Share News

Jubilee Hills By Election: రేవంత్‌ కా కమాల్‌

ABN , Publish Date - Nov 16 , 2025 | 03:34 AM

‘‘నాకు రాజకీయాల్లో లోతులు తెలియవు అనుకోవద్దు.. రాజకీయం చేయడం రాదు అని కూడా అనుకోవద్దు’’.. కొంతకాలం క్రితం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలివి. ‘‘జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ గెలవడం కష్టం. మాకు...

 Jubilee Hills By Election: రేవంత్‌ కా కమాల్‌

‘‘నాకు రాజకీయాల్లో లోతులు తెలియవు అనుకోవద్దు.. రాజకీయం చేయడం రాదు అని కూడా అనుకోవద్దు’’.. కొంతకాలం క్రితం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలివి. ‘‘జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ గెలవడం కష్టం. మాకు, భారత రాష్ట్ర సమితికి మధ్య పది శాతానికి పైగా ఓట్ల తేడా ఉంది. ముఖ్యమంత్రి ఒక్కరికే గెలుస్తామన్న నమ్మకం ఉంది’’ ..ఎన్నికల ప్రచారం ప్రారంభమయ్యాక కొందరు మంత్రులు చేసిన వ్యాఖ్యలివి. ‘‘రేవంత్‌రెడ్డికి కాంగ్రెస్‌ అధిష్ఠానం అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వడం లేదు. నమ్మి ముఖ్యమంత్రి పదవి కట్టబెడితే రేవంత్‌రెడ్డి పార్టీని నాశనం చేస్తున్నాడు అని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చిరాకుపడుతున్నారు’’ ..గత కొద్ది రోజులుగా రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా ఆయన ప్రత్యర్థులు చేసిన ప్రచారం ఇది. ఇప్పుడు జూబ్లీహిల్స్‌ ఫలితం వెల్లడైంది. ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీ అనూహ్యంగా దాదాపు 51 శాతం ఓట్లు సాధించింది. దాదాపు 25 వేల ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌ విజయం సాధించారు. తనకు రాజకీయాల్లో లోతులు తెలియవని హేళన చేసిన వారికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ విజయం ద్వారా తానేమిటో సమాధానం చెప్పారు. బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ దాదాపుగా మట్టి కరచినా తెలంగాణలోని జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో భారీ మెజారిటీ సాధించడం ద్వారా రాజకీయాలు చేయడంలో తాను ఆరితేరానని రేవంత్‌రెడ్డి రుజువు చేసుకున్నారు. గత శాసనసభ ఎన్నికల్లో హైదరాబాద్‌ మహా నగరంలో కాంగ్రెస్‌ పార్టీ చతికిలపడిన విషయం తెలిసిందే. అంతకుముందు జరిగిన గ్రేటర్‌ మునిసిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓటు బ్యాంకు పది శాతం దిగువకు పడిపోయింది. పార్టీ కార్యకర్తలు చెల్లాచెదురయ్యారు. ఈ నేపథ్యంలో భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ మరణంతో వచ్చిన ఉప ఎన్నిక ముఖ్యమంత్రి నాయకత్వ పటిమకు అగ్నిపరీక్షగా మారింది. గోపీనాథ్‌ భార్యకు బీఆర్‌ఎస్‌ టికెట్‌ ఇచ్చినందున సానుభూతి కూడా తోడై ఆ పార్టీనే గెలుస్తుందని విశ్లేషకులు కూడా భావించారు. సంస్థాగతంగా బలహీనంగా ఉన్న కాంగ్రెస్‌ పార్టీకి ఓటమి తప్పదని, అదే జరిగితే పార్టీలో, ప్రభుత్వంలో రేవంత్‌రెడ్డి బలహీనపడతారని చాలా మంది భావించారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తనలోని రాజకీయ చతురతను ప్రదర్శించారు. ఎన్నికల షెడ్యూల్‌ వెలువడక ముందే మజ్లిస్‌ పార్టీతో అవగాహన కుదుర్చుకున్నారు. ఆ పార్టీ సూచన మేరకు నవీన్‌ యాదవ్‌కు పార్టీ టికెట్‌ ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్‌ అధిష్ఠానాన్ని ఒప్పించారు. జూబ్లీహిల్స్‌ అభ్యర్థి విషయమై మీడియాలో వచ్చిన ఊహాగానాలతో నిమిత్తం లేకుండా నవీన్‌ యాదవ్‌ అభ్యర్థిత్వాన్ని సైలెంట్‌గా చాలా ముందుగానే ఖరారు చేయించుకున్నారు.


ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడకముందే పార్టీ అభ్యర్థిని ఖరారు చేయించడం రేవంత్‌ సాధించిన తొలి విజయం. అధిష్ఠానం సూచన మేరకు క్షేత్ర స్థాయిలో పనిచేసుకోవలసిందిగా నవీన్‌ యాదవ్‌కు ముఖ్యమంత్రి సూచించారు. పార్టీలో చాలామందికి ఈ విషయం తెలియదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్‌ నుంచి పోటీ చేసిన అజారుద్దీన్‌ అడ్డుపడకుండా ఉండడం కోసం ఆయన్ను మంత్రివర్గంలోకి తీసుకోవడానికి అనుమతించాలని పార్టీ అధిష్ఠానానికి చెప్పి ఒప్పించుకున్నారు. తాము సూచించిన అభ్యర్థికే కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ ఇవ్వడంతో మజ్లిస్‌ పార్టీ ఈ ఎన్నికల్లో గట్టిగా పనిచేసింది. జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో ముస్లిం ఓటర్లు గణనీయంగా ఉన్న విషయం తెలిసిందే. అదే సమయంలో ఈ నియోజకవర్గంలో ఆంధ్రా మూలాలు ఉన్న ఓటర్లు కూడా చెప్పుకోదగిన సంఖ్యలో ఉన్నారు. దీంతో ఆ వర్గం ఓట్లపై ముఖ్యమంత్రి దృష్టి పెట్టారు. వారందరూ తెలుగుదేశం పార్టీ అభిమానులు అయినందున అటు నుంచి నరుక్కొచ్చారు. జగన్మోహన్‌రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబును జైల్లో పెట్టడాన్ని నిరసిస్తూ హైదరాబాద్‌లో తెలుగుదేశం పార్టీ అభిమానులు ప్రదర్శన నిర్వహించినప్పుడు అప్పటి మంత్రి కేటీఆర్‌ హేళనగా మాట్లాడడాన్ని రేవంత్‌రెడ్డి గుర్తుచేయించారు. బీఆర్‌ఎస్‌కు ఓటు వేస్తే జగన్‌రెడ్డికి బలం చేకూర్చినట్టేనని ఆంధ్రా మూలాలు ఉన్న ఓటర్లలో విస్తృతంగా ప్రచారం చేయించారు. తాను ముఖ్యమంత్రిననీ, ఉప ఎన్నిక కోసం ప్రచారం చేయడం ఏమిటి? అనీ భావించకుండా కాలికి బలపం కట్టుకుని విస్తృతంగా ప్రచారం చేశారు. మొత్తంగా సామ దాన భేద దండోపాయాలను ప్రయోగించి బీఆర్‌ఎస్‌ సీటును కాంగ్రెస్‌ ఖాతాలోకి వేసుకున్నారు. అది కూడా 25 వేల మెజారిటీతో! ప్రధాన రాజకీయ ప్రత్యర్థి అయిన బీఆర్‌ఎస్‌ అతి విశ్వాసంతో ఉండగా, ముఖ్యమంత్రి రేవంత్‌ మాత్రం గెలుపే లక్ష్యంగా పనిచేశారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలను కార్యక్షేత్రంలో మోహరింపజేశారు. ఈ ఎన్నిక గెలవడం కష్టమని భావించిన మంత్రులు, ఇతరులకు కూడా తన సత్తా ఏమిటో రుజువు చేసి చూపారు.

కాంగ్రెస్‌ అధిష్ఠానం వద్ద రేవంత్‌రెడ్డి పరపతి పడిపోతోందని ప్రచారం చేసిన వారికి కూడా ఈ విజయంతో సమాధానం చెప్పారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందన్న ప్రచారం గత కొంత కాలంగా జోరుగా జరుగుతోంది. ఈ పరిస్థితులలో ఈ ఘన విజయం కాంగ్రెస్‌ పార్టీకి ఏమో గానీ, రేవంత్‌రెడ్డి ప్రతిష్ఠ అమాంతం పెరగడానికి దోహదం చేసింది. ఇటు ప్రభుత్వంలో, అటు పార్టీలో రేవంత్‌ పట్టు సడలుతోందన్న అభిప్రాయం కూడా ఈ మధ్య కాలంలో బలంగా వినిపించింది. వైఎస్‌ రాజశేఖరరెడ్డి వలె రేవంత్‌రెడ్డి పార్టీ పైనా, ప్రభుత్వం పైనా పట్టు సాధించలేకపోయారన్న అభిప్రాయం కూడా వ్యాపించింది. నిజానికి రాజశేఖరరెడ్డి నాటి పరిస్థితులు వేరు.. ఇప్పటి పరిస్థితులు వేరు. అప్పట్లో కాంగ్రెస్‌ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది. జాతీయ స్థాయిలో పార్టీ బలంగా ఉంది. కేంద్రంలో అధికారంలో ఉన్నందున పార్టీ అధిష్ఠానం మాటకు తిరుగులేకుండా ఉండేది. దీంతో అధిష్ఠానం ఆశీస్సులతో రాజశేఖరరెడ్డి బలంగా ఎదిగారు. ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి అందరికీ తెలిసిందే. పదకొండున్నరేళ్లుగా కేంద్రంలో అధికారానికి దూరంగా ఉంది. రెండు మూడు రాష్ట్రాలు మినహా అన్నిచోట్లా అధికారాన్ని కోల్పోయింది. పార్టీ అధిష్ఠానానికే దశా దిశా లేకుండా పోయింది. అధిష్ఠానాన్ని లెక్క చేసే స్థితిలో రాష్ట్రాల నాయకులు లేరు. బిహార్‌ ఫలితాల తర్వాత కాంగ్రెస్‌ పరిస్థితి మరింత దీనంగా మారే అవకాశాలు లేకపోలేదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీలోకి కొత్తగా వచ్చి ముఖ్యమంత్రి అయిన రేవంత్‌రెడ్డి పార్టీపైనా, ప్రభుత్వంపైనా పట్టు సాధించడం ఆషామాషీ విషయం కాదు. ఆయన ముఖ్యమంత్రి కావడమే పెద్ద విజయం. ఈ రెండేళ్లుగా తనను ఎవరు ఎన్ని విధాలుగా విమర్శించినా, హేళన చేసినా రేవంత్‌రెడ్డి ఆవేశపడలేదు. అవకాశం కోసం ఎదురుచూస్తూ వచ్చారు. జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక రూపంలో ఆయనకు ఆ అవకాశం వచ్చింది. ఆత్మవిశ్వాసంతో అడుగులు వేశారు. పదునైన వ్యూహ రచనతో విజయాన్ని అందుకున్నారు.


ఇంతింతై.. వటుడింతై..

నిజానికి జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక ఫలితంతో రాష్ట్ర రాజకీయాలలో గానీ, ప్రజల జీవితాలలో గానీ ఇప్పటికిప్పుడు వచ్చే గుణాత్మకమైన మార్పులు ఏమీ ఉండవు. అయితే రేవంత్‌రెడ్డికి మాత్రం ఈ విజయం ఎంతో ముఖ్యం. తాను బలహీన ముఖ్యమంత్రి అని ఎద్దేవా చేస్తున్న వారికి దీటైన జవాబు చెప్పే అవకాశం ఆయనకు లభించింది. ఇంతింతై వటుడింతై అన్నట్టుగా రాజకీయాలలో మరింత ఎత్తుకు ఎదగడానికి ఆయనకు ఈ విజయం అవసరం. పార్టీలోనే ఒక వర్గం ఆశలు వదులుకున్న సీటును భారీ మెజారిటీతో గెలుచుకోవడం ద్వారా పార్టీ అధిష్ఠానం వద్ద కూడా ముఖ్యమంత్రి ప్రతిష్ఠ అమాంతం పెరుగుతుంది. అపాయింట్‌మెంట్‌ ఇవ్వడానికి కూడా పార్టీ అధిష్ఠానం ఇష్టపడటం లేదన్న ప్రచారం నిజమే అనుకుందాం. ఈ ఫలితం తర్వాత పార్టీ అధిష్ఠానం రేవంత్‌రెడ్డిని కాదనుకోగలదా? ‘‘సోనియాగాంధీ అపాయింట్‌మెంట్‌ కుదరదు.. జూబ్లీహిల్స్‌ ఫలితం తర్వాత చూద్దాం’’ అని కేసీ వేణుగోపాల్‌ ముఖ్యమంత్రిని ఉద్దేశించి కసురుకున్నట్టుగా కేసీఆర్‌ సొంత మీడియాలో రాసుకొని మురుసుకున్నారు. అయితే వారి ఆనందం ఎంతోసేపు నిలవలేదు. శుక్రవారం మధ్యాహ్నానికల్లా ఫలితం వచ్చింది. ఈ దశలో రేవంత్‌ను చిన్న చూపు చూడగలరా? బిహార్‌ ఫలితాల తర్వాత కాంగ్రెస్‌ అధిష్ఠానం పైనే ఆ పార్టీ నాయకులు, శ్రేణులకు నమ్మకం పోయే పరిస్థితి ఏర్పడింది. జూబ్లీహిల్స్‌లో ఓడిపోయి ఉంటే రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కూలిపోయి ఉండేదని చెప్పలేం. కాకపోతే పార్టీలో, ప్రభుత్వంలో ఆయన పరిస్థితి మరింత బలహీనపడేది. పార్టీలోని ఆయన ప్రత్యర్థులు కూడా జూలు విదిలించేవారు. ఇప్పుడు ముఖ్యమంత్రికి ఆ బెడద లేదు. రేవంత్‌రెడ్డి అల్లాటప్పాగా గాలికి కొట్టుకొచ్చిన ముఖ్యమంత్రి కాదు.. శక్తివంతమైన నాయకుడు అని తనను అందరూ గుర్తించేలా ఆయన చేసుకోగలిగారు. ఒక్క మాటలో చెప్పాలంటే రేవంత్‌రెడ్డి నాయకత్వానికి ఇటు ప్రభుత్వంలో, అటు పార్టీలో ఇప్పట్లో తిరుగుండదు. ప్రభుత్వంలోనే కాదు.. పార్టీలోనూ క్రమశిక్షణ నెలకొల్పే శక్తి రేవంత్‌రెడ్డికి ఇప్పుడు లభిస్తుంది. అధిష్ఠానం వద్ద ఆయన మాటే చెల్లుబాటవుతుంది. కాంగ్రెస్‌ పార్టీ మహా అయితే ఐదారు వేల కంటే మెజారిటీ దాటదని విశ్లేషకులు కూడా భావించారు. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి జూబ్లీహిల్స్‌లో వచ్చిన ఓట్లు 35 శాతం మాత్రమే. అప్పుడు బీఆర్‌ఎస్‌కు దాదాపు 44 శాతం ఓట్లు వచ్చాయి. అంటే, కాంగ్రెస్‌ కంటే దాదాపు 9 శాతం అధికం. గత ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి 14 శాతం పైగా ఓట్లు వచ్చాయి. ఇప్పుడు 9 శాతంలోపే. ఈసారి బీజేపీ డిపాజిట్‌ కూడా కోల్పోయింది. 2023 ఎన్నికలతో పోల్చితే కాంగ్రెస్‌ పార్టీకి దాదాపు పదహారు శాతం ఓట్లు అధికంగా వచ్చాయి. అప్పటితో పోలిస్తే బీఆర్‌ఎస్‌, బీజేపీలకు కలిపి 11 శాతం ఓట్లు తగ్గాయి. ఇవన్నీ కాంగ్రెస్‌కు బదిలీ అయ్యాయని భావించాలి. గత ఎన్నికల్లో మజ్లిస్‌ పోటీ చేయగా, ఇప్పుడు ఆ పార్టీ కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించింది. దీంతో మరో ఐదు శాతం ఓట్లు కాంగ్రెస్‌కు కలసి వచ్చాయి. అధికారంలో ఉన్న పార్టీలకు ఉప ఎన్నికల్లో కొన్ని అనుకూలతలు ఉంటాయి. వాటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్నప్పటికీ కాంగ్రెస్‌ పార్టీకి 51 శాతం ఓట్లు లభించడం విశేషమే అని అంగీకరించాలి. ఉప ఎన్నికల్లో అధికార పార్టీకి ఐదు శాతం వరకు అనుకూలతల వల్ల లబ్ధి చేకూరుతుంది. కాంగ్రెస్‌కు 16 శాతం వరకు పెరిగినందున ఆ విజయాన్ని గుర్తించవలసిందే. రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని భావిస్తున్న భారతీయ జనతా పార్టీ జూబ్లీహిల్స్‌లో డిపాజిట్‌ కోల్పోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. గత ఎన్నికల్లో వచ్చిన ఓట్లలో ఐదు శాతం వరకు తగ్గిపోవడం ఏమిటి? బీజేపీ ఈ దుస్థితికి అంతర్గత కలహాలు ప్రధాన కారణమని భావించవచ్చు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మినహా మిగతా పార్టీ ముఖ్యులు ఎవరూ ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొనలేదు. కొందరు ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా ముఖం చాటేశారు.


బిహార్‌ ఎన్నికల్లో అంచనాలకు మించి స్వీప్‌ చేసిన బీజేపీకి తెలంగాణలో ఈ పరిస్థితి ఎందుకు ఏర్పడిందో ఆ పార్టీ అధిష్ఠానం ఆలోచించుకోవాలి. ఉత్తరాదిన తిరుగులేని శక్తిగా ఎదిగిన బీజేపీ దక్షిణాదిలో ఎందుకు ఆపసోపాలు పడుతోందో ఆలోచించుకోవాలి. ఉత్తరాది ప్రజల నాడిని దొరకపుచ్చుకున్న మోదీ–షా ద్వయం దక్షిణాది జన నాడిని ఎందుకు అందుకోలేకపోతున్నారో ఆత్మపరిశీలన చేసుకోవాలి. బీజేపీకి దక్షిణాదిన చోటు దొరకని విషయం అటుంచితే కాంగ్రెస్‌ పార్టీకి ఉత్తరాదిన పట్టుచిక్కడం లేదు. దక్షిణాది ప్రజల ఆశీస్సులు అడపాదడపా అయినా పొందుతున్న కాంగ్రెస్‌ పార్టీ, ఉత్తరాది ప్రజలకు ఎందుకు దూరమైందో ఆత్మపరిశీలన చేసుకోవాలి. దక్షిణాదిన బీజేపీకి పట్టు దొరకనప్పటికీ కేంద్రంలో ఆ పార్టీకి మద్దతు ఇచ్చే పార్టీలకు కొదవ లేదు. కాంగ్రెస్‌ పార్టీకి ఆ అవకాశం కూడా లేదు. బిహార్‌ ఫలితాలు చూశాక ఇండియా కూటమిలోని పార్టీలు కూడా కాంగ్రెస్‌కు దూరం కావొచ్చు. కాంగ్రెస్‌ పార్టీ బతికి బట్టకట్టాలంటే, ఆ పార్టీకి కాదు.. ఆ పార్టీ అధిష్ఠానానికి కాయకల్ప చికిత్స జరగాలి. కళ్ల ఎదురుగా పతనమైన పార్టీల నినాదాలు, విధానాలను అందిపుచ్చుకోవడమే ఆ పార్టీ అధిష్ఠానం చేస్తున్న ఘోర తప్పిదం. కాంగ్రెస్‌ నాయకత్వ వైఖరిలో మార్పు రానంత వరకు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వానికి తిరుగుండదు. ఆయన అంతట ఆయనకు విసుగు వచ్చి ప్రధానమంత్రి పదవి నుంచి తప్పుకొంటే తప్ప మోదీని సమీప భవిష్యత్తులో కాంగ్రెస్‌ పార్టీ గానీ, మరొక పార్టీ గానీ ఓడించలేదు. మహాభారతంలో భీష్ముడికి తన చావుకు తానే ముహూర్తం పెట్టుకొనే వరం ఉన్నట్టుగా వర్తమాన రాజకీయాలలో నరేంద్ర మోదీ కూడా పదవీ విరమణ ఎప్పుడు చేయాలి అన్నది తానే నిర్ణయించుకొనే విధంగా అలాంటి వరమే పొందారేమో!

ఇంకా భ్రమల్లోనే..

ఇప్పుడు మళ్లీ జూబ్లీహిల్స్‌ ఎన్నికల విషయానికి వద్దాం. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా తామే అధికారంలోకి వస్తామన్న అతి విశ్వాసంతో ఉన్న బీఆర్‌ఎస్‌కు ఈ ఫలితం అశనిపాతమే! ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని బీఆర్‌ఎస్‌ నాయకులు, ముఖ్యంగా కేటీఆర్‌ తక్కువగా అంచనా వేశారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రిని కేటీఆర్‌ తరచుగా కించపరుస్తూ రెచ్చగొట్టారు. రాజకీయంగా ఉండాల్సిన వైరాన్ని వ్యక్తిగత వైరంగా మార్చారు. రేవంత్‌రెడ్డిని ముఖ్యమంత్రిగా గుర్తించడానికి కూడా కేటీఆర్‌ నిరాకరిస్తున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ప్రజల్లో అంతులేని వ్యతిరేకత నిజమే అయితే జూబ్లీహిల్స్‌లో 51 శాతం ఓట్లు రావడం ఎలా సాధ్యం అని బీఆర్‌ఎస్‌ నాయకులు ఆత్మపరిశీలన చేసుకోవాలి. ప్రభుత్వంపై ప్రజాభిప్రాయం ఎలా ఉంది? అన్న విషయం పక్కనపెడితే, కేసీఆర్‌ కుటుంబం ఇంకా నేల మీదకు దిగి రాలేదన్న అభిప్రాయం మాత్రం ప్రజల్లో ఉంది. కేసీఆర్‌ ఆరోగ్యం కొంత దెబ్బతిని ఉన్నందున పార్టీలో అంతా తానే అన్నట్టుగా గత రెండేళ్లుగా కేటీఆర్‌ వ్యవహరిస్తున్నారు. అయినా ప్రజల అభిమానాన్ని మాత్రం ఆయన చూరగొనలేకపోతున్నారు. కేటీఆర్‌లో ఇంకా అహంభావం ఛాయలు పోలేదని ప్రజలు అనుకుంటున్నారు. మరుగుజ్జు లాంటి నాయకులను చుట్టూ పెట్టుకుని కాబోయే ముఖ్యమంత్రిని తానేనని ఆయన భ్రమల్లో బతుకుతున్నారు. చుట్టూ ఉన్నవాళ్లు హై హై నాయకా అంటూ చిడతలు కొడుతున్నారు. అదే నిజమని కేటీఆర్‌ నమ్ముతున్నారు.


పోలింగ్‌కు ముందు వరకు పరిస్థితి తమకే అనుకూలంగా ఉందని, చివరి మూడు రోజుల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడటంతో ఓడిపోయామని ఆయన చెప్పుకొచ్చారు. అదే నిజం అనుకుందాం. 2014–2023 మధ్య అధికారంలో ఉన్నప్పుడు జరిగిన ఉప ఎన్నికల సందర్భంగా బీఆర్‌ఎస్‌ అధికార దుర్వినియోగానికి పాల్పడలేదా? ఓటర్లకు డబ్బు పంచలేదా? ‘జో జీతా వహీ సికందర్‌’ అని అంటారు. ఎలా గెలిచామన్నది కాదు, ఎన్నికల్లో గెలిచామా లేదా అన్నదే ముఖ్యం అని కేటీఆర్‌కు తెలియదా? 2023 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత జరిగిన ఏ ఎన్నికల్లో కూడా బీఆర్‌ఎస్‌ గెలవలేదు. పార్లమెంటు ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాలేదు. కొన్నిచోట్ల పోటీ కూడా చేయలేదు. ఇప్పుడు జూబ్లీహిల్స్‌ ఎన్నిక. కర్మ మనల్ని వెంటాడుతుందని కేటీఆర్‌ సొంత చెల్లి కవిత తాజాగా వ్యాఖ్యానించారు. గతంలో అహంభావంతో వ్యవహరించినందునే ఇప్పటి దుస్థితి అని తెలుసుకోకుండా ఇప్పటికీ ‘‘త్వరలోనే అధికారంలోకి వస్తాం, మీ సంగతి తేలుస్తాం’’ అని బీరాలు పోవడం ఏమిటి? ఆంధ్రప్రదేశ్‌లో తాము అభిమానించే జగన్‌రెడ్డికి పట్టిన గతి చూసి కూడా కేసీఆర్‌ కుటుంబం తమ వైఖరి మార్చుకోకపోవడం ఆశ్చర్యంగా ఉంది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ సొంతంగా పోటీ చేసి సీట్లు గెలుచుకోలేకపోవచ్చు. కానీ ఆ పార్టీకి పలు నియోజకవర్గాలలో గణనీయంగా ఓట్లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబును అవమానించినా, ఆయనకు రాజకీయంగా నష్టం చేయాలనుకున్నా ఆ పని చేసిన వారికి ఈ వర్గం ఓటర్లందరూ వ్యతిరేకం అవుతారు. ఈ విషయం తెలిసి కూడా కేసీఆర్‌ కుటుంబం జగన్‌రెడ్డే మాకు ముద్దు అని భావించడం వింతగా ఉంది. గత ఎన్నికల్లో జూబ్లీహిల్స్‌లో 16 వేల ఓట్ల మెజారిటీతో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మాగంటి గోపీనాథ్‌ గెలవడానికి ఆంధ్రా మూలాలు ఉన్న ఓటర్లు కారణం కాదా? కేసీఆర్‌ అండ్‌ కో జగన్‌రెడ్డితో అంటకాగడం వల్ల ఈ వర్గం ఓటర్లు అందరూ బీఆర్‌ఎస్‌కు దూరమయ్యారు. అయినా జగన్‌రెడ్డే మాకు ముఖ్యం అని కేసీఆర్‌ అండ్‌ కో అనుకుంటున్నారు. ఇది గమనించిన రేవంత్‌రెడ్డి ఉప ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ గెలిస్తే జగన్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్‌లో బలపడతారని తెలుగుదేశం ఓటర్లకు నచ్చజెప్పి తన వైపునకు తిప్పుకొన్నారు. ఈ వర్గం ఓట్లతో పాటు ముస్లింలు కూడా ఇప్పుడు బీఆర్‌ఎస్‌కు దూరమయ్యారు. భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి బీఆర్‌ఎస్‌ సిద్ధపడిందని కేసీఆర్‌ కుమార్తె కవిత బహిరంగంగా చెప్పిన తర్వాత ముస్లింలు బీఆర్‌ఎస్‌కు దూరమయ్యారు. ఒకవైపు తెలుగుదేశం ఓటర్లు, మరోవైపు ముస్లింలు దూరమవడం వల్ల దాదాపు 50కి పైగా నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌కు దెబ్బపడుతుంది. అయినా ఆ పార్టీ నాయకత్వం తమ విధానాలను సమీక్షించుకోవడానికి సిద్ధంగా లేదు. అదే సమయంలో వాపును చూసి బలుపు అనుకుంటోంది. అధికారంలో ఉన్నప్పుడు వెనకేసుకున్న సొమ్ముతో యూట్యూబ్‌ చానళ్లు పెట్టించి, వాటిల్లో అనుకూలంగా ప్రచారం చేయించుకుంటూ అదే నిజమని కేటీఆర్‌ భ్రమల్లో బతుకుతున్నారు. ప్రస్తుత ఉప ఎన్నిక సందర్భంగా కూడా బీఆర్‌ఎస్‌ అనుకూల సోషల్‌ మీడియా వేదికలు ఊదరగొట్టాయి. అయినా ప్రయోజనం కలగలేదు. మీడియా అయినా, సోషల్‌ మీడియా అయినా రాజకీయ పార్టీలకు కొంత నష్టం చేయగలవే గానీ, ఎన్నికల్లో ఏదో ఒక పార్టీని గెలిపించలేవు. ప్రజలకు అన్నీ తెలుసు. ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌రెడ్డి కూడా సోషల్‌ మీడియా వారియర్స్‌ను నమ్ముకొని పదకొండు సీట్లకు పరిమితం అయ్యారు. కేటీఆర్‌ ఇదే వైఖరితో ఉంటే భవిష్యత్తులో కూడా ఫలితాలు ఇంతకు భిన్నంగా ఉంటాయని భావించలేం. కేసీఆర్‌ ఆరోగ్యంగా ఉన్నంత వరకు బీఆర్‌ఎస్‌ మనుగడకు ఢోకా ఉండదు. ఏ కారణం వల్లనైనా కేసీఆర్‌ క్రియాశీలంగా వ్యవహరించలేకపోతే బీఆర్‌ఎస్‌ పరిస్థితి ఏమిటి? అన్నది ఇప్పుడు ఆ పార్టీ శ్రేణులను వేధిస్తున్నది. దేనికైనా కాలమే సమాధానం చెబుతుంది. కవిత అన్నట్టుగా బీఆర్‌ఎస్‌ను, ముఖ్యంగా కేటీఆర్‌ను కర్మ వెంటాడుతోందని ప్రస్తుతానికి సరిపెట్టుకుందాం.


ఇక జనాభిమానమే టార్గెట్‌!

ఇప్పుడు మళ్లీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విషయానికి వద్దాం. ఇల్లు అలకగానే పండగ కాదు. ఒక ఉప ఎన్నికను సర్వశక్తులూ ఒడ్డి గెలవొచ్చు గాక. అంత మాత్రాన అంతా పచ్చగా ఉందని భావిస్తే పప్పులో కాలేసినట్టే. రాజకీయ పరీక్షలో ప్రస్తుతానికి రేవంత్‌రెడ్డి పాసయ్యారు. ఇకపై జనాభిమానాన్ని చూరగొనడానికి ఆయన ప్రయత్నించాలి. ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వసనీయత పెంచేలా ఆయన వెంటనే చర్యలు తీసుకోవాలి. పార్టీలో క్రమశిక్షణ నెలకొల్పడానికి ఇంతకంటే మంచి అవకాశం మళ్లీ ఆయనకు లభించదు. ప్రస్తుత పరిస్థితులలో కాంగ్రెస్‌ అధిష్ఠానం కూడా రేవంత్‌రెడ్డికి స్వేచ్ఛ ఇవ్వొచ్చు. ఈ రెండేళ్ల పాలనలో మంచి చెడులను ఆయన ఇప్పుడు సమీక్షించుకోవాలి. హైదరాబాద్‌ మహానగరంలో మధ్య తరగతి, ఆపై వర్గాల ప్రజల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉంది. గణనీయమైన సంఖ్యలో అసెంబ్లీ సీట్లు ఉన్న హైదరాబాద్‌ ప్రజల మనసు గెలుచుకోవడంపై ఆయన దృష్టి పెట్టాలి. ఉప ఎన్నిక అంటే పార్టీ యంత్రాంగం అంతా మోహరిస్తుంది. సాధారణ ఎన్నికల్లో అలా చేయడం సాధ్యం కాదు. వనరులు కూడా అంతంత మాత్రంగానే ఉంటాయి. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రభుత్వంపై కొంత వ్యతిరేకత ఉంది. సాధారణ ఎన్నికలకు ఇంకా మూడేళ్ల వ్యవధి ఉన్నందున ఈ పరిస్థితిని అధిగమించడానికి అవకాశం లేకపోలేదు. హైదరాబాద్‌లో జూబ్లీహిల్స్‌ వంటి స్థానాన్ని గెలుచుకోగలిగిన ముఖ్యమంత్రికి రాష్ట్రంలోని మిగతా నియోజకవర్గాల ప్రజల మనోగతం తెలియదని అనుకోలేం. ఇప్పుడు పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ తన స్థానం పటిష్ఠం అయినందున ప్రజల్లో ఫీల్‌ గుడ్‌ భావన కల్పించడానికి తీసుకోవలసిన చర్యలపై ముఖ్యమంత్రి దృష్టిసారించాలి. చంద్రబాబు, రాజశేఖరరెడ్డి, కేసీఆర్‌ రాజకీయాలు చూసి ఎదిగిన రేవంత్‌రెడ్డికి రాజకీయాల్లోని లోతులు గురించి వేరేవాళ్లు చెప్పాల్సిన అవసరం ఉంటుందనుకోకూడదు. ప్రస్తుతానికి ముఖ్యమంత్రికి బెస్టాఫ్‌ లక్‌ చెబుదాం. జూబ్లీహిల్స్‌లో లభించిన విజయంతో మరింత మెరుగైన పాలన అందిస్తారని ఆశిద్దాం!

ఆర్కే


222-ed.jpg

యూట్యూబ్‌లో

‘కొత్త పలుకు’ కోసం

QR Code

scan

చేయండి

ఇవి కూడా చదవండి..

బిహార్ గెలుపును సాకారం చేసిన MY ఫార్ములా

ఓటమితో విచారం, విజయంతో అహంకారం ఉండదు.. తొలిసారి స్పందించిన ఆర్జేడీ

మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి.

Updated Date - Nov 16 , 2025 | 07:17 AM