Share News

Rising Terror Threats: పాకిస్థాన్‌కు గుణపాఠం నేర్పడమెలా

ABN , Publish Date - Nov 12 , 2025 | 01:30 AM

సమస్త భారతీయులూ బిహార్ ఎన్నికలపై దృష్టి కేంద్రీకరించిన సమయంలో దేశ రాజధానిలోని ఎర్రకోట సమీపంలో బాంబు పేలుడు, ఫరీదాబాద్‌లో భారీ ఎత్తున మందుగుండు సామగ్రి దొరకడంతో అంతా ఉలిక్కిపడ్డారు. ఢిల్లీలో ఉన్న ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రతి...

Rising Terror Threats: పాకిస్థాన్‌కు గుణపాఠం నేర్పడమెలా

సమస్త భారతీయులూ బిహార్ ఎన్నికలపై దృష్టి కేంద్రీకరించిన సమయంలో దేశ రాజధానిలోని ఎర్రకోట సమీపంలో బాంబు పేలుడు, ఫరీదాబాద్‌లో భారీ ఎత్తున మందుగుండు సామగ్రి దొరకడంతో అంతా ఉలిక్కిపడ్డారు. ఢిల్లీలో ఉన్న ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రతి ఒక్కరికీ వారి బంధువుల నుంచి ఆందోళనతో ఫోన్లు వచ్చాయి. ఒకవైపు తీవ్రమైన కాలుష్యం, మరోవైపు పరిస్థితి సురక్షితంగా లేకపోవడంతో ఢిల్లీవాసులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. దేశంలో రాజకీయ వాతావరణంపై కూడా ప్రజల అభిప్రాయం భిన్నంగా ఉన్నది. జరిగిన ఘటనకూ, బిహార్ ఎన్నికలకూ ముడివేసేవారూ ఎదురయ్యారు. ‘ఈ బాంబు పేలుడు తర్వాత మంగళవారం బిహార్‌లో చివరి విడత పోలింగ్‌లో హిందూ ఓట్లు సంఘటితమైనా ఆశ్చర్యపోనక్కర్లేదు’ అని సీనియర్ రాజకీయ విశ్లేషకుడు ఒకరు అన్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే ఇది కారులో ఉన్న సీఎన్‌జీ సిలిండర్ పేలుడు మాత్రమేనని హోంమంత్రిత్వ శాఖ అధికారి ఒకరు నమ్మబలికారు. అయితే ఆ తర్వాత కొద్ది సేపట్లోనే అది ఉగ్రవాద దాడేనని ఆయన అంగీకరించారు.

పహల్గామ్‌లో 26 మంది భారత పౌరులను ఉగ్రవాదులు విచక్షణా రహితంగా హతమార్చి, ఏడునెలలు కూడా పూర్తిగా గడవక ముందే దేశ రాజధాని నడిబొడ్డున ఎర్రకోట సమీపంలో కారు బాంబు పేలుడు జరిగి అనేకమంది మరణించడం దేశ సార్వభౌమత్వాన్ని మరోసారి సవాలు చేసినట్లయింది. సౌత్ బ్లాక్‌లోని ప్రధానమంత్రి కార్యాలయమూ, లోక్‌కల్యాణ్ మార్గ్‌లోని ఆయన నివాసమూ ఎర్రకోటకు సమీపంలోనే ఉన్నాయి. ఆపరేషన్ సిందూర్ ద్వారా భారతదేశ స్వావలంబన, వ్యూహాత్మక స్వతంత్రతను నిరూపించుకున్నామని, దేశంలోనే తయారు చేసిన ఆయుధాలతో ఉగ్రవాద నెట్‌వర్క్‌లను, పాక్‌లో ఉన్న ఉగ్రవాద మౌలిక సదుపాయాలను ధ్వంసం చేశామని మోదీ గత ఆగస్టు 15న ఎర్రకోటపై నుంచి ప్రకటించారు. శ్రీకృష్ణుడి సుదర్శన చక్రం మిషన్‌ను ప్రారంభిస్తున్నామని దాని ద్వారా శత్రువు చొరబాట్లను తిప్పిగొట్టి అతి వేగంగా ఎదురుదాడులు చేసేందుకు సిద్ధంగా ఉంటామని కూడా ఆయన తన ఎర్రకోట ప్రసంగంలో తెలిపారు.


విషాదకరమైన విషయం ఏమంటే పహల్గామ్ హత్యాకాండ లేవనెత్తిన అనేక ప్రశ్నలకు జవాబులు రాకముందే ఎర్రకోట సంఘటన సంభవించింది. పహల్గామ్ సంఘటన జమ్మూ–కశ్మీర్‌లో జరిగితే ఢిల్లీలో చోటుచేసుకున్న వైపరీత్యం వెనుక కశ్మీర్ నుంచి వచ్చిన ఉగ్రవాదుల హస్తం ఉన్నదని తేలింది. ఈ ఉగ్రవాద సంఘటన సాయంత్రం 7 గంటలకు జరిగితే ఆ సమయానికి కొద్ది గంటలముందే ఢిల్లీ పొలిమేరల్లోని ఫరీదాబాద్‌లో రెండు ఇళ్లపై భద్రతాబలగాలు దాడి చేసి అక్కడ 2900 కిలోల పేలుడు సామగ్రి, రైఫిళ్లు, పిస్టళ్లు స్వాధీనం చేసుకున్నాయి. ఈ రెండు సంఘటనల వెనుక పాకిస్థాన్‌లో ఉన్న అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలు జైషే మహమ్మద్, అన్సర్ ఘజ్వవత్ ఉల్ హింద్ ప్రమేయం ఉన్నదని, ఈ సారి జమ్మూ–కశ్మీర్‌కు చెందిన విద్యాధికులైన వైద్యులు ఉగ్రవాదులుగా ప్రత్యక్షమయ్యారని హోంశాఖ వర్గాలు చెబుతున్నాయి. 1999లో భారత విమానం హైజాక్‌కు గురైన తర్వాత భారత్‌ విడుదల చేసిన ఉగ్రవాది మసూద్ అజర్ స్థాపించిన సంస్థే జైషే మహమ్మద్. ఆ సంస్థ ద్వారా మసూద్‌ అజర్‌ పాకిస్థాన్‌ నుంచి భారత్‌ వ్యతిరేక ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తూనే ఉన్నాడు. 2001లో పార్లమెంటు పైన, 2019లో పుల్వామాలో సైనికులు ప్రయాణిస్తున్న బస్సుపైన దాడుల వెనుక మసూద్‌ హస్తం ఉన్నది. అతడి ఉగ్రవాద దౌష్ట్యాలకు పాక్ ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తోంది. ఇప్పుడు ఆయన సోదరి సదియా సైతం మహిళా విభాగాన్ని నెలకొల్పి ఉగ్రవాద మహిళలను మన దేశంలో ప్రవేశపెట్టిందని వార్తలు వస్తున్నాయి.

పహల్గామ్ సంఘటన తర్వాత కూడా జమ్మూ కశ్మీర్‌లో పాక్ ప్రేరేపిత ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగుతున్నాయని, అవి దేశ రాజధాని దాకా వ్యాపించాయని, ఉగ్రవాదులు పేలుడు సామగ్రి కూడా భారీ ఎత్తున సరఫరా చేయగలుగుతున్నారని ఎర్రకోట, ఫరీదాబాద్‌ సంఘటనలు నిరూపిస్తున్నాయి. ఢిల్లీ, ముంబై, గుజరాత్‌తో పాటు దేశంలోని అనేక ప్రాంతాల్లో రెడ్ అలర్ట్‌ జారీ చేశారు. అప్రమత్తంగా ఉండాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు సందేశం పంపారు. దేశ వ్యాప్తంగా అనేక రైల్వే స్టేషన్లలో తనిఖీలు కూడా ప్రారంభమయ్యాయి.


మంగళవారం మెట్రోలో ఢిల్లీ విశ్వవిద్యాలయానికి వెళ్లే మెట్రో రైలు చాలా ఖాళీగా కనపడింది. మెట్రోలో ప్రయాణీకులు భయంభయంగా కనపడ్డారు. ఎర్రకోట వద్ద మెట్రోను ఆపనే లేదు. ఈ నేపథ్యంలో ఇంకా ఎక్కడెక్కడ దేశంలో ఉగ్రవాద శిబిరాలున్నాయి? ఎంత పేలుడు సామగ్రి వారి వద్ద ఉన్నది? ఇంకా ఎన్ని ఘటనలు జరిగే అవకాశాలున్నాయి? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ప్రశ్నలకు సమాధానం ఎవరు చెప్పగలరు? మన భద్రతా దళాలు గతంలో కంటే ఎక్కువగా గూఢచార సమాచారం సేకరించి అనేక మంది ఉగ్రవాదులను హతమార్చి, ఎన్నో దాడులు చేస్తూనే ఉన్నాయి కానీ అవేవీ సరిపోవడం లేదు.

‘మేము ఈ సంఘటన లోతు దాకా వెళతాం. ఎవర్నీ వదిలిపెట్టం..’ అని ప్రధానమంత్రి భూటాన్‌లో ప్రకటించారు. హోంమంత్రి అమిత్ షా, రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా ఇదే విధంగా ప్రకటనలు చేశారు. పహల్గామ్ సంఘటన సమయంలో సౌదీ అరేబియాలో ఉన్న మోదీ తన పర్యటనను వెన్వెంటనే రద్దు చేసుకుని పాకిస్థాన్ గగన తలం నుంచి కాకుండా వేరే మార్గంలో ఇండియాకు తిరిగి వచ్చారు. ఆ తర్వాత బిహార్‌లోని మధుబనికి వెళ్లి ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ ఉగ్రవాదులు భూమిపై ఎక్కడ దాక్కున్నా భారత్‌ గుర్తించి, వెంటాడి హతమారుస్తుందని ప్రకటించారు. ఈ సారి దేశ రాజధానిలోనే ఉగ్రవాద ఘటన జరిగిన తర్వాత కూడా భూటాన్ పర్యటనకు మోదీ వెళ్లారు. ఉగ్రవాద ఘటన తర్వాత ఉన్నత స్థాయి భద్రతాధికారుల సమావేశం నిర్వహించే బాధ్యతను ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు వదిలిపెట్టడం విస్మయం కలిగిస్తోంది. మంగళవారం ఉదయం నుంచి అమిత్ షా, ఎన్ఐఏ అధికారులు, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సమావేశాలు నిర్వహిస్తూనే ఉన్నారు. ఉగ్రవాద దాడుల్లో సైనికులు, ప్రజలు మరణించినప్పుడల్లా ఇలాంటి భద్రతా సమావేశాలు జరుగుతూనే ఉంటాయి. ఉగ్రవాదుల్ని వదిలిపెట్టబోమని మన నేతలు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంటారు. భారత్‌కు వ్యతిరేకంగా ఉగ్రవాద కార్యకలాపాలను పాక్‌ ప్రేరేపిస్తుందని వివరించేందుకు మన పార్లమెంటరీ ప్రతినిధి బృందాలు పలు దేశాలకు వెళ్లడం కూడా పరిపాటి అయిపోయింది. ఎంత కాలం ఇలా చేయగలం?


అసలు ఈ సంఘటనలకు ఎవరు జవాబుదారీగా వ్యవహరించాలి? రైలు ప్రమాదాలకు బాధ్యత వహించకపోవడం సరే, కనీసం ఉగ్రవాద ఘటనలకైనా ఎవరైనా ఒకరు బాధ్యత వహించాలి కదా! ఎవరో ఒకరు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయడం వల్ల పరిష్కారం లభిస్తుందా? అయితే భారత్‌లో పాక్ ఉగ్రవాదానికి అడ్డుకట్ట ఎలా వేయగలం అన్న ప్రశ్న దేశ ప్రజలందరి గుండెల్లోనూ మారుమ్రోగుతున్నది. ప్రముఖ జర్నలిస్టు అర్నాబ్ గోస్వామి తరుచూ ‘దేశం తెలుసుకోవాలనుకుంటుంది’ (నేషన్ వాంట్ టు నో) అని అంటూంటారు. ఆయన చేసే ఈ వ్యాఖ్యకు నేటి పరిస్థితుల్లో ఎంతో ప్రాధాన్యమున్నది.

పహల్గామ్ సంఘటన తర్వాత భారత పాకిస్తాన్‌ల మధ్య నాలుగు రోజుల పాటు తీవ్ర ఘర్షణ జరిగింది. బిహార్ మోదీలో హెచ్చరించిన విధంగానే పహల్గామ్ దారుణం జరిగిన రెండు వారాలకు పాక్‌పై భారత్‌ దాడులు ప్రారంభించింది. అణ్వస్త్ర దాడులు జరిగే ప్రమాదం కూడా ముంచుకొచ్చిందని అనేకమంది ఆందోళన వ్యక్తం చేశారు అయితే యుద్ధం తీవ్రమవుతున్న దశలో కాల్పుల విరమణ జరిగింది. అందుకు కారణాలు, మనకు జరిగిన నష్టాలపై అనేక చర్చలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. వాటిని పక్కన పెడితే, కాల్పుల విరమణ తర్వాత ప్రధాని మోదీ దేశ ప్రజలనుద్దేశించి అత్యంత కీలకమైన ప్రకటన ఒకటి చేశారు. ‘భారతదేశం తన సైనిక చర్యను కేవలం తాత్కాలికంగా నిలిపివేసింది. భవిష్యత్‌లో పాకిస్తాన్ ఎటువంటి దాడి చేసినా భారత్‌ తిరిగి తీవ్రమైన ప్రతీకారం తీర్చుకుంటుంది. ఎవరి ప్రమేయం లేకుండా భారత్ స్వంత నిర్ణయం తీసుకుని పాక్‌కు బుద్ధి చెబుతుంది, పాక్ ప్రతి చర్యా గమనిస్తున్నాం.. ఉగ్రవాదం, చర్చలు కలిసికట్టుగా సాగవు. ఉగ్రవాదం, వర్తకం కూడా కలిసి సాగవు’ అని హెచ్చరించారు. ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీలోనే పాక్ ప్రేరిత ఉగ్రవాదులు దాడులు చేశారు. భారత–పాక్ సంఘర్షణలో కొన్ని నష్టాలు జరిగినప్పటికీ మన సైనిక స్థావరాలు, వాయుతల రక్షణ సంస్థలు అవసరమైతే ఎప్పుడు ఏ దాడికైనా సంసిద్ధంగా ఉన్నాయని ఎయిర్ ఛీఫ్ మార్షల్ అమర్‌ప్రీత్‌ సింగ్‌ కొద్ది రోజుల క్రితం ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు పాక్‌కు మన ప్రధానమంత్రీ, సాయుధ బలగాలూ ఎలా బుద్ది చెబుతారో అని దేశం ఉత్కంఠతో ఎదురుచూస్తున్నది.


నిజానికి మోదీ వైఖరి కన్నా పాకిస్తాన్ వైఖరే తీవ్ర ఆశ్చర్యం కలిగిస్తోంది. తాము శాంతి సాధించాలనే స్ఫూర్తితోనే కాల్పుల విరమణకు అంగీకరించామని పాక్ ప్రధానమంత్రి గత మేలో ప్రకటించారు. తాము కాల్పుల విరమణకు కట్టుబడి ఉన్నామని, తమంతట తాము ముందుగా దాన్ని ఉల్లంఘించబోమని పాక్ సైనిక అధికార ప్రతినిధి సైతం అన్నారు. ఒకరకంగా పాకిస్థాన్‌ వెనక్కి తగ్గిన వాతావరణం కనిపించింది. కాల్పుల విరమణ వెనుక అమెరికా హస్తం ఏ మాత్రం లేదని ఆ దేశం ఖండించలేదు. వైట్‌హౌజ్‌లో పాక్ సైనిక దళాధిపతి మునీర్‌కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విందు ఇచ్చి మరీ తన మాట విన్నందుకు అభినందించారు. ఇప్పుడు మరి ఉన్నట్లుండి ఆ దేశ ఉగ్రవాదులు ఎందుకు క్రియాశీలమయ్యారు? దాని వెనుక ఎవరి హస్తం ఉన్నది? దీని పర్యవసానాలు ఎలా ఉంటాయి?

ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

ఇవి కూడా చదవండి

ఢిల్లీ పేలుళ్లు.. నిధులు సమీకరణలో కీలకంగా మహిళా డాక్టర్

ఎన్డీయేదే విజయం.. 7 ఎగ్జిట్ సర్వేలు జోస్యం

Updated Date - Nov 12 , 2025 | 01:30 AM