Where True Admirers of Literature Gone: భారతి ఆరాధకులు కానరారే
ABN , Publish Date - Nov 26 , 2025 | 01:11 AM
‘నేను ఎవరి కోసం తీయని రాగాల్ని పాడాలి?.. మన కనుల ముందే దేశం ఆకలితో కుమిలిపోతున్నప్పుడు. దేశమంతా విషాన్ని మథిస్తుంటే, ఢిల్లీ మద్యం సేవిస్తోంది. దేశమంతా చీకటి నిండితే ఢిల్లీ మెరిసిపోతోంది..’ అని...
‘నేను ఎవరి కోసం తీయని రాగాల్ని పాడాలి?.. మన కనుల ముందే దేశం ఆకలితో కుమిలిపోతున్నప్పుడు. దేశమంతా విషాన్ని మథిస్తుంటే, ఢిల్లీ మద్యం సేవిస్తోంది. దేశమంతా చీకటి నిండితే ఢిల్లీ మెరిసిపోతోంది..’ అని హిందీ కవి రాంధారీ సింగ్ దినకర్ (1908–74) ఆక్రోశించారు. ఆయన బిహారీ. కాంగ్రెస్‌వాది. జవహర్‌లాల్ నెహ్రూ స్వయంగా దినకర్‌ను మూడుసార్లు రాజ్యసభకు ఎంపిక చేశారు. రాజ్యసభ సభ్యుడుగా ఉన్నప్పుడే ఆయన ఈ కవిత రాశారు. దినకర్ కవితలు ప్రజల వెతలను ప్రభావవంతంగా వ్యక్తం చేశాయి. కనుకనే వాటిని జయప్రకాశ్ నారాయణ్ మాత్రమే కాదు, అటల్ బిహారీ వాజపేయి, నరేంద్ర మోదీ సైతం అమితంగా అభిమానించారు. ఈ బిహారీ కవి కవితల్ని వాజపేయి అనేక సందర్భాల్లో ఉటంకించేవారు. మోదీ సైతం తరచూ ఉటంకిస్తూ దినకర్ పట్ల తన అభిమానాన్ని చాటుతుంటారు. కాంగ్రెస్‌వాది అయిన ఈ కవి తల్లజుని శతజయంత్యుత్సవాలను భారతీయ జనతా పార్టీ ఘనంగా నిర్వహించింది. అధికార పీఠాలు గుర్తించినా, గుర్తించకపోయినా కవులు, రచయితలు తమ మనసు కలచివేసిన వాస్తవాల గురించి రచిస్తూనే ఉంటారు. చాలామంది జర్నలిస్టులు రాయలేని నిజాలు కవులు, రచయితల రచనల్లో తచ్చాడుతుంటాయని అంగీకరించక తప్పదు.
బిహార్‌లో ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో గతంతో పోలిస్తే నేరచరితులు 68 నుంచి 53 శాతానికి తగ్గిపోవడం ఒక శుభపరిణామం. గతంలో బిహార్‌లో సాహితీవేత్తలు, రచయితలు, కవులు క్రియాశీలంగా ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేవారు. తర్వాతి కాలంలో వారి స్థానంలో నేర చరితులు ప్రవేశించారు. రామకృష్ణ బేణిపురి, లక్ష్మీనారాయణ సుధాంశు, ఫణీశ్వర్‌నాథ్ రేణు వంటి రచయితలు 1950వ దశకంలో ఎన్నికల బరిలో నిలిచి పోరాడారు. బేణిపురి, సుధాంశు స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని జైలుపాలయ్యారు. ఆ స్ఫూర్తితో ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు కూడా. దళితుల హక్కుల పరిరక్షణ, రైతుల ప్రయోజనాల కోసం పోరాడిన ఫణీశ్వర్‌నాథ్ రేణు (1921–77) అరారియా జిల్లాలోని ఫోర్బ్స్ గంజ్ నియోజకవర్గం నుంచి 1972లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. కబీర్ గీతాల్ని, రామాయణ శ్లోకాల్ని, అమీర్ ఖుస్రో పర్షియన్ కవితల్ని ఉటంకిస్తూ ఆయన ప్రచారం చేశారు. ఎందరో రచయితలు, కళాకారులు ప్రచారం చేసినా ఆయన కేవలం 5వేల ఓట్లు మాత్రమే తెచ్చుకున్నారు. ‘తీస్రీ కసమ్’ లాంటి కళాత్మక సినిమాలకు ప్రేరణనిచ్చిన రేణు ఎన్నికల ఓటమి తర్వాత ‘కాగజ్ కీ నావ్’ (కాగితపు పడవ) అనే నవల రచించారు. అప్పటికి దేశంలో ఎన్నికల వాతావరణం సంపన్నులకు, నేర చరితులకు అనుకూలంగా మారిపోయింది. ఆ తర్వాతి కాలంలో దేశంలో రచయితలు, కళాకారులకూ– రాజకీయ వ్యవస్థకూ దూరం రోజురోజుకూ పెరిగిపోయింది. రేణు సృజించిన సాహిత్యంలోని స్ఫూర్తిదాయక మాటలను మోదీ, నితీశ్‌కుమార్ మొదలైన నేతలు తరచూ ఉటంకిస్తూ ఉంటారు.
బిహార్‌లోని మధుబని ప్రాంతానికి చెందిన 25 ఏళ్ల గాయని మైథిలీ థాకూర్– మైథిలీ, భోజ్‌పురి, హిందీ భాషల్లో స్వంత గీతాలతో పాటు భక్తి గీతాలూ ఆలపిస్తుంటారు. గాయనిగా సామాజిక మాధ్యమాలలో ఆమె బహుళ ప్రచారం పొందారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికలలో అలీనగర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు. ఆమె విజయం.. ఉక్కబోస్తున్న వాతావరణంలో ఒక మలయానిలం వీయడం లాంటిదే. మైథిలిని తమ అభ్యర్థిగా బీజేపీ నిలబెట్టడం ఆ పార్టీ ఆలోచనా విధానానికి యుక్తమైన నిర్ణయమే. అయితే దేశంలో తమ పార్టీ భావజాలంతో సంబంధం లేకపోయినా ప్రముఖ రచయితలను, కళాకారులను చట్టసభలకు, ముఖ్యంగా పార్లమెంటు ఎగువసభ అయిన రాజ్యసభకు ఎంపిక చేయడమనే ఒక మంచి సంప్రదాయాన్ని జాతీయ స్థాయిలో కొనసాగించిన నేతలు ఉన్నారు. నెహ్రూ నుంచి వాజపేయి దాకా ఈ సంప్రదాయాన్ని పాటించారు. నెహ్రూ తరచూ రచయితలను తీన్‌మూర్తి భవన్‌కు పిలిచి మాట్లాడడమే కాక గేటు వరకూ వచ్చి వారికి వీడ్కోలు చెప్పేవారు. మైథిలీ శరణ్ గుప్తా, కెఎం.పణిక్కర్, తారాశంకర్ బందోపాధ్యాయ, హరివంశరాయ్ బచ్చన్, జి.శంకర్ కురూప్, ఉమాశంకర్ జోషి, అబూ అబ్రహం, హబీబ్ తన్వర్, భగవతి చరణ్ వర్మ, కుష్వంత్ సింగ్, అమృతా ప్రీతమ్, ఆర్‌కె.నారాయణ్, కర్తార్‌సింగ్ దుగ్గల్, సి.నారాయణరెడ్డి, విద్యానివాస్ మిశ్రా, జావేద్ అఖ్తర్ తదితరులు రాజ్యసభకు నామినేట్ అయిన వారే. సినారెను రాజ్యసభకు నామినేట్ చేసిన సాహిత్య సహృదయుడు వాజపేయి. సినారెను చూడగానే వాజపేయి కవిత్వ పిపాసి అయిపోయేవారు. ఇరువురూ పార్లమెంటు నడవాల్లో ఉర్దూ కవితలను గుర్తు చేసుకుంటూ నడిచేవారు. తర్వాతి కాలంలో పెద్దల సభకు కవులు, రచయితలను ఎంపికచేయడం క్రమంగా తగ్గిపోయింది. ఒకవేళ ఒకరిద్దరిని ఎంపికచేసినా నాటి ప్రమాణాలు వారిలో కనపడడం తక్కువే. ఏవి తల్లీ నిరుడు కురిసిన హిమసమూహములు?
నిజానికి యూరోపియన్ ప్రమాణాలతో పోలిస్తే మన దేశంలో రచయితలను, కళాకారులను గౌరవించిన సందర్భాలు చాలా తక్కువే. ఇటీవల ఐర్లాండ్‌ను సందర్శించినప్పుడు అక్కడ రహదారుల కూడళ్లలోనూ, మార్కెట్ ప్రాంతాల్లోనూ, పార్కుల్లోనూ ఎక్కడ చూసినా రచయితల, కళాకారుల విగ్రహాలే కనపడ్డాయి. డబ్లిన్ నడిబొడ్డున మ్యూజియమ్ ఆఫ్ లిటరేచర్‌లో ఐరిష్ రచయితలు, వారి రచనలను ప్రదర్శించిన తీరు ఎవరికైనా అచ్చెరువు కలిగిస్తుంది. విఖ్యాత నవలా రచయిత జేమ్స్ జాయిస్ (1882–1941) రచనలు మనను చుట్టుముడతాయి. మహాకవి విలియం బట్లర్ యేట్స్ (1865–1939) పేరిట నిర్మించిన మ్యూజియంలో ఆయనకు సంబంధించిన వస్తువులు, రచనలు, పుస్తకాలను ప్రదర్శించడమే కాక, అడుగడుగునా ఆయన కవితల మధ్య మనం నడుస్తున్నట్లు వాతావరణాన్ని, దృశ్యాల్ని కల్పించారు. గాల్వేలో ప్రముఖ రచయిత ఆస్కార్ వైల్డ్ (1854–1900) ఆయన సోదరుడు, కవి విలియమ్ వైల్డ్ విగ్రహాలు కూర్చుని సంభాషిస్తున్నట్లుంటాయి. యేట్స్‌తో పాటు ఎందరో కవులు, రచయితలు ఐరిష్ పార్లమెంట్‌లో సభ్యులు అయ్యారు. ఐర్లాండ్ సాంస్కృతిక పునరుజ్జీవనంలో కీలకపాత్ర పోషించిన రచయిత డగ్లస్ హైడ్ ఐర్లాండ్ తొలి అధ్యక్షుడయ్యారు. భారతదేశ స్వాతంత్ర్యోద్యమానికి అనీబిసెంట్ లాంటి నేతలను అందించడమే కాదు, మాలపల్లి రచించిన ఉన్నవ లక్ష్మీనారాయణ, రాష్ట్రపతి వీవీ గిరి లాంటి వారికి ఎంతో ప్రేరణ కలిగించిన దేశం ఐర్లండ్. అంతే కాదు, బ్రిటిష్ వారి పాలనలో మనుగడ కోల్పోయిన ఐరిష్ భాషను మళ్లీ పునరుజ్జీవింప చేసిన ఐర్లండ్, భాషా సంస్కృతుల పరిరక్షణ విషయంలో మనకు ప్రేరణగా నిలుస్తుందని డబ్లిన్‌లో మన రాయబారి అఖిలేశ్ మిశ్రా చెప్పారు. నదులు, సంస్కృతులను కాపాడుకునే విషయంలో మనం యూరప్ నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి.
మన దేశంలో ఎల్లెడలా రాజకీయ నాయకుల విగ్రహాలే కనిపిస్తాయి. మన ప్రసిద్ధ రచయితలు, కవుల స్మృతులను మనం భద్రపరచగలిగామా? కనీసం ప్రేమ్‌చంద్, గురజాడ, నిరాలా వంటి కవులు, రచయితల ప్రాధాన్యం గురించి ఈ తరం వారికి చెప్పగలుగుతున్నామా? కాళిదాసు కాలం నుంచీ సుసంపన్నమైన మన సాహిత్య కళాసంస్కృతి యూరోపియన్ సాహిత్య, కళాసంస్కృతి కంటే ఎంతో ప్రాచీనమైనదని వారికెలా తెలుస్తుంది? ఇటీవల ఢిల్లీలోని ఏపీ భవన్‌లో ‘గుర్జాల హాలు’లో విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర మంత్రి ఆహ్వానం పంపారు. అది ‘గుర్జాల హాలు’ కాదని, ‘దేశమును ప్రేమించుమన్నా’ అన్న గీతాన్ని రచించిన ప్రముఖ కవి గురజాడ అప్పారావు పేరును ఆ హాలుకు నందమూరి తారకరామారావు పెట్టారని ఎవరు చెప్పాలి?
‘రాజు జీవించు రాతి విగ్రహములందు, సుకవి జీవించు ప్రజల నాలుకల యందు..’ అని గుర్రం జాషువా; ‘నీ కవిని బతికించుకోవాలిరా, నీవు మనిషి వనిపించుకోవాలిరా’ అని తెన్నేటి సూరి; ‘గాయపడిన కవి గుండెల్లో రాయబడని కావ్యాలెన్నో..’ అని దాశరథి లాంటి కవులు ఉన్న మన నేలపై రాజకీయ నేతల, సంపన్నుల, అధికారుల, దళారుల దుష్ట సంస్కృతి సాహిత్య, కళా వాతావరణంపై చీకటి నీడలా పరుచుకుంది. అయినప్పటికీ కొన్ని పరిణామాలు ఎంతో ఊరట కలిగిస్తాయి. కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడు సునీల్ గంగోపాధ్యాయ మరణించినప్పుడు ఆయన అంతిమ యాత్రకు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వయంగా సారథ్యం వహించారు. ఉత్కళ సాహితీవేత్తలు రమాకాంత్‌రథ్, మనోజ్‌దాస్‌లకు ఒడిషా ప్రభుత్వం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించింది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మరో అడుగు ముందుకు వేసి ప్రజాకళాకారుడు అందెశ్రీ పార్థివ దేహాన్ని మోసి ఆయన అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అందెశ్రీ ప్రతిధ్వనించిన ‘మాయమైపోతున్నడమ్మా’ అన్న ఒక్క గీతం చాలు ఆయన స్మృతిని గుండెలో పదిలం చేసుకునేందుకు. ధిక్కార స్వరాన్ని వినిపించిన బమ్మెర పోతన నుంచి కాళోజీ దాకా తెలంగాణ జన జీవన సంస్కృతిలో రచయితలు, కళాకారులు పోషించిన పాత్రను తక్కువ అంచనా వేయలేము. అదే విధంగా ఆంధ్రప్రదేశ్‌లో కూడా నన్నయ్య నుంచి శ్రీశ్రీ దాకా తెలుగు సంస్కృతిని సమున్నతం చేసిన వారిని మరిచిపోగలమా?
కవులు, రచయితలను గౌరవించడంలో తమిళనాడు అగ్రగామిగా, ఆదర్శప్రాయంగా ఉన్నదని చెప్పక తప్పదు. పార్లమెంటులో రవికుమార్, కనిమొళి, సల్మా, సుమతి, జ్యోతిమణి, వెంకటేశన్ వంటి తమిళ రచయితలు ఎందరో మనకు తటస్థపడతారు. జర్మనీలోని ‘ఫ్రాంక్‌ఫర్ట్ ప్రపంచ పుస్తక ప్రదర్శన’లో తమ స్వంత స్టాల్‌ను నిర్వహించేది తమిళనాడు ప్రభుత్వం ఒక్కటే. రచయితల పుస్తకాలు ప్రచురించి, తామే కొనుగోలు చేసి, రాయల్టీలు ఇవ్వడమే కాదు, కేంద్ర సాహిత్య అకాడమీ విజేతలకు ఇళ్ల పట్టాలు ఇచ్చిన ఘనత తమిళనాడు సర్కార్‌కే దక్కుతుంది. కర్ణాటకలో కూడా రచయితలు, కళాకారులను గౌరవించేందుకు పింఛన్లతో పాటు ఎన్నో చర్యలు చేపట్టారు. రచయితలు, కళాకారులను వారి భావజాలంతో నిమిత్తం లేకుండా గౌరవించి అక్కున చేర్చుకున్న ప్రభుత్వాలే చరిత్ర పుటల్లో నిలిచిపోతాయి. రాజరాజనరేంద్రుడు, మనుమసిద్ధి, శ్రీకృష్ణ దేవరాయలు మనకు ఇంకా ఎందుకు గుర్తున్నారు?
ఎ. కృష్ణారావు
(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)
ఇవి కూడా చదవండి
ప్రాక్టీస్ మొదలుపెట్టిన శ్రేయస్!
లిక్కర్ స్కామ్‌లో.. జోగి రమేష్‌కు పోలీస్ కస్టడీ..