Share News

విశ్వవేదికపై భారత్‌ స్థానమేమిటి

ABN , Publish Date - Jun 25 , 2025 | 06:19 AM

‘అరాచకత్వమే ప్రస్తుత వ్యవస్థగా కనిపిస్తోంది.. అలా అనిపించడం దారుణం కావచ్చు కాని అదే వాస్తవం..’ అని ఆర్ఎస్ఎస్ మేధావి రాం మాధవ్ తన తాజా పుస్తకం ‘ద న్యూ వరల్డ్ –ట్వంటీఫస్ట్ సెంచరీ గ్లోబల్ ఆర్డర్ అండ్ ఇండియా’లో చెప్పారు. ఈ పుస్తకాన్ని సోమవారం...

విశ్వవేదికపై భారత్‌ స్థానమేమిటి

‘అరాచకత్వమే ప్రస్తుత వ్యవస్థగా కనిపిస్తోంది.. అలా అనిపించడం దారుణం కావచ్చు కాని అదే వాస్తవం..’ అని ఆర్ఎస్ఎస్ మేధావి రాం మాధవ్ తన తాజా పుస్తకం ‘ద న్యూ వరల్డ్ –ట్వంటీఫస్ట్ సెంచరీ గ్లోబల్ ఆర్డర్ అండ్ ఇండియా’లో చెప్పారు. ఈ పుస్తకాన్ని సోమవారం నాడు ఢిల్లీలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధంఖడ్ ఆవిష్కరించారు. అంతర్జాతీయ రాజకీయాలు అయోమయంగా, హింసాత్మకంగా ఉన్న సమయంలో రాంమాధవ్ పుస్తకానికి ప్రాధాన్యత లేకపోలేదు. ‘భారతదేశం తన స్వంత బలం ద్వారా తన సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవాలి కాని పాశ్చాత్య ఆధిపత్య భావజాలానికి లోనుకావడం వల్లకాదు. అంతర్జాతీయ దేశాలన్నీ ఉమ్మడి లక్ష్యం కోసం పనిచేసే బహుపక్ష వాదం క్షీణిస్తోంది. ఈ సమయంలో భారతదేశం ఊహాలోకంలో విహరించే బదులు తన ఆర్థిక ప్రగతిపై దృష్టి కేంద్రీకరించాలి..’ అని రాంమాధవ్ చెప్పిన విషయాలను ఉపరాష్ట్రపతి ప్రత్యేకంగా ఉటంకించారు. అంతర్జాతీయ ఒత్తిడికి లోనై నెలరోజుల క్రితం భారత పాకిస్థాన్‌లు యుద్ధం అంచు నుంచి వెనక్కి మళ్లాయి. అయితే ప్రపంచంలో ఎక్కడా శాంతియుత వాతావరణం లేదు. రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య 2022 ఫిబ్రవరిలో మొదలైన యుద్ధం కొనసాగుతూనే ఉన్నది. 2023 అక్టోబర్‌లో మొదలైన ఇజ్రాయిల్–హమాస్–హెజ్బుల్లా–హౌతీ–ఇరాన్ యుద్ధం ఇంకా ఆగలేదు. గాజాలో ఆహారం, సహాయం కోసం సరిహద్దుల్లో వేచి చూస్తున్న వందలాది పాలస్తీనీయులను ఇజ్రాయిల్ దళాలు మంగళవారం కాల్చి చంపుతున్నట్లు వార్తలు వచ్చాయి. ఇరాన్‌లో మూడు అణుస్థావరాలను ధ్వంసం చేసినట్లు అమెరికా ప్రకటించినప్పటికీ, ఇజ్రాయిల్–ఇరాన్ యుద్ధం ఎడతెరిపి లేకుండా సాగుతోంది.


గత మూడు దశాబ్దాలుగా ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో చైనా విస్తరణ కొనసాగుతూనే ఉన్నది. ఈ మొత్తం పరిణామాల్లో భారతదేశం పాత్ర ఏమిటి? అన్న విషయంలో అంతటా అయోమయం నెలకొని ఉన్నది. పహల్గామ్‌లో పర్యాటకులను కాల్చి చంపిన పాకిస్థాన్‌ ఉగ్రవాదాన్ని ఎండగట్టేందుకు భారత్‌ తన ప్రతినిధులను ప్రపంచ దేశాలకు పంపిన కొద్ది రోజుల్లోనే ఈ పరిణామాలు సంభవించాయి. మన ప్రతినిధులు అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్‌ను కలిసిన వారం రోజుల్లోపే పాకిస్థాన్‌ ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్‌కు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వైట్ హౌజ్‌లో విందు ఇచ్చారు. పహల్గామ్‌లో ఉగ్రవాద ఘటనకు సూత్రధారి మునీరే అని భారత్ నిందించినప్పటికీ అతడికి అమెరికా పెద్ద పీట వేసింది! పాక్ ఆర్మీ ఛీఫ్‌ ఒకరికి వైట్ హౌజ్‌లో విందు ఇచ్చి గౌరవించడం ఇదే మొదటిసారి. ఇరాన్‌పై దాడులు చేసేందుకు పాక్‌ భూభాగాలు అమెరికాకు అవసరం. అదే సమయంలో ఇరాన్–పాకిస్థాన్ సరిహద్దుల్లో క్రియాశీలంగా ఉన్న వేర్పాటువాద శక్తులను నియంత్రించడం ఇస్లామాబాద్‌కు అవసరం. ఇరు దేశాలు తమ పరస్పర ప్రయోజనాలను నెరవేర్చుకునేందుకే ఈ సమావేశం జరిగిందని భారత రక్షణ, దౌత్య వ్యవహారాల నిపుణులు కొందరు వ్యాఖ్యానించారు. వేర్పాటువాదం పెచ్చరిల్లుతున్న బెలూచిస్తాన్‌లోని అత్యంత విలువైన ఖనిజవనరులను అమెరికాకు అప్పగించేందుకు ఫీల్డ్‌ మార్షల్‌ మునీర్ ఒప్పందం కుదుర్చుకున్నారని వార్తలు వచ్చాయి.. ఇరాన్‌పై ఇజ్రాయెల్‌, అమెరికా చేస్తున్న దాడులను పాకిస్థాన్ విజయవంతంగా తనకు అనుకూలంగా మలుచుకున్నదన్న విషయంలో సందేహం లేదు. ఇప్పటికే చైనాతో భవబంధాలు ఏర్పర్చుకుని బలమైన రక్షణ, ఆర్థిక సహకారాన్ని పొందుతున్న పాకిస్తాన్‌ను అమెరికా కూడా హత్తుకుంటోందన్న చేదు నిజం భారతీయులకు జీర్ణించుకోలేనిదిగా మారింది.


భారత్‌కు అమెరికా అత్యంత సన్నిహిత దేశమన్న విషయంలో ఎవరికైనా భ్రమలు ఉంటే ఈ పరిణామాల తర్వాత అవి చెదిరిపోయాయనే భావించవచ్చు. విచిత్రమేమంటే భారతదేశంలో నేరాలు, ఉగ్రవాదం పెరిగిపోతున్నందువల్ల ఆ దేశంలో ఉన్న, పనిచేస్తున్న అమెరికన్ పౌరులు, ఉద్యోగులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని, మహిళలు ఒంటరిగా ప్రయాణించకూడదని అమెరికా విదేశాంగ శాఖ తాజాగా తమ దేశస్తులకు హెచ్చరికలు పంపింది. భారతదేశంలో అత్యాచారాలు, నేరాలు పెరిగిపోతున్నాయని, ముఖ్యంగా పర్యాటక ప్రదేశాల్లో హింసాత్మక ఘటనలు, లైంగిక దాడులు జరిగే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించింది. తన విధానాలకు అనుగుణంగా నడుచుకునేలా ఒత్తిడి చేసే క్రమంలోనే అమెరికా ఇలాంటి అడ్వైజరీలు జారీ చేస్తుందన్న విషయం సుస్పష్టం. ఈ పరిణామాల నేపథ్యంలో గత దశాబ్ద కాలంగా చైనాతో పాటు పొరుగు దేశాలన్నిటినీ విస్మరించి, వాటితో శత్రుత్వం కొని తెచ్చుకుని, అమెరికాకు స్నేహహస్తం చాచి, ఆ దేశ సారథ్యంలోని కూటముల్లో చేరి ఎనలేని ఆదరాభిమానాలు చూపిన భారతదేశం సాధించినదేమిటి? అన్న ప్రశ్న తలెత్తుతోంది. నిజానికి అమెరికాకు ఆప్తమిత్ర దేశమైన ఇజ్రాయిల్ పాలస్తీనియన్‌ సంస్థ హమాస్‌పై దారుణంగా దాడులు చేస్తున్నప్పుడు భారత్ మౌనం పాటించింది. గాజాలో శాశ్వతంగా కాల్పులు విరమించాలని, ప్రజలను ఆకలితో మరణించేలా చేయడం సరైంది కాదని ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీలో జూన్ 12న చేసిన తీర్మానాన్ని అమెరికా, ఇజ్రాయిల్ తీవ్రంగా వ్యతిరేకించాయి. ఈ తీర్మానానికి అనుకూలంగా 149 దేశాలు ఓటు వేస్తే భారతదేశం ఓటు వేయకుండా తప్పుకొంది. రెండు రోజుల తర్వాత షాంఘై సహకార సంస్థ సమావేశంలో ఇరాన్ సైనిక స్థావరాలపైనే కాక, ప్రజల నివాసాలపై కూడా ఇజ్రాయెల్‌ దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ తీర్మానం చేసినప్పుడు కూడా భారతదేశం ఓటింగ్‌లో పాల్గొనకుండా తప్పుకుంది. ఇలా తప్పించుకున్న ఏకైక దక్షిణాసియా దేశం భారత్‌ మాత్రమే! తాజాగా ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ ప్రధాని మోదీకి ఫోన్ చేసి 45 నిమిషాలు మాట్లాడారు.


ఆ సందర్భంగా చర్చలు, దౌత్యనీతి ద్వారానే సమస్యను పరిష్కరించుకోవాలని మోదీ సలహా ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఇరాన్‌పై అమెరికా దాడుల విషయంలో భారత్ ఒక స్పష్టమైన వైఖరి తీసుకోదలుచుకోలేదని దీన్ని బట్టి స్పష్టమవుతోంది. పోఖ్రాన్ సమయంలో భారతదేశం ఎదుర్కొన్న పరిస్థితినే నేడు ఇరాన్ ఎదుర్కొంటోంది. నాడు భారత్‌కు అనేక దేశాలు అండగా నిలిచాయి. కాని ఇవాళ భారత్ ఒక స్పష్టమైన వైఖరి తీసుకునేందుకు వెనుకాడుతోంది.. అని ఒక దౌత్యవేత్త వ్యాఖ్యానించారు. దీనివల్ల భారత్‌కు లభించిన ప్రయోజనమేమిటి? ‘ఇవాళ భారతదేశాన్ని, మన జాతీయ వాదాన్ని పటిష్ఠం చేసుకోవడం ఒక్కటే మార్గం. మన వెన్నుముక బలంగా ఉండాలి. ఎటువంటి ఒత్తిళ్లకూ లొంగకుండా, రాజీపడకుండా ఉండాలి’ అని రామ్ మాధవ్ పుస్తకావిష్కరణ సందర్భంగా ఉపరాష్ట్రపతి చెప్పారు. ‘బహుపక్ష వాదం క్షీణించిపోవడంతో పాటు సమాజాలను నడిపించే వ్యవస్థలు కూడా తుప్పుపట్టిపోతున్నాయి. ప్రజల హక్కులను పరిరక్షించగల సంస్థలు దెబ్బతిన్నాయి. ప్రజాస్వామ్య ప్రపంచాన్ని పనిచేయించే విధంగా తప్పొప్పులను బేరీజు వేసి సరిదిద్దుకునేలా చేయగల శక్తులు లేకుండాపోయాయి. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత 75 సంవత్సరాల క్రితం ఏర్పడ్డ అంతర్జాతీయ ఉదారవాద వ్యవస్థ అన్నది ఇప్పుడు మచ్చుకైనా కనపడడం లేదు అని ఈ సమావేశంలో మాజీ కేంద్ర మంత్రి సురేశ్ ప్రభు, సీనియర్ కాంగ్రెస్ నేత మనీష్ తివారీతో పాటు పలువురు ప్రముఖులు వ్యాఖ్యానించారు. మన జాతీయ ప్రయోజనాలకు తగ్గట్లుగానే అంతర్జాతీయ దౌత్యనీతిని ఏర్పర్చుకోవాలని వారు వ్యాఖ్యానించారు. కాని అలా జరిగిందా? విషాదమేమిటంటే జాతీయంగా, అంతర్జాతీయంగా ఏ పరిణామాలు జరుగుతున్నాయన్న దానికంటే మన దేశంలో ఏది ప్రచారంలో ఉన్నదనే దానికే విలువ అధికంగా ఉంటుంది. మనం నేతల్ని అభిమానిస్తాం, ఆరాధిస్తాం, పూజిస్తాం.


అందువల్ల వారు చేసిన ప్రచార వెల్లువలో కొట్టుకుపోతాం. చాలా సంవత్సరాల పాటు ప్రపంచ రాజకీయాలను మనం నిర్ణయిస్తున్నామని భావించాం. జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినంగా ఐక్యరాజ్యసమితి నిర్ణయించినందుకు గర్వపడ్డాం. అయినా ఇవాళ ప్రపంచ రాజకీయాల్లో మన పాత్ర ఏమిటనే సందేహం మనను వెంటాడుతోంది. శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరని, శాశ్వత ప్రయోజనాలు మాత్రమే ఉంటాయని మనం గ్రహించాలి. ‘మీరు స్నేహితులను మార్చుకోవచ్చు కాని పొరుగువారిని మార్చుకోలేరు..’ అని మాజీ ప్రధాని వాజపేయి ఊరికే అనలేదు. అంతర్జాతీయ యోగాదినం సందర్భంగా మోదీ సారథ్యంలో సినిమా నటులు, ముఖ్యమంత్రులు, గవర్నర్లు, రాజకీయ నాయకులు, అధికారులు తమ యోగాసానాలతో ప్రజలను చైతన్యవంతం చేసే ప్రయత్నం చేయడం మంచి పరిణామమే. అయితే వీరిలో మరుసటి రోజు నుంచీ ఎంతమంది యోగాను తమ జీవన విధానంగా మార్చుకున్నారనే సందేహం కూడా తలెత్తుతుంది. భారతదేశంలో పెరిగిపోతున్న ఊబకాయుల పట్ల గత మార్చిలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ గుజరాత్‌లో ఒక సమావేశంలో మాట్లాడుతూ స్వయంగా ఆందోళన వ్యక్తం చేశారు. 2050 నాటికి దేశంలో 44 కోట్ల మంది ఊబకాయులు ఉంటారని, ఊబకాయమే సకల రోగాలకు కారణమని ఆయన చెప్పారు.


దేశంలో ఊబకాయత్వం ఒక సంక్షోభంగా మారిందని మోదీయే చెప్పిన నేపథ్యంలో జాతీయ యోగా దినం మన ప్రజలపై ఎంత ప్రభావం చూపిందో యోచించవలిసివుంది. అంతే కాదు, దేశంలో సగటున ప్రతి ఒక్కరూ ఏడాదికి 5 లీటర్ల మద్య పానం సేవిస్తున్నారని, ప్రతి రాష్ట్రమూ 15 నుంచి 30 శాతం ఆదాయం ప్రజల మద్యపానం ద్వారానే ఆర్జిస్తోందని, ఒక్క ఉత్తరప్రదేశ్ ఆదాయమే ఏడాదికి రూ. 40 వేల కోట్లకు పైగా ఉంటుందని గణాంక వివరాలు చెబుతున్నాయి. లాక్‌డౌన్ సమయంలో మద్యం లభ్యం కానందువల్ల ప్రతి రాష్ట్రమూ సగటున రోజుకు రూ. 700 కోట్లు కోల్పోయిందని ఒక అంచనా. యోగా ఎంతమేరకు మన మధుపాన గ్రస్తులను, మన ఆరోగ్య సూచికలను ప్రభావితం చేస్తోంది? మన అంతర్జాతీయ విధానాలనే కాదు, మన జాతీయ విధానాలను కూడా ప్రచారార్భాటంతో కాక ఆచరణీయ దృక్పథంతో అవలంబించినప్పుడే అవి విజయవంతమవుతాయి.

ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

ఇవీ చదవండి:

హార్ముజ్ జలసంధి మూసివేస్తే.. భారత్‌ తట్టుకోగలదా

మరోసారి మైక్రోసాఫ్ట్‌లో లేఆఫ్స్.. వేలల్లో తొలగింపులు ఉంటాయంటూ కథనాలు వైరల్

మరిన్ని బిజినెస్అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 25 , 2025 | 06:19 AM