పాకిస్థాన్‌కు గుణపాఠం ఎలా
ABN , Publish Date - May 07 , 2025 | 05:17 AM
భారత్, పాకిస్థాన్‌ల మధ్య మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఈ సారి భారతదేశం నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తోందని, పాకిస్థాన్‌కు గట్టి బుద్ధి చెప్పి తీరుతుందనే విషయమై స్పష్టమైన సంకేతాలు లభిస్తున్నాయి. దేశ విభజన కాలం నుంచీ పాకిస్థాన్ భారతదేశం పట్ల ఎన్నో...

భారత్, పాకిస్థాన్‌ల మధ్య మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఈ సారి భారతదేశం నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తోందని, పాకిస్థాన్‌కు గట్టి బుద్ధి చెప్పి తీరుతుందనే విషయమై స్పష్టమైన సంకేతాలు లభిస్తున్నాయి. దేశ విభజన కాలం నుంచీ పాకిస్థాన్ భారతదేశం పట్ల ఎన్నో దురాగతాలకు పాల్పడింది. మరెన్నోసార్లు భారత్ చేతుల్లో దెబ్బతిన్నది. అయినా ఆ దేశం వైఖరి మారడం లేదు. మత రాజ్యంగా మారడమే పాకిస్థాన్‌కు ప్రాణాంతకంగా మారుతోందా? ఆ దేశ పాలకులు తొలినాటి నుంచీ అనుసరిస్తున్న విధానాలు ఏ గుణపాఠాలు నేర్పుతున్నాయి?
‘నీవు కనుక నా స్నేహితుడువి కాకపోతే ఈ పాటికి నేను నిన్ను చంపేసి ఉండేవాడిని..’ అని ఒక సాయంత్రం ప్రముఖ ఉర్దూ రచయిత సాదత్ హసన్ మంటోతో ఒక హిందూ మిత్రుడు యధాలాపంగా అన్నాడట. దేశ విభజన సమయంలో భారతదేశంలోనే ఉండిపోవాలని నిర్ణయించిన మంటో ఆ మరుసటి రోజే పాకిస్థాన్ వెళ్లిపోయారు. అక్కడ కూడా పెచ్చరిల్లుతున్న ఉన్మాద పరిస్థితులను, అసహనాన్ని చూసి ఆయన తట్టుకోలేకపోయారు. దేశ విభజనను తీవ్రంగా వ్యతిరేకించిన సాదత్ హసన్ మంటో ఈ విభజనను ఒక బీభత్స విషాదంగా, రాజకీయ సామాజిక ఉన్మాదంగా అభివర్ణించారు. ఈ అర్థరహిత మతోన్మాదాన్ని ఆయన ప్రతీకగా తీసుకుని ‘తోబాటేక్ సింగ్’ అనే కథను రచించారు. దేశ విభజన వల్ల జరిగిన దుష్పరిణామాలను వివరిస్తూ ఆర్ఎస్ఎస్ మేధావి రాంమాధవ్ కూడా తన పుస్తకం ‘The Hindutva Paradigm’లో సాదత్ హసన్ మంటో రచనలను ఉటంకించారు. పాకిస్థాన్ ఒక స్వీయ విచ్ఛిన్నకర శక్తిగా మారే పరిణామం గురించి మంటో ఆనాడే ఊహించారు. ‘మీరు పాకిస్థాన్‌కు సైనిక సహాయం చేస్తున్నారంటే మా ముల్లాలను సాయుధం చేస్తున్నారన్నమాట’ అని ఆయన 1950లలో ‘లెటర్స్ టు అంకుల్ శామ్’ పేరిట వరుసగా రాసిన వ్యాసాల్లో వ్యాఖ్యానించారు. సంగీతం, కళలు, సాహిత్యం కవిత్వంపై నిషేధం విధించే రోజులు వస్తాయని ఆయన ‘అల్లా దయతో’ అన్న శీర్షికతో రాసిన వ్యాసంలో ఆనాడే ఊహించారు. ‘మా నాన్న ఊహించినట్లే పాకిస్థాన్‌లో అసహనం తీవ్రంగా పెచ్చరిల్లిపోయింది.. ఎందరో ప్రచురణ కర్తలు, జర్నలిస్టులను మతోన్మాదులు హత్య చేశారు..’ అని మంటో కుమార్తె నస్రత్ వాపోయారు.
‘ఇస్లామిస్టులు వేరు, ముస్లింలు వేరు..’ అని ప్రముఖ రచయిత Tarek Fatah ఞలాతారిక్ ఫతే తన ‘Chasing a Mirage : The tragic Illusion of an Islamic state’ పుస్తకంలో రాశారు. ఇస్లామిస్టులు మతరాజ్యాన్ని కోరుకుంటే, ముస్లింలు ఆధ్యాత్మికతను కోరుకుంటారని ఆయన పేర్కొన్నారు. ముస్లింలు ప్రపంచవ్యాప్తంగా వలస పాలనలో కునారిల్లుతున్న పరిస్థితుల్లో ప్రభవించిన పాకిస్థాన్ ముస్లిం ఉదారవాదులకు, వారిలో ఉన్న సూఫీ తత్వానికి, ప్రజాస్వామ్యానికి, బహుళ మతస్తులకు వేదికగా మారుతుందని అనేక మంది కలలు కన్నారు. అయితే విషాదకరంగా ఆ దేశం ఒక మత రాజ్యంగా మారిపోయింది. భారత్ నడిచిన దారిలో సాగలేదు. భవిష్యత్తులో హిందువులు హిందువులుగా, ముస్లింలు ముస్లింలుగా ఉండరని, మతం వారి వ్యక్తిగత విశ్వాసంగానే ఉన్నప్పటికీ వారు ఈ దేశ పౌరులుగా ఉండిపోతారని ప్రకటించిన పాకిస్థాన్ వ్యవస్థాపకుడు జిన్నా ఆ తర్వాత తన మాటలకు కట్టుబడకుండా తన దేశాన్ని మత రాజ్యంగా మార్చారు. దళితుల రాజకీయ హక్కులకోసం పోరాడుతూ జిన్నాకు సన్నిహితుడైన జోగేంద్రనాథ్ మండల్ దేశ విభజన తర్వాత పాకిస్థాన్ తొలి న్యాయ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1948లో భారత పాక్ యుద్ధం, మత కల్లోలాల తర్వాత ఆయనకు కీలకమైన పైళ్లు ఇవ్వడం నిరాకరించారు. ఇస్లాంను పాకిస్థాన్ అధికార మతంగా ఆ దేశ తొలి ప్రధాని లియాఖత్ అలీఖాన్ ప్రకటించిన తర్వాత మండల్‌పై దూషణలు, దాడులు పెరిగిపోయాయి. 1950 అక్టోబర్‌లో జోగేంద్రనాథ్ మండల్ కలకత్తాకు పారిపోయి రావాల్సి వచ్చింది. పాకిస్థాన్‌లో మైనారిటీలపై జరుగుతున్న దాడులను ఆయన తన రాజీనామా లేఖలో ప్రస్తావించారు.
1965లో దేశాధ్యక్ష పదవిని నిలబెట్టుకునేందుకు ఎన్నికలను రిగ్ చేసి గెలిచిన అయూబ్ ఖాన్ తనపై ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొనేందుకు ‘ఆపరేషన్ జిబ్రాల్టర్’ పేరిట వేలాది పాక్ సైనికులను సివిల్ దుస్తులతో కశ్మీర్‌లోకి పంపారు. ఆపరేషన్ జిబ్రాల్టర్ మాత్రమే కాదు, భారత సరఫరాలను అడ్డుకునేందుకు జమ్మూ–కశ్మీర్‌లో అఖ్నూర్ వంతెనను స్వాధీనం చేసుకునే లక్ష్యంతో నిర్వహించిన ఆపరేషన్ గ్రాండ్ స్లామ్ కూడా విఫలమైంది. అయినప్పటికీ ఆయనను విమర్శించిన వారిని దేశ ద్రోహులుగా చిత్రించారు. పాకిస్థాన్ సంరక్షకుడుగా సుప్రసిద్ధుడైన అయూబ్ ఖాన్ మరో దశాబ్దం పాటు అధికారంలో కొనసాగగలరని చాలా మంది భావించారు. నాలుగేళ్లలోనే ప్రజాగ్రహం ఆయనకు వ్యతిరేకంగా పెల్లుబుకింది. లక్షమందిని నిర్బంధించినా, వందల మందిని హతమార్చినా ఆయన గద్దె దిగాల్సి వచ్చింది. 50లక్షల మంది కశ్మీరీలకోసం పది కోట్ల మంది పాకిస్థానీయుల ప్రాణాలను పణంగా పెట్టలేమని ఆయన చెంపలేసుకున్నారు.
కశ్మీర్‌తో భారత్‌కు పురాతన కాలం నుంచీ ఉన్న అవినాభావ సంబంధం గురించి తెలిసినా పాకిస్తాన్ పాలకులు తమ మనుగడకోసం, రాజకీయాలకోసం మతాన్ని, కశ్మీర్‌ను ఉపయోగించుకుంటూనే ఉన్నారు. భారతదేశాన్ని శత్రువుగా, ముస్లింల వ్యతిరేకిగా చిత్రిస్తూ పబ్బం గడుపుకుంటూనే ఉన్నారు. పాకిస్థాన్‌లో పనిచేసిన అనేకమంది విదేశీ జర్నలిస్టులు ఈ వాస్తవాన్ని తమ వ్యాసాల్లో, పుస్తకాల్లో చిత్రించారు. కశ్మీర్ అనేది పాక్ వ్యూహాత్మక సంస్కృతిపై ఆధిపత్యం చలాయిస్తోందని ‘ద టైమ్స్’ విలేఖరి అనాటో లెవియన్ తన పుస్తకం ‘పాకిస్తాన్– ఏ హార్డ్ కంట్రీ’లో వ్యాఖ్యానించారు. ఇదే పాకిస్థాన్‌కు తీరని నష్టం చేసిందని, దీనివల్ల ఆ దేశం పూర్తిగా విచ్ఛిన్నమయ్యే అవకాశాలు లేకపోలేదని ఆయన పదేళ్ల క్రితమే రాశారు. భారతదేశం తమకు శత్రువని, అది పైకి కనపడినంత బలమైన దేశం కాదని, ఆ దేశంలో లుకలుకల్ని తాము ఉపయోగించుకుంటామని పాక్ సైనికాధికారులు తనకు చెప్పినట్లు ఆయన రాశారు. భారత వ్యతిరేకతే జాతీయ వాదంగా ప్రజల్ని ప్రభావితం చేసేందుకు పాక్ ప్రభుత్వాలు, సైన్యం, ఇంటలిజెన్స్ సంస్థలూ నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నాయని, ప్రమాదకర ఉగ్రవాద శక్తుల్ని పోషిస్తున్నాయని కూడా ఆయన స్పష్టంగా చెప్పారు. 2011లో ప్రముఖ జర్నలిస్టు కుల్దీప్ నయ్యర్ నేతృత్వంలో శాంతి బృందంలో భాగంగా పాకిస్థాన్‌ను సందర్శించినప్పుడు లాహోర్‌లో ధ్వంసమైన ఒక దేవాలయాన్ని, ముస్లింలు ఆక్రమించిన చరిత్రాత్మక గురుద్వారాను స్వయంగా చూశాను. బహుళమత సంస్కృతిని ధ్వంసం చేసిన పాకిస్థాన్ ఏం సాధించింది?
1971లో బంగ్లాదేశ్ ఆవిర్భావంతో తన జనాభాలో 54 శాతం కోల్పోయి అవమానాల పాలైనా, 1999లో కార్గిల్‌లో చొరబాటుకు పాల్పడి దెబ్బతిన్నా పాకిస్థాన్ పాలకుల మనస్తత్వం మారలేదు. జియా ఉల్ హఖ్ ఏలుబడిలో పాకిస్థాన్‌కు, ఆ దేశంలోని మదర్సాలు ఉగ్రవాదాన్ని పెంచి పోషించేందుకు సహాయపడిన అమెరికా సెప్టెంబర్ 11 దాడుల తర్వాత తన వైఖరిని మార్చుకుంది. ముషారఫ్‌పై ఒత్తిడి చేసి ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతును తగ్గించేందుకు తోడ్పడింది. అబోటాబాద్‌లో అమెరికన్ దళాలు ఒసామాబిన్ లాడెన్‌ను హతమార్చిన తర్వాత పాక్ సైన్యం నైతిక స్థైర్యం కోల్పోయింది. కాబూల్‌లో అమెరికన్ రాయబార కార్యాలయంపై దాడి చేసిన హక్కానీ నెట్‌వర్క్ వెనుక పాక్ సైనికాధికారుల హస్తం ఉన్నదని న్యూయార్క్ టైమ్స్ జర్నలిస్టు కర్లోట్టా గాల్ తన పుస్తకం ‘ద రాంగ్ ఎనిమీ’లో రాశారు. పొరుగుదేశాల్లో హింసాత్మక చర్యలను ప్రోత్సహించడం ద్వారా పాకిస్థాన్ తన అంతర్గత భద్రతకే ముప్పు తెచ్చుకుంటుందని, అంతర్జాతీయంగా విశ్వసనీయతను కోల్పోతోందని ఆమె రాశారు. క్రమంగా ఉగ్రవాదంపై పోరులో పాకిస్థాన్ తన మిత్రపక్షం కాలేదని అమెరికా గ్రహించింది. 2001 నుంచి 2003 మధ్య న్యూఢిల్లీలో అమెరికా రాయబారిగా ఉన్న రాబర్డ్ డి బ్లాక్‌వెల్ భారత్‌కు పూర్తి మద్దతునీయాలని సూచించిన తర్వాత అమెరికా విదేశాంగ విధానంలో మార్పు ప్రారంభమైంది.
1948లో ఐక్యరాజ్యసమితి కాల్పుల విరమణను ప్రకటించిన తర్వాత వేలాది ప్రజల ప్రాణాలు పోయినప్పటికీ వేల కోట్ల నిధులు వృధా అయినప్పటికీ నియంత్రణ రేఖ ఒక అంగుళమైనా మారలేదు. పాక్ బడ్జెట్‌లో 30శాతానికి పైగా సైన్యానికి ఖర్చుపెడుతున్నా, విద్య, ఆరోగ్యం, సంక్షేమ రంగాల్లో నిధులు తగ్గిపోయినా, ఆర్థిక ప్రగతి కునారిల్లినా, ఆసియాలోనే అత్యంత ఎక్కువ స్థాయిలో పెరుగుతున్న జనాభాలో దాదాపు 41 శాతం పేదరికంలో మగ్గుతున్నా ఆ దేశ పాలకులు, సైన్యం తమ మనుగడకోసం మతాన్ని ఆయుధంగా వాడుకుని భారత్‌లో హింసాత్మక చర్యలకు పాల్పడడం మానడం లేదు.
‘వసుధైక కుటుంబకం’ అన్న భావనను ఆదర్శంగా తీసుకునే భారతదేశం మాత్రం ఎప్పుడూ పాకిస్థాన్ దిశన పయనించకపోవడమే ఈ పురానవ దేశ ప్రజల విజయ రహస్యం. భారత ఉపరాష్ట్రపతిగా ఎంపికైన తర్వాత బీజేపీ మాజీ అధ్యక్షుడు వెంకయ్యనాయుడు తన జిల్లాలోని కసుమూరు మస్తాన్ వల్లీ దర్గాకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆయన మామగారి పేరే మస్తానయ్య నాయుడు. కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డికి ఆ పేరు నల్గొండలోని జాన్‌పహాడ్ దర్గా వల్ల వచ్చింది. అనంతపురంలో గుగుడు (గుహుడు) అనే గ్రామంలో ముస్లింలు రాముడు ఒక ముస్లిం పీర్‌గా తమ గ్రామానికి వచ్చారన్న నమ్మకంతో ఆయనను కుల్లాయప్ప పేరుతో మొహర్రం సందర్భంగా పూజిస్తారని, వారు ఆ పక్కనే హనుమంతుడి ఆలయాన్ని కూడా స్థాపించారని ప్రముఖ కవి అఫ్సర్ ‘ద ఫెస్టివల్ ఆఫ్ పీర్స్’ అన్న పుస్తకంలో రాశారు. భారత్ పాక్ మార్గంలోనో, అయూబ్ ఖాన్ పంథాలోనే పయనించడం జరగదనేది, మంటో పడిన వేదన మన రచయితలకు ఎదురు కాబోదనేది నిజమవ్వాలి.
ఎ. కృష్ణారావు
(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)
ఇవి కూడా చదవండి..
సరిహద్దు వెంబడి భారీ వైమానిక ఎక్సర్‌సైజ్.. నోటీసు విడుదల చేసిన కేంద్రం
India Pak War: యుద్ధం పరిష్కారం కానేకాదు.. భారత్‌కు ఐరాసా సూచన
Pakistan Army Chief: భారత్ దాడికి దిగితే.. పాక్ ఆర్మీ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
మరిిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి