Congress Caste Census: జైపాల్ బాటలో రాహుల్ రేవంత్
ABN , Publish Date - Jul 30 , 2025 | 01:48 AM
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మహాత్మా గాంధీ ఆకాశవాణిలో ప్రజలనుద్దేశించి చేసిన ప్రసంగానికి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 1997 నవంబర్ 12న అప్పటి సమాచార ప్రసార శాఖ మంత్రి జైపాల్‌రెడ్డి ఢిల్లీలోని బ్రాడ్ కాస్టింగ్ హౌజ్‌లో...

స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మహాత్మా గాంధీ ఆకాశవాణిలో ప్రజలనుద్దేశించి చేసిన ప్రసంగానికి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 1997 నవంబర్ 12న అప్పటి సమాచార ప్రసార శాఖ మంత్రి జైపాల్‌రెడ్డి ఢిల్లీలోని బ్రాడ్ కాస్టింగ్ హౌజ్‌లో ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రెండు ఫలకాలను జైపాల్‌రెడ్డి తాను ఆవిష్కరించకుండా వాటిని బ్రాడ్ కాస్టింగ్ హౌజ్‌లో పనిచేస్తున్న అట్టడుగున ఉన్న ఇద్దరు సఫాయీ కార్మికులతో ఆవిష్కరింపజేశారు. జైపాల్ ఏ దృక్కోణంతో ఆలోచిస్తారో చెప్పేందుకు ఈ సంఘటన ఒక ఉదాహరణ. తనను తాను మండల్ వాదినని చెప్పుకునే జైపాల్‌రెడ్డి సమాజంలో వెనుకబడిన వర్గాలకు సామాజిక న్యాయం గురించి తరుచూ మాట్లాడేవారు. 1990 అక్టోబర్ 1న రాజ్యసభలో జైపాల్ చేసిన చరిత్రాత్మక ప్రసంగంలో వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ కల్పించడాన్ని సమర్థిస్తూ బలంగా వాదించారు. 1956లో కాకా కాలేకర్ కమిషన్ నివేదికను కాంగ్రెస్ తిరస్కరించిన విషయాన్ని ఎత్తి చూపిన జైపాల్ ఓబీసీలకు కేవలం 4 శాతం మాత్రమే ఉద్యోగాలు లభిస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. కాంగ్రెస్ సామాజిక న్యాయ పంథాను వీడినందువల్లే బీజేపీ ఎదుగుదల జరుగుతోందని ఆయన చివరి రోజుల్లో వాపోయేవారు. ‘కులం ఒక సామాజిక వాస్తవం’ అని చెప్పేవారు. ‘నేను రెడ్డి అయినందువల్ల చాలా లాభాలు పొందాను. నేను కులానికి దూరం కావాలనుకున్నా కులం నన్ను వదిలిపెట్టలేదు’ అని ఆయన మరణించడానికి ఏడాది ముందు ఏబీఎన్‌లో నిర్వహించిన ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్‌కె’ కార్యక్రమంలో నిజాయితీగా అంగీకరించారు. ఏ ఆలోచనా విధానాన్ని జైపాల్‌రెడ్డి ప్రతిపాదించారో అదే ఆలోచనా విధానాన్ని ఇవాళ కాంగ్రెస్ అందుకునేందుకు ప్రయత్నం చేస్తోంది. జైపాల్‌రెడ్డిని మేధావిగా పరిగణించిన రాహుల్ తరచు ఆయనతో పలు అంశాలపై చర్చలు జరిపేవారు.
అయితే జైపాల్ ఆలోచనల్ని ఆయన అమలులో పెట్టలేదు. తాజాగా రాహుల్ అన్నమాటల్ని వింటుంటే తనను తాను ఆత్మావలోకనం చేసుకుంటున్నట్లు అర్థమవుతోంది. ‘ఓబీసీలు ఎదుర్కొంటున్న సవాళ్లను అర్థం చేసుకోవడంలోనూ, వారికోసం చేపట్టాల్సిన చర్యలను గ్రహించడంలోనూ కాంగ్రెస్ విఫలమైనట్లు నాకు అనిపిస్తోంది. ఓబీసీలకు సానుకూలంగా ప్రతిస్పందించకపోవడం వల్లే బీజేపీకి అవకాశం కల్పించామని భావిస్తున్నాను..’ అని రాహుల్ కాంగ్రెస్ కేంద్ర కార్యాలయంలో పార్టీ ఎంపీల నుద్దేశించి మాట్లాడుతూ అన్నారు. తెలంగాణలో జరిపిన సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ, కుల సర్వేపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన ప్రజంటేషన్ తర్వాత రాహుల్ ఈ ప్రసంగం చేశారు. ఏ జైపాల్‌రెడ్డి చేసిన ఆలోచనలను అర్థం చేసుకోవడంలో కాంగ్రెస్ విఫలమైందో అదే జైపాల్‌రెడ్డి స్ఫూర్తిని ఆయనకు అత్యంత సమీప బంధువైన రేవంత్‌రెడ్డి కార్యరూపంలో పెట్టేందుకు రాహుల్ పూర్తి ప్రోత్సాహం ఇవ్వడమే కాక తెలంగాణ నమూనానే దేశానికి ఆదర్శంగా ప్రకటించడం ఒక కీలక పరిణామంగా భావించవచ్చు. ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే తన స్వంత కులం వారు మెచ్చరని తెలిసినా రేవంత్‌రెడ్డి తన అంచనాలను అధిగమించి కులగణనను శాస్త్రీయంగా, అర్థవంతంగా జరిపించారని రాహుల్ ప్రశంసించారు. జైపాల్ సూచనలు తనలో మెదులుతున్నాయేమో రాహుల్ గత ఒకటి రెండేళ్లుగా అంతర్మథనం చేసుకుంటున్నట్లు కనపడుతోంది. ఈ ఏడాది జనవరిలో ఢిల్లీలో జరిగిన దళిత మేధావుల సదస్సులో ఆయన ప్రసంగిస్తూ ‘దళితులు, వెనుకబడిన వర్గాలు, అత్యంత వెనుకబడిన వర్గాల విశ్వాసాన్ని కాంగ్రెస్ చూరగొని ఉంటే బీజేపీ ఎప్పుడూ అధికారంలోకి వచ్చి ఉండేది కాదు..’ అని చెప్పారు. వెనుకబడిన, అట్టడుగున ఉన్నవారి ఆందోళనలను సమగ్రంగా అర్థం చేసుకుని నిర్మాణాత్మక పరిష్కారాలను సాధించి ఉంటే వారు తమకు దూరమయ్యేవారు కాదని రాహుల్ అభిప్రాయపడ్డారు. నిజానికి భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ కులాన్ని ఒక ప్రధానాంశంగా భావించలేదు. మండల్ కమిషన్ నివేదికను వీపీ సింగ్ వెలుగులోకి తీసుకువచ్చినప్పుడు దాని ప్రభావాన్ని హరించేలా చేసేందుకు ఆడ్వాణీ నాయకత్వంలో బీజేపీ రథయాత్ర చేపట్టింది.
వీపీ సింగ్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నది. ‘మండల్ వర్సెస్ కమండల్’ వివాదం ఆ రోజుల్లో అత్యంత ప్రాచుర్యం పొందింది. మండల్ రాజకీయాలు బిహార్‌లో సృష్టించిన కల్లోలం కుల సేనలను కూడా తయారు చేసి నెత్తురుటేర్లు పారించింది. సంబంధిత ఘటనలు చరిత్రలో నమోదయ్యాయి. మోదీ నాయకత్వంలో కూడా హిందూత్వనే బీజేపీ ప్రధానాంశంగా ముందుకు ప్రవేశపెట్టింది. యువత, పేదలు, మహిళలు, రైతులే అతిపెద్ద కులాలని, ఈ వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తే దేశం అభివృద్ధి చెందుతుందని మోదీ పదే పదే తన ప్రసంగాల్లో ప్రకటించారు. కాంగ్రెస్ తప్పిదాల వల్ల ఆ పార్టీ ఓటు బ్యాంకును దాదాపు తన వైపు తిప్పుకోగలిగిన బీజేపీ కుల ప్రాతిపదికన ప్రజలను తమ వైపునకు తిప్పుకోవాల్సిన అవసరం లేదని భావించింది. కులాన్ని కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకు మాత్రమే ఉపయోగించుకోవాలని, సంక్షేమ పథకాలు ప్రకటిస్తే చాలని భావించిన కాంగ్రెస్ పంథాను బీజేపీ కూడా అనుసరించింది. రామజన్మభూమి ఉద్యమ సమయంలో బీజేపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న గోవిందాచార్య మండల్ పార్టీలను ఎదుర్కోవాలంటే సామాజిక సమీకరణ తప్పదనే సిద్ధాంతీకరణ చేశారు. దాన్ని అమలు చేసి ఉత్తరప్రదేశ్‌లో తొలుత కల్యాణ్‌సింగ్ వంటి బీసీ నేతను ముఖ్యమంత్రిని చేసి అధికారంలోకి వచ్చిన బీజేపీ తర్వాత అగ్రవర్ణాలకే నాయకత్వాన్ని అప్పజెప్పింది. ఫలితంగా బీజేపీ క్రమంగా యూపీలో పట్టు కోల్పోయింది. మోదీ నాయకత్వంలో మళ్లీ బీజేపీ పుంజుకుని కేవలం అగ్రవర్ణాలను మాత్రమే కాక ఓబీసీల్లో అతి వెనుకబడిన వర్గాలను, ముఖ్యంగా యాదవేతరులను తన వైపునకు తిప్పుకుని సంఘటితం చేయగలిగింది. 2009 నుంచి 2019 మధ్య దేశ వ్యాప్తంగా బీజేపీ ఓబీసీ ఓట్లు 20 నుంచి 44 శాతం మేరకు పెరిగాయి. కాంగ్రెస్‌నే కాక అనేక రాష్ట్ర స్థాయి పార్టీలను బీజేపీ దెబ్బతీయగలిగింది. ఈ పరిణామాల్ని గమనించినందువల్లే గత ఎన్నికల్లో సమాజ్‌వాది పార్టీ బీజేపీ కంటే ఎక్కువ మంది బీసీ, దళిత అభ్యర్థులను రంగంలోకి దించింది. యాదవేతర బీసీలకు అధిక సీట్లను కేటాయించింది. వెనుకబడిన, దళిత, అల్పసంఖ్యాక వర్గాల ఫార్ములాను అనుసరించి లోక్‌సభలో అధిక సీట్లను సాధించగలిగింది. 2024 ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా ఎన్డీఏ 4 శాతం ఓబీసీల మద్దతును కోల్పోతే ఇండియా కూటమి 11 శాతం ఎగువ స్థాయి ఓబీసీలు, 7 శాతం మరింత వెనుకబడిన ఓబీసీల మద్దతును సాధించగలిగింది.
భారతీయ జనతా పార్టీని వరుసగా మూడు సార్వత్రక ఎన్నికల్లో ఓడించలేకపోగా, వివిధ రాష్ట్రాల్లో అధికారం కోల్పోయిన కాంగ్రెస్‌కు ఓబీసీ ఓట్ల పుణ్యమా అని గత సార్వత్రక ఎన్నికల్లో కొంత పుంజుకున్నది. ఇది ఆ పార్టీలో కొత్త ఆశల్ని చిగురింపచేసింది. అయినప్పటికీ హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పాత తప్పిదాల్నే చేసింది. భూపిందర్‌సింగ్ హుడా నాయకత్వంలో కేవలం జాట్ ఓట్ బ్యాంకు కాంగ్రెస్ మద్దతుగా ముందుకు వస్తే విస్తృత స్థాయిలో వివిధ కులాలను తన వైపునకు తిప్పుకోవడంలో కాంగ్రెస్ విఫలం కావడం ఆ పార్టీ ఓటమికి దారితీసింది. అదే సమయంలో జాట్‌కు సంబంధించని వారిని బీజేపీ తన వైపునకు తిప్పుకోగలగడం వల్ల ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించగలిగింది. ప్రస్తుత పరిస్థితుల్లో సామాజిక న్యాయాన్ని ఎజెండాగా చేపట్టడం కన్నా కాంగ్రెస్‌కు మరో గత్యంతరం లేదు. 11 సంవత్సరాల బీజేపీ పాలనలో వివిధ వర్గాలకు సరైన న్యాయం జరగలేదని విమర్శిస్తున్న కాంగ్రెస్ అధికారంలోనూ, విద్యలోనూ, సంపదలోనూ వెనుకబడిన వర్గాలకు సరైన న్యాయం జరిగిందా లేదా తేల్చేందుకు శాస్త్రీయంగా కులగణన జరపాలన్న డిమాండ్‌కు ప్రాచుర్యం కల్పిస్తోంది. అంతే కాదు, ఈ కులగణన డేటా ఆధారంగా ప్రభుత్వ విధానాలను రూపొందించి. ఎవరి జనాభా ఎంత ఎక్కువ ఉంటుందో అంత భాగస్వామ్యం కల్పించాలనే నినాదం ఆధారంగా ప్రజల్లోకి ప్రవేశించాలని వ్యూహరచన చేస్తోంది. వెనుకబడిన వర్గాలకు సంబంధించి కేవలం నినాదాలు చేయడం మాత్రమే సరిపోదని, నిర్దిష్టమైన చర్యలను ప్రకటించాలని కాంగ్రెస్ గ్రహించింది. కాంగ్రెస్ ఈ వ్యూహం ప్రజల్లో ఊపందుకుని మండల్ నాటి సామాజిక వాతావరణాన్ని కల్పించగలుగుతుందా? లోహియా రాజకీయాల ఆధారంగా వెలుగులోకి వచ్చిన వెనుకబడిన కులాలు మరో ప్రభంజనాన్ని రేకెత్తించగలుగుతాయా? బీజేపీ ఈ పరిణామాన్ని చూస్తూ ఊరుకుంటుందా? 2026లో జరిగే జనగణనలో భాగంగా కులగణన జరిపించాలని బీజేపీ కూడా నిర్ణయించింది.
ఈ ఏడాది బిహార్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మాత్రమే బీజేపీ ఈ నిర్ణయం తీసుకుందా? 2020 బిహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి నితీశ్ నాయకత్వంలో కూడా 10 శాతం ఓబీసీ మద్దతును కోల్పోయింది. బిహార్‌లో నితీశ్‌కుమార్ కూడా కులగణన జరిపించిన తర్వాత వాస్తవాలను గ్రహించి బిహార్‌లో రిజర్వేషన్ పరిమితిని 65 శాతానికి పెంచారు. సుప్రీంకోర్టు ఈ నిర్ణయాన్ని సహజంగానే కొట్టి వేసినప్పటికీ వెనుకబడిన కులాల ప్రాధాన్యాన్ని బీజేపీ, జేడీ(యు) గ్రహించినట్లే కనిపిస్తోంది. నవంబర్‌లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ కులాలు ఎటువైపు వెళతాయన్నదానిపై దేశ రాజకీయ పరిణామాలను అంచనా వేసేందుకు ఆస్కారం ఉన్నది. నిజానికి తెలంగాణలో మాదిరి దేశవ్యాప్తంగా విస్తృత స్థాయిలో కులగణన నిర్వహించి ప్రజల సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్యా, ఉపాధి పరిస్థితులను కూడా ఆరాతీస్తే ఈ దేశంలో ప్రజలు స్వాతంత్యం వచ్చిన 78 సంవత్సరాల తర్వాత కూడా ఏ స్థాయిలో ఉన్నారో ఖచ్చితంగా తేలేందుకు అవకాశాలు ఉన్నాయి. తద్వారా విధానాల రూపకల్పన కూడా శాస్త్రీయంగా చేసేందుకు తోడ్పడుతుంది. భారత్‌ను నాల్గవ పెద్ద ఆర్థిక వ్యవస్థగా చెప్పుకుంటున్న మన నేతలు మన ప్రజల వాస్తవ పరిస్థితిని వెల్లడించేందుకు సిద్ధంగా ఉన్నారా?
ఎ. కృష్ణారావు
(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)
ఈ వార్తలు కూడా చదవండి
సుప్రీంకోర్టులో సీఎం రేవంత్ రెడ్డికి ఊరట
హైదరాబాద్ అభివృద్ధిపై సీఎం రేవంత్‌రెడ్డి స్పెషల్ ఫోకస్
Read latest Telangana News And Telugu News