Parliamentary Controversies: ధన్‌ఖడ్ రాజీనామా మిగిల్చిన ప్రశ్నలు
ABN , Publish Date - Jul 23 , 2025 | 05:36 AM
‘ఆయనకు రాజ్యాంగం గురించి అద్భుతమైన పరిజ్ఞానం ఉన్నది. చట్టసభల వ్యవహారాలు ఆయనకు కొట్టిన పిండి..’ ఇవి, ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్‌ఖడ్‌ను ఎంపిక చేసుకున్నప్పుడు ఆయనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కురిపించిన...

‘ఆయనకు రాజ్యాంగం గురించి అద్భుతమైన పరిజ్ఞానం ఉన్నది. చట్టసభల వ్యవహారాలు ఆయనకు కొట్టిన పిండి..’ ఇవి, ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్‌ఖడ్‌ను ఎంపిక చేసుకున్నప్పుడు ఆయనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కురిపించిన ప్రశంసలు. సాగుచట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతాంగం నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నప్పుడు వారిలో అత్యధికంగా ఉన్న జాట్ రైతులను తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నంలో భాగంగా ధన్‌ఖడ్‌ను ఉపరాష్ట్రపతిగా బీజేపీ ఎంపిక చేసింది. ఆయనను కిసాన్ పుత్రుడని, పరిపాలనా వ్యవహారాల్లో సమర్థుడని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్‌ప్రకాశ్ నడ్డా నాడు కొనియాడారు. అలాంటి ధన్‌ఖడ్ తాను ఆరోగ్యకారణాల రీత్యా రాజీనామా చేస్తున్నానంటే బీజేపీ ఎందుకు వదులుకున్నది? అసలు నిజంగా ఆరోగ్య కారణాల వల్లే ఆయన తప్పుకున్నారా? సోమవారం ప్రారంభమైన వర్షాకాల సమావేశాలు ప్రతిపక్షాలకు ఎన్నో అస్త్రాలను అందించాయి. ముఖ్యంగా ఆపరేషన్ సిందూర్‌లో భారతదేశం అయిదు యుద్ధ విమానాలను కోల్పోయిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వారం రోజుల క్రితం ప్రకటనలు చేయడం, రక్షణదళాల ప్రధానాధిపతి ఈ ప్రకటనను ఖండించకపోవడం ప్రతిపక్షాలకు ఉత్సాహాన్నందించింది. ఆపరేషన్ సిందూర్‌తో పాటు బిహార్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ వంటి అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసి ఆత్మరక్షణలో పడేయాలని ప్రతిపక్షాలు సమాయత్తమవుతున్న నేపథ్యంలో జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామా పరిస్థితిని మరింత అయోమయంగా మార్చిందనడంలో సందేహం లేదు. దేశంలో రెండవ అత్యంత ఉన్నతమైన రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి రాజీనామా చేయడం సహజంగానే సంచలనం సృష్టించింది.
2019లో ధన్‌ఖడ్‌ను పశ్చిమబెంగాల్ గవర్నర్‌గా నియమించిప్పుడు ఆయన గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. 1987లో రైతు నేత దేవీలాల్ ఢిల్లీలో రైతుల ధర్నా నిర్వహించినప్పుడు ధన్‌ఖడ్ తన ఝున్‌ఝున్ ప్రాంతం నుంచి దాదాపు 500 వాహనాల్లో రైతులను సమీకరించి తీసుకువచ్చి ఆయనకు సన్నిహితుడయ్యాడు. దీనితో 1989లో ఝున్‌ఝున్ నియోజకవర్గం నుంచి ధన్‌ఖడ్‌కు జనతాదళ్ తరఫున ఎంపీ సీటు ఇచ్చి స్వయంగా ప్రచారం చేసి గెలిపించడమే కాక విశ్వనాథ్ ప్రతాప్‌సింగ్ ప్రభుత్వంలో సహాయమంత్రి పదవి కూడా ఇప్పించారు. దేవీలాల్‌ను వీపీ సింగ్ ఉపప్రధాని పదవి నుంచి తొలగించినప్పుడు ధన్‌ఖడ్ కూడా రాజీనామా చేసి ఆయనకు అండగా నిలిచారు. వీపీ సింగ్ తర్వాత ప్రధాని అయిన చంద్రశేఖర్ మంత్రివర్గంలో కూడా ధన్‌ఖడ్ కొనసాగారు. 1991లో పీవీ నరసింహారావు ప్రధానమంత్రి అయినప్పుడు జనతాదళ్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన నేతల్లో లాల్‌బహదూర్ శాస్త్రి కుమారుడు అనిల్ శాస్త్రి, ధన్‌ఖడ్ కూడా ఉన్నారు. ఎంపీగా ఓడిపోవడంతో కాంగ్రెస్ ఆయనకు 1993లో రాజస్థాన్‌లో కిషన్‌ఘర్ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. బాబ్రీ మసీదు కూల్చి వేత తర్వాత ఆర్ఎస్ఎస్‌ను ధన్‌ఖడ్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఆర్ఎస్ఎస్ లాంటి తీవ్రవాద సంస్థకు పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో స్థానం లేదని ఆయన శాసన సభలో తీవ్రంగా విమర్శించారు. ఇదంతా గతం. 1998లో మళ్లీ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన తర్వాత ఆయన రాజకీయాలను వదిలి న్యాయవాద వృత్తిలో నిమగ్నమయ్యారు. దాదాపు అయిదేళ్ల పాటు రాజకీయాలకు దూరంగా ఉండి ఏ బీజేపీనైతే తాను తీవ్రంగా విమర్శించారో అదే పార్టీలో ఆయన చేరారు. దరిమిలా చాలా కాలం బీజేపీ లీగల్ సెల్‌లో పనిచేసిన తర్వాత ఆయనకు 2016లో ఆ సెల్ సారథ్యం లభించింది. రామజన్మభూమి కేసుల్లోనూ, ఉగ్రవాద కేసుల్లోను బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలకు న్యాయ సహాయం అందించేవారు. ధన్‌ఖడ్‌పై మోదీ దృష్టి ఎలా పడిందో కాని 2019లో ఆయనను ఏకంగా పశ్చిమబెంగాల్ గవర్నర్‌గా నియమించారు. మూడు సంవత్సరాల పాటు అనేక బిల్లులను తొక్కిపెట్టడం, తీవ్ర విమర్శలు చేయడం వంటి పనులతో ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ముప్పుతిప్పలు పెట్టిన తర్వాత జగదీప్ ధన్‌ఖడ్‌ను ఉపరాష్ట్రపతి వంటి కీలక పదవిలో నియమించారు.
రెండు దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో కనుమరుగై ఉన్న జగదీప్ ధన్‌ఖడ్‌ను నరేంద్రమోదీ ఏ కారణాలరీత్యా చేరదీశారో తెలియదు. అయితే అదే వ్యక్తిని అనూహ్యంగా పదవి నుంచి తప్పించడం లేదా తప్పుకుంటే చూస్తూ ఉండడం మాత్రం ఆశ్చర్యకరం. న్యాయవ్యవహారాల్లో ధన్‌ఖడ్ పెద్దగా నిపుణుడు కాదని, ఒకటి రెండు ముఖ్యమైన కేసులు తప్ప గొప్ప కేసులు ఏవీ వాదించిన దాఖలాలు లేవని అనేకమంది న్యాయ నిపుణుల అభిప్రాయం. అలాంటి వ్యక్తిని రాజ్యాంగ వ్యవహారాల్లో గొప్ప పరిజ్ఞానం ఉన్న వ్యక్తిగా ప్రశంసిస్తూ అనుభవజ్ఞుడైన వెంకయ్యనాయుడు స్థానంలో మోదీ నియమించినప్పుడు ఆశ్చర్యపోని ఎంపీలు లేరు. ఇప్పుడు ఆయనను తొలగించడం కూడా అంతే ఆశ్చర్యం కలిగిస్తోంది. రాజకీయాల్లో ఒక వ్యక్తి ఉత్థాన పతనాలు ఎలా జరుగుతాయన్నదానికి జగదీప్ ధన్‌ఖడ్ జీవితమే నిదర్శనం. గవర్నర్ పదవిలో ఉండగా పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ బలోపేతం కావడానికి కారకుడై, బీజేపీ ఏజెంట్‌గా ముద్రపడిన ధన్‌ఖడ్ రాజ్యసభ చైర్మన్‌గా కూడా దాదాపు బీజేపీ నాయకుడుగానే వ్యవహరించారు! ప్రతిపక్ష సభ్యులను ఎంతగా కట్టడి చేయాలో అంతగా కట్టడి చేశారు. విపక్ష సభ్యులు మాట్లాడుతుంటే మాటిమాటికీ అడ్డుతగిలేవారు. పార్లమెంట్‌లో గత ఏడాది భద్రతా వైఫల్యం జరిగినప్పుడు నిరసన తెలిపిన ప్రతిపక్ష ఎంపీలను సభ నుంచి సస్పెండ్ చేశారు. ఒక దశలో ఆయనను తొలగించేందుకు ప్రతిపక్షాలు నోటీసు కూడా ఇచ్చాయి. పూర్వ ఉపరాష్ట్రపతి హోదాలో వెంకయ్య ఒకసారి విందు ఇచ్చినప్పుడు ‘మీ హాయంలోనే పరిస్థితులు బాగుండేవి’ అని పలువురు ప్రతిపక్షసభ్యులు ఆయన వద్ద వాపోయారు. న్యాయవ్యవస్థతో కూడా జగదీప్ ధన్‌ఖడ్ బలంగా ఢీకొన్నారు. న్యాయమూర్తుల నియామకంపై రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును కూడా తీవ్రంగా తప్పుపట్టారు. జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో డబ్బు దొరికినప్పుడు అదే అదనుగా ఆయన న్యాయవ్యవస్థపై విరుచుకుపడ్డారు. బిల్లుల ఆమోదంలో రాష్ట్రపతికి గడువు విధించే హక్కు న్యాయవ్యవస్థకు లేదని వ్యాఖ్యానించారు. రాజ్యాంగంలో ఉన్న సోషలిజం, సెక్యులరిజం పదాలకు వ్యతిరేకంగా కూడా వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వానికి పరమ విధేయుడులా వ్యవహరించిన ధన్‌ఖడ్ తన పదవీకాలం ఇంకా రెండేళ్లుందనగా రాజీనామా చేశారు.
ఆ ఉన్నత పదవి నుంచి ఇలా నిష్క్రమించవలసివస్తుందని ఆయన కూడా అనుకుని ఉండరు. ఉపరాష్ట్రపతి పదవిలో ఆయన అనేక సౌకర్యాలు డిమాండ్ చేసి మరీ కల్పించుకున్నారు. తన వ్యక్తిగత సిబ్బందిలో పలువురిని పార్లమెంటరీ కమిటీల్లో నియమించుకుని ప్రతిపక్షాల విమర్శలకు గురయ్యారు. 2027 ఆగస్టు వరకూ తాను ఉపరాష్ట్రపతి పదవిలో కొనసాగుతానని 11 రోజుల క్రితమే ఆయన ప్రకటించారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌ను మచ్చలేని సంస్థగా రాజ్యసభలో ప్రశంసించారు. ఇటీవలే ఆర్ఎస్ఎస్ నేత రాంమాధవ్ పుస్తకావిష్కరణలో సావర్కార్‌ను ప్రశంసించిన ధన్‌ఖడ్ తనపై బీజేపీ అగ్రనేతలు కినుక వహిస్తారని ఊహించి ఉండరు. ఆరోగ్య కారణాల రీత్యే అయితే ఉపరాష్ట్రపతి పదవిలో ఉన్నవారు రాజీనామా చేయనవసరం లేదు. రాజ్యాంగ పదవులలో ఉన్నవారికి ప్రభుత్వపరంగా అత్యాధునిక వైద్య సౌకర్యాలు ఎలాగూ లభిస్తాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నంతకాలం రాజ్యసభను నిర్వహించేందుకు వైస్ చైర్మన్, ఇతర ప్యానెల్ చైర్మన్లు ఉండనే ఉన్నారు. అందువల్ల ఆరోగ్య కారణాల రీత్యా రాజీనామా చేశానని ధన్‌ఖడ్ చెబితే నమ్మేవారుండరు. కాని ఆయన నిష్క్రమణ పర్వానికి సంకేతాలు కొద్ది రోజులనుంచే లభిస్తున్నాయని పార్లమెంట్ కార్యాలయ సిబ్బంది చెబుతున్నారు. అంతర్గత సమాచారం ప్రకారం కొద్ది రోజులనుంచి విదేశాలనుంచి వచ్చే నేతలు, ప్రతినిధులు ఉపరాష్ట్రపతిని కలుసుకోవడం లేదు. ప్రభుత్వాధినేతలు కొన్ని విషయాల్లో తనను విశ్వాసంలోకి తీసుకోవడం లేదని ధన్‌ఖడ్ తన సన్నిహితులతో వాపోయినట్లు సమాచారం. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభానికి ముందు ఆదివారం ఆయన తన సిబ్బంది అందరికీ విందు ఇవ్వడం కూడా ఒక సంకేతం. అసలు జస్టిస్ వర్మను తొలగించేందుకు ప్రతిపక్షాలు ఇచ్చిన నోటీసును రాజ్యసభ చైర్మన్‌గా ఆయన ఎందుకు ఆమోదించారు? లోక్‌సభలో అధికార ఎంపీలు ఇచ్చిన నోటీసును ఆమోదించి తామే చర్చను ప్రారంభించి న్యాయ వ్యవస్థపై పట్టుబిగించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్న విషయం ఆయనకు తెలియదా? పహల్గామ్ ఘటనపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ప్రభుత్వంపై అనేక ప్రశ్నలు సంధిస్తూ మాట్లాడేందుకు ఆయన ఎందుకు అనుమతించారు? ప్రభుత్వం నుంచి వస్తున్న వ్యతిరేక సంకేతాల మూలంగా వెళ్లిపోయే ముందు స్వతంత్రంగా వ్యవహరించాలని ఆయన అనుకున్నారా?
ధన్‌ఖడ్ ఏర్పాటు చేసిన సభా వ్యవహారాల కమిటీ సమావేశానికి ప్రభుత్వం తరఫున మంత్రులు రాకపోవడం కూడా ప్రతిపక్షాల దృష్టికి వచ్చింది. ధన్‌ఖడ్‌ను తప్పించడం తప్ప మరో మార్గం లేదని, లేకపోతే సభలో మరిన్ని సమస్యలు తలెత్తుతాయని సోమవారం సాయంత్రం మోదీ అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకున్న తర్వాతే ఆయనతో రాజీనామా చేయించారని అధికారిక వర్గాల కథనం. దేశ అధికార వ్యవస్థలో అత్యంత శక్తిమంతులైన నరేంద్రమోదీ, అమిత్ షాల ఆలోచనకు భిన్నంగా వ్యవహరిస్తే ఎంతవారైనా, ఎంత ఉన్నత పదవిలో ఉన్నా కొనసాగడం అంత సులభం కాదని జగదీప్ ధన్‌ఖడ్ నిష్క్రమణతో విశదమయింది. అయితే ఒక రాజ్యాంగ పదవిలో ఉన్నవారు సాధారణ ఉద్యోగిలా రాజీనామా చేసి వెళ్లడం, నమ్మదగిన కారణాలు చెప్పకపోవడంతో ఈ దేశంలో ఏది జరిగినా హతాశులు కానక్కర్లేదన్న విషయమూ స్పష్టమవుతోంది.
ఎ. కృష్ణారావు
(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)
ఈ వార్తలు కూడా చదవండి..
కోర్టును ఆశ్రయించిన మహిళ.. సీజేఐ ఆసక్తికర వ్యాఖ్యలు
ధన్‌ఖఢ్ రాజీనామా వెనుక నితీష్‌ను తప్పించే కుట్ర.. ఆర్జేడీ ఆరోపణ
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి