Share News

Narendra Modi: మోదీ వారసుడిపై చర్చ అవసరమా?

ABN , Publish Date - Jul 16 , 2025 | 01:43 AM

డెబ్బైతొమ్మిదేళ్ల ట్రంప్ ఉదయాన్నే ఏ ట్వీట్ చేస్తారా అని ప్రపంచమంతా ఎదురు చూస్తుందని, కొద్ది పదాల్లో ఆయన వెల్లడించే అభిప్రాయాలు ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు, ప్రభుత్వాల విధానాలనూ ప్రభావితం చేస్తున్నాయని విదేశాంగ వ్యవహారాల నిపుణుడు ఒకరు వ్యాఖ్యానించారు.

Narendra Modi: మోదీ వారసుడిపై చర్చ అవసరమా?

డెబ్బైతొమ్మిదేళ్ల ట్రంప్ ఉదయాన్నే ఏ ట్వీట్ చేస్తారా అని ప్రపంచమంతా ఎదురు చూస్తుందని, కొద్ది పదాల్లో ఆయన వెల్లడించే అభిప్రాయాలు ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు, ప్రభుత్వాల విధానాలనూ ప్రభావితం చేస్తున్నాయని విదేశాంగ వ్యవహారాల నిపుణుడు ఒకరు వ్యాఖ్యానించారు. పెద్ద నోట్ల రద్దును ప్రకటించి అరగంటలో భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసిన, వ్యవస్థలపై పట్టుబిగించిన నరేంద్రమోదీకి వచ్చే సెప్టెంబర్‌లో 75 ఏళ్లు నిండనున్నాయి. పరిపూర్ణ ఆరోగ్యవంతుడుగా కనిపించే మోదీ గురించి తెలియని భారతీయుడు ఇప్పుడు ఈ దేశంలో ఎక్కడా ఉండడు. అయిదుసార్లు రష్యా అధ్యక్షుడుగా గెలిచిన 74 ఏళ్ల పుతిన్ వర్తమాన ప్రపంచ శక్తిమంతమైన నాయకుల్లో ఒకరు. 75 సంవత్సరాలు ఇప్పటికే నిండిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇవాళ క్వాంటం వ్యాలీ గురించి మాట్లాడుతున్నారు. ప్రభుత్వ విధానాలే దేశ భవిష్యత్‌ను తీర్చిదిద్దుతాయని, 70 సంవత్సరాల వయసులో ప్రధాని అయిన పీవీ నరసింహారావు ఆర్థిక సంస్కరణలు అమలు చేయాలని నిర్ణయించకపోతే ఇవాళ దేశం అభివృద్ధి పథంలో పయనిస్తూ ఉండేది కాదని మంగళవారం చంద్రబాబు ఢిల్లీలో పీవీ స్మారకోపన్యాసం వెలువరిస్తూ చెప్పారు. దేశ రాజకీయాలను, ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేందుకు నాయకుల వయసుతో నిమిత్తం ఉండదని, ప్రజల అవసరాలు, ప్రయోజనాలకు అనుగుణంగా నాయకులు క్రియాశీలంగా ఉన్నంతకాలం వారు తమ రాజకీయ జీవితంలో కొనసాగుతూనే ఉంటారని చెప్పేందుకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి.


అయినప్పటికీ ప్రజా జీవనంలో ఉన్నవారు 75 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఇతరులకు అవకాశం కల్పించాలని రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ అధినేత మోహన్ భాగవత్ ఇటీవల అన్నమాటలు తీవ్ర చర్చను ఎందుకు ప్రేరేపిస్తున్నాయి? రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అంటే బీజేపీ మాతృసంస్థ. బీజేపీలో ఉన్న అగ్రనాయకులంతా ‘సంఘ్‌’ నుంచి వచ్చినవారే. ‘ఒక్కసారి స్వయం సేవకుడైతే జీవితాంతం స్వయం సేవకుడే’ అని దివంగత ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి సగర్వంగా ప్రకటించారు. గత ఏప్రిల్ తుదినాళ్లలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాగపూర్‌లో ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయానికి వెళ్లినప్పుడు స్వయం సేవకులను ఉద్దేశించి మాట్లాడుతూ ‘మనం..’ అనే పదాన్ని ఉపయోగించారు. తాను స్వయం సేవకుడిని కాదని మోదీ ఎప్పుడూ అనలేదు.


ఇంతకూ మోహన్ భాగవత్ వ్యాఖ్యలపై చర్చిస్తున్నది ఎవరు అన్నది ప్రధానం. భాగవత్ అలా ప్రకటించగానే కాంగ్రెస్ నేతలు సంబరపడిపోయారు. తన మనుగడకు మోదీ ఎంత ప్రమాదకరమో కాంగ్రెస్ భావిస్తున్నందువల్లే ఆ పార్టీ నాయకులు సంబరాన్ని ప్రకటించా రనడంలో అతిశయోక్తి లేదు. 2014లో మోదీ ప్రధానిగా ఎన్నికైనప్పటి నుంచీ కాంగ్రెస్ జీవన్మరణ సంఘర్షణ చేస్తూనే ఉన్నది. ఒకో రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోతూ వస్తోంది. మోదీని ఢీకొనడానికి బలమైన రాజకీయ కార్యాచరణ ఎలా నిర్మించాలా అన్న విషయం కాంగ్రెస్ నేతలకు అంతుపట్టడం లేదు. మోదీనే కాదు, ఆయన మూలంగా విస్తరిస్తోన్న భావజాలాన్ని ఎదుర్కొనేందుకు అవసరమైన ప్రత్యామ్నాయ భావజాలం కాంగ్రెస్ కానీ, ఇతర ప్రతిపక్షాలు కానీ, వామపక్ష మేధావులు కానీ ఇంకా సమకూర్చుకోవాల్సి ఉన్నది. అందువల్ల తాము ఓడించలేని మోదీని సంఘ్ పరివార్ పక్కకు తప్పిస్తుందని ఆశపడడంలో అర్థం లేదు. మోదీ ఉన్నా, లేకపోయినా మోదీ ఒక మహాశక్తిగా రూపొందడానికి కారణమైన భావజాలాన్ని కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు శక్తులు ఎలా ఎదుర్కోగలవా అని సామాజిక విశ్లేషకులు ఆలోచిస్తున్నారు. 82 ఏళ్లు నిండిన మల్లికార్జున ఖర్గేని పార్టీ అధ్యక్షుడుగా, 78 ఏళ్ల వయసులో సోనియాను రాజ్యసభ సభ్యురాలిగా కొనసాగిస్తున్న కాంగ్రెస్ ఇతర పార్టీల నేతల వయసు గురించి మాట్లాడడం అసమంజసంగానే ఉంటుంది.


మోదీ స్వయం సేవకుడే. అంతమాత్రాన మోహన్ భాగవత్ వ్యక్తం చేసిన అభిప్రాయం మోదీకి కూడా వర్తిస్తుందని అనడానికి వీల్లేదు. బహుశా, భాగవత్ స్వయంగా తన గురించి ఈ అభిప్రాయం వ్యక్తం చేసి ఉండవచ్చు. ఆయనకు కూడా సెప్టెంబర్‌లోనే 75 ఏళ్లు పూర్తి కానున్నాయి. గత ఏప్రిల్‌లో మోదీ నాగపూర్‌కు వెళ్లినప్పుడు ఆయనను పదవీ విరమణ చేయమని సంఘ్ అడిగిందని శివసేన నేత సంజయ్ రౌత్ చెప్పారు. మోదీ త్వరలో పదవీవిరమణ చేస్తారని, అమిత్ షాకు అధికారం అప్పజెబుతారని గత ఏడాది ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ ఊహాగానం చేశారు. అసలు బీజేపీ వ్యవహారాలపై మాట్లాడే హక్కు వారికేమున్నది? ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే కేజ్రీవాల్, సంజయ్ రౌత్ వ్యాఖ్యానించినప్పుడు అమిత్ షా, దేవేంద్ర ఫడణవీస్ వంటి నేతలు వెంటనే ఖండించారు. 75 సంవత్సరాలు దాటినంత మాత్రాన మోదీ పదవీవిరమణ చేయాలన్న నిబంధన ఏమీ లేదని వారు స్పష్టం చేశారు. గమనార్హమేమిటంటే మోహన్ భాగవత్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ స్పందిస్తూ మోదీని సంఘ్ ఇంటికి పంపాలనుకుంటున్నదని వ్యాఖ్యానిస్తే బీజేపీ నేతలు ఎవరూ మాట్లాడలేదు. అంతా నీరవ నిశ్శబ్దం నెలకొన్నది. అయినప్పటికీ భాగవత్ వ్యాఖ్యలు మోదీకి వర్తిస్తాయని చెప్పేందుకు వీల్లేదు. ఎందుకంటే సంఘ్ పెద్దల వ్యాఖ్యలపై బీజేపీ నేతెలు ఎవరూ వ్యాఖ్యానించే అవకాశం ఏ మాత్రం లేదు. ఇది సంఘ్‌ లోనూ, పార్టీలోనూ అందరూ పాటించే క్రమశిక్షణ. సంఘ్ పెద్దలు ఏ వ్యాఖ్యలు చేసినా అది తమ అంతర్గత వ్యవహారమని వారు భావిస్తారు. అంతేకాదు, మోదీ పది సంవత్సరాలకు పైగా అధికారంలో ఉన్నా, బీజేపీలో ఎక్కడా ఆయనకు వ్యతిరేకంగా రణ గొణ ధ్వనులు వినిపించలేదు. మోదీ తీసుకున్న ప్రతి నిర్ణయాన్నీ బీజేపీ నేతలు ఆమోదించారు. 75 సంవత్సరాలు దాటాయన్న పేరుతో ఆడ్వాణీ, మురళీమనోహర్ జోషి వంటి వారిని మార్గదర్శక మండలిలో చేర్చినా ఎవరూ ప్రశ్నించలేదు. ఆనందీబెన్, సుమిత్రా మహాజన్ వంటి వారిని విశ్రాంతి తీసుకొమ్మని చెప్పినా అలా ఎందుకు అని అడిగినవారు లేరు. ముఖ్యమంత్రులుగా ఉన్న సీనియర్లను తప్పించి అనామకులను నియమించినా మోదీని ధిక్కరించినవారు కనపడలేదు. మోదీ–షా ప్రవేశపెట్టిన అధిష్ఠాన సంస్కృతి అంతకంతకూ బలోపేతమవుతోంది.


అంతేకాక, వయసు పెరిగిందన్న పేరుతో మోదీని పక్కకు తప్పిస్తే ఆయన కంటే బలమైన నేత లభిస్తారన్న గ్యారంటీ ఏమిటి? మోదీ వారసుడిని సంఘ్ మాత్రమే నిర్ణయిస్తుందన్న విషయంలో రెండో ఆలోచనకు తావు లేదు. లాల్‌కృష్ణ ఆడ్వాణీ కరాచీ వెళ్లి దేశ విభజనకు కారకుడైన పాకిస్థాన్‌ సంస్థాపకుడు మహమ్మదాలీ జిన్నాను ప్రశంసిస్తే ఆయనను పక్కకు తప్పించింది సంఘ్ కాదా? వాజపేయి తర్వాత రెండుసార్లు అవకాశం లభించినా బీజేపీని అధికారంలోకి తెచ్చేందుకు ఆడ్వాణీ విఫలమైతే, ఆయన స్థానంలో ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్రమోదీని రంగంలోకి దించింది సంఘ్ కాదా? ఒకసారి బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ రోజువారీ నిర్ణయాల్లో సంఘ్‌ కలుగచేసుకోకపోవచ్చు. అయినా ఇవాళ ప్రతి మంత్రిత్వశాఖలోను, విభాగాల్లోను, అనుబంధ సంస్థల్లోనూ సంఘ్‌కు సంబంధించినవారు రకరకాల పదవుల్లో నియమితులవుతున్నారన్న విషయాన్ని కాదనగలమా? ఇంతెందుకు ఎన్నికలు జరుగుతున్న సమయంలో బీజేపీ గెలుపొందేందుకు రకరకాల సంస్థల ద్వారా సంఘ్ తనవంతు ప్రయత్నాలు చేయడం, లబ్ధిదారుల వద్దకు వెళ్లడం నిజం కాదా? సంఘ్ పెద్దల్ని మచ్చిక చేసుకుంటే తమ పనులు సులభంగా అవుతాయని, ఏ పదవి రావాలన్నా సంఘ్ ఆశీర్వాదాలు అవసరమని బీజేపీ నేతలు కూడా భావిస్తున్నారు. అందువల్ల సంఘ్ లేనిది బీజేపీ లేదు, బీజేపీ లేనిది సంఘ్ లేదనేది కఠోర వాస్తవం. ఆర్‌ఎస్‌ఎస్‌ను బలహీనం చేయకుండా బీజేపీని దెబ్బతీయలేమని ఇటీవల కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఒకరు అంగీకరించారు. రాహుల్‌గాంధీ కూడా తన ప్రధాన దాడిని సంఘ్‌పై ఎక్కుపెడుతున్నారు.


మోదీ స్థానంలో మరో నేత ఇప్పట్లో అధికారం చేపట్టే అవకాశాలు అనుమానమే. సంఘ్ ఇప్పటికే మోదీకి ప్రత్యామ్నాయంగా మరో నేతను సిద్ధం చేసిందని చెప్పడానికి ఆధారాలు ఏమీ లేవు. నిజానికి సంఘ్ ఎప్పుడూ వ్యక్తుల ఆధారంగా ఆలోచన జరపదని ఆ సంస్థ పెద్దలు అనేకసార్లు సూచించారు. వ్యక్తుల ఆధారంగా పార్టీలు అధికారంలోకి రావని, ఆ నాటి సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితుల ఆధారంగా పార్టీలు అధికారంలోకి వచ్చే వాతావరణం ఏర్పడుతుందని, ఆ సమయంలో క్రియాశీలంగా ఉన్న ఒక వ్యక్తి అవకాశాలు అందిపుచ్చుకుంటారని సమాజ చలన సూత్రాలు చెబుతున్నాయి. అందువల్ల మోదీ స్థానంలో నితిన్ గడ్కరి, యోగి ఆదిత్యనాథ్‌ల గురించి చర్చ జరుగుతున్నా అది కేవలం ఊహాగానాలపై ఆధారపడిన చర్చ మాత్రమే. కాకపోతే బీజేపీపై ఆర్‌ఎస్‌ఎస్ పట్టు మరింత బిగుస్తోందని చెప్పేందుకు ఆధారాలు ఉన్నాయి. వివిధ రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుల నియామకంలో సంఘ్ పాత్ర స్పష్టంగా కనపడుతోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడి నియామకం విషయంలో కూడా బీజేపీ, సంఘ్ పెద్దలు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే బీజేపీ ఇప్పటికే పదేళ్లకు పైగా అధికారంలో ఉన్నది. ఈ పదేళ్ల కాలంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయాలు, ఫలితాలపై అంతటా చర్చ జరుగుతోంది. రానున్న సంవత్సరాల్లో భారత రాజకీయాల్లో, సామాజిక జీవనంలో బీజేపీ, సంఘ్ ప్రభావాన్ని కొనసాగించడం అనేది చాలా కీలకమైన విషయం. బీజేపీని మరింత చైతన్యవంతం చేయగల, పటిష్ఠపరచగల పార్టీ అధ్యక్షుడు ప్రస్తుతం అవసరం. ఈ కారణంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడి నియామకం ఇప్పుడు యాంత్రికంగా జరిగే నిర్ణయం కాకపోవచ్చని ఆ పార్టీ నేతలే ఊహిస్తున్నారు. హిందూత్వ ఆధారంగా బీజేపీ చేసిన ప్రచారం, దానికి తోడుగా అవలంబించిన రాజకీయాలు, ప్రతిపక్షాలను బలహీనం చేసేందుకు అనుసరించిన విధానాలు ఎల్లవేళలా విజయవంతం కాకపోవచ్చు. భారతదేశంలో ఏ ప్రభంజనమూ శాశ్వతంగా కొనసాగిన దాఖలాలు లేవు. మోదీ ఆవశ్యకత, ఉపయుక్తత ఉన్నంతకాలమూ ఆయన కొనసాగుతారనడంలో సందేహం లేదు. మోదీ భవిష్యత్తును ఆయన వయసుతో నిమిత్తం లేకుండా ప్రజలు నిర్ణయిస్తారు.

-ఎ. కృష్ణారావు,

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Updated Date - Jul 16 , 2025 | 01:44 AM