Share News

Bihar at the Crossroads: ప్రజలు వస్తున్నారు జాగ్రత్త

ABN , Publish Date - Oct 29 , 2025 | 02:09 AM

గత బుధవారం తెల్లవారు జామున ఢిల్లీలోని రోహిణీ ప్రాంతంలో ఢిల్లీ పోలీసులు జరిపిన ఒక ఎన్‌కౌంటర్‌లో బిహార్‌కు చెందిన నలుగురు కరడుగట్టిన క్రిమినల్స్ మరణించారని వార్తలు వచ్చాయి. సిగ్మా ముఠా...

Bihar at the Crossroads: ప్రజలు వస్తున్నారు జాగ్రత్త

గత బుధవారం తెల్లవారు జామున ఢిల్లీలోని రోహిణీ ప్రాంతంలో ఢిల్లీ పోలీసులు జరిపిన ఒక ఎన్‌కౌంటర్‌లో బిహార్‌కు చెందిన నలుగురు కరడుగట్టిన క్రిమినల్స్ మరణించారని వార్తలు వచ్చాయి. సిగ్మా ముఠా పేరిట అనేక హత్యలు, దోపిడీకి పాల్పడిన ఈ నలుగురు బిహార్ ఎన్నికలకు ముందు బీభత్సం సృష్టించనున్నారన్న సమాచారం రావడంతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమై ఈ ఎన్‌కౌంటర్‌ను నిర్వహించారు. ఈ నేరగాళ్లు ఎవరి తరఫున హింసాకాండకు పాల్పడాలని అనుకున్నారు.. ఎవరి సుపారీ తీసుకున్నారు అన్న వివరాలు మాత్రం లభ్యం లేదు. అయితే బిహార్‌లో నవంబర్ మొదటి వారంలో జరిగే ఎన్నికల్లో జరగబోయే హింసాకాండ గురించి ఆందోళనలు మాత్రం కొనసాగుతున్నాయి. నేపాల్‌లో సంభవించిన పరిణామాలు భారత్‌–నేపాల్‌ సరిహద్దు సమీప ఏడు బిహారీ జిల్లాల్లోని 21 సీట్లపై ప్రభావం చూపవచ్చని భావిస్తున్నారు. కేవలం రెండు దశల్లో జరగాల్సిన ఎన్నికలకుగాను ఇప్పటికే సీఆర్‌పీఎఫ్, బీఎస్ఎఫ్, ఐటీబీపీ తదితర బలగాలకు చెందిన లక్ష మందిని బిహార్‌లో మోహరించారు. దేశంలో ఇంకెక్కడైనా ఎన్నికలు జరగడం ఒక ఎత్తు, బిహార్‌లో ఎన్నికలు జరగడం ఒక ఎత్తు అని అభివర్ణించిన ఎన్నికల కమిషన్ 4.5 లక్షల మంది పోలింగ్ సిబ్బంది, 2.5 లక్షల మంది పోలీసు అధికారులతో పాటు 470 మంది కేంద్ర పరిశీలకులను నియమించింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ ఇతర రాష్ట్రాలకు చెందిన ఐఏఎస్ అధికారులను నియమించామని వారే తమ కళ్లు చెవులుగా వ్యవహరిస్తారని కమిషన్ ప్రకటించింది. ఈ పరిణామాలను బట్టి చూస్తే కేంద్రంలో అధికారం నెరపుతున్న నరేంద్రమోదీ ప్రభుత్వం బిహార్ ఎన్నికలకు ఎంత ప్రాధాన్యమిస్తున్నదో విశదమవుతోంది.

రాష్ట్ర క్రైమ్ రికార్డ్ బ్యూరో ప్రకారమే ప్రతి నెలా సగటున 229 హత్యలు జరిగే బిహార్‌లో 20 సంవత్సరాలుగా నితీశ్‌ కుమార్ ముఖ్యమంత్రిగా ఉన్నా పరిస్థితిలో పెద్దగా మార్పు లేదు. హత్యలు, దోపిడీలు, కిడ్నాప్‌లు జరగని రోజు లేదు. బిహార్‌లో 60 శాతం జనాభా 30 ఏళ్ల వయసులో ఉన్నారని, వారికే ఉద్యోగమూ లేనప్పుడు శాంతిభద్రతల సమస్య రాకుండా ఎలా ఉంటుంది.. అని ఆ రాష్ట్ర అదనపు పోలీసు డైరెక్టర్ జనరల్ ఒకరు వ్యాఖ్యానించారు. బిహార్‌లో ప్రస్తుత నేర న్యాయ విచారణ వ్యవస్థ నేరాలను అరికట్టగల స్థితిలో లేదని పోలీసు ఉన్నతాధికారులే ఒప్పుకుంటున్నారు. బిహార్‌లో ఉపాధి దొరకని లక్షలాది యువజనులు ఇతర రాష్ట్రాలకు వలసవెళుతున్నారు. ఒక అంచనా ప్రకారం 74.5 లక్షలమంది బిహారీలు తమ రాష్ట్రానికి వెలుపల పనిచేస్తున్నారు.


బిహార్‌లో ఉపాధి కల్పన ఎంత ఘోరంగా ఉన్నదో అంచనా వేసేందుకు ఛట్‌ పూజకు హాజరయ్యేందుకు ఆ రాష్ట్రానికి లక్షల సంఖ్యలో ప్రజలు తిరిగి వచ్చిన తీరే నిదర్శనం. ప్రతి రాష్ట్రం నుంచీ బిహరీలు తిరిగి వచ్చేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ 12వేల ప్రత్యేక రైళ్ళు నడిపినా ప్రతి రైలూ కిక్కిరిసిపోయింది. నిలబడేందుకు కనీసం చోటు కూడా లేకపోవడంతో అశేష జనం ప్రాణాలకు తెగించి రైళ్లపై కూర్చుని ప్రయాణించారు. ‘నేను గత నాలుగు రోజులుగా కేవలం రెండుసార్లే భోజనం చేశాను. సామాను పోతుందన్న భయంతో నిద్ర కూడా పోలేదు. టాయిలెట్‌లో కూడా జనం నిండిపోవడంతో 30 గంటల పాటు మూత్రం చేయలేకపోయాను.. ప్రతి ఏడాదీ ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నాను’ అని బిహారీ కార్మికుడు ఒకరు చెప్పారు.

ఇవన్నీ చూస్తుంటే బిహార్ అసలు ఈ దేశంలోనే ఉన్నదా.. అని సందేహం వస్తుంది. 4 ట్రిలియన్ డాలర్లతో ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగామని, జపాన్‌ను సైతం అధిగమించామని సంతోషిస్తున్నవారు బిహార్‌లో పరిస్థితి చూస్తే విషాదంలో కూరుకుపోకతప్పదు. దాదాపు 20 సంవత్సరాల క్రితం లాలూప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో ఆటవిక రాజ్యం ఉన్నదని బీజేపీ తీవ్ర ప్రచారం చేసింది. 2005 సంవత్సరం నుంచీ బిహార్‌లో జనతాదళ్ (యు) అధికారంలో ఉన్నది. అందులో 15 సంవత్సరాలు బీజేపీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నది. ఇంత సుస్థిరత ఉన్న బిహార్ దేశంలో అత్యంత నిరుపేద రాష్ట్రంగా ఎందుకు మిగిలిపోయింది? ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి నివేదిక ప్రకారం సామాజిక అభివృద్ధి, ప్రజారోగ్య వ్యవస్థ పనితీరు, పాఠశాల విద్యానాణ్యత, సుపరిపాలనా సూచికల్లోను బిహార్ అధమ స్థానంలో ఉన్నది. మూడు సంవత్సరాల క్రితం రైల్వేలో 35వేల ఉద్యోగాల కోసం కోటిమందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా జరగలేదన్న ఆగ్రహంతో విద్యార్థులు బిహార్‌లో అనేక ప్రాంతాల్లో రైళ్లను ఆపి బోగీలకు నిప్పంటించారు. అనేక చోట్ల కాల్పులు జరపాల్సి వచ్చింది. ఎన్నికలకు ముందు ప్రతి పార్టీ పెద్ద ఎత్తున ఉద్యోగాలను కల్పిస్తామని హామీ ఇస్తుంది. అయితే ఆ హామీలు రాజకీయ నినాదాలుగా మాత్రమే మిగిలిపోతాయి. బిహార్‌లోనే అత్యధిక శాతం మంది పేదరికం, నిరుద్యోగంలోనూ కునారిల్లుతున్నారని ప్రపంచ బ్యాంకు నివేదిక వెల్లడించింది. బిహార్‌ స్థూల దేశీయోత్పత్తి, తలసరి ఆదాయం దేశంలోని అన్ని రాష్ట్రాలకంటే తక్కువ. నీతీ ఆయోగ్ నివేదిక ప్రకారమే దేశంలో అత్యంత ఘోరమైన ఆర్థిక పరిస్థితి ఉన్న రాష్ట్రం బిహార్. రెండేళ్ల క్రితం జరిగిన కుల సర్వే ప్రకారమే దాదాపు 94 లక్షలమంది రోజుకు రూ.200 కంటే తక్కువ ఆదాయంతో జీవిస్తున్నారు. అక్కడ 12వ తరగతి పూర్తి చేసినవారు కేవలం 10 శాతం మంది మాత్రమే!


దారిద్ర్యం, వలసలు, పాలనా వైఫల్యాలు, హింసాకాండ, కులతత్వం, అవినీతి, ప్రజలను ఉచితాలతో మభ్యపెట్టడం, పేలవమైన విద్యావ్యవస్థ చుట్టూ తిరుగుతున్న బిహార్ రాజకీయాలే ఆ రాష్ట్రం ఆర్థికంగా పరివర్తనం చెందకపోవడానికి కారణం. కుల ఆధారిత, ప్రాంతీయ పార్టీలకు బిహార్‌ను వదిలేసి కాంగ్రెస్‌ చేతులెత్తేస్తే బీజేపీ ఆ రాష్ట్రంలో ఉనికిని నిరూపించుకోవడానికి నానా కష్టాలు పడుతూ సంకీర్ణ ప్రభుత్వాన్ని ప్రోత్సహించక తప్పని పరిస్థితిలో ఉన్నది. ప్రతి బడ్జెట్‌లోనూ, మోదీ ప్రతి పర్యటనలోనూ రూ.లక్షల కోట్లపైగా ప్రాజెక్టులకు సంబంధించి ప్రకటనలే కాని ఆ మొత్తం బిహార్ రూపురేఖల్ని మార్చేందుకు అక్కడి పరిశ్రమలకు ఉపాధి కల్పనకు దోహదం చేసేందుకు ఉపయోగపడిన దాఖలాలు లేవు. కొన్ని దశాబ్దాల రాజకీయ నిర్లక్ష్యానికి ప్రతీకగా నేటి బిహార్ నిలిచిపోయింది.

ఛట్‌ పూజ అనంతరం మంగళవారం నుంచి ముమ్మరమవుతున్న బిహార్ ఎన్నికల ప్రచారంలో రాజకీయ పార్టీలకు ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకోవడం, ప్రజలకు వాగ్దానాల వర్షం కురిపించడం తప్ప మరో మార్గం లేదు. యథా ప్రకారం ప్రధానమంత్రి బిహార్‌లో సుడిగాలిలా తిరుగుతూ గతంలో ఉన్న జంగిల్‌రాజ్ గురించి విమర్శలు గుప్పిస్తున్నారు. నిజానికి ఆపరేషన్ సిందూర్ ప్రారంభమైన వెంటనే మోదీ తొలుత బిహార్‌కు వెళ్లి అక్కడ పాక్‌కు మరచిపోలేని గుణపాఠం చెబుతామని గర్జించారు. అప్పటి నుంచీ ఇప్పటి వరకు పలుసార్లు బిహార్‌లో పర్యటించిన మోదీ దాదాపు రూ. లక్షా 26వేల కోట్ల మేరకు ప్రాజెక్టులను ప్రారంభించారు. డబుల్ ఇంజన్ సర్కార్ వల్లే బిహార్ అభివృద్ధి జరుగుతుందని అన్నారు. ఎన్డీఏకు సంబంధించి మోదీయే రథసారథి. మోదీకి సంబంధించి బిహార్ ఆయన రాజకీయ అధ్యాయంలో ఒక కీలకమైన ఘట్టం. ఇప్పటికే ఆయన పార్టీలోనూ, ప్రజలకూ ఎన్నో ప్రశ్నలకు జవాబులు చెప్పాల్సిన పరిస్థితుల్లో ఉన్నారు. అసలు గత పది సంవత్సరాల్లో బిహార్‌లో బీజేపీ చొచ్చుకుపోయేలా ఆయన ఎందుకు చేయలేకపోయారో, కుల సమీకరణాలను బీజేపీ ఎందుకు అధిగమించలేకపోయిందో అన్నది ఒక ప్రశ్న. బిహార్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించలేకపోతే, ఇతర శక్తులు బలం పుంజుకుంటాయి. బీజేపీ విజయం సాధిస్తే మోదీ తదుపరి రాజకీయ విజృంభణలకు అడ్డుకట్టవేసే వారుండరు. తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌తో సహా అనేక రాష్ట్రాలు ఆయన తదుపరి ఎత్తుగడలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండవల్సి వస్తుంది.


మహాఘట్ బంధన్ తీరేవేరు. ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 1 వరకు బిహార్‌లో 1300 కి.మీ ఉధృతంగా పర్యటించిన కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ ఆ తర్వాత దాదాపు రెండు నెలల వరకు అక్కడ కనపడకుండా పోయారు. టిక్కెట్ల పంపిణీ విషయంలో తీవ్ర గందరగోళం జరుగుతున్నా, ఆయన పట్టించుకోలేదు. పొత్తు దాదాపు కూలిపోతుందన్న పరిస్థితుల్లో రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ రంగప్రవేశం చేయాల్సి వచ్చింది. ఓటర్ అధికార్‌ యాత్ర జరిపిన తర్వాత ఆ ప్రభావాన్ని కొనసాగించేందుకు రాహుల్ బిహార్‌లోనే ఉండి పార్టీని క్రింది స్థాయి నుంచి సంఘటితంగా నిర్మించేందుకు ఎందుకు ప్రయత్నించలేదు? ఒక్కొక్క సీటూ ముఖ్యమైన పరిస్థితుల్లో 9 సీట్లలో స్నేహపూర్వక పోటీ చేస్తామనడంలో అర్థం ఉన్నదా? అసలు రాజకీయాల్లో స్నేహపూర్వక పోటీ అనేది ఉంటుందా? బిహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ చేసే 61 సీట్లలో సగమైన గెలుచుకోకపోతే రాహుల్‌గాంధీని బిహార్ ప్రజలు తిరస్కరించారని, ఓట్ చోరీ విషయమై మోదీపై ఆయన చేసే ఆరోపణలు గాలికి కొట్టుకుపోయాయని భావించవలిసి ఉంటుంది. ఆయన ప్రయోగిస్తానన్న హైడ్రోజన్ బాంబు ఏమైంది? అత్యంత వెనుకబడిన బిహార్‌లో రాజకీయాలు కులం చుట్టే తిరుగుతాయని వేరే చెప్పనక్కర్లేదు. కులాల లెక్కలు, మనుగడ కోసం వేసే ఎత్తుగడలు, మత విద్వేషాలు, తాయిలాల సమీకరణాలను అధిగమించి పార్టీలు వ్యవహరించినప్పుడే బిహార్‌కు ఉజ్జ్వల భవిష్యత్ ఉంటుంది. లేకపోతే బిహార్ కవి దినకర్ ఒకప్పుడు ఎలుగెత్తిన ‘సింహాసన్ ఖాళీకరో.. ప్రజలు వస్తున్నారు’ అన్న నినాదం ఆ సేతుహిమాచలం మారుమ్రోగే పరిస్థితి ఏర్పడుతుంది.

ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

ఇవి కూడా చదవండి:

Cyclone Montha: పునరావాస శిబిరాల్లో వసతుల కల్పనపై దృష్టి పెట్టాలి: సీఎం చంద్రబాబు

Cyclone Montha: మొంథా తుపాను నేపథ్యంలో రహదారులపై ఆంక్షలు

మొంథా తుపాను.. ఎమ్మెల్యేలకు లోకేష్ ముఖ్య సూచనలు

ఆ జిల్లా ప్రజలను వణికిస్తోన్న తుపాను హెచ్చరికలు

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 29 , 2025 | 02:09 AM