రచన చేసుకున్నారు. ఫలితమే పరామర్శల సందర్భంగా కార్యకర్తలతో హడావిడి చేయడం. నాలుగేళ్ల తర్వాత జరిగే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే హడావిడి ఎందుకు? అన్న అనుమానం కలగడం సహజం. జగన్‌రెడ్డి తెలివితక్కువవాడు కాదు. రాజకీయంగా ఆయన ఎత్తుగడలు ప్రత్యేకంగా ఉంటాయి. నాలుగేళ్ల తర్వాత జరిగే ఎన్నికల్లో తామే అధికారంలోకి వస్తామన్న భరోసా, ఆత్మస్థైర్యాన్ని కార్యకర్తలు, అభిమానుల్లో నింపడం ప్రధాన ఉద్దేశం అయినప్పటికీ మరో లక్ష్యం కూడా ఇందులో ఉంది. కార్యకర్తల్లో భరోసా కల్పించడానికి మళ్లీ అధికారంలోకి వస్తామని ఏ రాజకీయ పార్టీ అయినా ప్రచారం చేసుకోవడం సహజం. జగన్‌రెడ్డి ఆలోచనలు మాత్రం అంతటితో ఆగిపోవు. ప్రతిపక్షంలో ఉండి కూడా అధికారపక్షాన్ని భయపెట్టడానికి ఆయన వినూత్న ఎత్తుగడలు ఎంచుకున్నారు. తెలుగునాట రాజకీయాలు ఇదివరకులా లేవు. ప్రతిపక్షంలో మనుగడ సాగించడం కష్టతరంగా మారింది. ఈ కారణంగానే 11 సీట్లకు మాత్రమే పరిమితమైనా అధికారపక్షంలో ఉన్న వారిని భయపెట్టే మార్గాన్ని జగన్‌రెడ్డి ఎంచుకున్నారు. ఆయన ఐదేళ్ల పాలనను చూసిన ప్రజలు, ఆయా రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తల్లో ఆయనంటే వణుకు ఏర్పడింది. మళ్లీ జగన్‌ అధికారంలోకి వస్తే? అన్న భయం సామాన్య ప్రజల నుంచి వివిధ స్థాయిల్లో ఉన్నవారిలో ఏర్పడింది. ఇది గమనించిన జగన్‌రెడ్డి భయపెట్టడాన్నే నమ్ముకున్నారు. ముందుగా సొంత పార్టీ కార్యకర్తల్లో భవిష్యత్తుపై నమ్మకం కలిగించడం ఎలా? ఆ తర్వాత అధికార కూటమి నాయకులు తన జోలికి, తమ వాళ్ల జోలికీ రాకుండా చేయడం ఎలా? అన్న దానిపై కసరత్తు చేశారు. ఈ కసరత్తు నుంచే భయపెట్టాలి అన్న ఆలోచన వచ్చింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌రెడ్డి మళ్లీ అధికారంలోకి వస్తాడంటారా? అన్న ప్రశ్న ప్రతి ఇద్దరిలో ఒకరి నుంచి వస్తోంది.


ఆయన మళ్లీ గెలిస్తే పరిస్థితి ఏమిటి? అన్న భయం కూడా వారిలో వ్యక్తమవుతోంది. రాజకీయాలతో సంబంధం లేనివారిలో అలాంటి భయాందోళనలు ఉంటే అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి నేతల్లో కూడా ఇలాంటి భయాందోళనలు ఉండటం ఆశ్చర్యంగా ఉంది. దీన్నిబట్టి జగన్‌రెడ్డి ఎత్తుగడ ఫలించినట్టే కదా! పరిస్థితి ఎంత వరకూ వెళ్లిందంటే అధికారుల్లోనూ ఈ భయం ఏర్పడింది. ఫలితంగా వారు చురుగ్గా వ్యవహరించలేకపోతున్నారు. జగన్‌ హయాంలో వలె ఇప్పుడు గుడ్డిగా పై నుంచి వచ్చే ఆదేశాలను అమలు చేయడానికి నిరాకరిస్తున్నారు. ప్రతి విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. జగన్‌ మళ్లీ అధికారంలోకి వస్తే తాము టార్గెట్‌ కాకూడదన్న ఉద్దేశంతోనే అధికారులు అతి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఫలితంగా ప్రభుత్వంపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు పట్టు రాలేదన్న అభిప్రాయం ఏర్పడుతోంది. అధికారుల్లో ఎవరిని నమ్మాలో తెలియని పరిస్థితి. ఏ ఉద్దేశంతో తమది మంచి ప్రభుత్వం అని చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ ప్రకటించుకున్నారో గానీ అధికార యంత్రాంగం సహాయ నిరాకరణ వల్ల మంచి ప్రభుత్వం నినాదం కాస్తా మెతక ప్రభుత్వం అన్న అభిప్రాయంగా మారిపోయింది! రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందా? లేక జగన్‌రెడ్డి అధికారంలో ఉన్నారా? అని తెలుగుదేశం కార్యకర్తలు ప్రశ్నించే వరకు పరిస్థితి వెళ్లింది. అంటే, జగన్‌రెడ్డి ఎత్తుగడ సక్సెస్‌ అయినట్టే కదా? అధికారంలో ఉన్నప్పుడే కాదు.. ప్రతిపక్షంలో, అది కూడా 11 సీట్లకు పరిమితమై కూడా భయపెట్టగలగడం ఆయన ప్రత్యేకత. ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలలో ఈ పరిస్థితి ఏర్పడటం వింతగా ఉంది. అధికారంలో ఉండి కూడా భయం నీడలో బతకడం ఆశ్చర్యంగా ఉంది. ఈ భయం కారణంగా చంద్రబాబు, లోకేశ్‌, పవన్‌ కల్యాణ్‌ వంటి వారిని మినహాయిస్తే, మిగతా నాయకులు ప్రస్తుతానికి అధికారం అనుభవిద్దాం, 2029 తర్వాత ఏం జరిగినా మనం సేఫ్‌గా ఉందాం అన్న ధోరణిని అలవర్చుకుంటున్నారు.


భయపెట్టే ప్లాన్‌ సత్ఫలితాలు ఇస్తుండటంతో జగన్‌ అండ్‌ కో మరింతగా రెచ్చిపోతున్నారు. ఈ క్రమంలోనే రప్పా రప్పా నరుకుతాం అన్న నినాదాన్ని అందుకున్నారు. వైసీపీ నాయకుల నుంచి కార్యకర్తల వరకు ఇప్పుడు ఈ పదాలే ఫ్యాషన్‌ అయ్యాయి. మామిడి రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదంటూ చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో జగన్‌రెడ్డి చేపట్టిన తాజా పరామర్శ యాత్రలో కొంత మంది కార్యకర్తలు.. పోలీసు అధికారుల చేతులు నరుకుతామని హెచ్చరికలు చేశారు. పనిలో పనిగా ‘ఆంధ్రజ్యోతి’ ఫొటోగ్రాఫర్‌పై దాడి చేశారు. అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే కాదు.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా దాడులు చేయగలమని రుజువు చేసుకుంటున్నారు. పోలీసుల చేతులు నరుకుతామని రంకెలు వేసినవారు స్వేచ్ఛగా తిరగడం దేనికి సంకేతం? మొగుడిని కొట్టి మొగసాలకు ఎక్కినట్టుగా ప్రతిపక్షంలో ఉండి కూడా ఇటు అధికారులను, అధికార పార్టీ నాయకులను భయపెట్టడంతో పాటు మరోవైపు మీడియాపై దాడులకు తెగబడుతున్న జగన్‌ అండ్‌ కో.. కూటమి ప్రభుత్వమే రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని అమలు చేస్తోందని నిందిస్తున్నారు. కూటమి నాయకులు ఉత్తుత్తి ప్రకటనలు చేస్తుండగా ప్రతిపక్ష వైసీపీ నాయకులు, కార్యకర్తలు చేసి చూపిస్తున్నారు.


భయం ఆసరాగా విజృంభణ

పిరికితనం అనేది తెలుగుదేశం పార్టీ నాయకుల డీఎన్‌ఏలోనే ఉంది. ఎన్టీఆర్‌ హయాం నుంచీ ఇదే పరిస్థితి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాటాలు చేయాలంటే భయం. అధికారంలో ఉన్నప్పుడు ఎందుకైనా మంచిదని అవతలి పక్షంతో లాలూచీ పడటం పరిపాటి అయింది. క్రిమినల్‌ సైకాలజీలో ఆరితేరినవారు ముందుగా ప్రత్యర్థుల బలహీనతలను అధ్యయనం చేస్తారు. ఆ తర్వాత ఎవరిని ఎలా లొంగదీసుకోవాలో స్కెచ్‌ వేసి అమలుచేస్తారు. ఈ క్రమంలోనే జగన్‌ అండ్‌ కో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు, మంత్రులలో గూడుకట్టుకుని ఉన్న భయాన్ని ఆసరాగా చేసుకొని విజృంభిస్తున్నారు. జనసైనికులు కూడా సోషల్‌ మీడియాలో ఉన్నంత చురుగ్గా క్షేత్ర స్థాయిలో ఉండటం లేదు. భారతీయ జనతా పార్టీ టచ్‌ మీ నాట్‌ అన్నట్టే ఉంటోంది. స్థూలంగా కూటమి పరిస్థితి ఇది. ఫలితంగా జగన్‌రెడ్డి పరామర్శ యాత్రలు సంచలనం అవుతున్నాయి. నిజానికి జగన్‌రెడ్డిది బలుపు కాదు.. వాపు మాత్రమే. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉంటే రోడ్ల మీదకు వచ్చి నరుకుతాం.. చంపుతాం అని రంకెలు వేయరు. 2024 ఎన్నికలకు ముందు చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ సభల్లో ఇలాంటి నినాదాలు వినపడలేదే? ఎన్నికల వరకు సైలెంట్‌గా ఉండే జనం పోలింగ్‌ రోజు బ్యాలెట్‌ పెట్టెల్లో మాత్రమే తమ అంతరంగాన్ని ఆవిష్కరిస్తారు. తెలంగాణలో కేసీఆర్‌ విషయంలో కూడా ఇలాగే జరిగింది. 2024కు ముందు జగన్‌రెడ్డి పట్ల ఈ స్థాయిలో వ్యతిరేకత ఉందని తలపండిన రాజకీయ విశ్లేషకులు, సెఫాలజిస్టులు కూడా పసిగట్టలేకపోయారు. ఇప్పుడు జగన్‌ పర్యటనల్లో కనిపిస్తున్న హడావిడి 2024కు ముందు చంద్రబాబు సభల వద్ద కనిపించలేదు. ముఖ్యమంత్రిగా ఉన్న జగన్‌రెడ్డి సభల వద్ద కూడా ఈ హడావిడి ఉండేది కాదు. ఇప్పుడే ఎందుకు? కార్యకర్తలు, అభిమానులు మొదటిసారి జగన్‌ను చూస్తున్నారా అంటే అదేమీ కాదు. 2019కి ముందు పాదయాత్రల పేరిట నెలల తరబడి ఆయన జనంలోనే ఉన్నారు. ఇప్పుడు ఎన్నికల్లో ఓడిపోయి ఏడాది తిరగకముందే జగన్‌ పట్ల జనంలో ఎందుకు క్రేజ్‌ ఏర్పడుతుంది? తాము పిచ్చి పిచ్చిగా అభిమానించే నాయకుడు ఓడిపోయాడనే బాధ ఉంటే ఉండవచ్చు. అలాంటి వారు ఇలా రెచ్చిపోయి నరుకుతామంటూ హెచ్చరికలు చేయరు. తమ నాయకుడికి సంఘీభావం చెప్పడానికి మాత్రమే బయటకు వస్తారు. పదిహేనేళ్లుగా రాజకీయాల్లో, అది కూడా జనాల్లో కలియదిరిగిన ఏ నాయకుడికైనా సినిమా స్టార్‌లాగా క్రేజ్‌ ఉండటం అసహజంగా అనిపించడం లేదా? పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు అందరూ కూడబలుక్కున్నట్టుగా అధికారంలోకి వచ్చాక నరుకుతాం, చంపుతాం, సినిమా చూపిస్తాం అని హెచ్చరికలు చేయడం వెనుక కచ్చితంగా పకడ్బందీ వ్యూహమే ఉంది. జగన్‌రెడ్డి పాలనలో గ్రామస్థాయిలో తెలుగుదేశం, జనసేన కార్యకర్తలు అనేక వేధింపులకు గురయ్యారు. కేసులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు వారందరూ ప్రతీకారం తీర్చుకోవాలని కోరుకోవడం సహజం. ఈ కారణంగానే కింది స్థాయిలో తమ పార్టీ కార్యకర్తల జోలికి రావాలంటే భయపడే పరిస్థితిని కల్పించాలని జగన్‌రెడ్డి వ్యూహ రచన చేసినట్టుగా ఉంది.


ఈ క్రమంలోనే అవతలి పక్షాన్ని ముందుగానే భయపెట్టడం అనే వ్యూహాన్ని అమలుచేస్తున్నారు. ఫలితంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాధలుపడిన కార్యకర్తల గోడును ఇప్పుడు పదవులు అనుభవిస్తున్న కూటమి నాయకులు పట్టించుకోవడం లేదు. పోలీసులు, ఇతర అధికార యంత్రాంగం గురించి ఇది వరకే చెప్పుకొన్నాం. జగన్‌రెడ్డి చూపిస్తున్న వాపును చూసి కూటమి నాయకులు, కార్యకర్తలు భయపడే పరిస్థితి ఏర్పడింది. నిజంగా జగన్‌రెడ్డి బలపడ్డారా? అని ఆరా తీస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. తమపై అధికారాన్ని ప్రయోగించకుండా కూటమిని కట్టడి చేయడంలో జగన్‌ అండ్‌ కో సఫలం అవుతున్నారు. పరామర్శ యాత్రల సందర్భంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎక్కడ దాక్కుంటున్నారో కూడా తెలియదు. ప్రతిపక్ష నాయకుడికి వ్యతిరేకంగా కనీసం ప్రకటనలు చేయడానికి కూడా వారు సిద్ధపడటం లేదు. అంటే జగన్‌ జోలికి ఎవరూ రాకుండా కట్టడి చేయడానికి స్టెరాయిడ్స్‌ మాదిరిగా పరామర్శ యాత్రలను బలప్రదర్శన యాత్రలుగా మార్చుకుంటున్నారు. అధికార కూటమి నాయకులు, కార్యకర్తల్లో భయం నెలకొల్పిన జగన్‌ అండ్‌ కో ఇప్పుడు మీడియాను కూడా టార్గెట్‌గా ఎంచుకోబోతున్నారు. మాజీ మంత్రి పేర్ని నాని శుక్రవారం నాడు చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. చీకట్లో కన్ను కొట్టగానే పనై పోవాలి గానీ రప్పా రప్పా అంటూ గోల చేయడం ఏమిటి? మన శత్రువులను చెప్పకుండా వేసేయాలి అని పేర్ని నాని కార్యకర్తలను పరోక్షంగా రెచ్చగొడుతున్నారు. కార్మిక సంఘాల నాయకుడిగా, రాజకీయ నాయకుడిగా లబ్ధప్రతిష్ఠుడైన పేర్ని కృష్ణమూర్తి కుమారుడైన పేర్ని నాని ఇలా మాట్లాడటం శోచనీయం. సహవాస దోషం కాబోలు. అధికారంలోకి వస్తే నరుకుతామని వాగడం వల్ల ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడే ప్రమాదం ఉందని, నరుకుదామనుకున్న వారిని చెప్పకుండానే నరకాలని, చీకట్లోనే పనైపోవాలని టిప్స్‌ ఇచ్చే స్థాయికి ఆయన దిగజారారు. తాజాగా జగన్‌ను వ్యతిరేకించే మీడియాను కూడా ముక్కలు ముక్కలుగా నరకాలని ఆయన కార్యకర్తలకు నూరి పోస్తున్నారు.


సరికొత్త దుస్సంప్రదాయం!

మీడియాను టార్గెట్‌గా ఎంచుకోవడంలో ఎవరికి ఎవరు ఆదర్శమో తెలియదు గానీ భారత రాష్ట్ర సమితి–వైసీపీలు అవిభక్త కవలలుగా వ్యవహరిస్తున్నాయి. రాజకీయ పార్టీలు తమ రాజకీయ ప్రత్యర్థులతో తలపడాలి కానీ మీడియాను తమ ప్రత్యర్థులుగా ప్రకటించుకోవడాన్ని ఇప్పుడే చూస్తున్నాం. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి అనేక మీడియా సంస్థలు ఆయా ప్రభుత్వాలకు మద్దతునివ్వడం, విమర్శించడం చూశాం. తమ ప్రభుత్వాన్ని విమర్శించే మీడియాను ఇప్పటిలాగా రాజకీయ ప్రత్యర్థిగా ఎవరూ ప్రకటించలేదు. అత్యవసర పరిస్థితి ప్రకటించినప్పుడు ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ వంటి అనేక పత్రికలు అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీని వ్యతిరేకించాయి. అప్పుడు ప్రభుత్వపరంగా సదరు పత్రికలకు ఇబ్బందులు సృష్టించారు గానీ ఆయా పత్రికల యాజమాన్యాలు, సిబ్బందిని ఇందిరాగాంధీ తన రాజకీయ ప్రత్యర్థులుగా ప్రకటించలేదు. ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ధోరణికి శ్రీకారం చుట్టారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో కేసీఆర్‌, ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్‌రెడ్డి మీడియాను రాజకీయ ప్రత్యర్థులుగా ప్రకటించుకున్నారు. తెలంగాణ శాసనసభకు తొలిసారిగా ఎన్నికైన కొందరు సభ్యులు ప్రమాణస్వీకారం సందర్భంగా ఇబ్బంది పడటాన్ని ‘ఏబీఎన్‌–ఆంధ్రజ్యోతి’ చానల్‌ హేళన చేయకపోయినా చేసినట్టు ప్రచారం చేసి తెలంగాణలో చానల్‌ ప్రసారాన్ని అడ్డుకున్నారు. 2024 ఎన్నికలకు ముందు జగన్మోహన్‌రెడ్డి కూడా ఎంపిక చేసిన కొన్ని మీడియా సంస్థలను రాజకీయ ప్రత్యర్థులుగా ప్రకటించుకున్నారు. ఈ పని కేసీఆర్‌ చేసినా, జగన్‌రెడ్డి చేసినా అది వారి బలహీనతకు నిదర్శనం. ఈ ఇరువురు నాయకులకూ సొంత మీడియా సంస్థలు ఉన్నాయి. అధికారం కోల్పోగానే ప్రభుత్వాలపై వారి మీడియా సంస్థలు ఎంత దారుణంగా దుష్ప్రచారం చేస్తున్నాయో చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్‌లో 2014–19 మధ్య కాలంలోను, 2024 నుంచి నేటి వరకు జగన్‌ మీడియా కూటమి ప్రభుత్వంపై ఎంతలా విరుచుకుపడుతున్నదో చూస్తున్నాం. తెలంగాణలో కేసీఆర్‌ మీడియాదీ అదే ధోరణి. తమ దారికి రాని మీడియా సంస్థలకు ప్రభుత్వపరంగా ప్రకటనలు నిలిపివేయడం గతంలోనూ జరిగింది. అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్‌, జగన్‌రెడ్డి ‘ఆంధ్రజ్యోతి’ సంస్థకు పైసా ప్రకటన కూడా ఇవ్వలేదు. అయినా వాటిని మేం ఖాతరు చేయలేదు. ఇప్పుడు అంతటితో ఆగకుండా మీడియాపై దాడులు చేయాలన్న నిర్ణయానికి కూడా రావడం ఆశ్చర్యంగా ఉంది.


ఈ ధోరణి సమర్థనీయం అయితే కేసీఆర్‌, జగన్‌రెడ్డి మీడియాలపై ఏ స్థాయిలో దాడులు చేయాలి? తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అయినా కేసీఆర్‌ మీడియాపై దూకుడు ప్రదర్శించలేదు. అధికారంలో ఉన్నవారు దాడులు చేయించాలనుకుంటే ఆపేది ఎవరు? ఆంధ్రప్రదేశ్‌లో కూడా జగన్‌రెడ్డి మీడియాపై కూటమి నేతలు దాడులు చేయించి, సిబ్బందిని కొట్టడం వంటి చర్యలకు పాల్పడలేదు. విచిత్రంగా ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ, బీఆర్‌ఎస్‌ నాయకులే దాడుల గురించి మాట్లాడుతున్నారు. మీడియాపై ఆధారపడి రాజకీయాలు చేసేవారు బలమైన నాయకులు కాలేరు. 2023 ఎన్నికలకు ముందు ‘ఆంధ్రజ్యోతి’ మినహా మిగతా మీడియా అంతా కేసీఆర్‌ ప్రభుత్వాన్ని తలపై పెట్టుకొని మోసింది. అయినా ఎన్నికల్లో ఆయనను ప్రజలు తిరస్కరించారు. రాజకీయ నాయకులు ఈ వాస్తవాన్ని ఎందుకు గుర్తించడం లేదో? ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌కు అనుకూలంగా ఆయన మీడియా ఎంత ప్రచారం చేసినా ఓటమిని తప్పించుకోలేకపోయారు కదా? ఇప్పుడు మీడియాపై దాడులు చేయాలనుకుంటున్నవారు అలా చేస్తే ప్రజల్లో మరింత వ్యతిరేకత పెరుగుతుందని గుర్తించలేకపోవడం విషాదం. అటు జగన్‌ మీడియాకు, ఇటు కేసీఆర్‌ మీడియాకు నేను ఒక ముడిసరుకుగా మారాను. దాదాపు పదిహేను సంవత్సరాలుగా ఈ ఇరువురి మీడియా సంస్థలు నాపై పుంఖాను పుంఖాలుగా వార్తలు వండి వడ్డించాయి.


అయినా ఇటు తెలంగాణలో గానీ, అటు ఆంధ్రప్రదేశ్‌లో గానీ మా సంస్థను ప్రజల నుంచి దూరం చేయలేకపోయారు. తెలంగాణలో కేసీఆర్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌రెడ్డికి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాన ప్రత్యర్థులు. అయినా కేసీఆర్‌, జగన్‌రెడ్డిలు ఆ ఇరువురి కంటే నన్నే ప్రధాన ప్రత్యర్థిగా పరిగణిస్తున్నారు. ఒక జర్నలిస్టుగా ఇందుకు నేను గర్విస్తున్నాను. ఎక్కడో నిజామాబాద్‌ జిల్లాలోని మారుమూల గ్రామంలో పుట్టి పెరిగిన నేను కేసీఆర్‌–జగన్‌కు టార్గెట్‌ అయ్యే స్థాయికి ఎదగడం నా మటుకు నాకు గర్వకారణం. మా సంస్థలకు దురుద్దేశాలు ఆపాదించాలని ఎంతగా ప్రయత్నించినా మాకు ఉన్న విశ్వసనీయత మిగిలే ఉంది. నన్ను రాజకీయ ప్రత్యర్థిగా టార్గెట్‌ చేసుకున్నంత మాత్రాన ప్రజాక్షేత్రంలో వారి బలం పెరగదు. తమ చర్యల ద్వారా నన్ను పెంచుతూ తమను తాము తక్కువ చేసుకుంటున్న వాస్తవాన్ని కేసీఆర్‌, జగన్‌రెడ్డి గుర్తిస్తే వారికే మంచిది. కొంత మంది రాజకీయ మరుగుజ్జులు, విదూషకులు చేసే ప్రకటనలకు స్పందించవద్దని, అలా చేస్తే వారి స్థాయి పెరుగుతుందని భారత రాష్ట్ర సమితికి చెందిన కొంత మంది ముఖ్యులు నాకు సలహా కూడా ఇచ్చారు. ఈ సలహాను పాటించాలనే నేను నిర్ణయించుకున్నాను. తమకు వ్యతిరేకంగా ఉంటున్న మీడియా సంస్థలను ముక్కలు ముక్కలుగా చేయాలని కార్యకర్తలను పేర్ని నాని వంటి వారు రెచ్చగొట్టినంత మాత్రాన భయపడేంత బలహీనంగా మీడియా సంస్థలు ఉండవు. తాత్కాలికంగా ఇబ్బందులు ఏర్పడినా తట్టుకోగలవు. దుష్ట సంప్రదాయాలను నెలకొల్పాలనుకుంటే అవి రేపటి రోజున మనల్నే మింగేస్తాయి అని ఇలాంటి వారు గుర్తుంచుకోవాలి!

QR Scan.jpg

-ఆర్కే

Updated Date - Jul 13 , 2025 | 07:26 AM