Judiciary Under Fire: మీ చేతుల్లోనే ఉంది మిలార్డ్స్
ABN , Publish Date - Jul 27 , 2025 | 01:02 AM
ఇంతకూ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఆస్తికుడా? నాస్తికుడా? మాటకు ముందూ వెనుకా ఆ దేవుడు కరుణిస్తే అని ఆయన అంటూ ఉంటారు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 23 సీట్లకే పరిమితమై, తనకు 151 సీట్లు వచ్చినప్పుడు...

ఇంతకూ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఆస్తికుడా? నాస్తికుడా? మాటకు ముందూ వెనుకా ఆ దేవుడు కరుణిస్తే అని ఆయన అంటూ ఉంటారు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 23 సీట్లకే పరిమితమై, తనకు 151 సీట్లు వచ్చినప్పుడు ‘ఆ దేవుడి స్ర్కిప్ట్ ఎంత గొప్పగా ఉందో’ అని పొంగిపోయారు. 2024 ఎన్నికల్లో తన పార్టీ 11 సీట్లకే పరిమితమైనప్పుడు మాత్రం దేవుణ్ని తలుచుకోలేదు. అన్నిటికీ దేవుడు ఉన్నాడని ఆయన చెబుతుంటారు. దీన్నిబట్టి ఆయనకు దైవభక్తి ఎక్కువ అని ఎవరైనా నమ్మాల్సిందే. పదహారణాల క్రైస్తవుడిగా ప్రతి రోజూ ఆయన ప్రేయర్లు చేస్తుంటారు. తనకు ఆ ప్రభువే అండగా ఉన్నాడని నమ్మకంగా చెబుతుంటారు. క్రైస్తవ మతాన్ని మనసా వాచా కర్మణా ఆచరించేవారు బైబిల్ సూక్తులను ఆచరించాలి. దైవభక్తి ఉన్నవారికి సహజంగానే పాపభీతి ఉంటుంది. అన్నట్టు ఆ మధ్య ఎవరో తమ బిడ్డకు పేరు పెట్టమని కోరగా ‘దేవుడు’ అని జగన్‌రెడ్డి నామకరణం చేశారు. ఆడపిల్లకు దేవుడు అనే పేరు ఎలా నప్పుతుందో తెలియదు. మొత్తానికి ఆయనను ఆస్తికుడిగానే పరిగణించాలి. అయితే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గానీ, ఆ తర్వాత అధికారం కోల్పోయినప్పుడు గానీ ఆయన చేష్టలను పరిశీలిస్తే జగన్‌రెడ్డిలో ఏ కోశానా పాపభీతి లేదని స్పష్టమవుతుంది. దేవుడి కంటే డబ్బే తనకు ముఖ్యమని అధికారంలో ఉన్నప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయాలను బట్టి ఎవరైనా భావించడంలో తప్పు లేదు. జగన్ హయాంలో అమలు చేసిన మద్యం విధానమే ఇందుకు నిదర్శనం. మద్యం వ్యవహారంలో భారీ కుంభకోణం జరిగిందని కూటమి ప్రభుత్వం ఎప్పటి నుంచో చెబుతోంది. దీనిపై ఏర్పాటు చేసిన సిట్ విచారణలో దిగ్ర్భాంతికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. అయితే అవన్నీ భేతాళ కథలుగా జగన్ అండ్ కో కొట్టిపడేస్తున్నారు. మద్యం వ్యవహారంలో సిట్ అధికారులు చెబుతున్నట్టుగా 3,600 కోట్ల రూపాయల అవినీతి జరిగిందా? లేదా? అన్నది న్యాయ సమీక్షలోనే తేలుతుంది. అయితే ధన దాహంతో జగన్‌రెడ్డి ప్రవేశపెట్టిన మద్యం విధానమే అసలు సమస్య.
ఉమ్మడి రాష్ట్రంలో గానీ, రాష్ట్రం విడిపోయిన తర్వాత గానీ నాణ్యమైన మద్యాన్ని మాత్రమే ఆయా ప్రభుత్వాలు సరఫరా చేసేవి. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా పేరున్న బ్రాండ్లనే కొనుగోలు చేయించారు. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రమే విషతుల్యమైన నాసిరకం మద్యాన్ని మార్కెట్‌లోకి ప్రవేశపెట్టారు. ఈ మద్యం తాగడం వల్ల పలువురు మరణించగా, ఎన్నో వేల మందికి కిడ్నీలు పాడైపోయాయి. ఇప్పుడు వారంతా జీవచ్ఛవాలుగా బతుకుతున్నారు. కమీషన్ల కక్కుర్తితో ఇంతటి మహా పాతకానికి ఒడిగట్టిన జగన్‌రెడ్డిలో దైవభక్తి ఉంది, పాపభీతి ఉంది అని ఎలా నమ్మడం? పాపభీతి ఉన్నవారు ఎవరూ ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి కాసుల కోసం కక్కుర్తి పడరు. నిజానికి మద్యం వ్యాపారం చేసిన వారెవరూ బాగుపడలేదు. మందు బాబుల ఇళ్లలోని ఆడవాళ్ల శాపనార్థాలు తగిలి వారి కుటుంబాలు చితికిపోయాయి. విజయ్ మాల్యా వంటి వారికి ఎలాంటి దుస్థితి దాపురించిందో చూస్తున్నాం. అలాంటిది నాసిరకం మద్యం సరఫరా చేసిన వారికి మహిళల ఉసురు తగలకుండా ఉంటుందా? నిజంగా దైవభక్తి ఉన్నవాళ్లు ఇలాంటి నీచానికి ఒడిగట్టరు. ప్రభుత్వం చెబుతున్న లిక్కర్ కుంభకోణం అంతా బోగస్ అని, గత ప్రభుత్వంలో లిక్కర్ అమ్మకాలు తగ్గి ప్రభుత్వ ఆదాయం పెరిగిందని, అలాంటప్పుడు అవినీతికి ఆస్కారం ఎక్కడ ఉంటుందని జగన్ అండ్ కో ప్రశ్నిస్తున్నారు. అయితే అలా ఎలా జరిగిందో మాత్రం వారు వివరించడం లేదు. గత ప్రభుత్వాలు నాణ్యమైన మద్యం సరఫరా చేయడం వల్ల అమ్మకాలు అధికంగా కనిపించినా లాభాలు అందుకు తగ్గట్టుగా ఉండేవి కావు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత నాసిరకం మద్యాన్ని అధిక మార్జిన్‌తో అమ్మేవారు. దీంతో అమ్మకాలు తగ్గినట్టుగా, ప్రభుత్వ ఆదాయం పెరిగినట్టుగా కనిపించేది. ఈ లాజిక్‌ను కనిపెట్టే జగన్ అండ్ కో తమకు అనుకూలమైన పాయింట్లతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం అమ్మకాలు పెరిగాయన్నది వాస్తవం. అయితే ఇందుకు ప్రజలు విపరీతంగా తాగేయడమో, మరొకటో కారణం కాదు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే మార్కెట్‌లోకి నాణ్యమైన బ్రాండ్స్‌ను ప్రవేశపెట్టింది. దీనివల్ల ఆదాయం సహజంగానే పెరుగుతుంది. ఎందుకంటే వాటి ధర ఎక్కువగా ఉంటుంది. జగన్ జమానాలో కమ్మని బీరు కూడా ఆంధ్రప్రదేశ్‌లో లభ్యం కావడం లేదని ఎంతో మంది వ్యాఖ్యానించడం తెలిసిందే. పది రూపాయల విలువ కూడా చేయని క్వార్టర్ బాటిల్‌ను జగన్ హయాంలో వంద రూపాయలకు అమ్మారని చెబుతారు. ఆయన అధికారంలోకి వచ్చిన రెండు మూడు నెలల్లోనే అంతకుముందు నుంచి ఉన్న డిస్టిలరీలను ఇప్పుడు లిక్కర్ కుంభకోణంలో అరెస్టయి జైల్లో ఉన్న కొందరు హస్తగతం చేసుకున్నారు. సదరు డిస్టిలరీలలో నాసిరకం మద్యం తయారుచేసి ప్రభుత్వానికి సరఫరా చేశారు. ఈ క్రమంలో జగన్ అండ్ కో నిర్ణయించిన మొత్తాన్ని ఆయన సూచించిన వారికి ముట్టజెప్పేవారు. ఉదాహరణకు, తిలక్‌నగర్ ఇండస్ర్టీస్ అనే కంపెనీ మద్యం వ్యాపారంలో రెండు మూడు తరాలుగా ఉంది. అన్ని రాష్ర్టాలు ఆ కంపెనీ నుంచి అంతో ఇంతో మద్యం కొనుగోలు చేసేవి. అలాంటి కంపెనీ నుంచి మద్యం కొనుగోలు చేయడానికి జగన్ ప్రభుత్వం నిరాకరించింది. దీంతో విధిలేని పరిస్థితుల్లో జగన్‌రెడ్డి విధించిన షరతులకు తిలక్‌నగర్ ఇండస్ర్టీస్ తలవొంచక తప్పలేదు. అంగీకరించిన విధంగా చెల్లించాల్సిన ముడుపులను పది గ్రాముల బంగారు నాణేల రూపంలో కావాలని కోరడం వల్లనే ఆ కంపెనీ వాళ్లు పద్మావతి జ్యువెలరీస్ నుంచి 200 కోట్ల రూపాయల విలువైన బంగారం కొనుగోలు చేసి అప్పగించారు. ఇలా బంగారం కొనుగోలు చేసిన ఉదంతాలు ఆ కంపెనీ చరిత్రలో లేవు. జగన్‌రెడ్డిని సమర్థిస్తున్న వాళ్లు ఇందుకు ఏం సమాధానం చెబుతారు?
తమ్ముడు తమ్ముడే...
లిక్కర్ కుంభకోణం.. అమలు కోసం ఒక వెబ్ అంటే సాలెగూడు తరహా నెట్‌వర్క్‌ను సృష్టించారు. ఫలితంగానే ఈ వ్యవహారంలో పలువురి పేర్లు బయటికొస్తున్నాయి. లిక్కర్‌ను సొంతానికి ప్రధాన ఆదాయ వనరుగా మార్చిన ఘనత కూడా జగన్‌రెడ్డికే దక్కుతుంది. ఉమ్మడి రాష్ట్రంలో గానీ, రాష్ట్రం విడిపోయిన తర్వాత గానీ ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారెవరూ లిక్కర్‌ను తమ పార్టీల ప్రధాన ఆర్థిక వనరుగా భావించలేదు. మద్యం తయారీ కంపెనీలు ఎన్నికల సమయంలో ఆయా రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చేవి. అంతకు మించి మద్యం కొనుగోళ్లలో ప్రభుత్వ పెద్దల జోక్యం ఉండేది కాదు. డిమాండ్‌ను బట్టి ఏ బ్రాండ్‌ను ఎంత మొత్తంలో కొనుగోలు చేయాలో అధికారుల స్థాయిలో నిర్ణయించేవారు. జగన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత లిక్కర్ వ్యాపారాన్ని బంగారు గుడ్డు పెట్టే బాతుగా మార్చారు. నెలకు 50 నుంచి 60 కోట్ల వరకు పార్టీ ఖాతాకు సమర్పించవలసిందే అని షరతు పెట్టారు. తమకు అందే ముడుపులను బట్టి ఏ కంపెనీ నుంచి ఎంత మొత్తం కొనుగోలు చేయాలో పై స్థాయిలో నిర్ణయించేవారు. అధికారులు నిమిత్తమాత్రులు. ‘ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా’ అన్నట్టుగా అధికారులు తమ వాటాలు రాబట్టుకునేవారు. నిజానికి జగన్ అండ్ కో లక్ష్యంగా పెట్టుకున్న మొత్తాన్ని ఇవ్వడానికి పేరున్న బ్రాండ్లకు చెందిన కంపెనీలు అంగీకరించలేదు. ఆ కారణంగానే నాసిరకం మద్యం సరఫరా చేశారు. నిర్దేశించుకున్న మొత్తాలను కాజేశారు. ఉదాహరణకు మద్యం వ్యాపారంలో దశాబ్దాలుగా ఉన్న ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి అప్పుడు వైసీపీలోనే ఉన్నారు. తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అన్నట్టుగా ఆయనకు కూడా జగన్ అండ్ కో టార్గెట్ విధించింది. అయితే అంత మొత్తం ఇవ్వడం సాధ్యం కాదని మాగుంట తేల్చిచెప్పడంతో ఆయన సరఫరా చేసే మెక్‌డొనాల్డ్ మద్యం కొనుగోళ్లను నిలిపివేశారు. దాని స్థానంలో చెత్త బ్రాండ్లు మార్కెట్లోకి వచ్చాయి. ఈ విషయంలో ఎవరికైనా అనుమానాలు ఉంటే మాగుంట శ్రీనివాసులురెడ్డిని అడిగి తెలుసుకోవచ్చు. ఇసుక, మద్యం ద్వారా నెలకు వంద కోట్లకు పైగా సమకూర్చుకోవాలని జగన్ అండ్ కో లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ కారణంగానే ఈ రెండు విధానాలూ వివాదాస్పదం అయ్యాయి. నిజాయితీగా చెప్పుకోవాలంటే, జగన్‌రెడ్డి మినహా మరే ఇతర ముఖ్యమంత్రి కూడా మద్యం, ఇసుక నుంచి డబ్బు పిండుకొనే ప్రయత్నం చేయలేదు. అలాంటి అవకాశం ఉందన్న ఆలోచన కూడా వారెవరికీ రాలేదు.
2024 ఎన్నికల్లో జగన్ ఘోరంగా ఓడిపోవడానికి నాసిరకం మద్యం సరఫరా కూడా ఒక కారణం కాదా? ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడినందుకే దేవుడు 2019లో రాసిన స్ర్కిప్ట్‌ను తిరగరాశాడు. బ్రేక్ ఫాస్ట్ నుంచి రాత్రి డిన్నర్ వరకు డబ్బును మాత్రమే నంజుకు తినాలని చూసే వారిని దేవుడు మాత్రం ఉపేక్షిస్తాడా? ఫలితాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నారు. జరిగిన తంతును పరిశీలించిన ఎవరైనా జగన్ అండ్ కోకు పాపభీతి ఉందని, దైవభక్తికి కొదవ లేదని చెప్పగలరా? పాపభీతి ఉంటే ప్రజల రక్తమాంసాలను పణంగా పెట్టి కాసులకు కక్కుర్తిపడరు. నాస్తికులు కూడా ఇలాంటి నీచానికి ఒడిగట్టరు. ఎందుకంటే వారిలో నైతికత అధికంగా ఉంటుంది. బైబిల్‌ను నిత్యం పఠించేవారు, క్రైస్తవ మతాన్ని చిత్తశుద్ధితో ఆచరించేవారు ఎవరూ కూడా పాపిష్టి డబ్బు కోసం ఆశపడరు. దీన్నిబట్టి జగన్‌రెడ్డి అటు ఆస్తికుడూ కాదు– ఇటు నాస్తికుడూ కాడని భావించాల్సి ఉంటుంది. ఆయనకు డబ్బు మాత్రమే ముఖ్యం. అధికారం కూడా డబ్బు కోసమే అనే కోణంలోనే ఆయన ఆలోచిస్తాడన్నది సుస్పష్టం. పాపభీతి, కుటుంబ సంబంధాల పట్ల అనురాగం ఉండి ఉంటే సొంత బాబాయ్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని వెనకేసుకొని రారు కదా? 2004తో పోల్చితే జగన్‌రెడ్డి వద్ద ఇప్పుడు అంతులేని సంపద ఉంది. అదే సమయంలో కుటుంబ సభ్యులు ఆయనకు దూరమయ్యారు. రక్తసంబంధం కంటే డబ్బే ముఖ్యమని భావించి సొంత చెల్లిని, తల్లిని కూడా దూరం చేసుకున్నారు. మనకు అంటూ ఎవరూ లేనప్పుడు ఈ డబ్బు ఎందుకు? తమిళనాడు ముఖ్యమంత్రిగా మరణించిన జయలలిత ఏమి తీసుకెళ్లారు? నాసిరకం మద్యం తాగి ప్రాణాలు కోల్పోయినవారు, ఒళ్లు గుల్ల చేసుకున్నవారి శాపనార్థాలను కొట్టిపారేయలేం. ఎవరైనా పాప పరిహారం చెల్లించుకోవాల్సిందే! అది ఎప్పుడు అన్నదే ప్రశ్న?
పర్వర్టడ్ ఆర్డర్...!
ఈ విషయాన్ని అలా ఉంచితే, వివిధ రాష్ర్టాల హైకోర్టు న్యాయమూర్తులు ఇస్తున్న కొన్ని ఆదేశాలపై దేశ సర్వోన్నత న్యాయస్థానం చేస్తున్న వ్యాఖ్యలు, వెల్లడిస్తున్న అభిప్రాయాలు సంచలనంగా ఉంటున్నాయి. కొన్ని సందర్భాలలో సుప్రీంకోర్టు వ్యాఖ్యలు కటువుగానూ ఉంటున్నాయి. సదరు వ్యాఖ్యలను పరిశీలిస్తే సుప్రీంకోర్టు ఆగ్రహానికి గురైనవారు హైకోర్టు న్యాయమూర్తులుగా ఎలా నియమితులయ్యారు? అన్న సందేహం కలగడం సహజం. అయితే అలాంటి వారిని కూడా సుప్రీంకోర్టు కొలీజియమే ఎంపిక చేసినందున ఎవరిని తప్పు పట్టాలి? తాజాగా ఒక హత్య కేసులో అరెస్టై జైల్లో ఉన్న కన్నడ నటుడు దర్శన్‌కు కర్ణాటక హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంపై సుప్రీంకోర్టు విస్మయం వ్యక్తంచేసింది. ‘పర్వర్టడ్ ఆర్డర్’ అని కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఇంకొంచెం వెనక్కు వెళితే, ఆంధ్రప్రదేశ్‌లో ఐపీఎస్ అధికారి సంజయ్‌కు ముందస్తు బెయిల్ మంజూరు చేయడంపై కూడా సుప్రీంకోర్టు విస్మయం వ్యక్తంచేసింది. బెయిల్ విచారణ దశలోనే పూర్తి స్థాయి ట్రయల్ నిర్వహించినట్టుగా 49 పేజీల ఆదేశాలు జారీ చేయడం ఏమిటి? అని సుప్రీంకోర్టు నిలదీసింది. అక్రమ మైనింగ్ కేసులో సుదీర్ఘ విచారణ అనంతరం హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టు గాలి జనార్దన్‌రెడ్డిని దోషిగా నిర్ధారిస్తూ ఏడేళ్ల కారాగార శిక్ష విధించింది. దాదాపు పదమూడేళ్ల విచారణ తర్వాత సీబీఐ కోర్టు ఈ తీర్పు వెలువరించగా హైకోర్టు మాత్రం ఒకే రోజు గాలి జనార్దన్‌రెడ్డి పిటిషన్‌పై విచారణ చేసి బెయిల్ మంజూరు చేయడమే కాకుండా సీబీఐ కోర్టు తీర్పుపై స్టే కూడా విధించింది. ఇలాంటి సందర్భాలలో కింది స్థాయి న్యాయ వ్యవస్థలో నైతికత చచ్చిపోదా? అన్న అనుమానం కలుగుతుంది. ఇవన్నీ ఒక ఎత్తు కాగా, నోట్ల కట్టలు తగులబడిన ఉదంతంలో అభిశంసనకు గురికాబోతున్న ఢిల్లీ హైకోర్టు పూర్వ న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ నోట్ల కట్టలు దొరికినంత మాత్రాన ఒక వ్యక్తిని నిందితుడిగా ఎలా పరిగణిస్తారని ప్రశ్నిస్తున్నారు.
అవినీతి కేసులలో రెడ్‌హ్యాండెడ్‌గా దొరకడం అంటే నోట్ల కట్టలు అందుకోవడమే కదా? సీబీఐ, ఏసీబీ అధికారులు అలాంటి సందర్భాలలోనే కదా నిందితులను అరెస్టు చేస్తారు. ఇప్పుడు వర్మ సంధిస్తున్న ప్రశ్న ప్రకారం వారు నిందితులు కారన్న మాట! ఆయన అంతటితో ఆగకుండా తనపై చర్య తీసుకునే అధికారం కానీ, విచారణ జరిపే అధికారం కానీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేదంటూ సుప్రీంకోర్టులోనే పిటిషన్ వేశారు. న్యాయ వ్యవస్థపై కుట్రలు జరగకుండా నిరోధించడానికి, వ్యవస్థ ఔన్నత్యం కాపాడటానికి రాజ్యాంగంలో హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు ప్రత్యేక రక్షణలు కల్పించారు. ఇప్పుడు చోటుచేసుకుంటున్న పరిణామాలను గమనిస్తే ఈ రక్షణలను కొందరు దుర్వినియోగం చేస్తున్నారని సామాన్య ప్రజలకు అనుమానం రాకుండా ఎలా ఉంటుంది? జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు తగులబడటాన్ని యావద్దేశం గమనించింది. అయినా ఆయనను అభిశంసించాలని పార్లమెంటును కోరే అధికారం కూడా సుప్రీంకోర్టుకు ఉండదా? సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసిన వారినే కదా హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా రాష్ట్రపతి ఆమోదం కోసం కేంద్రం సిఫారసు చేస్తుంది. ఏదైనా పదవిలో నియమితుడైన వ్యక్తి తప్పు చేస్తే చర్య తీసుకునే అధికారం నియామకపు అథారిటీకే మిగతా వ్యవస్థలలో ఉంటుంది. ఒక్క న్యాయ వ్యవస్థలోనే ఈ వెసులుబాటు లేదు. ఐదేళ్లకోసారి ప్రభుత్వాలను మార్చే అధికారం ఓటర్లకు ఉంటుంది. అంటే, తాము ఎన్నుకున్న ప్రభుత్వాన్ని ఐదేళ్ల తర్వాత ప్రజలు తిరస్కరించవచ్చు. అవినీతి, అనైతిక చర్యలకు పాల్పడిన న్యాయమూర్తులను తొలగించాలంటే ప్రస్తుతానికి పార్లమెంటులో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టడం ఒక్కటే మార్గం. రాజ్యాంగ నిర్మాతలు సదుద్దేశంతో న్యాయ వ్యవస్థ ఔన్నత్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రక్షణ ఏర్పాట్లు చేశారు. అయితే ప్రస్తుతం మన దేశంలో న్యాయ వ్యవస్థ ప్రతిష్ఠ మసకబారుతోంది. ప్రజలకు న్యాయ వ్యవస్థపై నమ్మకం సడలుతోంది. తప్పు చేసిన కింది స్థాయి న్యాయాధికారులపై చర్య తీసుకునే అధికారం హైకోర్టులకు ఉంది. అదే హైకోర్టు తప్పు చేస్తే మాత్రం చర్య తీసుకోకూడదట! ఈ రక్షణ వల్లనే కదా న్యాయ వ్యవస్థలో పెడధోరణులు చోటు చేసుకుంటున్నాయి. ఉపరాష్ట్రపతి పదవికి ఇటీవలే రాజీనామా చేసిన జగదీప్ ధన్‌ఖడ్ ఈ విషయంలో తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా వ్యక్తంచేయడం చూశాం. ఫలానా కేసులో హైకోర్టు ఆదేశాలు, తీర్పులు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయని సుప్రీంకోర్టు ఎన్నో సందర్భాలలో వ్యాఖ్యానించింది. అయితే సదరు ఆదేశాలు, తీర్పులు ఇచ్చిన న్యాయమూర్తులు మాత్రం నిక్షేపంగా ఉంటారు.
న్యాయ సూత్రాలకు విరుద్ధంగా రాజ్యాంగ నిర్దేశితాలకు భిన్నంగా తీర్పులు ఇచ్చిన సందర్భాలలో సర్వోన్నత న్యాయస్థానం అయినా దాన్ని సరిదిద్దే పరిస్థితి ఉండాలి కదా? నాపై విచారణ జరపడానికి నువ్వెవరివి? అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తినే అభిశంసన తీర్మానం ఎదుర్కోబోతున్న జస్టిస్ యశ్వంత్ వర్మ ఎలా అనగలుగుతున్నారు? ఇలాంటి వారిని కట్డడి చేయడానికైనా వ్యవస్థలో కొన్ని మార్పులు అవసరం అని ప్రజలు భావించడం తప్పు కాదు కదా? తప్పు చేస్తే చర్యలు ఉంటాయన్న భయం ఉంటేనే కదా ఏ వ్యవస్థ అయినా బాధ్యతగా ఉంటుంది? నేను ఏం చేసినా నన్ను విమర్శించకూడదు, నాపై ఎవరూ చర్యలు తీసుకోలేరు అనే అపరిమిత ధీమా ఏ వ్యవస్థకూ మంచిది కాదు. సుప్రీంకోర్టు తప్పు పడితే పరిస్థితి ఏమిటి? అన్న కనీసపు వెరపు హైకోర్టులకు ఉండాలా? వద్దా? నటుడు దర్శన్ విషయంలో గానీ, ఐపీఎస్ సంజయ్ విషయంలో గానీ హైకోర్టులు అనుచితంగా బెయిల్ మంజూరు చేశాయని సుప్రీంకోర్టు భావించినప్పుడు సదరు ఆదేశాలు ఇచ్చినవారు నిక్షేపంగా ఉండవచ్చా?.. తెలియదు! అదేమంటే న్యాయమూర్తులను ఏమీ అనకూడదు అని చట్టంలో ఉందంటారు. న్యాయ వ్యవస్థ ఔన్నత్యాన్ని కాపాడాల్సిందే! అయితే న్యాయ వ్యవస్థకు మచ్చ తెస్తున్నదీ, ప్రతిష్ఠ దిగజారుస్తున్నదీ ఎవరు? ప్రజలు కాదు కదా? న్యాయ వ్యవస్థలో ఉన్నవారే కదా అందుకు బాధ్యులు? ఇవాళ ఈ దేశంలో మిగతా వ్యవస్థలన్నీ విశ్వసనీయతను కోల్పోయాయి. ఒక్క న్యాయ వ్యవస్థ మాత్రమే అంతో ఇంతో విశ్వసనీయతను నిలుపుకొంది. పలు కీలక సందర్భాలలో ఆయా న్యాయస్థానాలు వెలువరించిన కీలక తీర్పుల వల్ల న్యాయ వ్యవస్థ ఔన్నత్యం ఇనుమడించడమే కాకుండా, న్యాయ వ్యవస్థ పట్ల ప్రజల్లో నమ్మకం పెరిగిన విషయం కూడా వాస్తవం. నిజానికి న్యాయ వ్యవస్థ సక్రమంగా, నిజాయితీగా వ్యవహరిస్తే అన్ని వ్యవస్థలూ గాడిలోనే ఉంటాయి.
న్యాయ వ్యవస్థపై ఇటు పాలకుల్లో అటు ప్రజల్లో భయం పోకూడదు. లేని పక్షంలో అరాచకం ప్రబలుతుంది. అంటే న్యాయ వ్యవస్థపై ఎంతటి గురుతర బాధ్యత ఉందో అర్థం చేసుకోవచ్చు. మిమ్మల్ని జీతాలకు పనిచేసే మిగతావారిలా సమాజం చూడటం లేదు. ‘మిలార్డ్’ అంటే నా ప్రభువా అని కోర్టులలో న్యాయమూర్తులను సంబోధిస్తారు. ఈ దేశ పౌరులకు న్యాయ వ్యవస్థపై విశ్వాసం పోతే మీరు ఎవరికి ప్రభువులు? అని ప్రశ్నించడానికి ఎంతో సమయం పట్టదు. ఆ మధ్య నాగపూర్‌లో ఒక న్యాయాధికారి తప్పుడు ఆదేశాలు జారీ చేయడంతో ప్రజలు ఆయన వెంటపడ్డారు. హెల్మెట్ పెట్టుకొని పారిపోయారు. న్యాయ వ్యవస్థ గౌరవం పెంచేది.. తుంచేది న్యాయమూర్తులే. న్యాయమూర్తుల తీర్పులే. న్యాయమూర్తులు సక్రమంగా ఉంటే వారి ఔన్నత్యాన్ని రాజకీయ నాయకులు కూడా దిగజార్చలేరు. కాబట్టి మీ వ్యవస్థ ఔన్నత్యాన్ని కాపాడుకోవడం మీ చేతుల్లోనే ఉంది మిలార్డ్స్!
ఆర్కే
ఈ వార్తలు కూడా చదవండి..
సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటన షెడ్యూల్ ఖరారు
లొంగిపోయిన అగ్ర మావోయిస్టులు.. డీజీపీ ఏమన్నారంటే..
Read latest AP News And Telugu News