Supreme Court Verdict: ఇది జ్యుడీషియల్ యారగన్సీ కాదా
ABN , Publish Date - Nov 23 , 2025 | 03:16 AM
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంపించే బిల్లులను ఆమోదించడానికి గవర్నర్లు, రాష్ట్రపతికి గడువు ఉండాలా? వద్దా? అన్న విషయంలో గత కొంతకాలంగా నెలకొన్న సందిగ్ధతకు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తాజా తీర్పుతో తాత్కాలికంగా...
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంపించే బిల్లులను ఆమోదించడానికి గవర్నర్లు, రాష్ట్రపతికి గడువు ఉండాలా? వద్దా? అన్న విషయంలో గత కొంతకాలంగా నెలకొన్న సందిగ్ధతకు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తాజా తీర్పుతో తాత్కాలికంగా తెరపడింది. గవర్నర్లు, రాష్ట్రపతికి సుప్రీంకోర్టు గడువు విధించజాలదని చెబుతూనే... బిల్లుల ఆమోదంలో అసాధారణ జాప్యం జరిగినప్పుడు పరిమిత స్థాయిలో న్యాయస్థానం జోక్యం చేసుకోవచ్చునని తాజా తీర్పులో పేర్కొన్నారు. దీంతో కర్ర విరగలేదు– పాము చావలేదు అన్నట్టుగా వ్యవహారం తయారైంది. బిల్లుల ఆమోదంలో కొంత మంది గవర్నర్లు రాజ్యాంగ స్ఫూర్తితో వ్యవహరించడం లేదన్న కారణంగా ఈ అంశంపై చాలాకాలంగా వివాదం నెలకొంది. రాష్ర్టాలలో స్వపక్షం అధికారంలో ఉన్నప్పుడు ఒకలా – ప్రతిపక్షం అధికారంలో ఉన్నప్పుడు మరోలా గవర్నర్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శ ఎప్పటి నుంచో ఉంది. గవర్నర్ల వ్యవస్థ దుర్వినియోగమవుతోందని, ఆ వ్యవస్థను రద్దు చేయాలని కూడా ప్రతిపక్షాలు చాలా సందర్భాలలో డిమాండ్‌ను లేవనెత్తాయి. ఈ నేపథ్యంలోనే తమిళనాడు ప్రభుత్వం ఆ రాష్ట్ర గవర్నర్‌కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దానిపై గవర్నర్లతోపాటు రాష్ట్రపతికి గడువు విధిస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు ఇచ్చింది. దీనిపై అభ్యంతరం తెలుపుతూ రాష్ట్రపతి కార్యాలయం 14 ప్రశ్నలను సుప్రీంకోర్టుకు సంధించింది. కేంద్రం కూడా గొంతు కలిపింది. ఫలితమే రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తాజా తీర్పు! మన న్యాయ వ్యవస్థ కొన్ని సందర్భాలలో పరిణతి ప్రదర్శిస్తుండగా, మరికొన్ని సందర్భాలలో దూకుడుగా వ్యవహరిస్తోంది. కొన్ని కేసుల విచారణ సందర్భంగా న్యాయమూర్తులు చేస్తున్న వ్యాఖ్యలు ‘జ్యుడీషియల్ యారగన్సీ’ని తలపిస్తున్నాయి. తాజా తీర్పుతో గవర్నర్లు–రాష్ర్టాలకు మధ్య వివాదాలు కొనసాగుతూనే ఉంటాయి.
అంతులేని కథలేనా...?
ఏ విషయంలోనైనా ‘గడువు’ అనేది ఉండాలన్నది జనాభిప్రాయం. మనం రోగాలకు వాడే మందులకు కూడా గడువు ఉంటుంది కదా! కాలమాన పరిస్థితులను బట్టి ప్రభుత్వాలు చట్టాలు చేస్తాయి. అలాంటప్పుడు వాటిని నిరవధికంగా పెండింగ్‌లో పెడితే ప్రజలకు ప్రయోజనం ఉండదు కదా! సరైన సమయంలో సరైన మందు వాడినప్పుడే రోగం నయమవుతుంది. రాజ్యాంగం ప్రకారం గవర్నర్లకు–రాష్ట్రపతికి గడువు విధించే అధికారం న్యాయ వ్యవస్థకు లేకపోవచ్చు. అలాగని ఎవరికి వారు చేతులు ముడుచుకొని ఉండిపోతే ప్రజా ప్రయోజనాలు ఏంకావాలి? రాజ్యాంగ వ్యవస్థలలో భాగమైన రాష్ట్రపతికి గడువు విధించే అధికారం న్యాయ వ్యవస్థకు లేని పక్షంలో... అదే రాజ్యాంగంలో మరో భాగమైన లెజిస్లేచర్ విషయంలో మరోరకంగా ఉత్తర్వు ఎలా ఇవ్వగలరు? తమకు అధికారం లేదని చెప్పడం వరకు ఆక్షేపణ ఉండదు కానీ, అదే సమయంలో ప్రస్తుత సమస్యను అధిగమించడానికి పార్లమెంటులో చట్టం చేయాలని లేదా రాజ్యాంగ సవరణ చేయాలని సుప్రీంకోర్టు సూచించి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం వినిపిస్తోంది. దీనివల్ల బాధిత పక్షానికి ఎంతో కొంత ఉపశమనం లభించి ఉండేది. ‘గడువు’ అనేది ఒక అనివార్యంగా ఉండాలా? లేదా? అన్నది ఎప్పుడు తేలాలి? వాహనాల వినియోగానికి కూడా గడువు విధిస్తున్నాము కదా! కాలం చెల్లిన ఎన్నో చట్టాలను ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం రద్దు చేసింది కదా! అదే విధంగా గవర్నర్లకు, రాష్ట్రపతికి గడువు విధిస్తూ చట్టం చేయవచ్చు కదా! ఈ విషయంలో సుప్రీంకోర్టు మౌనంగా ఉన్నందునే రాజకీయ పార్టీలు సహజంగానే ఆ అంశం జోలికి వెళ్లవు. ఇదే సుప్రీంకోర్టు కొద్ది రోజుల క్రితం పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవడానికి తెలంగాణ శాసనసభ స్పీకర్‌కు గడువు ఎలా విధించింది? స్పీకర్లు రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన వ్యవస్థలకు అధిపతులే కదా? గవర్నర్లు, ఆ మాటకొస్తే న్యాయమూర్తులకు జీతభత్యాలు చెల్లించాలన్నా అవే చట్టసభలు ఆమోదించాలి కదా! తెలంగాణ శాసనసభ స్పీకర్‌కు గడువు విధించడంతో అయిపోలేదు. ఈ అంశంపై విచారణకు వచ్చిన కోర్టు ధిక్కరణ పిటిషన్ సందర్భంగా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు జ్యుడీషియల్ యారగన్సీని గుర్తుకు తెస్తున్నాయి. ‘మా ఆదేశాలు అమలు చేస్తారా లేదా? కొత్త సంవత్సరం రోజున ఎక్కడ ఉండాలో... అంటే జైల్లో ఉంటారో బయట ఉంటారో తేల్చుకోండి’ అని సుప్రీంకోర్టు తెలంగాణ స్పీకర్‌ను ఉద్దేశించి కఠినంగా వ్యాఖ్యానించింది. గవర్నర్‌కు గడువు విధించే అధికారం లేనప్పుడు లెజిస్లేచర్ అధిపతికి గడువు విధించడంతోపాటు కోర్టు ధిక్కారం కింద జైలుకు పంపే అధికారం న్యాయ వ్యవస్థకు ఉంటుందా? అన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది.
స్పీకర్‌ను జైలుకు పంపగలరా?
వాస్తవానికి, ఫిరాయింపులకు పాల్పడిన వారిపై స్పీకర్లు ఫలానా గడువులోపే చర్య తీసుకోవాలని పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలో లేదు. అలా చట్టంలో గడువు విధించకపోతే సదరు చట్టం చేసిన లక్ష్యం ఎలా నెరవేరుతుందని ప్రశ్నించాల్సిన సుప్రీంకోర్టు... ఇప్పుడు తెలంగాణ స్పీకర్‌కు తనకు తానుగా గడువు విధించింది. ఫిరాయింపులు, సభ్యుల రాజీనామాల విషయంలో సభాపతులు ఎడతెరిపిలేకుండా తాత్సారం చేస్తున్నారు. చట్టంలోని లొసుగులను ఉపయోగించుకుంటున్నారు. సదరు లొసుగులను అధిగమించే చర్యలకు ఉపక్రమించాల్సిన సుప్రీంకోర్టు మౌనంగా ఎందుకు ఉంటోందో తెలియదు. ఫిరాయింపుల వ్యవహారం ప్రహసనంలా మారిందన్నది ప్రజాభిప్రాయం. చట్టం చేసిన లక్ష్యం నెరవేరాలంటే గడువు ఉండాలి. ఆ మేరకు పార్లమెంటుకు సర్వోన్నత న్యాయస్థానం సూచించి ఉండాల్సింది. అలా కాకుండా ఒక్కో కేసు విషయంలో ఒక్కోలా తీర్పులు ఇస్తూ పోతుండటం వల్ల న్యాయ వ్యవస్థపై గౌరవం తగ్గుతుంది. రాజ్యాంగం ప్రకారం చట్టసభల ప్రిసైడింగ్ అధికారులకు కూడా రక్షణ ఉంటుంది. అయినప్పటికీ... చర్య తీసుకుంటారా? జైలుకు వెళ్లడానికి సిద్ధపడతారా? అని న్యాయస్థానం హూంకరించింది. ఇదొక రకంగా పరిధిని అతిక్రమించడమే. నిజంగా ఆ పరిస్థితే వస్తే తెలంగాణ శాసనసభ స్పీకర్‌ను జైలుకు పంపగలరా? అదే జరిగితే సదరు ఆదేశాలు ఇచ్చిన న్యాయమూర్తిపై శాసనసభ కూడా చర్యలకు ఉపక్రమిస్తే పరిస్థితి ఏమిటి? అందుకే రాజ్యాంగ బద్ధంగా ఏర్పడిన వ్యవస్థలు తమ పరిధులకు లోబడి హుందాగా వ్యవహరించాలని రాజ్యాంగ నిర్మాతలు ఆశించారు. ఎవరికి వారు తామే గొప్ప అనుకుంటే రాజ్యాంగపరమైన ప్రతిష్టంభన ఏర్పడదా? నాలుగు దశాబ్దాల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇటువంటి ప్రతిష్టంభనే ఏర్పడింది.

హద్దుల్లో... హుందాగా...
రాజ్యాంగ బద్ధమైన వ్యవస్థల మధ్య సున్నితమైన లక్ష్మణ రేఖ ఉంటుంది. రాజ్యాంగ నిర్మాతల అభిమతం అదే. అయితే, ఇటీవలి కాలంలో కేసుల విచారణ సందర్భంగా న్యాయ వ్యవస్థలోని కొందరు తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. చివరకు అవేమీ తీర్పులో భాగంగా ఉండవు. అయితే.. అలాంటి వ్యాఖ్యలు, అభిప్రాయాలు వెలువడినప్పుడు అవన్నీ న్యాయస్థానాల తీర్పులు, ఆదేశాలుగానే ప్రజలు పరిగణిస్తున్నారు. కోర్టు ధిక్కార కేసులలో కూడా అరుదైన సందర్భాలలో మాత్రమే సంబంధిత అధికారులను పిలిపించాలి కానీ, చీటికీ మాటికీ కాదని సుప్రీంకోర్టు చెప్పింది. కానీ, ఆచరణలో మరోలా జరుగుతోంది. మిగతా వ్యవస్థలతో పోల్చితే సామాన్య ప్రజలు ఇప్పటికీ న్యాయస్థానాల మీదనే నమ్మకం ఎక్కువ పెట్టుకుంటున్నారు. అయితే, కొంతమంది న్యాయమూర్తులు కేసు మెరిట్స్‌తో సంబంధం లేకుండా వ్యక్తిగత అభిప్రాయాలను వెల్లడించడం ఇప్పుడొక సమస్యగా మారుతోంది. దీనివల్ల న్యాయ వ్యవస్థ కొన్ని సందర్భాలలో ప్రజల మన్ననలను పొందుతుండగా, మరికొన్ని సందర్భాలలో ఆత్మరక్షణలో పడుతోంది. ఇప్పుడు మళ్లీ గడువు విషయానికి వద్దాం! ఏ విషయంలో అయినా గడువు అనేది అవసరమని అందరూ అంగీకరిస్తున్నారు. ‘గవర్నర్‌కు గడువు విధిస్తూ చట్టం చేయండి లేదా రాజ్యాంగాన్ని సవరించండి’ అని పార్లమెంటును సర్వోన్నత న్యాయస్థానం చొరవ తీసుకుని కోరితే ప్రజలు కూడా హర్షిస్తారు కదా? పార్టీ ఫిరాయింపుల విషయంలో కూడా ఫలానా గడువులోగా చర్యలు తీసుకునేలా చట్టాన్ని సవరించాలని సూచిస్తే ఎవరు మాత్రం అభ్యంతరం చెబుతారు? ఇలాంటి విషయాలలో తమకు అధికారం లేదని న్యాయ వ్యవస్థ అభిప్రాయపడితే చేయగలిగిందేమీ లేదు. అలా అయితే కేసుల విచారణ సందర్భంగా చట్టం, రాజ్యాంగం సమ్మతించని వ్యాఖ్యలు, అభిప్రాయాలు ఎలా వెలిబుచ్చుతారు? అన్న ప్రశ్న వస్తోంది. దిక్కులేని వాడికి దేవుడే దిక్కు అంటారు. మిగతా వ్యవస్థల వద్ద న్యాయం జరగనప్పుడు ప్రజలు అంతిమంగా న్యాయ వ్యవస్థ తలుపునే తడతారు కదా! అధికారం ఉన్నా లేకపోయినా న్యాయ వ్యవస్థకు బాధ్యత ఉండకపోతుందా? ఫలానా సమస్యను అధిగమించడానికి చట్టాన్ని చేయవచ్చునని గతంలో కొన్ని సందర్భాలలో సూచించారు కదా? రాజకీయ పార్టీలు బడ్జెట్‌లో సింహభాగాన్ని ఓట్ల కొనుగోలు కోసం తాయిలాల కింద పంచిపెడుతున్న విషయంలో కూడా ఈ దేశ ప్రజలు న్యాయ వ్యవస్థపై గంపెడు ఆశలు పెట్టుకున్నారు. గడువు ఉన్నప్పుడే ఎవరైనా బాధ్యతగా వ్యవహరిస్తారు. రాజ్యాంగాన్ని ఎడాపెడా రాజకీయ అవసరాలకోసం సవరించిన ఈ దేశంలో గవర్నర్లయినా, స్పీకర్లయినా వారందరికీ గడువు విధిస్తూ సవరణ చేయలేమా? ఈ గడువు అనేది లేకపోతే వ్యవస్థలపై ప్రజలకు నమ్మకం పోతుంది. న్యాయ వ్యవస్థకు కూడా ఇదే మాట వర్తిస్తుంది.
కోర్టుల్లోనే అంతులేని జాప్యం
న్యాయ స్థానాలలో కేసుల పరిష్కారం విషయంలో అంతులేని జాప్యం జరుగుతోంది. ఇందులో కొన్నింటి విషయంలో సహేతుక కారణాలు ఉండగా, చాలా సందర్భాలలో చట్టంలోని లొసుగులను అడ్డం పెట్టుకొని నేరస్థులు చట్టంతో, న్యాయస్థానాలతో చెలగాటం ఆడుతున్నారు. వంద మంది నేరస్థులు తప్పించుకున్నా ఫర్వాలేదుగానీ ఒక్క అమాయకుడు శిక్షకు గురి కాకూడదన్న సూక్తి వినడానికి బాగానే ఉంటుంది. ఆచరణలోనే ఇది నవ్వులపాలవుతోంది. సాదాసీదా నేరస్థుల విషయంలో జాప్యం జరిగినా ఫర్వాలేదుగానీ రాజకీయాలలోకి వచ్చిన నిందితులు, నేరస్థుల విషయంలో అంతులేని జాప్యం జరిగితే సమాజం నష్టపోతుంది. కేసుల పరిష్కారంలో ఏళ్లూ పూళ్లూ పట్టడం వల్ల నిందితులు అధికారంలోకి కూడా వస్తున్నారు. వారు అధికారంలో ఉన్నప్పుడు తీసుకొనే చర్యలకు ఎవరు బాధ్యత వహిస్తారు? బహుశా ఈ కారణంగానే కాబోలు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేసిన కొందరు ఆర్థిక నేరాలు, క్రిమినల్ నేరాలతో సంబంధం ఉన్న ప్రజాప్రతినిధులపై కేసుల విచారణను ఏడాదిలోగా పూర్తి చేయాలని తీర్పు ఇచ్చారు. ప్రజాప్రతినిధులపై ఉన్న కేసుల విచారణకు గడువు ఉండాలనే కదా ఇటువంటి ఉత్తర్వులు ఇచ్చింది! అయితే, దురదృష్టవశాత్తు ఈ ఆదేశాలు ఏవీ అమలు కావడం లేదు. చట్టంలోని లొసుగులే అందుకు కారణమైతే వాటిని సవరించాలని సర్వోన్నత న్యాయస్థానం సూచించలేదా? కాలానుగుణంగా ఎన్నో చట్టాలను సవరించుకున్నాం. కొత్త చట్టాలను చేసుకుంటున్నాం. ప్రజాప్రతినిధులపై విచారణ త్వరితగతిన పూర్తి కావాలన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేసిన వారి ఆదేశాలకే దిక్కు లేకపోతే ఎలా? ఈ కారణంగా న్యాయ వ్యవస్థ విశ్వసనీయత దెబ్బతినదా? తీవ్రమైన నేరాలు జరిగినప్పుడు ప్రజల్లో కలిగే ఆగ్రహావేశాలను చల్లార్చడం కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి సత్వరమే శిక్షలు పడేలా చేస్తున్నారు కదా? ప్రజాప్రతినిధులపై ఉన్న కేసులలో కూడా శీఘ్ర పరిష్కారం కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఎందుకు ఏర్పాటు చేయకూడదు? ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి విషయమే తీసుకుందాం. ఆయన దాదాపు పదమూడేళ్లుగా బెయిల్ మీదే ఉన్నారు. మధ్యలో ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో ఆయన నిర్ణయాల వల్ల రాష్ట్రం నష్టపోయిందని భావించడం వల్లనే గత ఎన్నికల్లో ఆయనను ప్రజలు పదకొండు సీట్లకే పరిమితం చేశారు. ఆయనపై నమోదైన అవినీతి కేసులలో కనీసం విచారణ కూడా ప్రారంభం కాలేదు. గడువు లేకపోవడం వల్లనే కదా ఇలా జరుగుతోంది. విచారణ పూర్తి చేసి ఆయన నిర్దోషి అని తేల్చితే ఎవరికీ అభ్యంతరం ఉండదు కదా! పుష్కర కాలం దాటినా జగన్‌రెడ్డి ఆర్థిక నేరస్థుడో కాడో తేల్చుకోలేని స్థితిలో ప్రజలు ఉండటం ఏమిటి? ఆయన దాఖలు చేసిన డిశ్చార్జి పిటిషన్లకు కూడా అతీగతీ లేదు. ఫలితంగా జగన్ వంటి వారు చట్టంతో చెలగాటమాడుతున్నారు.
కోర్టులో జగన్ తీరు...
ఎట్టకేలకు ఆరేళ్ల తర్వాత జగన్‌రెడ్డి సీబీఐ కోర్టు ఎదుట హాజరయ్యారు. ఈ సందర్భంగా చోటుచేసుకున్న హైడ్రామా విషయం తర్వాత చర్చించుకుందాం! కోర్టు అనుమతితో విదేశాలకు వెళ్లిన జగన్‌రెడ్డి కోర్టుకు తెలిపిన ఫోన్ నంబర్లలో అందుబాటులో లేరని సీబీఐ న్యాయస్థానానికి ఫిర్యాదు చేసింది. దీనిపై ఆయనను ఈ నెల 20న కోర్టుకు హాజరు కావలసిందిగా సీబీఐ కోర్టు ఆదేశించింది. విధిలేని పరిస్థితిలో ఆయన కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కోర్టులో జరిగింది తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. నిందితులు ఎవరైనా వారికోసం కేటాయించిన స్థానంలో న్యాయమూర్తి ఎదుట నిలబడి ఉండాలి. జగన్‌రెడ్డి మాత్రం సాక్షులకు కేటాయించిన చోట కూర్చున్నారు. కేసు విచారణకు వచ్చినప్పుడు విదేశీ పర్యటన నుంచి మీరు ఎప్పుడు తిరిగి వచ్చారు? అని న్యాయమూర్తి ప్రశ్నించగా, 20వ తేదీన అని జగన్ చెప్పారు. దీంతో పక్కన ఉన్న న్యాయవాది కల్పించుకొని అక్టోబరు 20వ తేదీన అని న్యాయమూర్తికి తెలిపారు. తర్వాత మీరు చెప్పుకొనేందుకు ఏమైనా ఉందా? అని న్యాయమూర్తి ప్రశ్నించగా, ఏమీ లేదని జగన్‌రెడ్డి చెప్పారు. అంతే, విచారణ పూర్తయిపోయింది. సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. ఆ తర్వాత అదే కోర్టు హాలులో ఉన్న కొంతమంది న్యాయవాదులు జగన్‌రెడ్డితో సెల్ఫీలు దిగారు. ఇది కోర్టు నియమాలకు విరుద్ధం. కోర్టు హాలులో ఫోన్ల వినియోగం నిషిద్ధం. నిందితులు, సాక్షులు నిశ్శబ్దంగా ఉండాలి. వారి జేబులలో ఫోన్లు ఉండకూడదు. జగన్‌రెడ్డికి స్పెషల్ ప్రివిలేజెస్ ఉన్నాయేమో తెలియదు. ఆయన నిందితులకు కేటాయించిన స్థానంలో కూడా కూర్చోలేదు. కుశల ప్రశ్నలవంటి ప్రశ్నలు అడగడానికి జగన్‌రెడ్డిని కోర్టు ఎందుకు పిలిపించిందో తెలియదు. జగన్‌రెడ్డి కోర్టు హాలులోకి ఆలస్యంగా రావడం వల్ల ఇతర కేసుల విచారణలో జాప్యం జరిగి సాక్షులు ఇబ్బందిపడ్డారు. ఆయనకు మాత్రం ప్రాధ్యానం ఇచ్చారు. న్యాయ వ్యవస్థలో ఎంతటివాడైనా కోర్టు హాలులో ఒదిగి ఉండాల్సిందే. పీవీ నరసింహారావు అంతటివాడే జేఎంఎం ముడుపుల కేసులో న్యాయ స్థానానికి వెళ్లి న్యాయాధికారి ఎదుట నిలబడ్డారు. అప్పటికే ప్రధానమంత్రిగా వ్యవహరించిన ఆయనకోసం కోర్టు కార్యకలాపాలు స్తంభించలేదు. ‘నేనేమిటి? కోర్టుకు హాజరు కావడం ఏమిటి?’ అని పీవీ నరసింహారావు భావించలేదు. జగన్‌రెడ్డి మాత్రం అలా భావిస్తున్నారు. అందుకే కోర్టు విచారణకు హాజరు కావడానికి ఆయన మొరాయిస్తున్నారు. ఈ క్రమంలో న్యాయ వ్యవస్థపై ఒత్తిడి తేవడం కోసం ఆయన ఎంచుకున్న మార్గం కూడా అనితర సాధ్యం. జగన్ కంటే ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు కూడా స్కిల్ కేసులో తనను అరెస్టు చేసినప్పుడు జనాల్ని పోగేసి హడావిడి చేయకుండా... న్యాయాధికారి వద్ద వినయంగా నిలబడ్డారు. జగన్‌రెడ్డి ఆకాశం నుంచి ఊడిపడలేదు. నిందితుడిగా కోర్టుకు హాజరు కావాల్సిన పరిస్థితికి ఒక రకంగా సిగ్గుపడాలి. జగన్‌రెడ్డి అలా కూడా భావించడం లేదు. తనను మళ్లీ మళ్లీ కోర్టుకు పిలవకుండా ఉండటం కోసం స్వరాష్ట్రం నుంచి జనాన్ని పోగేసి హైదరాబాద్‌లో హడావిడి సృష్టించారు. ఆయన ఏదో సాధించడానికి వస్తున్నాడు అన్నట్టు సోషల్ మీడియాలో బిల్డప్ ఇచ్చుకున్నారు. హైదరాబాద్‌లో కూడా ఆయనపై ప్రజాభిమానం ఉప్పొంగిందని ప్రజలను నమ్మించే స్కెచ్ వేశారు. అదంతా స్టేజ్ మేనేజ్డ్ డ్రామా అని ఆయనకు తెలుసు. అయితే, కొంత మంది తమను తాము మోసగించుకుంటూ జనాన్ని మోసగించాలని ప్రయత్నిస్తారు. జగన్‌రెడ్డి ఈ కోవకు చెందినవాడే. ఆయన బేగంపేట ఎయిర్ పోర్టులో దిగి, నాంపల్లిలోని సీబీఐ కోర్టుకు వెళ్లి, అక్కడ నుంచి లోటస్ పాండ్‌కు చేరుకునే వరకు కనిపించిన హడావిడి... బేగంపేట నుంచి తిరిగి బెంగళూరుకు వెళ్లేటప్పుడు కనిపించలేదంటే ఈ డ్రామా వెనుక ఉద్దేశ్యం తెలియడం లేదా? జగన్‌రెడ్డికి, తెలంగాణ రాష్ర్టానికి రాజకీయంగా ఏ సంబంధం లేదు. తెలంగాణలో ఆయన పార్టీని ఎప్పుడో మూసేసుకున్నారు. హైదరాబాదీలకు జగన్ కొత్త కాదు. ఆయనను చూడ్డం కోసం ఎగబడేంత ఎమోషనల్ అనుబంధం ఆయనతో వారికి లేదు. ఆంధ్రా మూలాలు ఉన్న వారు ఉంటేగింటే కొద్ది మంది ఉండవచ్చు.
ఇదే జగన్ వ్యూహం...
ఎంపిక చేసిన సందర్భాలలో మాత్రమే జగన్‌రెడ్డి బల ప్రదర్శన ఎందుకు చేస్తున్నారన్నదే కీలకం! తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆయన తరచూ విజయవాడ ఎయిర్ పోర్టుకు వెళతారు. అప్పుడేమీ జనం పోటెత్తరు. బెంగళూరు ఎయిర్ పోర్టులో సాదాసీదాగా దిగి యలహంక ప్యాలెస్‌కు వెళతారు. అక్కడ ఎయిర్ పోర్టులో ఆయనను ఎవరూ పట్టించుకోవడం లేదు. నిజంగా ఆయనపై ప్రజాభిమానం ఉప్పొంగిపోతుంటే కాలు బయటపెట్టిన ప్రతిసారీ జనం పోటెత్తాలి కదా? కేవలం పరామర్శలకు బయలుదేరినప్పుడు, ఇప్పుడు ఇలా కోర్టుకు హాజరు కాకుండా తప్పించుకొనే ఎత్తుగడలు వేసినప్పుడు మాత్రమే జనం పోటెత్తడం ఏమిటి? అది కూడా ఎంపిక చేసిన మూకకు మాత్రమే ఆదేశాలు వెళతాయి. అంటే, జగన్ కావాలనుకున్నప్పుడు మాత్రమే జనం పోటెత్తుతారు ప్రజాభిమానం ఉప్పొంగడం పచ్చి అబద్ధమని జగన్‌తో పాటు ఆయన అనుచరులందరికీ తెలుసు. అయినా వారు భ్రమల్లో ఉంటూ ప్రజలను కూడా భ్రమల్లోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. తమాషా ఏమిటంటే, దీనికంతటికీ కర్త, కర్మ, క్రియ అయిన జగన్‌రెడ్డి... తామే తోలుకొచ్చిన వాళ్లను చూసి నిజంగానే మురిసిపోవడం! ‘సీఎం సీఎం’ అని చేసే అర్థరహిత నినాదాలకు ఉప్పొంగిపోవడం వింతల్లోకెల్లా వింత. ఎన్నికలు జరిగి ఏడాదిన్నర కూడా కాలేదు. ఇంతలోనే ఎన్నికల్లో ఓడిపోయిన వారికోసం ప్రజలు అల్లాడిపోవడం అసంభవం. ఒకప్పుడు కమ్యూనిస్టులు నిర్వహించిన మహాసభలకు లక్షల సంఖ్యలో కార్యకర్తలు వచ్చేవారు. ఆ ప్రాంతమంతా ఎరుపు రంగు అలముకొనేది. ఆ వాతావరణం చూసిన వారికి కమ్యూనిస్టులు చాలా బలంగా ఉన్నారన్న అభిప్రాయం కలిగేది. నిజమేమిటంటే, కమ్యూనిస్టులు అప్పట్లో ఎక్కడ సభలు పెట్టినా అదే మనుషులు వెళ్లేవారు. అది ప్రజాబలం కాదు, ప్రదర్శన మాత్రమే అని తెలియడానికి ఎంతో కాలం పట్టలేదు. జగన్‌రెడ్డి స్వీయ దర్శకత్వంలో ప్రస్తుతం జరుగుతున్న ఈ జన సమీకరణ అనే డ్రామా కూడా ఇదే కోవలోకి వస్తుంది. అంతిమంగా జగన్‌రెడ్డి తనను తాను వంచించుకుంటున్నారు. అందులో రాజకీయ ఎత్తుగడ ఉంటే ఉండవచ్చు. ‘రప్పా రప్పా–గంగమ్మ జాతర’ వంటి ప్లకార్డులు ప్రదర్శిస్తూ జనాన్ని భయపెట్టే ఏ నాయకుడైనా అధికారానికి చేరువ కాగలడా? అయినా అదే మార్గాన్ని ఎంచుకున్నారంటే సొంత కేడర్‌లో ఆత్మవిశ్వాసం నింపి ప్రత్యర్థి కేడర్‌లో భయం నింపడమే ఇందులోని ఆంతర్యం కావొచ్చు.
2024 ఎన్నికలకు ముందు అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు వెళ్లినప్పుడు జనం ఇలా వెర్రెక్కినట్టు వ్యవహరించలేదే? చేయాల్సిందేదో పోలింగ్ రోజు చేసి చూపించారు. తాను ఆడుతున్న నాటకాలను ప్రజలు తెలుసుకోలేరని జగన్‌రెడ్డి భావించడం ఆయన చేస్తున్న తప్పు. ఎంపిక చేసుకున్న సందర్భాలలోనే బలప్రదర్శన చేస్తున్నారన్న విషయం ప్రజల్లోకి వెళ్లిపోయింది. ప్రజాప్రతినిధుల కేసుల విచారణలో జరుగుతున్న అంతులేని జాప్యం వల్లనే కాదా జగన్‌రెడ్డి వంటివారు ఇలాంటి ఆటలు ఆడుతున్నారు. మిగతా విషయాలలో వలె ప్రజాప్రతినిధులపై దాఖలైన కేసులు, ముఖ్యంగా ఆర్థిక నేరాలతో సంబంధం ఉన్న వారిపై నిర్దిష్ట కాల పరిమితిలో విచారణ పూర్తి చేయడానికి సర్వోన్నత న్యాయస్థానం చర్యలు తీసుకుంటే ఈ దేశానికి ఎంతో మేలు చేసినట్టవుతుంది. జగన్‌రెడ్డి వంటి వారి కేసుల విచారణకైనా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయడంలో సుప్రీంకోర్టు చొరవ తీసుకుంటుందని ఆశిద్దాం! లేని పక్షంలో ఎవరి మీద ఎవరికీ నమ్మకం ఉండదు. వ్యవస్థలపై ప్రజలలో నమ్మకాన్ని పాదుగొల్పాల్సిన బాధ్యత ప్రధానంగా న్యాయ వ్యవస్థపైనే ఉంటుందని నమ్ముదాం! ఆశిద్దాం!
ఆర్కే
ఇవి కూడా చదవండి..
రైలు రద్దీగా ఉంటే మాత్రం.. ఇలా ఎవరైనా చేస్తారా..
వాషింగ్‌మిషిన్ వాడేది దుస్తుల కోసమే అనుకుంటున్నారా..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి