Share News

Telangana Politics: మార్చే యత్నం.. మారిన సీఎం

ABN , Publish Date - Jun 29 , 2025 | 03:18 AM

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిలో మార్పు కనిపిస్తోంది. ఏడాదిన్నర క్రితం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన ఇంత కాలంగా అనేక సందర్భాలలో టేకిట్‌ ఈజీ ధోరణి ప్రదర్శించారు. సహచర మంత్రులతో స్నేహపూర్వకంగా వ్యవహరించారు.

 Telangana Politics: మార్చే యత్నం.. మారిన సీఎం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిలో మార్పు కనిపిస్తోంది. మంత్రులతో నిర్మొహమాటంగా వ్యవహరిస్తున్నట్టు చెబుతున్నారు. పార్టీ సమావేశాల్లో కూడా తన మనసులోని మాటను సూటిగా చెబుతున్నారు. ముఖ్యమంత్రిగా ఆయా శాఖల పనితీరుపై సమీక్షలు మొదలెట్టారు. అదే సమయంలో మంత్రులు తమ పనితీరును మెరుగుపరచుకోవాలని, స్థానిక ఎన్నికల్లో పార్టీని గెలిపించాల్సిన బాధ్యత మంత్రులపైనే ఉంటుందని స్పష్టంచేస్తున్నారు.

..కొంత మంది మంత్రులు, నాయకులు పార్టీ అధిష్ఠానానికి ముఖ్యమంత్రిపై ఫిర్యాదులు చేయడం ఎక్కువైంది. పరిస్థితి ఎంత దూరం వెళ్లిందంటే, రేవంత్‌ రెడ్డి నాయకత్వాన్ని మార్చడం అవసరమని కాంగ్రెస్‌ అగ్రనాయకత్వం అభిప్రాయపడేలా చేశారు. ఆయన నాయకత్వంలో స్థానిక ఎన్నికలకు వెళ్లలేమని ఫిర్యాదు చేశారు. ఎన్నికల నాటితో పోలిస్తే కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణలో బలహీనపడిందని చెప్పుకొచ్చారు. దీంతో కాంగ్రెస్‌ అధిష్ఠానం కూడా అలవాటు ప్రకారం అసంతృప్తులనే ప్రోత్సహించింది.

...నాయకత్వంలో లోపాలు గుర్తిస్తే వాటిని సరిదిద్దుకోవడానికి సలహాలు, సూచనలు ఇవ్వాలి గానీ ఏకంగా నాయకత్వాన్నే మార్చాలనుకోవడం ఆత్మహత్యాసదృశం అవుతుందని క్షేత్ర స్థాయి నుంచి కూడా పార్టీ అధిష్ఠానానికి అభిప్రాయాలు అందాయి. దీంతో రేవంత్‌ రెడ్డి నాయకత్వాన్ని మార్చాలన్న అభిప్రాయానికి పార్టీ అధిష్ఠానం స్వస్తి చెప్పింది.

కేసీఆర్‌ హయాంలో విచ్చలవిడిగా వేల సంఖ్యలో ప్రత్యర్థుల ఫోన్లను దొంగచాటుగా, అక్రమంగా విన్నప్పటికీ కేసీఆర్‌ ఓటమి నుంచి తప్పించుకోలేకపోయారు. ఇక నాకు సంబంధించినంత వరకు రెండేళ్ల కాల్‌ డేటా తెప్పించుకున్నారు. ఇది అమలులో ఉన్న చట్టాలు, నిబంధనలకు విరుద్ధం. మావోయిస్టులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించిన వారి జాబితాలో నా నంబర్‌ చేర్చారు. నా ఫోన్‌ మాత్రమే కాదు, మరికొందరు మీడియా యజమానుల ఫోన్లనూ ట్యాప్‌ చేశారు.

ఫోన్‌ ట్యాపింగ్‌లో బాధితులకు న్యాయం జరగాలన్నా, నిందితులకు శిక్ష పడాలన్నా సుప్రీం పర్యవేక్షణలో దర్యాప్తు చేయాలి. ఈ అరాచకానికి కర్త, కర్మ, క్రియ నాటి సీఎం కేసీఆర్‌ అన్నది అందరికీ తెలిసిందే. కేసీఆర్‌ అండ్‌ కో సేఫ్‌ గా ఉంటారా? జైలుకు వెళతారా? అన్నది కాలమే చెప్పాలి!


తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిలో మార్పు కనిపిస్తోంది. ఏడాదిన్నర క్రితం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన ఇంత కాలంగా అనేక సందర్భాలలో టేకిట్‌ ఈజీ ధోరణి ప్రదర్శించారు. సహచర మంత్రులతో స్నేహపూర్వకంగా వ్యవహరించారు. మంత్రులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. ఈ క్రమంలో పలువురు మంత్రులు, అధికారులు అదుపు తప్పారు. ఫలితంగా ముఖ్యమంత్రికి ప్రభుత్వంపై పట్టు రాలేదన్న విమర్శలు వినిపించాయి. దీంతో రేవంత్‌రెడ్డి ఇటీవలి కాలంలో మంత్రులు, శాసనసభ్యులతో కొంత నిర్మొహమాటంగా వ్యవహరించడం మొదలుపెట్టారు. పార్టీపై, ప్రభుత్వంపై పట్టు సాధించే ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ మార్పు అకస్మాత్తుగా వచ్చింది కాదు. ముఖ్యమంత్రిలో ఈ తెగింపు రావడానికి కారణం ఏమిటి? ముఖ్యమంత్రిగా తన స్థానం పదిలం చేసుకోవాలని ఎందుకు నిర్ణయించుకున్నారు? అన్న ప్రశ్నలు సహజంగానే తలెత్తుతాయి. ఆయనలో ఈ మార్పు రావడానికి సహచర మంత్రులతో పాటు సొంత పార్టీ నాయకులు, పార్టీ అధిష్ఠానం కూడా కారణమని స్పష్టమవుతోంది. ముఖ్యమంత్రిగా ఆయనకు తగినంత స్వేచ్ఛ ఇవ్వకుండా కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠానం ఇబ్బందులపాల్జేసింది. దీంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి, పార్టీ అధిష్ఠానానికి మధ్య అంతరం ఏర్పడిందన్న వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. కాంగ్రెస్‌ అగ్రనాయకుడు రాహుల్‌గాంధీ ఆయనకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వడం లేదన్న ప్రచారం కూడా జరిగింది. రేవంత్‌రెడ్డి ఢిల్లీలో ఉన్న సమయంలోనే రాహుల్‌గాంధీ ఆయనను కలుసుకోకుండా పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ను కలుసుకోవడం ఈ వార్తలకు బలం చేకూరింది. ఈ క్రమంలో పార్టీ అధిష్ఠానానికి మళ్లీ సన్నిహితం అవడానికి ఆయన తన వంతు ప్రయత్నం చేశారు. దీంతో కాంగ్రెస్‌ అధిష్ఠానం కొంత మెత్తబడింది. అయితే, అదే సమయంలో కొంత మంది మంత్రులు, నాయకులు పార్టీ అధిష్ఠానానికి ముఖ్యమంత్రిపై ఫిర్యాదులు చేయడం ఎక్కువైంది. పరిస్థితి ఎంత దూరం వెళ్లిందంటే, రేవంత్‌రెడ్డి నాయకత్వాన్ని మార్చడం అవసరమని కాంగ్రెస్‌ అగ్రనాయకత్వం అభిప్రాయపడేలా చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఫైర్‌ బ్రాండ్‌ లీడర్‌లా వ్యవహరించిన రేవంత్‌రెడ్డి, ముఖ్యమంత్రిగా ఆ స్థాయిలో వ్యవహరించకపోవడం వాస్తవం. ఇందుకు అనేక కారణాలున్నాయి.


వాటిలో ప్రధానమైనది కాంగ్రెస్‌ అధిష్ఠానమే. కాంగ్రెస్‌ సంస్కృతిని అవగాహన చేసుకోవడానికి ఆయనకు కొంత సమయం పట్టింది. ముఖ్యమంత్రిగా అనేక పరిమితుల మధ్య పనిచేయవలసి వచ్చింది. అయినా కాంగ్రెస్‌ అధిష్ఠానం మనసెరిగి వ్యవహరించడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆయన నాయకత్వ ప్రతిభపై నీలినీడలు కమ్ముకున్నాయి. ముఖ్యమంత్రిగా ఉండి కూడా కొంత మంది మంత్రుల శాఖల్లో జోక్యం చేసుకోలేని విధంగా పార్టీ అధిష్ఠానం ఆరంభంలోనే ఆంక్షలు విధించింది. రేవంత్‌రెడ్డి కూడా కొన్ని సందర్భాలలో తొందరపాటు ప్రదర్శించారు. అందరూ తనవాళ్లే అన్నట్టుగా తన మనసులోని అభిప్రాయాలను అందరి ముందూ బయటపెట్టేవారు. దీంతో పార్టీలోని రేవంత్‌రెడ్డి ప్రత్యర్థులు తమ వ్యూహాలకు పదునుపెట్టారు. రేవంత్‌రెడ్డి నాయకత్వాన్ని మార్చాల్సిన అవసరం ఉందని పార్టీ అధిష్ఠానానికి నూరిపోశారు. ఆయన నాయకత్వంలో స్థానిక ఎన్నికలకు వెళ్లలేమని ఫిర్యాదు చేశారు. ఎన్నికల నాటితో పోలిస్తే కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణలో బలహీనపడిందని చెప్పుకొచ్చారు. దీంతో కాంగ్రెస్‌ అధిష్ఠానం కూడా అలవాటు ప్రకారం అసంతృప్తులనే ప్రోత్సహించింది. ఒక దశలో రేవంత్‌రెడ్డి నాయకత్వాన్ని మార్చే విషయం కూడా పార్టీ అధిష్ఠానం పరిశీలించింది. ఈ అభిప్రాయానికి వచ్చిందే తడవుగా ఢిల్లీ పెద్దలు రంగంలోకి దిగి అత్యంత గోప్యంగా అభిప్రాయ సేకరణకు పూనుకున్నారు.ఎంపిక చేసిన కొంత మందికి, ముఖ్యంగా ఎన్నికలకు ముందు, ఆ తర్వాత ఇతర పార్టీల నుంచి వచ్చి కాంగ్రెస్‌లో చేరిన వారికి ఫోన్లు చేసి ముఖ్యమంత్రిని మారిస్తే ఎలా ఉంటుందంటూ ఆరా తీశారు. అయితే ఈ క్రమంలో కాంగ్రెస్‌ అధిష్ఠానానికి షాకింగ్‌ విషయాలు తెలిసొచ్చాయి. రాష్ట్ర నాయకత్వాన్ని మార్చాలన్న పిచ్చి ఆలోచన చేయొద్దు.. అలా చేస్తే ప్రభుత్వం నెల రోజుల్లోనే పతనమవుతుందని ఒక సీనియర్‌ ఎమ్మెల్యే కుండబద్దలు కొట్టారు. మారిస్తే ప్రభుత్వం ఒక్క రోజు కూడా మనుగడ సాగించలేదు అని మరో సీనియర్‌ నాయకుడు కూడా తేల్చిచెప్పారు. రేవంత్‌రెడ్డి నాయకత్వంపై నమ్మకంతోనే తాను ప్రతిపక్ష పార్టీ నుంచి గెలిచి కూడా కాంగ్రెస్‌లో చేరానని, రేవంత్‌రెడ్డే లేకపోతే మేం ఈ పార్టీలో ఎందుకుంటామని మరో ఎమ్మెల్యే స్పష్టంచేశారు.


నాయకత్వంలో లోపాలు గుర్తిస్తే వాటిని సరిదిద్దుకోవడానికి సలహాలు, సూచనలు ఇవ్వాలి గానీ ఏకంగా నాయకత్వాన్నే మార్చాలనుకోవడం ఆత్మహత్యాసదృశం అవుతుందని క్షేత్ర స్థాయి నుంచి కూడా పార్టీ అధిష్ఠానానికి అభిప్రాయాలు అందాయి. దీంతో రేవంత్‌రెడ్డి నాయకత్వాన్ని మార్చాలన్న అభిప్రాయానికి పార్టీ అధిష్ఠానం స్వస్తి చెప్పింది. ఈ విషయం ముఖ్యమంత్రికి తెలుసో లేదో తెలియదు గానీ ఆయన మాత్రం గేరు మార్చాలన్న నిర్ణయానికి వచ్చారు. ఇటీవలి కాలంలో ఆయనలో ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. మంత్రులతో నిర్మొహమాటంగా వ్యవహరిస్తున్నట్టు చెబుతున్నారు. పార్టీ సమావేశాల్లో కూడా తన మనసులోని మాటను నిర్మొహమాటంగా చెబుతున్నారు. ముఖ్యమంత్రిగా ఆయా శాఖల పనితీరుపై సమీక్షలు మొదలెట్టారు. అదే సమయంలో మంత్రులు తమ పనితీరును మెరుగుపరచుకోవాలని, స్థానిక ఎన్నికల్లో పార్టీని గెలిపించాల్సిన బాధ్యత ఎక్కడికక్కడ మంత్రులపైనే ఉంటుందని స్పష్టంచేస్తున్నారు. విధానపరమైన ప్రకటనలను మంత్రులు తమంతట తాము చేయకుండా పీసీసీ అధ్యక్షుడి ద్వారా కట్టడి చేయించారు. ముఖ్యమంత్రి అనుమతి లేకుండా మంత్రులు విధానపరమైన ప్రకటనలు చేయకూడదని ఆంక్షలు విధించారు. అదే సమయంలో పార్టీ అధిష్ఠానం ఆలోచనలతో సంబంధం లేకుండా తన మానాన తాను పనిచేసుకుపోవాలన్న నిర్ణయానికి ముఖ్యమంత్రి వచ్చినట్టుగా కనిపిస్తోంది. పార్టీపైన, ప్రభుత్వంపైన పట్టు పెంచుకుంటే తన నాయకత్వానికి ఢోకా ఉండదన్న అభిప్రాయానికి రేవంత్‌ వచ్చారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీ, ప్రభుత్వ వ్యవహారాల్లో ఆయన స్పీడ్‌ పెంచారు. తదుపరి దశలో మంత్రులను కట్టడి చేయడంపై ముఖ్యమంత్రి దృష్టిపెడతారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.


ప్చ్‌.. అధిష్ఠానం తీరంతే!

రేవంత్‌రెడ్డి విషయం అలా ఉంచితే, జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌ పార్టీ ఏమీ మారలేదని ఈ పరిణామాలతో స్పష్టమవుతోంది. పుష్కర కాలం క్రితం కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు ప్రదర్శించిన పెత్తందారీ పోకడలనే ఇప్పుడూ ప్రదర్శిస్తోంది. నిజానికి ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీ జాతీయ స్థాయిలో కుంచించుకుపోయింది. పలు రాష్ర్టాలలో ఆ పార్టీకి ఉనికి లేదు. సమీప భవిష్యత్తులో కేంద్రంలో అధికారంలోకి వస్తుందన్న విశ్వాసం కాంగ్రెస్‌ శ్రేణుల్లో నానాటికీ సన్నగిల్లుతోంది. ప్రధాని మోదీ రాజకీయం ముందు ఆ పార్టీ నిలబడలేకపోతోంది. ప్రస్తుతం కర్ణాటక, తెలంగాణ, హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ర్టాలలో మాత్రమే కాంగ్రెస్‌ అధికారంలో ఉంది. అది కూడా స్థానికంగా బలమైన నాయకులు ఉండటం వల్లనే అక్కడ పార్టీ అధికారంలోకి రాగలిగింది. కర్ణాటకలో అధికారంలోకి రావడానికి భారతీయ జనతా పార్టీ యడియూరప్పను దూరం పెట్టడం ఎంత కారణమో, కాంగ్రెస్‌ సిద్దరామయ్య నాయకత్వంలో ఉండటం కూడా అంత కారణం. తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడానికి రేవంత్‌రెడ్డే ప్రధాన కారణం. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ నియంతృత్వ పోకడలతో తెలంగాణ ప్రజలు విసుగు చెందారు. అయితే కాంగ్రెస్‌– బీజేపీలో ప్రత్యామ్నాయ పార్టీగా దేన్ని ఎంచుకోవాలో తేల్చుకోలేని స్థితిలో తెలంగాణ సమాజం ఉండింది. ఈ దశలో కాంగ్రెస్‌ నాయకత్వ పగ్గాలు చేపట్టిన రేవంత్‌రెడ్డి రాజకీయంగా విజృంభించారు. అదే సమయంలో బీజేపీ రాష్ట్ర నాయకత్వం మారడం కూడా కాంగ్రెస్‌కు లాభించింది. ముఖ్యమంత్రి పదవి చేపట్టాలన్న తన లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇదే అదనుగా భావించిన రేవంత్‌రెడ్డి ఎన్నికల్లో అమీతుమీకి సిద్ధపడ్డారు. ఎన్నికల ఖర్చు కోసం అందినచోటల్లా అప్పులు చేశారు. కాంగ్రెస్‌ పార్టీ సంస్కృతికి ఆయన కొత్త అయినప్పటికీ ఎన్నికల్లో పార్టీ విజయం కోసం ఒంటి చేత్తో పోరాడారు. ప్రజలు కూడా కేసీఆర్‌కు ప్రత్యామ్నాయాన్ని రేవంత్‌రెడ్డిలో చూసుకున్నారు. ఫలితంగా ఏడాదిన్నర క్రితం జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి 65 స్థానాలు లభించాయి. అభ్యర్థుల ఎంపికలో పార్టీ అధిష్ఠానం ఒత్తిళ్లకు తలొగ్గకుండా ఉండి వుంటే కాంగ్రెస్‌ పార్టీకి 70కి పైగా సీట్లు లభించి ఉండేవి.


కాంగ్రెస్‌ విజయం సాధిస్తే రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అవుతారన్న అభిప్రాయం సర్వత్రా వ్యాపించింది. అయినా ముఖ్యమంత్రి ఎంపికపై కాంగ్రెస్‌ లెజిస్లేచర్‌ పార్టీ అభిప్రాయాలు సేకరించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి పదవి కోసం పోటీపడిన ఒకరిద్దరితో పాటు, వారికి మద్దతు ప్రకటించిన ఐదారుగురిని మినహాయిస్తే మిగతా వారందరూ రేవంత్‌రెడ్డి నాయకత్వాన్ని బలపరిచారు. 2004లో వైఎస్‌ రాజశేఖరరెడ్డికి ఎటువంటి అనుకూల వాతావరణం ఉందో రేవంత్‌రెడ్డికి కూడా అటువంటి సానుకూల పరిస్థితి వచ్చింది. అయినా ముఖ్యమంత్రి ఎంపికలో కాంగ్రెస్‌ అధిష్ఠానం కొద్దిరోజులు తాత్సారం చేసింది. ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డిని ఎంపిక చేసినా మంత్రివర్గం కూర్పులో ఆయనకు స్వేచ్ఛ ఇవ్వలేదు. మంత్రులుగా ఎవరిని తీసుకోవాలో, వారికి ఏయే శాఖలను కేటాయించాలో కూడా పార్టీ అధిష్ఠానమే నిర్ణయించింది. అదే సమయంలో మంత్రులకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని, వారి శాఖల్లో జోక్యం చేసుకోవద్దని షరతు విధించింది. అయినప్పటికీ ముఖ్యమంత్రి అవ్వాలన్న కోరిక ఫలించిన సంతోషంలో రేవంత్‌రెడ్డి ఇవేమీ పట్టించుకోలేదు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత మంత్రులు, పార్టీలో సీనియర్లను సమన్వయం చేసుకోవడం రేవంత్‌రెడ్డికి తలనొప్పిగా మారింది. ముఖ్యమంత్రిగా ఉండి కూడా వంద కోట్ల రూపాయల బిల్లులను కూడా విడుదల చేయించలేని దుస్థితి నెలకొంది. ఆర్థికమంత్రిగా భట్టి విక్రమార్కకు బిల్లుల చెల్లింపు అధికారం కట్టబెట్టారు. ఏయే శాఖల్లో ఎవరెవరికి ఎంత మొత్తం చెల్లించాలో సంబంధిత శాఖల మంత్రులు సూచిస్తే తదనుగుణంగా బిల్లులు చెల్లించే విధానం అమలు చేస్తున్నారు. ఇటువంటి సవాలక్ష పరిమితులు ఉన్నప్పటికీ పార్టీ అధిష్ఠానం పట్ల విధేయతతో రేవంత్‌రెడ్డి సర్దుకుపోయారు. అధిష్ఠానం చెప్పిన విధంగా నడుచుకున్నారు.ఈ క్రమంలో ముఖ్యమంత్రిగా ఆయన రెండు మూడు నిర్ణయాలు అనాలోచితంగా చేశారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆర్థిక కష్టాలు చుట్టుముట్టాయి. ఇంకోవైపు పార్టీ నిధుల కోసం అధిష్ఠానం తెలంగాణపైనే ఆధారపడిన పరిస్థితి. ప్రభుత్వ ప్రతిష్ఠ మసకబారడానికి ఇది కూడా ఒక కారణం అయింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర నాయకత్వాన్ని మార్చాలన్న ఆలోచన అధిష్ఠానానికి రావడం పలువుర్ని దిగ్ర్భాంతికి గురిచేస్తోంది. పార్టీ పగ్గాలు జాతీయ స్థాయిలో సోనియాగాంధీ చేతికి వచ్చాక ఢిల్లీలో సామంతరాజులు ఎక్కువయ్యారు. కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర నాయకత్వాలపై అంతులేని పెత్తనం చేశారు. రాజశేఖరరెడ్డి వంటి వారు కూడా డబ్బు మూటలతో సామంతులను సంతృప్తిపరచాల్సిన పరిస్థితి.


ఇప్పుడు పార్టీ కేంద్రంలో అధికారం కోల్పోయి పదకొండేళ్లు అయింది. అయినా ఢిల్లీలో పెద్దలుగా చెలామణి అవుతున్న వారిలో మార్పు లేదు. జాతీయ స్థాయిలో పార్టీ బలహీనపడినా రాష్ర్టాలలో పెత్తనాన్ని కొనసాగిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని చీటికిమాటికీ ఢిల్లీకి పిలిపించుకొని రోజుల తరబడి వేచివుండే పరిస్థితి కల్పించారు. కేంద్రంలో పదకొండేళ్లుగా అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీలో ఈ సంస్కృతి లేదు. ప్రధాని మోదీ నాయకత్వంలోని ఆ పార్టీ అత్యంత బలంగా ఉంది. అయినా రాష్ర్టాలలో పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా సమస్యలు ఉత్పన్నమైతే వాటి పరిష్కారానికి ఢిల్లీ నుంచి పార్టీ ప్రతినిధులను పంపుతున్నారే గానీ ముఖ్యమంత్రులను ఢిల్లీకి పిలిపించుకోవడం లేదు. ఢిల్లీలో కాంగ్రెస్‌ అధిష్ఠానం పెద్దలకు ఇప్పుడు చేయడానికి పని కూడా లేదు. అయినా అయినదానికీ కానిదానికీ ఆ ఇద్దరు ముగ్గురు ముఖ్యమంత్రులను కూడా ఢిల్లీకి పిలిపించుకుంటున్నారు. ఇటువంటి ధోరణులను విడనాడకపోవడం వల్లనే జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి మెరుగుపడటం లేదు. గతంలో వలె రాష్ర్టాలపై పార్టీకి పట్టు ఉండటం లేదు. అయినా ఢిల్లీ నుంచి పెత్తనం చేయాలని అనుకుంటున్నారు. రాష్ర్టాలలో బలమైన నాయకులు ఉన్నప్పుడు జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌ బలంగా ఉండేది. జాతీయ స్థాయిలో పార్టీ బలపడాలంటే రాష్ర్టాలలో పటిష్ఠమైన నాయకత్వాలను అభివృద్ధి చేసుకోవాలన్న ప్రాథమిక సూత్రాలను విస్మరిస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే కాంగ్రెస్‌ పార్టీ ప్రస్తుత దుస్థితికి ఆ పార్టీ అధిష్ఠానమే కారణం. ఈ నేపథ్యంలో దాదాపు దశాబ్దం తర్వాత తెలంగాణలో అధికారంలోకి రాగలిగాం అన్నది విస్మరించడంతో పాటు అందుకు కారణం ఎవరు అన్న వాస్తవాన్ని విస్మరించి ఏడాదిన్నరకే నాయకత్వాన్ని మార్చాలన్న ఆలోచన చేయడమే వింతగా ఉంది. అయితే పార్టీ అధిష్ఠానం ఆలోచనలతో సంబంధం లేకుండా రాష్ట్రంలో తన నాయకత్వాన్ని పటిష్ఠం చేసుకోవాలన్న ఆలోచనకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వచ్చారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన కరకుగా వ్యవహరించాలన్న నిర్ణయానికీ వచ్చారట. ఏది ఎలా జరగాలని ఉంటే అలానే జరుగుతుంది. ఇకపై నా స్టయిల్లోనే ముందుకు వెళతాను అన్న నిర్ణయానికి రేవంత్‌రెడ్డి వచ్చారని చెబుతున్నారు. ఫలితమే ఇటీవలి కాలంలో ఆయనలో మనం చూస్తున్న మార్పు.


ట్యాపింగ్‌ లోగుట్టు వీడాలంటే..

ఈ విషయం అలా ఉంచితే తెలంగాణలో కేసీఆర్‌ హయాంలో విచ్చలవిడిగా సాగిన టెలిఫోన్‌ ట్యాపింగ్‌ విషయానికి వద్దాం. 2018కి ముందు అధికారులు ఎంత అరాచకంగా వ్యవహరించారో ఈ ఉదంతం చెబుతోంది. వందల వేల సంఖ్యలో ప్రత్యర్థుల ఫోన్లను దొంగచాటుగా, అక్రమంగా విన్నప్పటికీ కేసీఆర్‌ ఓటమి నుంచి తప్పించుకోలేకపోయారు. ఇంత భారీ స్థాయిలో ఫోన్‌ ట్యాపింగ్‌ జరిగిన విషయం కూడా కాకతాళీయంగా బయటపడింది. ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత ఆ నాటి ప్రభువుల కోసం అడ్డగోలుగా వ్యవహరించిన నాటి ఎస్‌ఐబీ అధికారులు తమను తాము కాపాడుకొనే క్రమంలో సర్వర్లు, హార్డు డిస్క్‌లు ధ్వంసం చేశారు. ఈ క్రమంలో తీవ్రవాదులు, ఉగ్రవాదులకు సంబంధించి కొన్ని ఏళ్లుగా సేకరించి భద్రపరిచిన సమాచారాన్ని కూడా ధ్వంసం చేశారు. ఇది అత్యంత తీవ్రమైన నేరం. దీంతో ప్రభుత్వ మార్పిడి తర్వాత ఎస్‌ఐబీ అధికారుల ఫిర్యాదుతో కేసు నమోదైంది. తీగ లాగితే డొంక కదిలినట్టు 2018 ఎన్నికలకు ముందు విచ్చలవిడిగా ఫోన్‌ ట్యాపింగ్‌ జరిగిందని వెల్లడైంది. నేరస్థులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఎక్కడో ఒకచోట పొరపాటు చేస్తారు అన్నట్టుగా నాటి ఎస్‌ఐబీ చీఫ్‌ ప్రభాకరరావు బృందం సర్వీస్‌ ప్రొవైడర్లకు పంపిన మెయిల్‌ ఒకటి విచారణ అధికారులకు లభించింది. దీంతో ఎవరెవరి ఫోన్లు ఎంతకాలం దొంగచాటుగా విన్నదీ వెలుగులోకి వచ్చింది. ఈ దురాగతానికి వివిధ స్థాయిలలో అనుమతించిన అధికారులందరికీ ఈ నేరంతో సంబంధం ఉన్నట్టే. అమలులో ఉన్న నిబంధనలకు విరుద్ధంగా వివిధ స్థాయిల్లో అధికారులు గుడ్డిగా అనుమతించారు. ఫోన్‌ ట్యాపింగ్‌ అరాచకానికి నాటి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అత్యంత విశ్వాసపాత్రులైన, ఆయన సామాజిక వర్గానికే చెందిన అధికారులు ప్రభాకరరావు, ప్రణీత్‌రావు, రాధాకృష్ణ రావు వంటి వారు పాల్పడ్డారు. మునుగోడు ఉప ఎన్నికలో ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులకు నిధులు అందకుండా కట్టడి చేయడం కోసం విచ్చలవిడిగా ఫోన్‌ ట్యాపింగ్‌ చేయించి అధికార పార్టీ గెలుపునకు సహకరించిన ప్రణీత్‌రావు అనే ఇన్‌స్పెక్టర్‌కు ఆక్సిలరేటెడ్‌ ప్రమోషన్‌ ఇచ్చి డీఎస్పీగా నియమించుకున్నారు. ప్రభాకరరావు అప్పటికే పదవీ విరమణ చేసినా ఆయననే ఎస్‌ఐబీ చీఫ్‌గా నియమిస్తూ నాటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ అడ్డగోలుగా జీవో ఇచ్చారు.


మరో రిటైర్డ్‌ అధికారి రాధాకృష్ణరావును టాస్క్‌ఫోర్స్‌ డీసీపీగా నియమించారు. వీళ్లందరూ చట్టవిరుద్ధంగా వ్యవహరించి కేసీఆర్‌ సేవలో తరించారు. ఫోన్‌ ట్యాపింగ్‌ జాబితాను ప్రతి ఆరు నెలలకు ఉన్నత స్థాయిలో సమీక్షించాలి. ఈ కమిటీకి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వం వహిస్తారు. ఏయే సందర్భాలలో కాల్‌ డేటా సేకరించవచ్చు, ఫోన్‌ ట్యాపింగ్‌ చేయవచ్చు అన్న విషయమై కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన నిబంధనలు విధించి రాష్ర్టాలకు పంపింది. అయినా నాటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి నేతృత్వంలోని కమిటీ ఇవేమీ పట్టించుకోకుండా గుడ్డిగా ఆమోదించింది. అత్యవసర పరిస్థితులలో ఐజీ, ఆ పైస్థాయి అధికారి మాత్రమే ఫోన్‌ ట్యాపింగ్‌కు అనుమతించవచ్చు. ఈ కేసును సీరియస్‌గా తీసుకొని విచారణ జరిపితే నాటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆ కమిటీలోని ఇతర అధికారులతో పాటు పలువురు ఐపీఎస్‌ అధికారులను శిక్షించాల్సి ఉంటుంది. ఈ కారణంగా వారంతా ప్రభుత్వానికి సహాయ నిరాకరణ చేస్తున్నారు. సాక్షిగా సంతకం చేయడానికి కూడా శాంతికుమారి వంటి వారు నిరాకరిస్తున్నారు. సిట్‌ అధికారులు సుప్రీంకోర్టు ఆదేశాలతో రాష్ర్టానికి తిరిగి వచ్చిన ప్రభాకరరావును విచారిస్తున్నారు. అయితే ఆయన నోరు విప్పకపోగా అప్పటి ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ అనిల్‌ను అడగండి అని బుకాయిస్తున్నారు. అనిల్‌ను అడిగితే తాను పేరుకు మాత్రమే ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ని అని, అంతా ప్రభాకరరావు చూసేవారని చెబుతున్నారు. ప్రస్తుతం సిట్‌కు ఏసీపీ స్థాయి అధికారి నేతృత్వం వహిస్తున్నారు. ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులను ఆ స్థాయి అధికారులు ఏం ప్రశ్నించగలరు? ఎస్‌ఐబీ చీఫ్‌గా ఉన్నప్పుడు వాడిన ఫోన్లను ఇవ్వమని సిట్‌ అధికారులు కోరగా, అమెరికాలో మరచిపోయానని ప్రభాకరరావు చెబుతున్నారు. కేంద్రం జారీ చేసిన నిబంధనల ప్రకారం ఎమ్మెల్యేలు, ఎంపీల ఫోన్‌ నంబర్లను ట్యాప్‌ చేయకూడదు. అలా చెయ్యాలంటే పెద్ద తతంగమే ఉంటుంది. దీంతో ప్రభాకరరావు బృందం కేవలం ఫోన్‌ నంబర్లను మాత్రమే సర్వీస్‌ ప్రొవైడర్లకు, రివ్యూ కమిటీకి పంపేవారు. ఇలా పంపిన కొన్ని జాబితాలపై నాటి ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ అనిల్‌ సంతకం లేదు. ఇక నాకు సంబంధించినంత వరకు రెండు సంవత్సరాల కాల్‌ డేటా తెప్పించుకున్నారు. ఇది అమలులో ఉన్న చట్టాలు, నిబంధనలకు విరుద్ధం.


మావోయిస్టులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించిన వారి జాబితాలో నా ఫోన్‌ నంబర్‌ చేర్చారు. 2018 ఎన్నికలకు ముందు సెప్టెంబరు మాసంలో నా ఫోన్‌ సంభాషణలను నేరుగా విన్నారు. నా ఫోన్‌ మాత్రమే కాదు, మరికొందరు మీడియా యజమానుల ఫోన్లనూ ట్యాప్‌ చేశారు. తమాషా ఏమిటంటే, ఈ మొత్తం ఎపిసోడ్‌లో ఫోన్‌ ట్యాపింగ్‌ చేసిన అధికారులను బురిడీ కొట్టించింది బీజేపీ ఎంపీ రఘునందనరావు ఒక్కరే. ఎన్నికల సందర్భంగా ఆయన ఫోన్‌ కూడా ట్యాప్‌ చేశారు. అయితే అధికారులను తప్పుదారి పట్టించడం కోసం ఆయన ఫలానా కారులో డబ్బు పంపుతున్నానని అవతలి వ్యక్తికి చెప్పారు. ఆ వెంటనే అధికారులు సదరు నంబరు కారును క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఏమీ దొరక్కపోవడంతో కారును విడి భాగాలుగా ఊడదీసి మరీ తనిఖీ చేశారు. అయినా ఏమీ దొరక్కపోవడంతో తాము బోల్తా పడ్డామని సదరు అధికారులు తెలుసుకున్నారు. ఈ ఫోన్‌ ట్యాపింగ్‌లో బాధితులకు న్యాయం జరగాలన్నా, నిందితులకు శిక్ష పడాలన్నా సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఉన్నత స్థాయి కమిటీ దర్యాప్తు చేయాలి. ఈ అరాచకానికి కర్త, కర్మ, క్రియ నాటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నది అందరికీ తెలిసిందే. అయితే ఆయనకు వ్యతిరేకంగా ఒక్కరు కూడా నోరు విప్పడం లేదు. ఎవరి ఆదేశాలతో, ఎవరి కోసం ఇన్ని వందల ఫోన్లు ట్యాప్‌ చేశారని సిట్‌ అధికారులు ప్రశ్నిస్తున్నా ప్రభాకరరావు మౌనాన్నే ఆశ్రయిస్తున్నారు. ఇలా అయితే ప్రస్తుత దర్యాప్తు వృథా ప్రయాసే అవుతుంది. గజం మిథ్య, పలాయనం మిథ్య అన్నట్టుగా ఈ ఎపిసోడ్‌ మిగలకూడదు అంటే తగు నిర్ణయం తీసుకోవలసింది రేవంత్‌రెడ్డి ప్రభుత్వమే. చూద్దాం ఏం జరుగుతుందో.. కేసీఆర్‌ అండ్‌ కో సేఫ్‌గా ఉంటారా? జైలుకు వెళతారా? అన్నది కాలమే చెప్పాలి!

Updated Date - Jun 29 , 2025 | 06:36 AM