Share News

Religious Extremism: కశ్మీర్‌లో ఏది ఓడాలి? ఏది గెలవాలి?

ABN , Publish Date - Apr 29 , 2025 | 05:48 AM

మారణకాండలూ కిరాతక కాల్చివేతలూ చరిత్రను గుర్తుకుతెస్తాయి. ఆ చరిత్ర వెనకున్న దారుణ భావాలపై దృష్టిపడేలా చేస్తాయి. పహల్గాం ఘోరకలిపై క్షోభించని హృదయం లేదు. గర్హించని మనసు లేదు. ఆగ్రహం చెందని ఆత్మలేదు...

Religious Extremism: కశ్మీర్‌లో ఏది ఓడాలి? ఏది గెలవాలి?

మారణకాండలూ కిరాతక కాల్చివేతలూ చరిత్రను గుర్తుకుతెస్తాయి. ఆ చరిత్ర వెనకున్న దారుణ భావాలపై దృష్టిపడేలా చేస్తాయి. పహల్గాం ఘోరకలిపై క్షోభించని హృదయం లేదు. గర్హించని మనసు లేదు. ఆగ్రహం చెందని ఆత్మలేదు. కన్నీరు కార్చని కన్నులు లేవు. మానవత్వం ప్రేరేపించే ఈ స్పందనలతో సమస్య తీరిపోదు. భవిష్యత్తు దారుణాలను ఆపనూలేవు. రాజకీయ లక్ష్యాల కోసం సాగించే రాక్షసాలనూ నిలువరించలేవు. మరోవైపు తక్షణ ప్రతీకారాలూ ప్రతిచర్యలూ మొదలయ్యాయి. హృదయాగ్నులను తాత్కాలికంగా చల్లార్చటం కూడా కొన్ని సందర్భాల్లో కావాల్సి వస్తుంది. కానీ సమస్య మూలాల్లోకి వెళ్లే సమాంతర చర్యలు చేపడితేనే వాటికీ సార్థకత లభిస్తుంది.

మతతత్వం రాజకీయాలను ప్రభావితం చేస్తున్నంతవరకూ తీవ్రవాదాలు నిరంతరం ఊపిరి పోసుకుంటూనే ఉంటాయి. కశ్మీర్‌ సమస్య చుట్టూ ఆవరించిన తీవ్రవాదం ఆ తత్వం నుంచే ప్రేరణ పొందుతోంది. దుశ్చర్యలన్నీ అందులో నుంచే తన్నుకొస్తున్నాయి. అందుకే విశాల దృష్టితో సమస్యను చూడటం మొదలుపెడితేనే కష్టమైనా, కొంత నష్టమైనా శాశ్వత పరిష్కార మార్గం కనపడుతుంది. మతదృక్పథంలో ఎంతటి వైషమ్యాలూ, ద్వేషాలూ, అమానవీయ ధోరణులూ గూడుకట్టుకుంటాయో గ్రహించటానికి పాకిస్థాన్‌ సైన్యాధిపతి ఆసిమ్‌ మునీర్‌ ఇటీవల చేసిన వ్యాఖ్యలే నిదర్శనం. పహల్గాం దారుణానికి ముందూ, తర్వాత కూడా మునీర్‌ చేస్తున్న వ్యాఖ్యలు యథాలాపంగా చేసినవిగా అనుకోలేం. 1940ల నుంచీ బలం పుంజుకున్న మతతత్వ భావాల నుంచే అలాంటి వ్యాఖ్యలు పుట్టుకొస్తున్నాయి.

1940లకు ముందు కూడా మతతత్వ భావాలు ఉన్నాయి. రెండో ప్రపంచయుద్ధం ముమ్మరంగా సాగుతున్న రోజుల్లో అవింకా ఇంకా బలపడ్డాయి. పాక్‌ సైన్యాధ్యక్షుడు పదేపదే ప్రస్తావిస్తున్నట్లుగా ముస్లింలు, హిందువులు అన్నిరకాలుగా వేర్వేరనీ ఇరువురూ ఒక రాజ్యవ్యవస్థలో ఇమడలేరనే భావన మతతత్వ సిద్ధాంతంలో కీలకం. 1940లో మహ్మద్‌ అలీ జిన్నా చేసిన లాహోర్‌ ప్రసంగంలో అది బలంగా వ్యక్తమైంది. దాన్నే మునీర్‌ లాంటి వాళ్లు పదేపదే వల్లెవేస్తున్నారు. నిజానికి జిన్నా మతతత్వాన్ని నూటికి నూరుపాళ్లూ విశ్వసించారని చెప్పలేం! ప్రత్యేక పాకిస్థాన్‌ ఏర్పడాలనే లక్ష్యానికి అది కావాల్సి వచ్చింది. జిన్నా ప్రకటన తర్వాత రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. ఆ తర్వాత అడుగులన్నీ దేశ విభజన దిశగానే పడ్డాయి. మైనారిటీలకు అనేక రక్షణలను కల్పించి, అధికారంలో సముచిత వాటా ఇచ్చి, ఉన్నత పదవులకు పోటీపడటానికి అన్ని అవకాశాలనూ అందించి, హిందువులు, ముస్లింలు సామరస్యంగా మనగలిగే రీతిలో గట్టి రాజ్యాంగబద్ధమైన ఏర్పాట్లు చేసుకుందామని ఎన్ని ప్రతిపాదనలు చేసినా జిన్నా అంగీకరించలేదు. అందుకు జిన్నా సమర్థించుకున్న తీరును తెలుసుకోవాలనుకుంటే లాహోర్‌ ప్రసంగం లోతుల్లోకి వెళ్లాలి. 1990ల తర్వాత ఇంటాబయటా పెరుగుతున్న భిన్నరకాల మతతత్వాలను అర్థం చేసుకోటానికీ అది అత్యవసరం. సారంలో మతతత్వాల మధ్య పెద్ద తేడా ఉండదు.


హిందువులూ ముస్లింలూ ఏక రాజ్యవ్యవస్థలో సామరస్యంతో జీవించగలరని ఎవరు చెప్పినా జిన్నా తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్య, లౌకిక విధానాలతో భిన్న మతాల ప్రజలకు సమానహక్కులు కల్పిస్తే ఐక్యంగా ఉండొచ్చన్న ప్రతిపాదనను జిన్నా కొట్టిపడేశారు. అట్లా సాధ్యం అవుతుందని చెప్పిన ఆనాటి కాంగ్రెస్‌ నాయకులకు అసలు హిందూ–ముస్లిం మతాల మూలసారమే అర్థం కావటంలేదనీ విమర్శించారు. జిన్నా దృష్టిలో ఇస్లాం, హిందూ మతాలు.. భిన్న దేవతారాధనలకూ, భిన్న విశ్వాసాలకూ పరిమితమైనవే కావు. అవి మతాలు కావనీ భిన్న సామాజిక వ్యవస్థలనీ సూత్రీకరించారు. సామాజిక వ్యవస్థ అంటే సమాజ మనుగడకు అవసరమైన అన్ని కార్యకలాపాలనూ భావాలనూ ఇముడ్చుకున్న ఒక వ్యవస్థ. అనేక సంబంధాల సమాహారమైన ఒక ఏర్పాటు. అది మనుషుల స్థానాలను నిర్దేశిస్తుంది. ఆ స్థానాల్లో కుదురుకుని జీవించేలా విలువలను బోధిస్తుంది. నీతులను ఖాయపరుస్తుంది. పాపపుణ్యాలను స్పష్టం చేస్తుంది. అసమానతలను సమర్థించే భావాలను కలిగి ఉంటుంది.. కష్టనష్టాలకు దైవిక కారణాలను పేర్కొంటుంది. అధికారాలకు హద్దులనూ అర్హులనూ నిర్దేశిస్తుంది. ఒకనాటి సగటు భారతీయ గ్రామాన్ని చూస్తే సామాజిక వ్యవస్థకు సంబంధించిన ప్రధాన రూపురేఖలన్నీ స్పష్టంగా కనపడతాయి. హిందువులకూ ముస్లింలకూ పూర్తి భిన్నంగా ఉండే వ్యవస్థగా దాన్ని భావించలేం. ముస్లిం భూస్వాములకు ఆధిపత్యం ఉండేచోట భిన్న సామాజిక వ్యవస్థ ఉంటుందనీ అట్లాగే హిందూ భూస్వాములకు ఆధిపత్యం ఉన్నచోట వేరే సామాజిక వ్యవస్థ ఉంటుందనీ చెప్పేందుకు భారత్‌ చరిత్రలో ఆధారాలు కనపడవు. ఒక మతాన్ని పాటించేవారు ఎక్కువగా ఉన్నచోట సాంస్కృతికపరమైన ఆచారాలు, కట్టుబాట్లు భిన్నంగా ఉండొచ్చు. అంతమాత్రాన భిన్నమతాలు పాటించే వారందరూ ప్రత్యేకమైన సామాజిక వ్యవస్థలో ఉన్నట్లుగా భావించలేం. గ్రామాలకైనా నగరాలకైనా ఇదే వర్తిస్తుంది.


జిన్నా దృష్టిలో వేర్వేరు మతాలను అవలంబించేవారు ఒకే జాతిగా ఉండలేరు. అందుకు అవసరమైన జాతీయ ఐక్యతా భావాన్ని ఏర్పరుచుకోలేరు. సహానుభూతిని సృష్టించుకోలేరు. కష్టనష్టాలకు ఒకరీతిగా స్పందించలేరు. ఉమ్మడి ప్రమాదాలప్పుడూ ఊపివేసే ఉమ్మడి ఉద్వేగ భావన కనపడదు. అనుసరించే మతసంస్కృతి భిన్నమైంది కాబట్టి సమష్టి భావన నెలకొనదు. అందుకే జాతీయ భావాలతో ముస్లింలూ, హిందువులూ ఎదగగలరని అనుకోవటం ఒక కల.. అపోహ మాత్రమే. దీన్ని గ్రహించకపోవటమే అన్ని సమస్యలకూ మూలం. ఆ అపోహనూ ఆ కలనూ వీడి పొరపాటును సరిదిద్దుకోకపోతే భారతదేశం వినాశం వైపు నడుస్తుంది. ఇట్లా మౌలికంగా భిన్న మతాలపై ఆధారపడిన రెండు వేర్వేరు నాగరికతలకు.. హిందువులూ, ముస్లింలూ చెందుతారనీ జిన్నా వ్యాఖ్యానించారు. ఒక రాజ్యంలో వీళ్లు కలిసి ఉంటే సంఘర్షణలు తప్పవని జిన్నా 1940ల్లో సూత్రీకరించారు. అమెరికా రాజకీయ శాస్త్రవేత్త శామ్యూల్‌ హంటింగ్‌టన్‌ 1990లో బాగా ప్రచారంలోకి తీసుకొచ్చిన భిన్న నాగరికతల సంఘర్షణల భావనకూ దీనికీ పెద్ద తేడా కన్పించదు. అంబేడ్కర్‌ కూడా ముస్లింలు ప్రత్యేక దేశం కోరుకోవటంలో తప్పులేదంటూ గట్టి వాదనే చేశారు. ముస్లింలీగ్‌ వాదనపై అంబేడ్కర్‌ చేసిన విశ్లేషణ ఆయన రచనలు– ప్రసంగాల ఎనిమిదో సంపుటంలో స్పష్టంగా ఉంది.

ఇక జిన్నా ప్రకారం... ముస్లిం సాహిత్యం వేరు. తాత్వికత వేరు.. అభిరుచి వేరు.. ప్రేరణగా తీసుకునే మూలాలు వేరు.. కావ్యాలు వేరు... కథనాలు వేరు... ముస్లిం వీరులు వేరు... శత్రువులు వేరు.. విషాదాలు వేరు.. ఇంకా చెప్పుకోవాలంటే ఒకరి (హిందువులైనా, ముస్లింలైనా) విజయం ఇంకొకరికి పరాజయం అవుతుంది... ఇలాంటి విరుద్ధ భావనలు, చరిత్రలు కలిగిన రెండు జాతులను ఒక దేశంలో కలిపి ఉంచటం, అందులోనూ ఒకదాన్ని మెజారిటీగా మరొకదాన్ని మైనారిటీగా కలిపి ఉంచటం ఏ విధంగానూ వాంఛనీయం కాదు.

జిన్నా ఈ మాటలు చెప్పి 85 ఏళ్లు అయింది. విశాల ప్రజాస్వామ్య దృష్టితో వీటిని అంగీకరించటం కష్టం. అన్నిటినీ మతమే నిర్ణయిస్తుందని భావిస్తే ఆధునిక నాగరికతకు అర్థమే ఉండదు. ఆర్థిక, సాంకేతిక, విజ్ఞాన శాస్త్రాల్లో వచ్చిన అనేక మార్పులు మతాలు ప్రాణప్రదంగా భావించే ఎన్నో భావాలను మార్చివేశాయి. ఏక భాష, ఏక మతం, ఏక ప్రాంతం ఆధారంగా తలెత్తిన జాతీయ రాజ్యాలు (నేషన్‌ స్టేట్స్‌), జాతీయవాదాలు (నేషనలిజమ్స్‌) మారణకాండలకూ, యుద్ధాలకూ, ఉన్మాద రాజకీయాలకు పలుచోట్ల కారణమయ్యాయి. ఈనాటి జాతీయ రాజ్యాల గతంలో ఎంతో హింస ఉంది. అల్పసంఖ్యాకుల అణచివేత ఉంది.


బహుళ సంస్కృతుల పట్ల సహనం, సమానత్వం చూపాలనీ మతాధిక్య రాజ్యాంగాలు ఉండకూడదనే భావన బలపడినచోటే ప్రజాస్వామ్యాలు నిలబడ్డాయి. ఏక మతాధిక్యతే రాజ్యాంగానికి ఆధారమైన చోట నియంతృత్వాలు రాజ్యమేలుతున్నాయి. 78 ఏళ్ల మన ప్రజాస్వామ్యం మనగలగటానికి బహుళ సంస్కృతుల పట్ల సహనమే ప్రధానకారణం. ఆ సహనానికి కల్పించిన రాజ్యాంగబద్ధతే మనల్ని జిన్నా భావాల నుంచి దూరంగా ఉంచుతోంది. ప్రస్తుతానికి దూరంగా ఉన్నంత మాత్రాన ప్రమాదం తొలగిపోయిందన్న భరోసాలేదు. 1940ల్లో జిన్నా, 1990ల్లో శామ్యూల్‌ హంటింగ్‌టన్‌ చేసిన సూత్రీకరణలను నిజం చేయటానికి జరుగుతున్న ప్రయత్నాలు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరంగా మారాయి. జిన్నా ఆలోచనలు ఇస్లాం మతాన్ని అనుసరించిన వారికే పరిమితం కాలేదు. ఆ భావాలకు నకళ్లూ, ప్రతిధ్వనులూ బలంగా వ్యాపించటం మన ప్రజాస్వామ్యానికి సవాలుగా మారాయి. మతం సర్వోన్నతమని, స్వమతం నుంచే సమస్త ప్రేరణ పొందాలని, ప్రతినాయకులందరూ ఇతర మతాల్లోనే ఉన్నారని చెలరేగిపోతున్న ప్రచారమే ఇందుకు నిదర్శనం.

Meta AI Chatbot: అశ్లీలతకు అడ్డాగా మారిన మెటా ఏఐ చాట్ బాట్స్


ముస్లింలు అధికులుగా ఉన్న కశ్మీర్‌ తమకే చెందాలనే పాకిస్థాన్‌ చేస్తున్న వితండవాదన వెనుక ఉన్నది 1940ల్లో పురుడుపోసుకున్న మతతత్వమే. మతతత్వం ఉన్నచోట ప్రజాస్వామ్య నిర్ణయాలకు తావుండదు. ప్రజల అభీష్టాలకు విలువుండదు. అన్యమతస్తులను అసమానంగా, కర్కశంగా, అమానవీయంగా చూడటం ద్వారానే మతతత్వం మనుగడ సాగిస్తుంది. కశ్మీర్‌ ప్రజలు దాన్ని తిరస్కరించేలా చేయటంలోనే అసలు విజయం ఉంటుంది. పహల్గాం సంఘటనకు ప్రతీకార చర్యలు... సింధూ నదీజలాల ఒప్పందం నుంచి వైదొలగటంతో మొదలై మరెన్నింటి దాకానో వెళ్లొచ్చు. పాక్‌ను చక్రబంధనం చేయొచ్చు. ఛిన్నాభిన్నం చేసే వ్యూహాలకు పదునుపెట్టొచ్చు. కశ్మీర్‌ వ్యవహారాల నిపుణులందరూ ఏమేమీ చేయాలో జాబితాలూ ఇస్తున్నారు. వారందరూ ముఖ్యమైందిగా చెప్పేదీ ఒకటుంది. అది.. కశ్మీరీల హృదయాలను గెలుచుకోవటం! ఆ గెలుపే తీవ్రవాదుల ఓటమిని ఖాయం చేస్తుంది. కశ్మీర మహాచరిత్రకారుడైన కల్హణుడు అన్నట్లుగా కశ్మీరును ఆధ్యాత్మికంగా గెలుచుకోవటం ఒకనాడు కష్టం అయివుండొచ్చు. ఆధునిక ప్రజాస్వామ్యంలో తగినంత ఉదారత ప్రదర్శిస్తే అది అసాధ్యం కాదు. అందుకు ఇప్పటిదాకా వేసిన అడుగులు మాత్రం సరిపోవు!

రాహుల్ కుమార్

(ఆంధ్రజ్యోతి ఎడిటర్‌)

ఇవి కూడా చదవండి

Jagga Reddy: జగ్గారెడ్డి మాస్ డైలాగ్.. రాజకీయాల్లో విలన్ మేమే, హీరోలం మేమే

Updated Date - Apr 29 , 2025 | 06:53 AM