Bihar Elections Analysis: విపక్షాల దౌర్బల్యమే మోదీ విజయం
ABN , Publish Date - Nov 19 , 2025 | 02:20 AM
‘మీరు బిహార్‌లో ఎన్నికల కవరేజ్‌కు వెళ్లి పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చు. అక్కడ ఎన్డీఏ అధికారంలోకి రావడం ఖాయం’ అని ఎన్నికల షెడ్యూలు ప్రకటించకముందే ఒక సీనియర్ జర్నలిస్టు సలహా ఇచ్చారు. ఆయన ఏ ఉద్దేశంతో ఈ సలహా ఇచ్చారో కానీ....
‘మీరు బిహార్‌లో ఎన్నికల కవరేజ్‌కు వెళ్లి పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చు. అక్కడ ఎన్డీఏ అధికారంలోకి రావడం ఖాయం’ అని ఎన్నికల షెడ్యూలు ప్రకటించకముందే ఒక సీనియర్ జర్నలిస్టు సలహా ఇచ్చారు. ఆయన ఏ ఉద్దేశంతో ఈ సలహా ఇచ్చారో కానీ దేశంలోని పరిస్థితులు చూస్తుంటే ప్రధాని మోదీకి దేశ రాజకీయాల్లో తిరుగులేదనే అభిప్రాయం చాలా మందిలో నెలకొని ఉన్నదని తెలుస్తోంది. మోదీకి మించిన, బలమైన నాయకుడు ఇతర పార్టీల్లో లేకపోవడం మాత్రమే కాదు, భారతీయ జనతా పార్టీకున్న ఎన్నికల యంత్రాంగం, పటిష్ఠ వ్యూహరచన చేసే శక్తి, కింది స్థాయి నుంచి పరిస్థితులను అధ్యయనం చేసి అవసరమైన చర్యలు తీసుకోగల నిశిత దృష్టి, అన్నిటినీ మించి వ్యవస్థలపై ఉన్న పట్టు మూలంగా కమలనాథులను ఓడించడం కాంగ్రెస్‌కు, ఇతర పార్టీలకు సాధ్యం కాదేమోనన్న అంచనా చాలా మందికి ఉన్నది.
అయినప్పటికీ బిహార్‌లో ఫలితాలు భిన్నంగా ఉండవచ్చునేమో అన్న ఆశలు బీజేపీ వ్యతిరేకులకు చివరివరకూ మిణుకుమిణుకుమంటూనే ఉన్నాయి. దాదాపు 20 ఏళ్లు నితీశ్‌కుమార్ ముఖ్యమంత్రిగా ఉండడం, బీజేపీకి స్థానిక నాయకుడంటూ లేకపోవడం మాత్రమే కాదు, ఎన్నికల కమిషన్ అక్రమాలు చేస్తున్నదన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రతిపక్షాలు ఉధృతంగా ప్రయత్నం చేయడం, బలహీనవర్గాలకు మోదీ వ్యతిరేకమని, రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతున్నారనే ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు తీవ్రయత్నాలు చేయడం మూలంగా ప్రతిపక్షాలు పుంజుకోవచ్చుననే అభిప్రాయం చాలా మంది వ్యక్తం చేశారు. ముఖ్యంగా రాహుల్‌గాంధీ, తేజస్వి యాదవ్ ఇద్దరూ చేపట్టిన ఓటర్ అధికార యాత్రకు భారీ ఎత్తున ప్రతిస్పందన లభించింది. ఒక లక్ష్యం ప్రకారం గ్రామీణ, సెమీ అర్బన్ ఏరియాలో ఈ యాత్రను చేపట్టారు. గయాలో తొక్కిసలాటలో ఒక యువకుడు కూడా మరణించాడు. ముఖ్యంగా సీమాంచల్‌లో రాహుల్ యాత్ర అన్ని రికార్డులను అధిగమించి 2 లక్షలకు పైగా జనాన్ని ఆకర్షించింది. ఎన్నికల ప్రచార సమయంలో కూడా రాహుల్, ప్రియాంక, తేజస్వి సభలకు జనం పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
‘బహిరంగ సభలకు, యాత్రలకు జనం పెద్ద సంఖ్యలో హాజరు కావడం, హాజరైన జనం ఓటర్లుగా మారడం అనేది ఒకటి కాదు’ అనేది చరిత్రలో అనేకసార్లు రుజువైంది. 1994లో పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పాల్గొన్న ఏలూరు సభకు లక్షలాది మంది హాజరయ్యారు. కానీ ఆశ్చర్యకరమేమంటే ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కేవలం 26 సీట్లు రాగా, తెలుగుదేశం 216 సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్ కంటే వామపక్షాలకు ఎక్కువ(34) సీట్లు లభించాయి. 1977లో ఎమర్జెన్సీ అనంతరం ఉమ్మడి బిహార్‌లో జరిగిన ఎన్నికల్లో ఇందిరాగాంధీ రాష్ట్రంలో ఎక్కడకు వెళ్లినా పెద్ద సంఖ్యలో జనం ఆమెకు నీరాజనాలు పట్టారు. కానీ ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ బిహార్‌లో అప్పుడున్న మొత్తం 54 సీట్లను కోల్పోయింది. ఈ రెండు సంఘటనలతో పాటు రాహుల్ సభలకు పెద్ద సంఖ్యలో జనం రావడాన్ని బట్టి రెండు అంచనాలకు రావచ్చని స్పష్టమవుతోంది. ప్రజా వ్యతిరేకత అనేది ఉంటే అది పైకి కనపడకుండా చాప కింద నీరు లాగా పాకుతుంది. ఇందిరాగాంధీ, పీవీ నరసింహారావు ఇద్దరూ కాంగ్రెస్ పట్ల ప్రజా వ్యతిరేకతను కనిపెట్టలేకపోయారు. ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకోవడంలో రాహుల్ విఫలమయ్యారు. 2014లో ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ జనం నాడిని పసిగట్టి అందుకు తగ్గ వ్యూహరచన చేయడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమవుతోంది. ప్రతికూల అంశాలను కూడా మోదీ అనుకూలంగా మార్చుకోగలిగితే, అనుకూల అంశాలను కూడా రాహుల్ వ్యతిరేకంగా మార్చుకుంటున్నారేమో!
ఆశ్చర్యమేమంటే, రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ సభలకు పెద్ద సంఖ్యలో జనం వచ్చిన నియోజకవర్గాలన్నిటిలోనూ కాంగ్రెస్ చిత్తుగా ఓడిపోయింది. కాంగ్రెస్ గెలిచిన ఆరు సీట్లలో మూడు సీట్లు అతి స్వల్ప మెజారిటీతో గెలిచింది. కాంగ్రెస్ 5 సీట్లలోనూ, ఆర్‌జేడీ ఒక సీటులోనూ డిపాజిట్ కోల్పోగా ఎన్డీఏ ఎక్కడా డిపాజిట్ కోల్పోకపోవడం గమనార్హం.
ఒక యంత్రాంగం అంటూ లేకపోవడం వల్ల కాంగ్రెస్ ఓడిపోయింది. కానీ ఆర్‌జేడీ ఘోర వైఫల్యమే బిహార్ ఎన్నికల్లో అన్నిటికంటే విడ్డూరమైన విషయం. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్‌జేడీ అన్ని పార్టీల కంటే ఎక్కువగా– అంటే 75 సీట్లు గెలుచుకుంది. ఈసారి తన సీట్లు తప్పకుండా పెంచుకుంటుందని చాలా మంది ఆశించారు. బిహార్‌లో మండల్ రాజకీయాల్లో బలమైన పునాది ఉన్న రాష్ట్రీయ జనతాదళ్ 143 సీట్లలో పోటీ చేసి కేవలం 25 సీట్లు మాత్రమే గెలుచుకోవడానికి కారణం ఏమిటి? ఆర్‌జేడీకి ప్రధాన ఓటు బ్యాంక్ అయిన యాదవులకూ, ఇతర అత్యంత వెనుకబడిన సామాజిక వర్గాలు, మహిళలు, దళితులకూ మధ్య వైరుధ్యం ఈ ఎన్నికల్లో కొట్టొచ్చినట్లు కనపడిందని ఒక విశ్లేషకుడు తెలిపారు. యాదవులకు 37 శాతం సీట్లిచ్చి, అత్యంత వెనుకబడిన వర్గాలకు కేవలం 11 శాతం సీట్లు ఇవ్వడం వల్ల ఆర్‌జేడీ కొత్త సామాజిక పునాదిని ఏర్పర్చుకోలేకపోయిందని ఆయన చెప్పారు. తన సొంత కుటుంబంలోని లుకలుకలనే ఆర్‌జేడీ పరిష్కరించుకోలేకపోయింది. ఆర్‌జేడీ తన వైఫల్యానికి గతంలో లాగా కాంగ్రెస్ వంటి మిత్రపక్షాలను నిందించేందుకు వీలు లేకుండా పోయింది. తాను పోటీ చేసిన సీట్లలో నాలుగోవంతు కూడా గెలుచుకోలేనప్పుడు ఇతరులను నిందించి అర్థం లేదు.
ఇంకా ఆశ్చర్యకరమయిన విషయం ఏమంటే దేశంలో ఎన్నో పార్టీల తరఫున వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిశోర్ స్వయంగా పార్టీ పెట్టి, గత ఏడాది కాలంగా జనం మధ్యలో తిరగడం ప్రారంభించారు. అనేకమంది మాజీ బ్యూరోక్రాట్లు, మేధావులకు టిక్కెట్లు ఇచ్చారు. ఆయన సభలకు కూడా జనం భారీగా హాజరయ్యారు. ఇంతకాలం తాను పార్టీల నుంచి వసూలు చేసిన కోట్లాది రూపాయలను ఆయన విచ్చలవిడిగా ఖర్చు పెట్టారు. బిహార్‌లో జన ప్రభంజనం వీస్తుందని, బొటాబొటి మెజారిటీ వచ్చినా అది తన ఓటమిగానే భావిస్తానని ఆయన చెప్పుకున్నారు. కానీ ఆయన మాటలన్నీ ప్రగల్భాలుగా మిగిలిపోయాయి. ఆయన స్థాపించిన ‘జన సురాజ్ పార్టీ’ 238 స్థానాల్లో పోటీ చేస్తే 236 స్థానాల్లో డిపాజిట్ కోల్పోయింది. రాజకీయ పార్టీలు ఎంతవరకు ఇలాంటి వ్యూహకర్తలను నమ్మాలో గ్రహించేందుకు ప్రశాంత్ కిశోర్ ఘోర వైఫల్యం ఒక ఉదాహరణ.
ప్రశాంత్ కిశోర్ మాత్రమే కాదు, మహాగఠ్ బంధన్‌లో ఉన్న అన్ని పార్టీలు గతంలో కంటే ఘోరంగా పరాజయం పొందడానికి రకరకాల కారణాలు చెబుతున్నారు. మండల్ రాజకీయాలకు నెలవైన బిహార్‌లో ఎవరూ ఊహించలేని మార్పు జరుగుతున్నదని కొందరు పరిశీలకులు భావిస్తున్నారు. అది బీజేపీ సీట్ల సంఖ్య ఈసారి గతంలో కంటే ఎక్కువ పెరగడమే కాక, బీజేపీతో చేతులు కలిపిన పార్టీలు కూడా తమ సంఖ్యా బలాన్ని పెంచుకోవడం కూడా. బీజేపీ హిందూత్వ రాజకీయాలు బిహార్‌లోనూ ప్రభావం చూపుతున్నాయని ఒక విశ్లేషకుడు అంటే, ప్రజలు మోదీ నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధికి స్వాగతం పలుకుతున్నారని ఎన్డీఏ భాగస్వామి పక్షమైన తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విశ్లేషించారు. ఏమైనా బిహార్‌లో బీజేపీ సారథ్యంలో ఎన్డీఏ విజయం సాధించడం దేశ రాజకీయాల తీరుతెన్నులపై ప్రభావం చూపక తప్పదు.
ప్రతిపక్ష కూటమిలో మొదటి నుంచి పొడజూపిన అంతర్గత వైరుధ్యాలు కూడా ఈ ఫలితాలకు దారితీసి ఉండవచ్చు. ఓటర్ అధికార యాత్ర ద్వారా ప్రదర్శించిన వాపును బలుపుగా మార్చుకోవడంలో కాంగ్రెస్, ఆర్‌జేడీ విఫలమయ్యాయి. సీట్ల సర్దుబాటులో రెండు పార్టీలు చివరి వరకు ఘర్షించడం, స్నేహపూర్వక పోటీ పేరుతో దాదాపు 10 సీట్లలో కాంగ్రెస్ మిత్రపక్షాలతో తలపడడం, ముఖ్యమంత్రి అభ్యర్థి పేరును ప్రకటించడంపై అభ్యంతరాలు వ్యక్తం చేయడం, ఉమ్మడి మేనిఫెస్టో విడుదలకు రాహుల్‌గాంధీ హాజరుకాకపోవడం, ఆర్‌జేడీపై లాలూ హయాంలో పడ్డ జంగిల్ రాజ్ ప్రభావం ప్రజలు మరచిపోకపోవడం లాంటి అనేక కారణాల వల్ల మహాగఠ్ బంధన్ ఒక సమైక్య శక్తిగా ఏనాడూ కనిపించలేదు. అదే సమయంలో బీజేపీ, ఎన్డీఏ మిత్రపక్షాలు తమ మధ్య విభేదాలను ఎంతో ముందుగా పరిష్కరించుకోవడం, హోంమంత్రి అమిత్ షా ఢిల్లీని కూడా విస్మరించి దాదాపు 20 రోజులు అక్కడే మకాం వేయడం, మోదీ ఉధృతంగా ప్రచారం చేయడం, ఎస్‌ఐఆర్ పేరుతో ఓట్లను తొలగించలేకపోయినా హిందూ ఓట్లను సంఘటితం చేయగలగడం ఎన్డీఏ గెలుపునకు దారితీసింది.
అయినా ఎన్డీఏ 200కు పైగా సీట్లను గెలుచుకుంటుందని ఏ పరిశీలకుడూ ముందుగా ఊహించలేదు. ఎన్నికల సమయంలో మహిళలకు పెద్ద మొత్తంలో నిధులు పంపిణీ చేయడం వంటి కారణాలు ఎన్డీఏ గెలుపునకు దోహదం చేస్తాయని అంచనా వేసినవారు కూడా కొద్దిపాటి ఆధిక్యతతో ఎన్డీఏ అధికారంలోకి వస్తుందని మాత్రమే ఊహించారు. కానీ ఎన్డీఏకు అనూహ్యమైన విజయం లభించింది. ఎన్నికల అక్రమాలే కారణమని, ఎన్నికల కమిషన్ అధికార పార్టీకి అనుగుణంగా నడుచుకుందని ప్రతిపక్షాలు విమర్శించినంత మాత్రాన ఈ విజయం ప్రాధాన్యం తగ్గిపోదు. తమ ఆరోపణలు, విమర్శలు ప్రజలను కదిలించలేనప్పుడు వాటివల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. బిహార్ ఎన్నికల్లో విజయం సాధించి, తన నాయకత్వ సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి, తనపై ఇంటా బయటా వస్తున్న విమర్శలను తిప్పికొట్టి అజేయుడుగా మారడానికి మోదీ ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయత్నిస్తారన్న విషయం తెలిసినప్పటికీ బీజేపీ వ్యూహాల్ని అంచనా వేయడంలోను, తమ పార్టీలను పటిష్ఠంగా మార్చుకోవడంలోనూ కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు విఫలమయ్యాయన్న విషయం స్పష్టమవుతోంది. ప్రతిపక్షాల దౌర్బల్యమే మోదీకి శ్రీరామరక్ష.
ఎ. కృష్ణారావు
(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)
ఈ వార్తలు కూడా చదవండి..
హిడ్మా ఎన్‌కౌంటర్.. ప్రొ.హరగోపాల్ కీలక వ్యాఖ్యలు
అందుకే మారేడుమిల్లికి వచ్చిన మావోయిస్టులు.. జిల్లా ఎస్పీ
రాష్ట్రపతిని కలువనున్న మందకృష్ణ.. ఎందుకంటే
కుల, మత రాజకీయాలు శాశ్వతంగా నడవవు
Read Latest National News And Telugu News
Read Latest AP News And Telugu News