కులాంతర వివాహాలకు ప్రోత్సాహం కరువు
ABN , Publish Date - Jun 13 , 2025 | 06:02 AM
నేటికీ మన భారతీయ సమాజంలో.. మరీ ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో వేరే కులం పిల్లనో, పిల్లగాన్నో పెండ్లి చేసుకోవడం అంటే మామూలు ముచ్చట కాదని మనందరికీ తెలిసిందే...

నేటికీ మన భారతీయ సమాజంలో.. మరీ ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో వేరే కులం పిల్లనో, పిల్లగాన్నో పెండ్లి చేసుకోవడం అంటే మామూలు ముచ్చట కాదని మనందరికీ తెలిసిందే. కుల వ్యవస్థలోని అంతరాలను తగ్గించే శక్తి కులాంతర వివాహాలకే ఉందని కూడా మనకు తెలుసు. కుటుంబాన్ని, సమాజాన్ని ఎదిరించి కులాంతర వివాహం చేసుకున్న వారి జీవనం సాఫీగా సాగడం అంత సులువు కాదు. అయితే పరువు హత్యలు, లేదంటే ఆ కొత్త దంపతులు ఎదుర్కొనే ఆర్థిక ఇబ్బందులు! ఇలా అనేక సమస్యలు కులాంతర వివాహాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. కులాంతర వివాహాలకు ప్రోత్సాహం, ఆర్థికంగా దన్ను అవసరం. ఆ వివాహాలు చేసుకున్న వారికి రూ.2.50 లక్షలు ఇస్తామని గత ప్రభుత్వం ప్రకటించింది. దానిని మరికొంత పెంచి ఇస్తామని గత అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. కానీ ఈ రెండూ హామీలూ అందని ద్రాక్షగానే మిగిలాయి. ఉదాహరణకు ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో 2019 నుంచి గత నెల వరకూ కొన్ని వందల కులాంతర వివాహాలు జరిగాయి. వాటిలో ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు కోరుతూ ఎస్సీ సంక్షేమశాఖకు దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య 360. కానీ అందులో 77 మందికి మాత్రమే ప్రోత్సాహకాలు మంజూరయ్యాయి! తక్కిన 283 మందికి ఎదురు చూపులే మిగిలాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో పరిస్థితి ఇలాగే ఉంది. ‘సీనియారిటీ ప్రాతిపాదికన ఏటా ఇద్దరు ముగ్గురికే ప్రోత్సాహకాలు మంజూరవుతాయి.
అవి కూడా ఎప్పుడు వస్తాయనే విషయం తెలియద’ని ఓ జిల్లా ఎస్సీ సంక్షేమశాఖ అధికారి తెలిపారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్న ప్రభుత్వం.. కులాంతర వివాహ ప్రోత్సాహకాలపై వివక్ష చూపడం చూస్తుంటే ‘ప్రభుత్వాలకే కులాంతర వివాహాలు జరగడం ఇష్టం లేదేమో’ అనే అనుమానం కలుగక మానదు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి కులాంతర వివాహాల ప్రోత్సాహకాలపై గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. సత్వరమే దరఖాస్తుదారులకు ప్రోత్సాహకాలు అందజేయాలి.
పిన్నింటి విజయ్‌కుమార్
కాకతీయ యూనివర్సిటీ
ఈ వార్తలు కూడా చదవండి..
కూలిన విమానంలో గుజరాత్ మాజీ సీఎం.. ఆయన చివరి ఫొటో ఇదే..
లోపం ఉందని ముందే చెప్పినా.. పట్టించుకోని ఎయిర్ ఇండియా
For National News And Telugu News