Kapu Rajaiah: సహస్ర వృత్తుల సమస్త చిత్రం
ABN , Publish Date - Aug 03 , 2025 | 01:41 AM
తలచుకోగానే ఎవరైనా కళ్లబడితే వారికి ‘నిండు నూరేళ్ళు’ అంటాం. అట్లా కాపు రాజయ్యకి నిండు ఆయుర్దాయం నేటికి నిండినదేమీ కాదు, మలిదశ తెలంగాణ ఉద్యమంలోనే వారి యాది సంపూర్ణం. శతాయువు మాత్రమే కాదు...

తలచుకోగానే ఎవరైనా కళ్లబడితే వారికి ‘నిండు నూరేళ్ళు’ అంటాం. అట్లా కాపు రాజయ్యకి నిండు ఆయుర్దాయం నేటికి నిండినదేమీ కాదు, మలిదశ తెలంగాణ ఉద్యమంలోనే వారి యాది సంపూర్ణం. శతాయువు మాత్రమే కాదు, వారు అనునిత్యం చిరంజీవి. అయితే ఇక ముందు వారి మరో అంకం సాగనుంది. అదే ఈ వ్యాసం సారాంశం.
ఎవరైతే తమ గడుల్లో బలవంతంగా బతుకమ్మ ఆడించారో వారే బతుకమ్మ ఆడే స్థితి తెలంగాణ ఉద్యమం తేనే తెచ్చింది. వాళ్ళ మెడలు వంచి బతుకమ్మను, బోనాలను నెత్తిమీద పెట్టుకునేలా చేయనే చేసింది. అంతేకాదు, సకల జనుల సమిష్టి చేతనలోకి మన సాంస్కృతిక ఆనవాళ్ళు బలీయమై, ఉద్యమ సోయిలోకి వచ్చేసరికి మళ్ళీ సజీవ స్మృతిలోకి వచ్చి చేరిన రెండే రెండు బొమ్మలు, రాజయ్య గీసినవే. ఒకటి– సద్దుల బతుకమ్మ, రెండు– బోనాలు, ఈ రెండు బొమ్మలు రాష్ట్ర పండుగలుగా అయ్యేనాటికి ఎంతో ముందు, అనేక దశాబ్దాల క్రితమే వారు ఆ ఉత్సవాలను అపురూపంగా పదిలపరిచారు. చిత్రమేమిటంటే, ‘ఫక్తు రాజకీయాల దశ’ పోయి ‘ప్రజా పాలన’ అని మూడో దఫా ప్రభుత్వం వచ్చేనాటికి తెలంగాణ తల్లి చేతుల్లో బతుకమ్మ మాయం అయి ఉండొచ్చు గాక. కానీ, ఆయన చేసిన పని అంతకుముందే పరిసమాప్తి అయింది. అవును, వారు చిత్రించి పెట్టిన ఆ రెండు బొమ్మలు చేయవలసిన పని చేశాయి. ఇప్పుడు మిగితావి కూడా బయలుపడతాయి. అదే శత జయంతి ఆన.
నేటి (ఆగస్టు 3) సాయంత్రం హైదరాబాద్‌లోని చిత్రమయి స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో కాపు రాజయ్య శత జయంతి ఉత్సవ సందర్భంగా కళా ప్రదర్శన ప్రారంభం. ఆగస్టు పది వరకూ ఉంటుంది. ఈ ప్రదర్శనలో బహుశా అనేక చిత్రాలు నూతన అంకురానికి ప్రేరేపణ ఇస్తాయనే నమ్ముతాను నేను.
అవును, రాజయ్య సబ్బండ వర్ణాల చిత్రకారులు. వారు పండుగలు, పబ్బాలను మాత్రమే చిత్రించలేదు. నేడు బీసీ కుల గణన ద్వారా మొదటిసారిగా దేశవ్యాప్తంగా మెజారిటీ ప్రజగణన జరిగే తరుణం ఆసన్నమయ్యే సరికి వారు అసలైన ఉత్సవ రథాన్ని మన ముందుకు చేర్చనే చేర్చారు. ఆయన తీరొక్క కులాన్ని, వారి వ్యావృత్తులతో కూడి, కడు సుందరంగా ఎప్పుడో చిత్రించి ఉన్నారు. ఇకముందు వారి అన్ని చిత్రాలూ ఊరేగక మానవు. వెలికి తీయవలసిన సందర్భం ఇది.
ఒక్క మాటలో భారతదేశ చిత్రకళా మండలంలోకి ఒకనాడు పరిపుష్టంగా తులతూగిన తెలంగాణ గ్రామాన్ని, అందలి మెజారిటీ కుల సముదాయాలను కాపు రాజయ్య ప్రతిక్షేపించి చూపినంత ఘనంగా మరొకరు చేయలేదు. వారు సహస్ర వృత్తుల సమస్త చిహ్నాలను ఉపరితల మానకంగా వేయలేదు. ఆయా వృత్తిదారులను వారి పనిపాటలే రక్తమాంసాలతో తమవైన అచ్చట్లు ముచ్చట్లతో తమవైన అలంకారాలతో ఒక కోలాటంగా చిత్రించి పెట్టారు. నేడు వాటిని చూడటం అంటే వాంఛితంగా నైరూప్యం చేసిన మెజారిటీ ప్రజల గ్రామీణ జీవన ఉత్సవాన్ని తిరిగి వాస్తవికంగా దర్శించడమే. అదే ఇప్పటి కవి సమయం లేదా చిత్రకళా పునరుజ్జీవన సందర్భం.
అనేకులకు వారి బతుకమ్మ, బోనాలతో పాటు రాజయ్య గీసిన రాధాకృష్ణుల చిత్రం తెలుసు. చాలామందికి తాటి చెట్టు ఎక్కుతున్న గౌడ్ తాలూకు ‘రిస్కీ లైఫ్’ తెలుసు. కానీ, వారి కాన్వాసు పెద్దది. అందులో కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, బెస్త, స్వర్ణకారి, మేదరి, పద్మశాలీ, వడ్డెరలు, నకాషీలే కాదు, యాదవులు, దూదేకులు, రజకులు ఎందరో ఉన్నారు. పరమాత్మ, జీవాత్మలతో సహా ఇంకా ఎన్నో చిత్రించారు. నిజానికి వారు సహస్ర వృత్తుల సమస్త చిహ్నంగా చూపింది ‘కళ’ను. అవును. కళే ఒక్కో కులానికి ఉన్న బహుజన ప్రజల అసలైన విద్యా ఉద్యోగ ఔపాధిక సంస్కృతి అని, అదే స్వరాజ్యం అని ఆయన చిత్రించారు. అదే రాజయ్య రాజరికం.
నిజానికి బహుజన సమాజాన్ని, ఒక్కో సముదాయంగా తరతరాలుగా వారు చేపట్టి అభివృద్ధి చేసిన పనులను ‘వృత్తులు’ అనే చాలా మంది భావించారు. వాటిని ‘హస్తకళలు’ అనే మాట్లాడారు. కానీ రాజయ్య తన లలిత కళలో ఒక్కో కులాన్ని గొప్ప జీవకళగా అభివ్యక్తం చేసి చూపారు. ఒకరి చేతుల్లో ఒకరు చేయుంచి ఊరు ఉమ్మడిగా సకల కులాల సమ్మేళనంగా, తీరొక్క మనుషుల సమిష్టి జీవన గ్రామంగా ఆయన దేనికదే ఒక బొమ్మగా చిత్రించి పెట్టారు. అదే వారి ‘కళా భవనం’. మరో మాటలో ఆయన గ్రామాన్ని తన జానపద చిత్తమూ చిత్రంతో పల్లకీ ఎక్కేలా చేశారు. ఆ బోయలే అందులో ఊరేగేలా చిత్రించారు. ధ్వంసం కాకముందరి గ్రామాన్ని, మనం కోల్పోయిన గ్రామ పునాదిని, అందలి నాగరికతలను వారు చూపినంత విశిష్టంగా ఇంతటి వైవిధ్యంతో దేశంలోనే మరే చిత్రకారుడూ చిత్రించలేదు. అందువల్లే రాజయ్య శత జయంతి ఉత్సవం ఒక్క తెలంగాణకు, తెలుగు రాష్టాలకు పరిమితం కారాదు, దేశంలోని బహుళ ప్రజానీకపు బతుకులకు ఈ వేడుక పునరుజ్జీవన కానుక. ఒక ఎరుక. గణన.
అందుకే సరికొత్తగా అనడం, వారి కళ సహస్ర వృత్తుల సమస్త చిహ్నం అని. అది ఒకనాడు కేవలం బతుకమ్మ బొమ్మగానే కానవచ్చింది. కానీ నేడు వారి శత జయంతి సమయానికి, ఒక్కో కులానికి చెందిన వారి బొమ్మలన్నీ తీరొక్క పూల వంటి ఒక సాంస్కృతిక సమ్మేళనంగా, ఒక గణనీయమైన వైవిధ్యంగా మన ముందకు వచ్చాయని. అదే దేనికదే నిజమైన ‘బతుకమ్మ’. విభిన్న పండుగగా చూడాలి. ఇక వారి ఒక్కో బొమ్మను లెక్కించి చూడాలి. అదే వారికి మనమిచ్చే ఘనమైన నీరాజనం.
కందుకూరి రమేష్‌బాబు
స్వతంత్ర పాత్రికేయుడు, ఛాయాచిత్రకారుడు
ఈ వార్తలు కూడా చదవండి...
అమర్నాథ్ దిగజారి మాట్లాడుతున్నారు.. ఎంపీ శ్రీభరత్ ఫైర్
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో బిగ్‌బాస్ అరెస్ట్ ఖాయం
Read Latest AP News and National News