Share News

The Psychology Behind Andhra Politics: నార్సిస్టిక్‌ జగన్‌

ABN , Publish Date - Nov 02 , 2025 | 02:02 AM

‘‘ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సృష్టించిన విపత్తు ఈ మొంథా తుఫాను’’ అని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. అదే సమయంలో ‘‘ముఖ్యమంత్రిగా లేకపోయినా...

The Psychology Behind Andhra Politics: నార్సిస్టిక్‌ జగన్‌

‘‘ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సృష్టించిన విపత్తు ఈ మొంథా తుఫాను’’ అని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. అదే సమయంలో ‘‘ముఖ్యమంత్రిగా లేకపోయినా తుఫాను నుంచి ప్రజలను కాపాడిన ఏకైక మగాడు జగన్‌రెడ్డి’’ అని తన సొంత మీడియాలో ప్రచారం చేయించుకున్నారు. సాధారణ ప్రజలకు ఈ రెండు వ్యాఖ్యానాలు వింతగా అనిపిస్తాయి. మొంథా తుఫానును చంద్రబాబు సృష్టించడం ఏమిటి? ప్రకృతి విపత్తు సంభవించి ప్రజలు అవస్తలు పడాలని చంద్రబాబే కాదు– జగన్‌రెడ్డి కూడా కోరుకోరు కదా! అదే సమయంలో ముఖ్యమంత్రిగా లేకపోయినా ఈ విపత్తు నుంచి ప్రజలను కాపాడిన ఏకైక మగాడు అని తనకు తానే కితాబు ఇప్పించుకోవడం వింతల్లోకెల్లా వింత. నిజానికి తుఫాను తీరం దాటినప్పుడు ఆయన రాష్ట్రంలోనే లేరు. బెంగళూరులో ఉన్నారు. తుఫాను ముప్పు తగ్గిన తర్వాత రాష్ర్టానికి వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబును కాసేపు తిట్టి మళ్లీ బెంగళూరు వెళ్లిపోయారు. గత ఏడాది బుడమేరుకు వరద వచ్చినప్పుడు కూడా జగన్‌రెడ్డి ‘ఇది మనిషి సృష్టించిన విపత్తు’ అని విమర్శించారు. జగన్‌రెడ్డి ప్రవర్తన చూసిన వారికి వింతగా ఉంటుంది. దీన్ని లోతుగా అధ్యయనం చేస్తే ఆయన ‘నార్సిస్టిక్‌ డిజార్డర్‌’ అనే మానసిక సమస్యతో బాధపడుతున్నట్టు స్పష్టమవుతుంది. అంతర్జాతీయంగా పేరొందిన అమెరికాలోని మయో క్లినిక్‌ ఈ వ్యాధి ఉన్న వారిలో కనిపించే లక్షణాలను స్పష్టంగా నిర్వచించింది. ఈ వ్యాధి లక్షణాలలో ప్రముఖమైనది... ఒక వ్యక్తి తనకు తాను గొప్పవాడిగా భావిస్తూ అధిక ప్రాముఖ్యత ఇచ్చుకోవడం, దీనితోపాటు విపరీతమైన అహంభావం కలిగి ఉండటం! అర్హత లేని సందర్భాలలో కూడా తనను గొప్పగా ఊహించుకొని తనను తాను ప్రేమించుకుంటూ ఇతరులు కూడా తనను అభినందించాలని, సన్మానించడం ద్వారా గుర్తించాలని కోరుకుంటారు. ఇతరుల పట్ల కనీస సానుభూతి ఉండదు. తనను ప్రతి ఒక్కరూ నిరంతరం ప్రశంసించాలని కోరుకుంటూ తన గొప్పతనాన్ని అతిగా ఊహించుకుంటారు. తానొక ప్రత్యేకమైన వ్యక్తినని, ప్రత్యేక గౌరవానికి అర్హుడనని నమ్ముతూ మితిమీరిన ప్రశంసలకోసం ఎదురుచూస్తుంటారు. ఇతరులు ఏమనుకుంటారో అన్న చింత ఉండదు. అపరిమిత విజయాలను సాధించానని, అంతులేని అధికారం అనుభవిస్తున్నానని, అందగాడినని–మొత్తంగా తానొక ప్రత్యేకమైన వ్యక్తినని ఊహాలోకంలో విహరిస్తుంటారు. తాను చేసిన పనులను అసాధారణ ఘనకార్యాలుగా మిగతా వారంతా భావించాలని, తాను ఏమి చేసినా, చెప్పినా ఇతరులు ప్రశ్నించకుండా అనుసరించాలని కోరుకుంటారు. ఇతరుల అవసరాలు, మనోభావాలు వారికి పట్టవు. తనను ప్రత్యేకమైన వాడిగా గుర్తించని వారినందరినీ శత్రువులుగా భావిస్తారు. అలాంటి వారి పట్ల దురుసుగా వ్యవహరిస్తారు. తమకు ప్రత్యేక గుర్తింపు, గౌరవం లభించనప్పుడు వారికి కోపం వస్తుంది. సహనం నశిస్తుంది. ఇలా చెప్పుకొంటూ పోతే సాధారణ మనుషులలో కనిపించని అనేక లక్షణాలు ఈ వ్యాధితో బాధపడుతున్న వారిలో ఉంటాయి. వైద్య పరిభాషలో ఇదొక తీవ్రమైన మానసిక సమస్య. దీనికి మందులు కూడా ఉండవు. ఈ సమస్యతో బాధపడుతున్న వారికి దూరంగా ఉండటమే మందు అని వైద్యులు చమత్కరిస్తుంటారు.


జగన్‌ చేతలు...

జగన్మోహన్‌రెడ్డి రాజకీయాల్లోకి వచ్చే వరకు అతని గురించి ప్రజలకు తెలియదు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత, ముఖ్యంగా ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన తర్వాత అతడి ప్రవర్తనను గమనిస్తే... తనలో నార్సిస్టిక్‌ డిజార్డర్‌ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని ఎవరైనా అంగీకరించాల్సిందే! ముఖ్యమంత్రి అయిన కొత్తలో ప్రభుత్వ కార్యక్రమాలలో పాల్గొనే వారితో ‘సీఎం సర్‌’ అన్న ప్లకార్డులు ప్రదర్శింపజేసేవారు. తాను ధరించిన టోపీలపై కూడా ‘సీఎం సర్‌’ అని రాసి ఉండటం చూశాం. ఈ దేశంలో ఎంతో మంది ముఖ్యమంత్రులుగా పనిచేశారు. వాళ్లెవ్వరూ ‘సీఎం సర్‌’ అన్న ప్లకార్డులు ప్రదర్శింపజేసుకోలేదు. అంటే, జగన్‌రెడ్డి మాత్రమే ముఖ్యమంత్రిగా తాను ప్రత్యేకమని, ప్రజలందరూ తనను అభిమానించి ప్రత్యేకంగా గుర్తించి గౌరవించాలని కోరుకున్నారన్న మాట! తన మాటకు ఎదురు చెప్పిన వారిని ఆయన దారుణంగా అవమానించేవారు. బహుశా ఈ కారణం వల్లనే కాబోలు అఖిల భారత సర్వీసు అధికారులు సైతం ఆయన ముందు మోకరిల్లేవారు. ఇది కూడా ఆ వ్యాధి లక్షణమే! నిన్నగాక మొన్న వైద్య కళాశాలలను పీపీపీ మోడల్లో నిర్మించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని విమర్శిస్తూ... అధికారంలో ఉన్నప్పుడు తాము నిర్మించిన వైద్య కళాశాల భవనాలను చూసిన వారంతా ‘ఆహా’ అని మెచ్చుకోవాలని, తనకు శాలువాలు కప్పి సత్కరించాలని చెప్పుకొచ్చారు. ఇది కూడా సదరు మానసిక సమస్యతో బాధపడుతున్న వారిలో కలిగే భావనే. జగన్‌రెడ్డి అధికారంలో ఉన్నంతకాలం ఇలాంటి సందర్భాలను ఎన్నింటినో చూశాం! ఇప్పుడు అధికారం కోల్పోయినప్పటికీ... తాను అధికారంలో ఉన్నప్పుడు ప్రజలంతా సుభిక్షంగా ఉన్నారని, ఇప్పుడు అష్టకష్టాలు పడుతున్నారని తాను నమ్ముతూ, అందర్నీ నమ్మవలసిందిగా కోరుతున్నారు. ఇది కూడా నార్సిస్టిక్‌ వ్యాధి లక్షణమే. తమాషా ఏమిటంటే, జగన్‌రెడ్డిలో కనిపిస్తున్న వ్యాధి లక్షణాలు ఆయన చుట్టూ ఉన్న వారిలోనూ కనిపిస్తున్నాయి. కాకపోతే తక్కువ స్థాయిలో! జగన్‌ తన గురించి ఎంత గొప్పగా ఊహించుకుంటారో.. ఆయనని అభిమానించేవారు కూడా అదే విధంగా ఆయన గురించి గొప్పగా ప్రచారం చేస్తుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే, ఈ మూక అంతా ఊహాలోకంలో విహరిస్తుంటారు. నిజానికి జగన్‌రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు వారికి పెద్దగా ఒరిగింది ఏమైనా ఉందా అంటే అది కూడా కనిపించదు. శరభ శరభ అని కీర్తించడంతోపాటు రాజకీయ ప్రత్యర్థులపై బురద చల్లినందుకు మహా అయితే నెలవారీ చెల్లింపులు అందుతూ ఉండొచ్చు. సోషల్‌ మీడియాలో జగన్‌ మద్దతుదారులు పెడుతున్న పోస్టులను చూస్తే ఆయన తల్లి విజయమ్మకు కూడా నా బిడ్డలో ఇన్ని అసాధారణ లక్షణాలు ఉన్నాయా అన్న అనుమానం కలగకమానదు. తనను తాను జగన్‌ ఎలా ఊహించుకుంటారో ఆయన మద్దతుదారులు కూడా అలానే తలచుకొని పోస్టులు పెడతారు. మొత్తంగా జగన్‌రెడ్డి అనే అతను ఒక అసాధారణ వ్యక్తి అని వారంతా నమ్ముతారు. జగన్‌ లాంటి వాడు మళ్లీ పుట్టడని కూడా ప్రచారం చేస్తారు. ఒక రకంగా ఇది నిజమే. నార్సిస్టిక్‌ వ్యాధి లక్షణాలు ముదిరిన జగన్‌ లాంటి వాడు మళ్లీ ఎప్పుడు పుడతాడో చెప్పలేం!


ఆయనేం చేసినట్లు?

ఇప్పుడు మొంథా తుఫాను గురించి జగన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యల విషయానికి వద్దాం! ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు నష్టపోయిన ప్రజలను ప్రభుత్వాలు మరింత మెరుగ్గా ఆదుకోవాలని కోరడం లేదా బాధితులకు సహాయం చేయడంలోగానీ, ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవడంలోగానీ విఫలమయ్యారని విమర్శించడం సహజం. జగన్‌రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఒక్కసారే ప్రకృతి విపత్తు సంభవించింది. అప్పుడు ఆయన పెద్దగా హైరానా పడలేదు. ‘నేను ప్రార్థన బాగా చేస్తాను. అయినా ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే మనం ఏం చేయగలం? జరిగేది ఏదో జరుగుతుంది’ అని నిర్వేదంగా వ్యాఖ్యానించారు. రైతులు, ఇతర బాధితులలో మనోధైర్యం కల్పించే ప్రయత్నం కూడా చేయలేదు. అంతా విధి లిఖితం అని సరిపెట్టుకోమన్నారు. ఇప్పుడు అదే మనిషి మొంథా తుఫాను ముఖ్యమంత్రి చంద్రబాబు సృష్టించిన విపత్తు అని అలవోకగా అనేశారు. నార్సిస్టిక్‌ వ్యాధి ఉన్నవారు ఇతరులను కించపరుస్తారని వైద్యులు చెబుతారు. దీన్నిబట్టి జగన్‌రెడ్డిలో ఆ లక్షణం ఉన్నట్టే కదా? ఏ ముఖ్యమంత్రి అయినా పకృతి వైపరీత్యాలు సంభవించాలని కోరుకుంటారా? లేదా విపత్తులను సృష్టిస్తారా? ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు అవినీతి జరిగిందని విన్నాం. శవాలపై పైసలు ఏరుకోవడం చూశాం. అంతేగానీ తుఫానులకు ఫలానా ముఖ్యమంత్రి కారణం అని ఇంతవరకు ఎవరూ విమర్శించలేదు. ఇప్పుడు జగన్‌ మీడియా, ఆయన సోషల్‌ మీడియా చేసిన, చేస్తున్న ప్రచారం విషయానికి వద్దాం! ముఖ్యమంత్రిగా లేకపోయినా తుఫాను నుంచి ప్రజలను కాపాడిన ఏకైక మగాడు జగన్‌ అని కీర్తించుకోవడం ఏమిటి? తుపాను అనంతరం జరిగిన సహాయక చర్యలలో జగన్‌ పాత్ర ఏముంది? ప్రజలను ఎలా కాపాడారు? ఇలా భావించడం కూడా నార్సిస్టిక్‌ వ్యాధి లక్షణమే. అర్హత లేకపోయినా తనకు తాను అధిక ప్రాధాన్యత ఇచ్చుకోవడం, తనను అందరూ ప్రశంసించాలని, సన్మానించాలని కోరుకోవడం ఈ వ్యాధి లక్షణాలే కదా! జగనన్న లాంటి సంకల్పం ఉంటే సూర్యుడైనా సలాం కొట్టాల్సిందేనట! మొంథా తుఫానుకు ముందూ వెనుకా జగన్‌రెడ్డి పాత్ర సున్నా! తుఫాను రాష్ట్రంపై విరుచుకుపడినప్పుడు ఆయన అసలు ఏపీలోనే లేరు. తుఫాను తీరం దాటి శాంతించిన తర్వాత మాత్రమే ఆయన తాడేపల్లి ప్యాలెస్‌కు వచ్చారు. ఒక్కరోజు అక్కడే ఉన్నప్పటికీ... అడుగు బయటపెట్టకుండా శుక్రవారం నాడే బెంగళూరు వెళ్లిపోయారు. అంటే తన పాత్ర ఏమీ లేని సందర్భాలలో కూడా ఆయన తనకు తాను భుజకీర్తులు తగిలించుకుంటారన్నమాట! ఇతరులతో కీర్తింపజేసుకుంటారన్నమాట! ఏఐ అంటే ఏమిటో జగన్‌ ఆ మధ్య తేల్చిపడేశారు. డేటా సెంటర్‌ నుంచి డేటా తీసుకొని, దానికి మైండ్‌ అప్లై చేస్తే అదే ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అవుతుందని చెప్పి నవ్వులపాలు అయ్యారు. దీనిపై పలువురు వ్యంగ్యాస్ర్తాలు సంధించారుగానీ, అలా చెప్పగలగడం కూడా ఈ వ్యాధి లక్షణమే. తనకు తెలియని అంశం ఏదీ ఉండదని, ఏ విషయమైనా అలవోకగా చెప్పేయగలమన్న మితిమీరిన ఆత్మవిశ్వాసం ఈ వ్యాధి ఉన్న వారికి ఉంటుంది.


సంక్షోభాలే సోపానాలుగా...

చంద్రబాబుపై జగన్‌ చేసిన విమర్శల విషయానికి వద్దాం! సమకాలీన రాజకీయాలలో సంక్షోభాలను తనకు అనుకూలంగా మలచుకోవడంలో చంద్రబాబు ప్రథమ స్థానంలో ఉంటారు. 1984లో ఎన్టీఆర్‌ను పదవీచ్యుతుడిని చేసినప్పుడు చంద్రబాబులోని శక్తియుక్తులు బయటపడ్డాయి. అదే చంద్రబాబు తర్వాత కాలంలో లక్ష్మీపార్వతి కారణంగా పార్టీ సంక్షోభంలోకి జారుకుంటున్నదని గ్రహించి అదే ఎన్టీఆర్‌పై తిరుగుబాటు చేసి పార్టీని, ప్రభుత్వాన్ని హస్తగతం చేసుకొని మూడు దశాబ్దాలుగా ఎన్నో సంక్షోభాలను అధిగమించి పార్టీని కాపాడుకుంటూ వస్తున్నారు. ఇక అధికారంలో ఉన్నప్పుడు తుఫానులు వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే నిద్రాహారాలు మాని సహాయ పునరావాస చర్యలపై దృష్టి పెడతారు. ఇలాంటి సందర్భాలలో చంద్రబాబు ఒకింత అతి చేస్తారని కొంత మంది భావిస్తారుగానీ... ఆయన అలాంటి సందర్భాలను తనకు లభించిన అవకాశాలుగా స్వీకరిస్తారు. మొంథా తుఫాను సందర్భంలో కూడా ఆయన ఇలాగే పనిచేశారు. సాంకేతిక విజ్ఞానం కూడా అందుబాటులోకి రావడంతో ప్రజలకు ఎప్పటికప్పుడు తుఫాను సమాచారాన్ని అందిస్తూ ప్రాణ నష్టం లేకుండా చర్యలు తీసుకున్నారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడం, రహదారులు ధ్వంసం అవడం సర్వసాధారణం. తిరిగి సాధారణ పరిస్థితులు రావడానికి వారం పది రోజులు పట్టేది. ఇప్పుడు ఒక్క రాత్రిలో విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించారు. రాత్రికి రాత్రి రహదారులపై కూలిన చెట్లను తొలగించి రాకపోకలకు ఆటంకం లేకుండా చేశారు. తుఫాను తాకిడికి గురైన ప్రాంతాల ప్రజలు ఈ విషయాన్ని బాహాటంగానే చెబుతున్నారు. ప్రభుత్వ సిబ్బంది నిద్రాహారాలు మాని మరీ పునరుద్ధరణ పనులు చేశారు. ఈ క్రమంలో విద్యుత్‌ సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించాలి. ప్రజాభిప్రాయం ఇలా ఉండగా... ముఖ్యమంత్రిని విమర్శించడం, ప్రకృతి విపత్తుకు ఆయనే కారణమని జగన్‌ నిందించడం వింతగా ఉంది. కూటమి నాయకులు కొంత కాలంగా జగన్‌రెడ్డిని సైకోగా అభివర్ణిస్తున్నారు. ఆయనలో సైకో లక్షణాలు ఉన్నాయా లేదా అన్నది వైద్యులు మాత్రమే నిర్ణయించాలి. అయితే, దాదాపు దశాబ్ద కాలంగా జగన్‌రెడ్డిని గమనిస్తున్న వారికి ఆయనలో నార్సిస్టిక్‌ డిజార్డర్‌ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని ఇట్టే తెలిసిపోతుంది. అయితే, వైద్యులు ఇప్పటివరకు ఆయనలో ఈ లక్షణాలు ఉన్నాయని గ్రహించలేదు. ఎందుకంటే వారికి ఆ ఊహ కూడా రాలేదు. బహుశా ఈ వ్యాధి లక్షణాల కారణంగానే జగన్‌రెడ్డి రాజకీయ ఎత్తుగడలు కూడా అంతుబట్టకుండా ఉంటాయి. ప్రజాక్షేత్రంలో బలం ఉన్న నాయకులు కూడా ఆయన ముందు చేతులు కట్టుకొని ఎందుకు నిలబడతారో అర్థం అవుతుంది. తానొక అసాధారణ నాయకుడినని ఆయన వారందరినీ నమ్మించి ఉంటారు. ఈ కారణంగానే ఆయన మద్దతుదారులు కనీస వెరపు లేకుండా జగన్‌ కోసం పనిచేస్తున్నారు. తన మాటకు ఎవరు ఎదురు చెప్పినా ఆయనలో ఆగ్రహం పెల్లుబుకుతుంది. సహనం నశిస్తుంది. ఇతరులలో గొప్ప లక్షణాలు ఉంటే వాటిని గుర్తించి గౌరవించడానికి నార్సిస్టిక్‌ వ్యాధి లక్షణాలు ఉన్నవారు నిరాకరిస్తారు. బహుశా ఈ కారణంగానే కాబోలు రాజశేఖరరెడ్డి కంటే గొప్ప పాలనను అందిస్తానని తాను అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్‌రెడ్డి ప్రకటించారు. ఉమ్మడి రాష్ట్రంలో చివరి ముఖ్యమంత్రులుగా పనిచేసిన రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డిని గుర్తించడానికి కూడా జగన్‌ నిరాకరించారు. చంద్రబాబుపై ద్వేషంతో చీదరించుకుంటారు. తాను తప్ప అన్యులు మంచి చేయరని ఈ వ్యాధి ఉన్నవారు భావిస్తుంటారు కనుకే జగన్‌రెడ్డి కూడా కూటమి పాలనలో ఏపీ సర్వనాశనం అయిందని చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన రెండు నెలలకే విమర్శలు మొదలుపెట్టారు. చంద్రబాబు పాలనలో ఒక్కటంటే ఒక్కటీ మంచి పని జరగలేదని తాను నమ్ముతూ ప్రజలను కూడా నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. తన గొప్పతనం ముందు ఇతరులు బలాదూర్‌ అని నార్సిస్టిక్‌ వ్యాధి ఉన్నవాళ్లు భావిస్తారు.


జగన్‌ విషయంలో ఇప్పుడు జరుగుతున్నది కూడా ఇదే. తాను అధికారంలో ఉన్నప్పుడు ఒక్క తప్పు కూడా చేయలేదని భావించడానికి కూడా ఈ వ్యాధే కారణం. ఉదాహరణకు కాపు, కమ్మ కులస్తుల విషయమే తీసుకుందాం. అధికారంలో ఉన్నప్పుడు ఈ రెండు కులాల వారిని వేటాడి వేధించడం గుర్తు లేదన్నట్టుగా ఇప్పుడు కపట ప్రేమ ప్రదర్శిస్తున్నారు. కమ్మ వాళ్లను జాతి శత్రువులుగా భావించిన ఆయన కాపులను కూడా ఆ జాబితాలోకి చేర్చారు. జన సేనాని పవన్‌ కల్యాణ్‌ విషయమే తీసుకుందాం. కాపు సామాజికవర్గం అమితంగా ఇష్టపడే ఆయనను ఎన్ని రకాలుగా వేధించారో... పావలాగాడు, ప్యాకేజీ స్టార్‌ అని ఎలా కించపరిచారో చూశాం. తన మనో వికారాలను ప్రజలు గుర్తించకుండా ఉండటానికి ‘క్లాస్‌ వార్‌’ అని వామపక్షాల నినాదాన్ని జగన్‌ అందిపుచ్చుకున్నారు. కాపులను కాపులతోనే తిట్టించారు. కమ్మ వారిని కమ్మ వారితోనే తిట్టించారు. ఈ క్రమంలో పేర్ని నాని, ముద్రగడ పద్మనాభం వంటి వారిని చేరదీశారు. చివరికి ముద్రగడ పద్మనాభం తన పేరును పద్మనాభరెడ్డి అని మార్చుకోవలసిన దుస్థితి కల్పించారు. ఇక వల్లభనేని, కొడాలి నాని వంటి వారి గురించి తెలిసిందే. ఇప్పుడు వారి పరిస్థితి ఎలా ఉందో చూస్తున్నాం. అప్పుడు ఆ రెండు కులాలను వేధించిన జగన్‌రెడ్డి ఇప్పుడు ఆ రెండు కులాలను విడదీయడానికి స్కెచ్‌ గీశారు.

కూటమి మధ్య చిచ్చు పెట్టేందుకు...

కాపులను కూటమి నుంచి దూరం పెట్టడానికి కుట్రలు, కుతంత్రాలకు తెరతీశారు. ఇందుకోసం కాపు సామాజిక వర్గానికి చెందిన కొందరిని చేరదీశారు. ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా జగన్‌ మనుషులు అక్కడ వాలిపోతూ కులాల మధ్య కుంపట్లను రాజేస్తున్నారు. తాజాగా కాల్‌ మనీ వ్యాపారుల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న ఒక మహిళకు సంబంధించిన కేసులో ఏ సంబంధం లేని కల్లూరు శ్రీనివాస్‌ అనే కమ్మ సామాజికవర్గానికి చెందిన తెలుగుదేశం కార్యకర్త పేరు బయటకు తెచ్చారు. కర్లపూడి శ్రీను అనే పేరు బదులు కల్లూరు శ్రీను అని ఆత్మహత్య చేసుకున్న శేషమ్మ వీడియోలో అన్నారు. అంతే, అక్కడ కూడా కులాల మధ్య విధ్వేషాలు రగిలించడానికి జగన్‌ తరపున వకల్తా పుచ్చుకున్నవారు వాలిపోయారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా తాను మాత్రమే అర్హుడినని జగన్‌రెడ్డి తనకు ఉన్న మానసిక సమస్య వల్ల బలంగా నమ్ముతున్నారు. ఈ కారణంగానే ప్రస్తుతం తాను అధికారంలో లేనందున ఏదేదో జరిగిపోతోందని బాధపడిపోతున్నారు. జగన్‌లో ఉన్న నార్సిస్టిక్‌ లక్షణాల వల్లనే ఆయన ఎత్తుగడలను నాలుగున్నర దశాబ్దాలకు పైగా రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు కూడా ముందుగా పసిగట్టలేక పోతున్నారు.


తెలుగుదేశం పార్టీకి బలమైన మద్దతుదారులుగా ఉన్న కమ్మ వారిలో కూడా చంద్రబాబుపై వ్యతిరేకత సృష్టించే ప్రయత్నం జగన్‌రెడ్డి చేయగలరని ఎవరైనా ఊహిస్తారా? ఆ సామాజికవర్గానికి చెందిన కొందరిని చేరదీసి, చంద్రబాబు పాలనలో కమ్మ వారికి అన్యాయం జరుగుతోందని... ముఖ్యంగా కృష్ణా, గుంటూరు జిల్లాలకు అన్యాయం చేస్తున్నారని, అమరావతిని నిర్వీర్యం చేస్తున్నారని ప్రచారం చేస్తున్నారు. తమాషా ఏమిటంటే, జగన్‌రెడ్డి పాలనలో వేధింపులను తట్టుకోలేక కలుగుల్లో దూరి బిక్కు బిక్కు మంటూ బతుకు వెళ్లదీసిన కమ్మ సామాజికవర్గంలో కొందరు ఈ ప్రచారాన్ని నమ్ముతున్నారు. మయో క్లినిక్‌ వాళ్లు ఇచ్చిన నిర్వచనంలో ఈ లక్షణం కూడా ఉంది. విషాదం ఏమిటంటే, నార్సిస్టిక్‌ డిజార్డర్‌కు మందు లేకపోవడం. అంటే నయం కాని మానసిక సమస్యతో బాధపడుతున్న జగన్‌రెడ్డిని ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు భరించాల్సిందే. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాబోయే భారత ప్రధాని అని ఇదే జగన్‌రెడ్డి ప్రచారం చేయించుకోవడం గుర్తుంది కదా? అంటే ఆయనలో ఈ మానసిక సమస్య తీవ్రరూపం దాల్చుతోన్నదన్న మాట. జగన్మోహన్‌రెడ్డిలో ఈ వ్యాధి లక్షణాలు ఉన్నాయా? లేవా? అన్న విషయం స్పష్టం చేయాల్సిన బాధ్యత సైకాలజిస్టుల మీద ఉన్నది. ఆయనలో ఈ వ్యాధి లక్షణాలు లేవని వారు నిర్ధారిస్తే మరేదో సమస్య ఉందని సరిపెట్టుకోవచ్చు. అంతవరకు జగన్‌ విషయంలోనూ, ఆయన రాజకీయాల విషయంలోనూ ప్రజలే అప్రమత్తంగా ఉండాలి.

ఆర్కే

ఈ వార్తలు కూడా చదవండి...

కాశీబుగ్గ ఘటనపై పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి

షాకింగ్ ఘటన... జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికురాలిపై అత్యాచారం

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 02 , 2025 | 02:02 AM