India US Relations: వ్యూహాత్మక స్వతంత్రతే భారత్ బాట
ABN , Publish Date - Oct 22 , 2025 | 12:41 AM
‘అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు పిచ్చెక్కినట్లుంది..’ అని ప్రపంచవ్యాప్తంగా సంఖ్యానేకులు అభిప్రాయపడుతున్నారు. 30 ట్రిలియన్ డాలర్ల వార్షిక జీడీపీ ఉన్న అతిపెద్ద ఆర్థిక శక్తి అమెరికా. అంతేకాదు, అది అతిపెద్ద...
‘అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు పిచ్చెక్కినట్లుంది..’ అని ప్రపంచవ్యాప్తంగా సంఖ్యానేకులు అభిప్రాయపడుతున్నారు. 30 ట్రిలియన్ డాలర్ల వార్షిక జీడీపీ ఉన్న అతిపెద్ద ఆర్థిక శక్తి అమెరికా. అంతేకాదు, అది అతిపెద్ద మిలటరీ సూపర్ పవర్ కూడా. పెంటగాన్ (అమెరికా రక్షణ మంత్రిత్వశాఖ నెలవు) ఆయుధాగారంలో వేలాది అణ్వస్త్రాలు ఉన్నాయి; అమెరికా యుద్ధ నౌకలు, సబ్‌మెరైన్లు, నిత్యం ప్రపంచ మహాసముద్రాలలో నలుమూలలా సంచరిస్తుంటాయి; 70 దేశాల్లో అమెరికా సైనిక స్థావరాలున్నాయి. గత ఏడాది అమెరికా తన సైనిక శక్తిపై వేయి బిలియన్ డాలర్లు ఖర్చుపెట్టింది. ప్రపంచ పటం నుంచి ఏ దేశాన్ని అయినా తుడిచిపెట్టగలిగిన శక్తి అమెరికాకు ఉన్నది. ఇంత మహాశక్తికి సర్వాధినేత అయిన అధ్యక్షుడు ట్రంప్ ఎంత బాధ్యతగా ఉండాలి?
రెండోసారి అమెరికా అధ్యక్ష పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచీ ట్రంప్ స్థిమితం లేనట్లు మాట్లాడుతున్నారు. ఎవరు మిత్రులో, ఎవరు శత్రువో తేల్చుకోలేకపోతున్నారు. భారత్‌పై కక్షసాధింపుగా అన్నట్లు హెచ్–1బి వీసా, టారిఫ్‌ల విషయమై రకరకాల ప్రకటనలు గుప్పిస్తున్నారు. భారత్–పాక్ సంఘర్షణలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడ సంఘర్షణ తలెత్తినా అమెరికా తలదూరుస్తోంది. ప్రతి దేశానికీ సార్వభౌమాధికారం ఉంటుందన్న మాట మరిచి ఆయా దేశాల పక్షాన ట్రంప్ తానే ప్రకటనలు చేస్తున్నారు! ఆపరేషన్ సింధూర్ గురించి రకరకాల ప్రకటనలు చేసిన ట్రంప్ రష్యా నుంచి చమురు కొనుగోలు నిలిపివేయాలని భారత్‌ను హెచ్చరించారు. రష్యా నుంచి చమురు కొనుగోలు మానేస్తానని మోదీ తనకు హామీ ఇచ్చినట్లు కూడా ట్రంప్ తాజాగా ప్రకటించారు. అలాంటి హామీ ఏదీ తామివ్వలేదని భారత విదేశాంగశాఖ స్పష్టం చేసింది. అయినా భారత్‌పై టారిఫ్‌లు భారీ ఎత్తున పెంచక తప్పదని ట్రంప్ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మొదట్లో ట్రంప్ మాటలకు విశ్వసనీయత ఉన్నదని భావించిన వారు సైతం ఇప్పుడు ఆయన అబద్ధాలు చెబుతున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. ట్రంప్ ప్రకటనలను భారత్ ఏమీ లెక్కచేయనక్కర్లేదని భావిస్తున్నారు. చివరకు అమెరికా ప్రజలు కూడా ట్రంప్ వాచాలతకు విసుగు చెందుతున్నట్టు స్పష్టమవుతోంది. అమెరికా టెక్నాలజీ సంస్థలు కూడా ట్రంప్ హెచ్చరికలతో నిమిత్తం లేకుండా భారత్‌లో పెట్టుబడులు పెడుతున్నాయి. వైజాగ్‌లో 15 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ డేటా సెంటర్ ఏర్పాటు చేయాలని గూగుల్ సంస్థ నిర్ణయించడమే అందుకొక ఉదాహరణ. భారత్‌లో తన విస్తరణను నిలిపివేసే ప్రసక్తి లేదని ఆపిల్ సంస్థ కూడా ప్రకటించింది. ఈ సంస్థ గత ఆరు నెలల్లో భారతదేశం నుంచి 10 బిలియన్ డాలర్ల విలువైన ఐ ఫోన్లను ఎగుమతి చేసింది. నేతల విశ్వసనీయత, పెట్టుబడులకు లభించే ఆదరణ, ఫలితాలను బట్టి పారిశ్రామిక సంస్థలు నిర్ణయాలు తీసుకుంటాయి కాని, ఉత్తుత్తి బెదిరింపులకు అవి లొంగే అవకాశాలు తక్కువ. మార్కెట్ చలన సూత్రాలు వేరుగా ఉంటాయని వేరే చెప్పనక్కర్లేదు. ఈ పండుగ రోజుల్లో భారతీయులు దాదాపు రూ. 6 లక్షల కోట్లకు పైగా సరుకులు, సేవలకోసం ఖర్చు పెట్టడమే భారతదేశంలో పెరుగుతున్న మార్కెట్ శక్తికి నిదర్శనం.
అయినా ట్రంప్ ప్రకటనలను తప్పనిసరైతే ఖండించడం తప్ప ఆయనపై వ్యక్తిగతంగా పరుష విమర్శలు చేయకూడదని భారత్ వ్యూహాత్మకంగా నిర్ణయించుకున్నట్లు స్పష్టమవుతోంది. భారతదేశ వ్యతిరేక ప్రకటనలు ట్రంప్ ఎన్ని చేసినా ఆయన తనకు ‘మంచి స్నేహితుడు’ అని మోదీ అభివర్ణిస్తున్నారు. నిజానికి ట్రంప్ ప్రకటనల వల్ల భారతీయుల ఆత్మాభిమానం ఎక్కువగా దెబ్బతిన్నట్లు కనపడుతోంది. దానివల్ల మోదీకి ప్రయోజనమే కాని నష్టం వచ్చే అవకాశాలు తక్కువ. ట్రంప్‌ను నేరుగా మోదీ ఎందుకు ఢీకొనడం లేదు? ‘ప్రస్తుతానికి మౌనం వహించడం మినహా మనకు వేరే గత్యంతరం లేదు. అదే సరైన దౌత్యనీతి..’ అని మన విదేశాంగశాఖ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ‘యుద్ధం చేయకుండానే ప్రత్యర్థిని తగ్గేలా చేయడం ఒక అద్భుత కళ’ అని చైనా సైనిక వ్యూహకర్త సు జు తన ‘ద ఆర్ట్ ఆఫ్ వార్’లో సూచించారు. వ్యక్తులతో నిమిత్తం లేకుండా అమెరికా లాంటి మహాశక్తి భారతదేశం వైపు ఉండడం, దాన్ని శత్రువుగా మార్చుకోకపోవడం అనేది అవసరం అని మన నాయకులు గ్రహించినట్లున్నారు.
నిజానికి నరేంద్రమోదీ అమెరికాను భారత్‌కు సహజ మిత్రదేశంగా భావించారు. తాను తూర్పు తీరం నుంచి చూస్తే అమెరికా పశ్చిమ తీరం కనపడుతోందని, ఇరు దేశాలు ఒకే సువిశాలమైన ప్రాంతంలో భాగమని, తమ మధ్య స్నేహం ఇరు దేశాలకే కాక ప్రపంచ భవిష్యత్తుకు కూడా ఎంతో మంచిదని మోదీ 2014లోనే ‘ఇండో–అమెరికా సీఈఓల ఫోరమ్’లో ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నంతకాలం అమెరికాను తన అభివృద్ధి అజెండాలో సహాయకారిగానే భావించింది. మోదీ అధికారంలోకి రాగానే అమెరికాను తన హిందూ వ్యూహాత్మక అజెండాలో భాగంగా భావించారు. ప్రపంచ అగ్రరాజ్యంగా ఎదిగేందుకు భారత్‌కు ఆమెరికా అండ దోహదం చేయగలదని ఆయన ఆలోచించారు. ట్రంప్ ఎలుగెత్తుతోన్న ‘అమెరికా ఫస్ట్’ సిద్ధాంతానికి తన ‘భారత్ ఫస్ట్’ నినాదం తోడవుతుందని మోదీ అనుకున్నారు. ట్రంప్‌ను రెండోసారి గెలిపించేందుకు పనిగట్టుకుని ప్రచారం చేశారు. అమెరికాలో ఉన్న ప్రవాస భారతీయులు పూర్తిగా ట్రంప్ వైపు మొగ్గేలా చేశారు. మోదీ ఇలా ట్రంప్‌ను పూర్తిగా విశ్వసించేందుకు ఎన్నో కారణాలున్నాయి.
ప్రధానంగా పాకిస్థాన్, చైనా విషయంలో భారత్ వైఖరితో ట్రంప్ తొలుత ఏకీభవించారు. తన ఎన్నికల ప్రచారంలో ఇస్లామిక్ తీవ్రవాదాన్ని, చైనా విస్తరణ వాదాన్ని ట్రంప్ తీవ్రంగా విమర్శించారు. అంతకు ముందు న్యూఢిల్లీ ఎన్ని ఫిర్యాదులు చేసినా ఉగ్రవాద బృందాలకు ఇస్లామాబాద్ మద్దతు గురించి వాషింగ్టన్ పట్టించుకునేది కాదు. జియా ఉల్ హక్ పాక్ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు అమెరికా నుంచి లభించిన ఆర్థిక సహాయమే ఆ దేశంలో తీవ్రవాదాన్ని పెంచి పోషించింది. 1990 దశకం ప్రథమార్ధంలో ముంబైను అతలాకుతలం చేసిన దాడుల్లో లభ్యమైన బాంబులు పాక్‌లో తయారైనవని ఆధారాలు సమర్పించినా అమెరికా విస్మరించిందని అప్పటి హోంసెక్రటరీ పద్మనాభయ్య చెప్పారు. పాక్ అణుశాస్త్రవేత్తలు యురేనియంను స్మగుల్ చేసి అణుబాంబు తయారీ చేశారని తెలిసినా అమెరికా పట్టించుకోలేదని మాజీ విదేశాంగమంత్రి జస్వంత్‌సింగ్ తన ‘A call to Honour’లో రాశారు. ఇస్లామిక్ తీవ్రవాదంపై పోరు విషయంలో భారత్, అమెరికా, ఇజ్రాయెల్ సహజ మిత్రులని జస్వంత్‌సింగ్ నాటి అమెరికా విదేశాంగశాఖ సహాయ మంత్రి స్ట్రోబ్ టాల్బోట్‌కు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఈ విషయాన్ని టాల్బోట్ తన పుస్తకం ‘ఎంగేజింగ్ ఇండియా’లో వివరించారు. భారత్ అమెరికా స్నేహసంబంధాలు వాజపేయి హయాంలో గణనీయంగా మెరుగయ్యాయి. భారత్ అణు వాణిజ్యానికి చైనా అడ్డుపడకుండా చేసిన అమెరికా కార్గిల్ ఘర్షణను భారత్‌తో సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని పాకిస్థాన్‌పై ఒత్తిడి చేసింది. అయితే 2001 సెప్టెంబర్ 11న న్యూయార్క్‌లో ఉగ్రవాద దాడుల తర్వాత అమెరికా వైఖరి క్రమంగా మారిపోయింది.
ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత అమెరికా విదేశాంగ విధానమే భారతదేశ విదేశాంగ విధానమా అన్నట్లు మోదీ వ్యవహరించారు. ఇరుగు పొరుగు దేశాల ప్రభుత్వాధినేతలను తొలుత తన ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించి స్నేహహస్తం చాచిన మోదీ ఆ తర్వాత ట్రంప్‌తో స్నేహం చేస్తే తనకు తిరుగుండదని భావించారు. మోదీ ప్రధాని అయిన కొత్తలో భారతదేశంలో పర్యటించిన బరాక్ ఒబామా మన దేశానికే మన రాజ్యాంగం గురించి గుర్తు చేశారు. అమెరికా రాజ్యాంగాన్నే పెద్దగా పట్టించుకోని ట్రంప్ మోదీ ప్రభుత్వ జాతీయవాద అజెండాను బలపరిచారు. భారత్ కూడా అనేక అంతర్జాతీయ వేదికలపై అమెరికా ప్రయోజనాలకు అనుగుణంగా, చైనాకు వ్యతిరేకంగా వ్యవహరించింది.
మొదటిసారి అధ్యక్షుడుగా ఉన్నప్పుడు భారత్‌కు అనుకూలంగా ఉన్న ట్రంప్ రెండోసారి అధ్యక్షుడైన తర్వాత ఎందుకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారనేది ట్రిలియన్ డాలర్ల ప్రశ్న. ఈ మధ్య కాలంలో డెమొక్రాటిక్ పార్టీకి చెందిన జో బైడెన్ అధికారంలో ఉన్నప్పుడు ట్రంప్‌ను మోదీ విస్మరించారని, ఈ విషయంలో మన విదేశాంగ శాఖ ఆయనకు సరైన సలహాలనివ్వలేకపోయిందని తలపండిన దౌత్య దురంధరులు అభిప్రాయపడుతున్నారు. విచిత్రమేమంటే ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అమెరికా విదేశాంగ విధానం పూర్తిగా అస్తవ్యస్తమైనట్లు కనపడుతోంది. పాక్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నదని తెలిసినా భారత్ వైఖరికి భిన్నంగా ఆ దేశాన్ని ప్రోత్సహించడం ఆశ్చర్యకరం. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్‌కు అమెరికా గానీ ఇజ్రాయిల్ గానీ మద్దతునివ్వలేదు. పైగా పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నదని ప్రపంచ దేశాలకు వివరించాల్సిన పరిస్థితి మనకు ఏర్పడింది. అంటే పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చినట్లే అన్నట్లుగా మారింది. విడ్డూరమేమిటంటే అమెరికా ఒకవైపు రష్యా నుంచి చమురు కొనుగోలు చేయవద్దని భారత్‌ను హెచ్చరిస్తూనే మరోవైపు పుతిన్‌తో స్నేహం చేయమని ఉక్రెయిన్ అధ్యక్షుడిని బలవంతం చేస్తోంది. నిన్నమొన్నటి వరకూ చైనా విస్తరణ వాదాన్ని అడ్డుకున్న అమెరికా ఇప్పుడు జీ-2 పేరిట చైనాకు స్నేహహస్తం అందిస్తోంది. యూరోపియన్, ఆసియన్ మిత్రపక్షాలకు చేసిన వాగ్దానాలను విస్మరిస్తోంది. అమెరికా తన ప్రయోజనాలనే ధ్యేయంగా పెట్టుకోవాలనే 1823 నాటి జేమ్స్ మన్రో (అమెరికా ఐదవ అధ్యక్షుడు) సిద్ధాంతాన్ని అనుసరించాలని ట్రంప్ ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. అదే జరిగితే భారత్‌తో పాటు అనేక దేశాలు తమ విదేశాంగ విధానాన్ని మార్చుకోవడం అనివార్యమవుతుంది. ఏ దేశంతోను పూర్తిగా అంటకాగకుండా వ్యూహాత్మక స్వతంత్రతను అవలంబించడమే భారత్‌కు ఎప్పటికైనా శ్రేయస్కరం.
ఎ. కృష్ణారావు
(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)
ఇవి కూడా చదవండి
సీఎం నియోజకవర్గం నుంచి రసవత్తర పోటీ
విధ్వంసం సృష్టించిన సౌతాఫ్రికా.. పాక్ ముందు భారీ లక్ష్యం