Share News

ఫోన్‌ ట్రాప్‌‌లో పడేదెవరో..?

ABN , Publish Date - Jun 22 , 2025 | 01:26 AM

తెలంగాణలో చోటుచేసుకున్న టెలిఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ర్టాల్లో కాక రేపుతోంది. కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణలో విచ్చలవిడిగా ఫోన్‌ ట్యాపింగ్‌ జరిగింది. దీనిపై దర్యాప్తు చేయడానికి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం సిట్‌ ఏర్పాటు చేసింది. సిట్‌ దర్యాప్తులో...

ఫోన్‌ ట్రాప్‌‌లో పడేదెవరో..?

తెలంగాణలో చోటుచేసుకున్న టెలిఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ర్టాల్లో కాక రేపుతోంది. కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణలో విచ్చలవిడిగా ఫోన్‌ ట్యాపింగ్‌ జరిగింది. దీనిపై దర్యాప్తు చేయడానికి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం సిట్‌ ఏర్పాటు చేసింది. సిట్‌ దర్యాప్తులో విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఉప ఎన్నిక అయినా, సాధారణ ఎన్నికలైనా ప్రత్యర్థులను కట్టడి చేయడానికి కేసీఆర్‌ ప్రభుత్వం ఫోన్‌ ట్యాపింగ్‌ను బ్రహ్మాస్త్రంగా వాడుకుంది. ఫోన్లు దొంగచాటుగా వినడం తీవ్ర నేరమన్న విషయం మరచి విచ్చలవిడిగా వందల మంది ఫోన్‌ సంభాషణలను విన్నారు. ఈ క్రమంలో అధికార పార్టీకి చెందినవారు కూడా బాధితులుగా మిగిలారు. ఫోన్‌ ట్యాపింగ్‌ ఆధారంగానే కేసీఆర్‌ ఒకప్పుడు హరీశ్‌రావ్‌, ఈటల రాజేందర్‌లను పక్కన పెట్టారు. ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలను శాసించడానికి కూడా కేసీఆర్‌ ఈ అస్ర్తాన్నే ఎంచుకున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా 2019 ఎన్నికల్లో ఆయనకు హైదరాబాద్‌ నుంచి నిధులు అందకుండా కట్టడి చేశారు. షర్మిల ఫోన్లతో పాటు ఆమె అనుయాయుల ఫోన్లను ట్యాప్‌ చేసి తన ఆప్త మిత్రుడైన జగన్‌రెడ్డికి ఆ వివరాలు అందించారు. దీంతో ఆ ఇరువురి మధ్య ఏర్పడిన బంధం ఫెవికాల్‌ కంటే దృఢమైనదని రుజువైంది. రక్తసంబంధం కంటే కేసీఆర్‌–జగన్‌ మధ్య బంధమే బలమైనదని షర్మిల సైతం వ్యాఖ్యానించారు. ఫోన్‌ ట్యాపింగ్‌కు పాల్పడటం ద్వారా ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఇరికించిన కేసీఆర్‌.. అప్పటి నుంచే ట్యాపింగ్‌ రుచి మరిగారు. ఇందుకోసం ప్రభాకరరావు, రాధాకిషన్‌రావు వంటి అధికారులను వాడుకున్నారు. పాపం పండుతుంది అంటారు. ఇప్పుడు ఫోన్‌ ట్యాపింగ్‌ పాపం పండుతోంది. ఈ వ్యవహారంలో దర్యాప్తు సజావుగా పూర్తయితే ఇటు కేసీఆర్‌, అటు జగన్‌రెడ్డి కూడా ఇరుక్కుపోతారు. రికార్డు చేసిన తన వాయిస్‌ను తన చిన్నాన్న వైవీ సుబ్బారెడ్డి తనకే వినిపించారని షర్మిల చెప్పుకొచ్చారు. దీన్నిబట్టి జగన్‌రెడ్డి కోసం కేసీఆర్‌ ట్యాపింగ్‌ చేయించారని అర్థమవుతోంది. టెలిఫోన్‌ ట్యాపింగ్‌ అనేది ఇప్పుడు సర్వసాధారణం అయిపోయింది. అందుకే ప్రజలు కూడా దీన్ని సీరియస్‌గా తీసుకోవడం లేదు. అయితే తెలంగాణలో హైకోర్టు జడ్జీల ఫోన్లు కూడా ట్యాప్‌ చేయించడం ద్వారా కేసీఆర్‌ ప్రభుత్వం సరికొత్త రికార్డులు సృష్టించింది.


‘దొంగ చెవుల’కు చెక్‌!

మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా వ్యక్తిగత గోప్యత మౌలిక హక్కు. ఇప్పుడు ప్రభుత్వాలే ఈ హక్కును హరిస్తున్నాయి. నియమ నిబంధనలు పాటించకుండా ఫోన్‌ ట్యాపింగ్‌ చేయడం తీవ్ర నేరంగా ఇండియన్‌ టెలిగ్రాఫ్‌ చట్టం పేర్కొంటోంది. ప్రజల భద్రత, అంతర్గత శాంతిభద్రతలు వంటి కారణాలతో ఈ చట్టం ద్వారా ఫోన్లు ట్యాప్‌ చేసే అధికారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంక్రమించింది. కాల క్రమంలో అధికారంలో ఉన్నవాళ్లు రాజకీయ ప్రత్యర్థుల కదలికలు, వ్యూహాలు తెలుసుకోవడానికి ట్యాపింగ్‌ చేయించారు. ఈ క్రమంలోనే 1988లో కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్న రామకృష్ణ హెగ్డేపై తమ రాష్ట్రంలోని ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాప్‌ చేయించారన్న ఆరోపణలు వచ్చాయి. ఇందులో నిజం ఉండటంతో రామకృష్ణ హెగ్డే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. నీరా రాడియా టేపుల వ్యవహారం కూడా సంచలనం అయింది. ఈ నేపథ్యంలోనే టెలిఫోన్‌ ట్యాపింగ్‌ అనేది వ్యక్తిగత గోప్యత హక్కును ఉల్లంఘించడమేనని 1996లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. హోం శాఖ కార్యదర్శి అనుమతితోనే ట్యాపింగ్‌ జరగాలని, ట్యాపింగ్‌ ఆర్డర్‌కు రివ్యూ కమిటీ ఆమోదం కూడా ఉండాలని, ట్యాపింగ్‌ 60 రోజులకు మించి చేయకూడదని, రికార్డులు సక్రమంగా ఉండాలని సుప్రీంకోర్టు తన తీర్పులో స్పష్టంచేసింది. చట్టపరంగా ఫోన్‌ ట్యాపింగ్‌కు అనుమతించే అధికారం కేంద్ర ప్రభుత్వ స్థాయిలో కొద్ది సంస్థలకు మాత్రమే ఉంది. ఇంటెలిజెన్స్‌ బ్యూరో, రా, సీబీఐ, ఎన్‌ఐఏ, ఐటీ, ఢిల్లీ పోలీస్‌ కమిషనర్‌ తదితరులకే అధికారం ఉంది. రాష్ట్ర స్థాయిలో ఫోన్‌ ట్యాపింగ్‌ చేయాలంటే హోం శాఖ కార్యదర్శి అనుమతి తప్పనిసరి. తెలంగాణలో జరిగిన ట్యాపింగ్‌ విషయానికి వస్తే ఇక్కడ నియమ నిబంధనలను తుంగలో తొక్కారు. నక్సలైట్ల పేరిట ఎవరి ఫోన్లనుబడితే వారి ఫోన్లను ట్యాప్‌ చేశారు. డీజీపీ స్థాయి అధికారి సైతం స్వేచ్ఛగా ఫోన్లో మాట్లాడలేని పరిస్థితి కల్పించారు. జగన్‌ పాలనలో కూడా ఇలాగే సాగింది. సొంత పార్టీలకు చెందిన కీలక నాయకులపై కూడా నిఘా పెట్టించారు.


ప్రస్తుత కేసులో విచారణ ఎదుర్కొంటున్న ప్రభాకరరావు అనే రిటైర్డ్‌ అధికారి సిట్‌ అధికారులకు సహకరించడం లేదు. అయితే ఆయన ఆధ్వర్యంలో జరిగిన ఫోన్‌ ట్యాపింగ్‌కు అనుమతించిన అధికారులు ఎవరు? వారి ముందుకు వచ్చిన అభ్యర్థనలు ఎన్ని? ఎవరెవరి ఫోన్లు ట్యాప్‌ అయ్యాయి? వంటి అంశాలను ట్యాపింగ్‌కు అనుమతించిన అధికారుల నుంచి సమాచారం సేకరిస్తే ఈ కేసు ఒక కొలిక్కి వస్తుంది. ఒకే సమయంలో, అది కూడా ఎన్నికలకు ముందు అన్ని వందల ఫోన్లు ట్యాప్‌ చేయడానికి ఎలా అనుమతించారు? కనీస అనుమానం రాలేదా? తమ ఆమోదానికి పంపిన జాబితాలో ఉన్న నంబర్లు ఎవరివని కనీసం ఆరాతీశారా? అని సంబంధిత అధికారులను ప్రశ్నించి సమాధానాలు రాబడితే తెర వెనుక శక్తులు బయటకు రాకతప్పదు. పెగాసస్‌ సాఫ్ట్‌వేర్‌ను అనధికారికంగా తెప్పించుకొని విచ్చలవిడిగా ఫోన్‌ ట్యాపింగ్‌ చేయించారన్న ఆరోపణలు కూడా బలంగా వినిపించాయి. ముఖ్యమంత్రుల ఆదేశాలు లేకుండా రాజకీయ నాయకుల ఫోన్లను అధికారులు ట్యాప్‌ చేయరు. వందలకొద్దీ ఫోన్లను ట్యాప్‌ చేయడం వల్ల కింది స్థాయి అధికారులు పనిలో పనిగా తమకు గిట్టని వారి ఫోన్లను కూడా దొంగచాటుగా విన్నారు. ముంబైలో ఒక కేసుకు సంబంధించి ఫోన్‌ ట్యాపింగ్‌ చేయించారు. అయితే ఆ పనికి నియమితులైన ఆపరేటర్‌, తనకు ఇష్టమైన ఒక హీరోయిన్‌ ఫోన్‌ను ప్రతిరోజూ దొంగచాటుగా వినేవాడు. ఉన్నతాధికారుల తనిఖీలో ఇది బయటపడింది. ఈ లెక్కన ట్యాపింగ్‌ అనేది ఏ స్థాయిలోనైనా దుర్వినియోగం అయ్యే అవకాశం ఉంది. తెలంగాణ ప్రభుత్వం జరిపిస్తున్న దర్యాప్తులో కేసీఆర్‌ పాత్రకు సంబంధించిన ఆధారాలు లభిస్తాయా లేదా అన్నది వేచి చూడాలి. ఆధారాలు లభిస్తే రాజకీయంగా కేసీఆర్‌పై ప్రతీకారం తీర్చుకోవడానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి అవకాశం లభిస్తుంది. కేసీఆర్‌ ఇరుక్కుంటే జగన్‌రెడ్డి కూడా ఇరుక్కొనే అవకాశం లేకపోలేదు. రాష్ట్ర ప్రభుత్వాలు విచ్చలవిడిగా ఫోన్లు ట్యాప్‌ చేయిస్తున్నందున ప్రజల వ్యక్తిగత గోప్యత హక్కును పరిరక్షించాలంటే నిబంధనలను మరింత కఠినతరం చేయాలి. ట్యాపింగ్‌కు జ్యుడీషియల్‌ అనుమతి తప్పనిసరి చేయాలి. హోం శాఖ కార్యదర్శి అనుమతికి ముందు హైకోర్టులోని సీనియర్‌ న్యాయమూర్తి అనుమతి పొందడం తప్పనిసరి చేయాలి. ఆ తర్వాత కూడా కింది స్థాయి అధికారులకు వదిలిపెట్టకుండా మాజీ న్యాయమూర్తులు, సాంకేతిక నిపుణులు, పార్లమెంటు సభ్యులతో పర్యవేక్షణకు కమిటీని ఏర్పాటు చేయాలి. ఈ కమిటీ కూడా సుప్రీంకోర్టు పర్యవేక్షణలోనే ఉండాలి. ప్రతి మూడు నెలలకు ఒకసారి ట్యాపింగ్‌ ఆదేశాలపై సమీక్ష జరపాలి. పౌర హక్కులకు భంగం కలిగితే నష్టపరిహారం చెల్లించే నిబంధన విధించాలి. అమెరికాలో ఫారిన్‌ ఇంటెలిజెన్స్‌ సర్వేలెన్స్‌ చట్టం ప్రకారం ట్యాపింగ్‌ కోసం ప్రత్యేక న్యాయమూర్తుల అనుమతి తప్పనిసరి. ఇంగ్లండ్‌లో మంత్రి మండలి ఆమోదం తర్వాత ఒక సీనియర్‌ న్యాయమూర్తి కూడా ఆమోదముద్ర వేయాలి. జర్మనీలో పార్లమెంటరీ పర్యవేక్షణ కమిటీ అనుమతి తప్పనిసరి. చట్టాలను కఠినతరం చేయని పక్షంలో ప్రభుత్వాలే కాకుండా ప్రైవేటు వ్యక్తులు కూడా పెగాసస్‌ సాఫ్ట్‌వేర్‌ సమకూర్చుకొని వ్యాపార ప్రత్యర్థుల ఫోన్లను ట్యాప్‌ చేసే ప్రమాదం ఉంది. తెలుగునాట కొంత మంది ప్రైవేటు వ్యక్తుల వద్ద ఇలాంటి ఎక్విప్‌మెంట్‌ ఉందన్న ప్రచారం ఉంది. ఇజ్రాయెల్‌కు చెందిన సంస్థ సరఫరా చేసిన పరికరాల్లో మూడు నాలుగు ప్రైవేటు వ్యక్తుల వద్దే ఉన్నాయట. వ్యాపార ప్రత్యర్థుల ఎత్తుగడలను ముందుగానే తెలుసుకోవడానికి కొంత మంది వ్యాపార దిగ్గజాలు ఇలాంటి అనైతిక పద్ధతులకు పాల్పడుతున్నారట. ఈ నేపథ్యంలో పౌరుల వ్యక్తిగత గోప్యత హక్కు భద్రంగా ఉండాలంటే పౌర సమాజం కూడా ఆ దిశగా ఉద్యమించాలి. పాలకులు ట్యాపింగ్‌ రుచి మరిగినందున వారిని కట్టడి చేయాలంటే ప్రజలే ఉద్యమించాలి!


‘నరుకుడు’ నైజం!

ఇక, ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డితో పాటు ఆయనకు వత్తాసు పలుకుతున్న వారిని ఎలా అర్థం చేసుకోవాలి? తాను అధికారం కోల్పోవలసి వస్తుందని కలలో కూడా ఊహించని జగన్‌రెడ్డి ఇప్పుడు కరుణామయుడి ముసుగు తొలగించి తనలోని వికృత మనస్తత్వాన్ని ప్రదర్శించడానికి ఏ మాత్రం మొహమాటపడటం లేదు. అయితే ఆయనలోని ఉక్రోషం రాజకీయంగా మేలు చేస్తుందా? కీడు చేస్తుందా? అన్నది చెప్పలేని పరిస్థితి. గత ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుందని కోటిన్నర వరకు పందెం కాసి నష్టపోయిన నాగమల్లేశ్వరరావు అనే కార్యకర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన జగన్‌రెడ్డి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జరిగింది. జగన్‌ హయాంలో నియమితులైన పోలీసు అధికారులే అప్పుడు స్థానికంగా పనిచేస్తున్నారు. అయినప్పటికీ చంద్రబాబు అండ్‌ కో వేధింపుల వల్లనే నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నాడంటూ జగన్‌ విమర్శలు గుప్పించారు. అంతటితో ఆగకుండా అప్పులపాలై ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ ధోరణి దేనికి సంకేతమో ఆయనే చెప్పాలి. ఈ సందర్భంగా జగన్‌రెడ్డి మద్దతుదారులు హద్దులు మీరి తాము తిరిగి అధికారంలోకి వస్తే ఎంత కిరాతకంగా వ్యవహరించబోతామనేది దాచుకోకుండా ప్లకార్డుల రూపంలో రాష్ట్ర ప్రజలను హెచ్చరించారు. గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తలలు నరికినట్టు మళ్లీ అధికారంలోకి వచ్చాక ఒక్కొక్కరినీ నరుకుతాం, రాజారెడ్డి రాజ్యాంగాన్ని పల్నాడు నుంచే అమలు చేస్తాం, 2029 తర్వాత తమకు అడ్డొస్తే తొక్కిపడేస్తాం అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. సభ్యత, సంస్కారం, బాధ్యత తెలిసిన ఏ నాయకుడైనా ఇలాంటి ఆలోచనా ధోరణులకు అడ్డుకట్ట వేస్తారు. అయితే జగన్‌రెడ్డి అలా చేయకుండా సదరు వ్యాఖ్యలను సమర్థించారు. ‘పుష్ప సినిమాలో డైలాగులు చెప్పినా తప్పేనా? మనం ఎక్కడున్నాం? ప్రజాస్వామ్యంలో ఉన్నామా?’ అని ప్రశ్నించడమే కాకుండా ‘రప్పా రప్పా నరుకుతాం అనడంలో తప్పేముంది?’ అని ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్‌రెడ్డి అనడం రాష్ట్ర ప్రజలను దిగ్ర్భాంతికి గురిచేసింది. జగన్‌రెడ్డి పాలన ఎలా ఉండేదో ప్రత్యక్షంగా చూసి అనుభవించిన ప్రజలు ఇప్పుడు ఈ వ్యాఖ్యలు, హెచ్చరికలతో భయభ్రాంతులకు గురవుతున్నారు. రప్పా రప్పా నరకడాన్ని జగన్‌రెడ్డి సమర్థించడం చూసి నాగరిక సమాజం ముక్కున వేలేసుకుంది. ఈ చేష్టలు, పోకడలు జగన్‌రెడ్డికి రాజకీయంగా ఎలా మేలు చేస్తాయో అంతుపట్టడం లేదు. రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యలు సృష్టించడం జగన్‌ అండ్‌ కో లక్ష్యం అయితే అయి ఉండవచ్చు గానీ ప్రశాంత వాతావరణం కోరుకొనే ప్రజలు ఇలాంటి వికృత పోకడలను హర్షించలేరు. 2024 ఎన్నికల్లో తాను ఓడిపోవడానికి గల ప్రధాన కారణాలను గుర్తించడానికి జగన్‌రెడ్డి నిరాకరించడం వల్లనే ఆయన హింసను ఆశ్రయిస్తున్నారు. జగన్‌ పాలనలో అమలైన నిర్బంధాల వల్ల ప్రజలు ఉక్కపోతకు గురయ్యారు. ఆ కారణంగానే దాదాపు 57 శాతం ప్రజలు కూటమికి అనుకూలంగా ఓటు వేశారు. ఈ వాస్తవాన్ని గుర్తించకుండా 2029లో తిరిగి అధికారంలోకి వస్తే మరింత కర్కశంగా వ్యవహరిస్తామని, అడ్డొచ్చిన వారిని నరుకుతామని హెచ్చరించడం ద్వారా జగన్‌ అండ్‌ కో తమ అవకాశాలను తామే ధ్వంసం చేసుకుంటున్నామని గుర్తించలేకపోతున్నట్టుగా ఉంది. నేరస్తులు, సంఘ విద్రోహ శక్తులు, కుల మతోన్మాద శక్తులు తోడుంటే చాలునని జగన్‌ అండ్‌ కో భావిస్తున్నట్టుగా ఉంది. ఈ నేపథ్యంలోనే ఏ మాత్రం వెరపు లేకుండా నరుకుడు భాష ప్రయోగిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రయోగించిన బూతు భాషనే ప్రజలు భరించలేకపోయారు. అలాంటిది మళ్లీ అధికారంలోకి వస్తే నరుకుతామని హెచ్చరించడాన్ని ఎలా సమర్థిస్తారు?


ప్రజలది సైలెంట్‌ నిర్ణయమే!

జగన్‌రెడ్డి వాపును చూసి బలుపు అనుకుంటున్నట్టుగా ఉంది. ఓదార్పు పేరిట జరుగుతున్న పర్యటనలకు భారీగా జన సమీకరణ చేస్తున్నారు. అలా వచ్చిన వారు జగన్‌ చుట్టూ చేరి పిచ్చి గోల చేస్తున్నారు. ఇదంతా చూసి నాలుగేళ్ల తర్వాత తాను మళ్లీ ముఖ్యమంత్రి అవుతానని జగన్‌రెడ్డి కలలు కంటున్నారు. ఆయన మద్దతుదారులు కూడా అదే ట్రాన్స్‌లోకి వెళుతున్నారు. నిజానికి ఏడాది క్రితం అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వంపై.. జగన్‌రెడ్డి భావిస్తున్నట్టుగా ప్రజల్లో వ్యతిరేకత లేదు. ప్రభుత్వాల పట్ల వ్యతిరేకత ఉన్నప్పటికీ ప్రజలు బహిరంగంగా ప్రదర్శించరు. తెలుగునాట ఇది రుజువైంది. తెలంగాణలో కేసీఆర్‌ ప్రభుత్వం పైన, ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌రెడ్డి ప్రభుత్వం పైన ప్రజల్లో ఇంతటి వ్యతిరేకత ఉందని ఎన్నికలకు ముందు కనిపించిందా? లేదే? పోలింగ్‌ రోజున ప్రజలు కామ్‌గా వెళ్లి తమ తీర్పు ఇచ్చారు. ప్రజలు ఎప్పుడూ సైలెంట్‌గానే ఉంటారు. జగన్‌రెడ్డి ఓదార్పు పర్యటనల్లో లాగా గోల చేయరు. ఈ చిన్న లాజిక్‌ మిస్‌ అవుతున్న జగన్‌ అండ్‌ కో 2029 తర్వాత సినిమా చూపిస్తామంటూ రెచ్చిపోతున్నారు. ప్రజలను భయపెట్టి అధికారంలోకి రావాలని అనుకోవడం ఏమిటో అర్థం కాని విషయం! అధికారంలో ఉన్నప్పుడు ప్రజలను భయపెట్టినందుకే కదా జగన్‌రెడ్డిని పదకొండు సీట్లకే పరిమితం చేశారు? ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండీ భయపెట్టాలనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది. అందుకే జగన్‌ అండ్‌ కోను అర్థం చేసుకోవడం కష్టం. తన చర్యలు, వ్యాఖ్యల ద్వారా జగన్‌రెడ్డి సమాజానికి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారో తెలియదు. ఏది ఏమైనా ఇలాంటి పెడధోరణులను కూటమి ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచివేయాలి. తాను మళ్లీ అధికారంలోకి వస్తే ఎంత కర్కశంగా వ్యవహరించేదీ జగన్‌రెడ్డి చెప్పకనే చెబుతున్నారు కనుక ఆయనకు ఆ అవకాశం ఇవ్వకుండా అత్యంత కఠినంగా వ్యవహరించాలి. సత్తెనపల్లి పర్యటన సందర్భంగా కమ్మ సామాజికవర్గం పట్ల జగన్‌రెడ్డి చేసిన ప్రకటన కూడా వింతగా ఉంది. 2019కి ముందు ఆ సామాజిక వర్గంపై ఇతర సామాజిక వర్గాలలో విద్వేషాన్ని నింపి రాజకీయంగా లబ్ధి పొందిన జగన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత సదరు సామాజిక వర్గాన్ని అంటరానిదానిగా చూశారు. ఫలానా సామాజిక వర్గం వారికి ప్రభుత్వంలో పనులు కాకూడదని పరోక్షంగా ఆదేశాలు జారీ చేశారు. తెలుగునాట ఎన్నడూ లేని విధంగా ఆ సామాజిక వర్గానికి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేకుండా చేశారు. ఇప్పుడు అదే జగన్‌రెడ్డి కమ్మ సామాజిక వర్గం ఏం పాపం చేసిందని వాపోవడం రోతగా ఉంది. ఆయన ఏ ఉద్దేశంతో ఈ వైఖరి తీసుకున్నారో తెలియదు గానీ దీనివల్ల ఉభయ భ్రష్టత్వం ప్రాప్తించినా ఆశ్చర్యం లేదు. కమ్మ సామాజిక వర్గం పట్ల ద్వేషాన్ని పెంచుకున్న వారికి జగన్‌రెడ్డి వ్యాఖ్యలు సహజంగానే రుచించవు. అదే సమయంలో కమ్మ సామాజిక వర్గం తనను ఎన్నటికీ నమ్మని విధంగా అధికారంలో ఉన్నప్పుడు ఆయన వ్యవహరించారు. ఈ కారణంగా జగన్‌రెడ్డికి ఉభయ భ్రష్టత్వం అనివార్యంగా కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలో జగన్‌రెడ్డి చేపట్టిన సత్తెనపల్లి పర్యటన ఆయనకు రాజకీయంగా మేలు చేసే పరిస్థితి కనిపించడం లేదు. చంద్రబాబుపై వ్యతిరేకత ఉన్నవారు కూడా రప్పా రప్పా నరుకుడు భాషను బాహాటంగా సమర్థించలేరు. ప్రజలను ఉన్మాదులుగా మార్చాలని జగన్‌ అండ్‌ కో భావిస్తున్నారు గానీ, ప్రజలు తెలివైనవారు అని అనేక సందర్భాలలో రుజువైంది. వివిధ కారణాల వల్ల ఆంధ్రప్రదేశ్‌లో పిల్ల సైకోల సంఖ్య పెరిగింది. అదే సమయంలో రాష్ట్రంలో ప్రశాంత పరిస్థితులు ఉండాలనుకొనేవారు జగన్‌రెడ్డికి శాశ్వతంగా దూరమవుతున్నారు. నీలి మీడియాకు తోడుగా కూలి మీడియా అండగా ఉండగా తమకు తిరుగుండదని జగన్‌ అండ్‌ కో భావించవచ్చు గానీ ఈ మీడియానే 2024లో జగన్‌ ఘోర పరాజయాన్ని నిరోధించలేకపోయింది. జగన్‌ రోత చానల్‌లో పిచ్చి వాగుడు వాగిన వారు ఇప్పుడు అనుభవిస్తున్నారు.


చంద్రబాబు ప్రభుత్వాన్ని తిట్టి పోస్తున్నందుకు జగన్‌ అండ్‌ కో నుంచి తనకు డబ్బు ముడుతోందని కృష్ణంరాజు అనే స్వయం ప్రకటిత ఎడిటర్‌ పోలీసుల విచారణలో చెప్పారు. జర్నలిస్టులం, ఎనలిస్టులం అని చెప్పుకొంటున్నవారు ఈ స్థాయికి దిగజారారన్న మాట! పత్రికా స్వేచ్ఛ గురించి ఇప్పుడు జగన్‌రెడ్డి గొంతు చించుకుంటున్నారు. ఆయనకు వత్తాసుగా మరికొన్ని గొంతులు వినిపిస్తున్నాయి. జగన్‌ అధికారంలో ఉన్నప్పుడు ‘ఆంధ్రజ్యోతి’ పత్రికను ఐదేళ్లపాటు వెంటాడి వేధించినప్పుడు గానీ, ‘ఏబీఎన్‌’ చానల్‌ ప్రసారాలను ఐదేళ్లపాటు అడ్డుకున్నప్పుడు గానీ ఈ గొంతులు ఎక్కడికి పోయాయో తెలియదు. ఒక రాజకీయ పార్టీ అధినేత ఏర్పాటు చేసుకున్న మీడియాకు మాత్రమే స్వేచ్ఛ ఉండాలని వారు కోరుకుంటున్నారేమో తెలియదు. తెలుగునాట మీడియా పవిత్రత ఏనాడో మంటగలిసింది. రాజశేఖరరెడ్డి అధికారంలోకి రాకముందు మీడియాలో కొన్ని లోపాలు ఉన్నప్పటికీ కనీస ప్రమాణాలు ఉండేవి. ఆ తర్వాత రాజశేఖరరెడ్డి, కేసీఆర్‌ సొంత మీడియా సంస్థలను ఏర్పాటు చేసుకున్నాక మీడియా నిట్టనిలువునా చీలిపోయింది. ఈ క్రమంలో గిట్టుబాటు అయిన వాళ్లందరూ రాజశేఖరరెడ్డి, కేసీఆర్‌ పంచన చేరారు. వారి మీడియాకు ఇబ్బంది ఎదురైనప్పుడే సుద్దులు చెప్పడానికి బయటకొస్తారు. ఐదేళ్లపాటు ఇటు కేసీఆర్‌, అటు జగన్‌రెడ్డి ‘ఆంధ్రజ్యోతి’ పత్రికకు పైసా ప్రకటన కూడా ఇవ్వకపోయినా, కేసులు పెట్టి వేధించినా వీళ్లకు నోళ్లు పెగల్లేదు ఎందుకో! రాజకీయ పార్టీలతో ప్రత్యక్ష సంబంధాలు లేని మీడియాకే రంగులు పూసినప్పుడు, రాజకీయ పార్టీల సొంత మీడియాలో పనిచేస్తున్న వారికి పరిస్థితులు ప్రతికూలించినప్పుడు ఇబ్బందులు తప్పవు. అధికారంలో ఉన్నప్పుడు లబ్ధి పొందిన వాళ్లు, అధికారం లేనప్పుడు కూడా అదే దర్జా వొలకబోయాలనుకుంటే ఎలా? అధికారంలో ఉన్నప్పుడు రాజధర్మాన్ని పాటించనివారు కూడా ఇప్పుడు పత్రికా స్వేచ్ఛ అని గొంతు చించుకుంటే ఎబ్బెట్టుగా ఉంటుంది. అందుకే మీడియా గొడవలను ప్రజలు కూడా పట్టించుకోవడం లేదు.

ఆర్కే

ఈ వార్తలు కూడా చదవండి.

విదేశాల్లో ఉద్యోగాల పేరిట మోసం

ఈ నెలాఖరులోపు బకాయిలు చెల్లించాల్సిందే

Read Latest Telangana News and National News

Updated Date - Jun 22 , 2025 | 07:12 AM