ముగిసిన యుద్ధం మిగిల్చిన ప్రశ్నలు
ABN , Publish Date - May 14 , 2025 | 06:36 AM
గగనతలంలో యుద్దమేఘాలు కమ్ముకున్నాయి. యుద్ధ విమానాలు శత్రుస్థావరాలపై క్షిపణుల వర్షం కురిపించాయి. డ్రోన్‌లు పేలుడు పదార్థాలతో నిప్పులు కక్కాయి. సరిహద్దులు కాల్పులతో దద్దరిల్లాయి. కేవలం నాలుగు రోజుల్లోనే భారత్ పాకిస్థాన్‌ల మధ్య యుద్ధం తీవ్రస్థాయికి చేరుకుంది. ఇది ఆధునిక యుద్ధతంత్రం కనుక టెక్నాలజీ సాయంతో నిర్దిష్ట లక్ష్యాలను ఛేదించగలగడం...

గగనతలంలో యుద్దమేఘాలు కమ్ముకున్నాయి. యుద్ధ విమానాలు శత్రుస్థావరాలపై క్షిపణుల వర్షం కురిపించాయి. డ్రోన్‌లు పేలుడు పదార్థాలతో నిప్పులు కక్కాయి. సరిహద్దులు కాల్పులతో దద్దరిల్లాయి. కేవలం నాలుగు రోజుల్లోనే భారత్ పాకిస్థాన్‌ల మధ్య యుద్ధం తీవ్రస్థాయికి చేరుకుంది. ఇది ఆధునిక యుద్ధతంత్రం కనుక టెక్నాలజీ సాయంతో నిర్దిష్ట లక్ష్యాలను ఛేదించగలగడం, క్షిపణులను, డ్రోన్‌లను గాలిలోనే పేల్చివేయడం వంటి అపూర్వ దృశ్యాలను మనం చూడగలిగాం. పహల్గాంలో పర్యాటకులను ఉగ్రవాదులు దారుణంగా కాల్చి చంపిన 15 రోజుల్లోనే భారత దేశం సర్వశక్తులను మోహరించి పాకిస్థాన్‌పై దాడులు ప్రారంభించిన వైనాన్ని, పాకిస్థాన్ మనను ఎదుర్కొనే విషయంలో విఫలం కావడం స్పష్టంగా కనపడింది. ఆపరేషన్ సిందూర్ పేరిట భారత సైనిక దళాలు ప్రారంభించిన యుద్ధం మొత్తం దేశాన్నే గగుర్పొడిచేలా చేసింది. భారత మహిళల సిందూరాన్ని తుడిచివేసిన పాక్ ప్రేరిత ఉగ్రవాదులకు బుద్ధి చెప్పేందుకు తగిన పేరే పెట్టినందుకు దేశ వ్యాప్తంగా హర్షామోదాలు వ్యక్తమయ్యాయి. ‘ఉగ్రవాదులను, వారికి వెనుక ఉన్న శక్తులను మట్టిలో కలిపేస్తాం’ అని ప్రధానమంత్రి చేసిన హుంకారం దేశమంతటా ప్రతిధ్వనించింది. పాకిస్థాన్ కూడా భారత్‌ను ఎదుర్కొనేందుకు సమాయత్తం కావడంతో ఈ యుద్ధం చాలా కాలం సాగుతుందని, ఈసారి భారతదేశం లాహోర్‌లో ప్రవేశించడమే కాదు, పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను కూడా కైవశం చేసుకుంటుందనే భావనలు అంతటా పెల్లుబుకాయి. కాని యుద్ధం ప్రారంభించిన నాలుగు రోజుల్లోనే ఉన్నట్లుండి ఇరు దేశాలు యుద్ధ విరమణను ప్రకటిస్తాయని, శతఘ్నులు, విమానాలు మూగపోతాయని ఎవరూ ఊహించలేదు. ఏదో జరగబోతుందని, ఈసారి పాకిస్థాన్‌కు మనం కనీవినీ ఎరుగని రీతిలో బుద్ధి చెబుతామని భావించిన తరుణంలో పాక్ కాల్పుల విరమణను ప్రతిపాదించడం, అందుకే ఎదురుచూస్తున్నట్లుగా మనం నాటకీయంగా అందుకు అంగీకరించడం దేశ వ్యాప్తంగా అనేకమందికి ఆశ్చర్యం కలిగించింది. నిజానికి మనమే కాల్పుల విరమణను ముందుగా ప్రతిపాదించామని, అందుకు తాము ఒప్పుకున్నామని పాకిస్థాన్ కూడా ప్రకటించింది. 2022 ఫిబ్రవరిలో రష్యా–ఉక్రెయిన్‌ల మధ్య ప్రారంభమైన యుద్ధం ఎంతో బీభత్సం సృష్టించిన తర్వాత ఇప్పుడిప్పుడే శాంతి బాటలోకి పయనిస్తోంది. ఇజ్రాయిల్–పాలస్తీనా మధ్య నెత్తుటి సంఘర్షణ కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తోంది.
గతంలో ఇరాన్, ఇరాక్‌ల మధ్య యుద్ధం 8 సంవత్సరాలకు పైగా సాగింది. అమెరికా సంకీర్ణ దళాలకూ, ఇరాక్‌కు మధ్య మరో 8 సంవత్సరాలు హోరాహోరీ సాగింది. వియత్నాంపై అమెరికా యుద్ధం కూడా 20 సంవత్సరాలకు పైగా జరిగింది. మరెందుకు భారత పాకిస్థాన్‌ల మధ్య యుద్ధం కేవలం నాలుగు రోజుల్లోనే యాంటీ క్లైమాక్స్ లాగా ఎందుకు ముగిసింది? ఈ యుద్ధం ఇలా అర్ధాంతరంగా ముగియడాన్ని బట్టే యుద్ధం గురించి స్వతంత్రంగా మనం నిర్ణయాలు తీసుకోలేమని, తీసుకున్నా దాన్ని కొనసాగించలేమని అర్థమవుతుంది. ఈ యుద్ధ విరమణను భారత పాకిస్థాన్ దేశాలు తమంతట తాము ప్రకటించాయని అనుకోవడానికి ఏ మాత్రం వీల్లేదు. ఉన్నట్లుండి కత్తులు ఒరల్లోకి చేరిపోవడం యాదృచ్ఛికం కానేకాదు. అసలు సుదీర్ఘకాలం యుద్ధం జరగాలని, సైనికులు, ప్రజలు చనిపోవాలని, అభివృద్ధి స్తంభించిపోవాలని ఎవరూ కోరుకోరు. ప్రపంచ శాంతి ఏర్పడాలనే అందరూ కోరుకుంటారు. గతంతో పోలిస్తే ఒకటి రెండు చోట్ల తప్ప ప్రపంచంలో యుద్ధ వాతావరణం అంతగా లేదు. చైనా, అమెరికా లాంటి దేశాలు వాణిజ్య భాషకే ప్రాధాన్యతనిస్తున్నాయి. భారత దేశం కూడా వికసిత్ భారత లక్ష్యం నెరవేరాలంటే యుద్ధాన్ని సాధ్యమైనంత మేరకు నివారించాలి. యుద్ధం చేయడమంటే పులిపై స్వారీ చేయడమే. ప్రారంభించే ముందే దాని పర్యవసానాల గురించి ఆలోచించాలి. అందువల్ల యుద్ధం ఎందుకు ప్రారంభించాల్సి వచ్చింది? యుద్ధాన్ని ఎందుకు ముగించాల్సి వచ్చింది అన్న ప్రశ్నలపై మాత్రం చర్చ జరగడం అవసరం. రష్యా–ఉక్రెయిన్‌ల మధ్య, ఇజ్రాయిల్–హమాస్‌ల మధ్య యుద్ధాన్ని ఆపలేకపోయిన ఆంతర్జాతీయ శక్తులు భారత– పాకిస్థాన్‌ల విషయంలో మాత్రం ఎందుకు విజయవంతం కాగలిగాయి? ఒకటి రెండు ఫోన్‌కాల్స్‌తో ఇరు దేశాలు ఎందుకు శాంతించాయి? భారత పాకిస్థాన్‌ల మధ్య యుద్ధం ప్రారంభించిన వెంటనే అమెరికా, బ్రిటన్, సౌదీ అరేబియాతో సహా అనేక దేశాలు మధ్యవర్తిత్వానికి ప్రయత్నించాయి. ఇరు దేశాలు తమ నిర్ణయాన్ని ప్రకటించకముందే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత పాక్ దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయని ప్రకటించారు. తామే ఇరు దేశాలను ఒప్పించామని, ఈ దేశాలు తమ వివేకాన్ని, విజ్ఞతను ప్రదర్శించాయని ఆయన అభినందించారు. తాను, అమెరికన్ ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ భారతదేశం, పాకిస్థాన్‌లోని సైనిక నాయకత్వంతో మాట్లాడామని, పరిస్థితి విషమించకుండా ఒప్పందం కుదిరేలా చేసామని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో అన్నారు. దాదాపు పది పన్నెండు దేశాలు ఇరు దేశాలను శాంతింపచేసేందుకు ప్రయత్నాలు చేసినప్పటికీ ప్రధానంగా భారత పాకిస్థాన్‌ల మధ్య తాత్కాలిక శాంతి ఏర్పర్చడంలో అమెరికా కీలక పాత్ర వహించినట్లు స్పష్టమవుతోంది. తమకు సంబంధం లేని యుద్ధంలో తాము జోక్యం చేసుకోబోమని తొలుత ప్రకటించిన అమెరికా తన వైఖరి మార్చుకుని పెద్దన్న పాత్ర పోషించింది. యుద్ధం, సంఘర్షణలు జరిగినప్పుడే తమ పక్షాన ఎవరు నిలబడతారో అన్న విషయం స్పష్టమవుతుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో వ్యక్తిగత స్నేహం కూడా ఏర్పర్చుకుని పరమ మిత్రుడుగా వ్యవహరించారు. అయితే ఆయనే యుద్ధాన్ని ఆపేయాలని హెచ్చరించే స్వరంతో చెప్పారు. యుద్ధం ప్రారంభమైన తర్వాత కూడా అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ పాకిస్థాన్‌కు 2.4 బిలియన్ డాలర్ల రుణాన్ని మంజూరు చేసింది. సౌదీ ఆరేబియా, చైనా, యూఏఈ పాక్‌కు ఈ రుణం లభించేందుకు గట్టి మద్దతునిచ్చాయి. ఈ రుణం లభించకుండా వీటో చేసే అధికారాలున్నా అమెరికా అడ్డుకోలేదు, జపాన్, జర్మనీ, యూకే కూడా మాట్లాడలేదు. పాకిస్థాన్‌కు మద్దతునిస్తే ఉగ్రవాదానికి మద్దతునిచ్చినట్లేనన్న భారత్ నిరసనలకు మద్దతు లభించలేదు. దీనితో పాక్‌కు ఐఎంఎఫ్ రుణం ఇచ్చే విషయంలో ఐఎంఎఫ్ బోర్డులో వోటింగ్ చేయకుండా భారత్ వైదొలగాల్సి వచ్చింది.
ఈ నాలుగు రోజుల యుద్ధం కొన్ని ప్రశ్నలను మిగిల్చింది. ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత్ నిజంగా తన లక్ష్యాన్ని సాధించిందా? పహల్గాంలో హత్యకు గురైన అమాయక భారతీయుల మరణాలకు ప్రతీకారాలు తీర్చుకున్నారా? పాకిస్థాన్‌లో ఉగ్రవాద నెట్‌వర్క్‌ను మనం పూర్తిగా ధ్వంసం చేశామా? భారతీయ పర్యాటకులను హత్య చేసి అదృశ్యమైన ఉగ్రవాదులను మనం వెతికి వేటాడి చంపగలిగామా? పహల్గాం ఘటన సూత్రదారి ముసా, లష్కరే వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్, జైషే మహమ్మద్ వ్యవస్థాపకుడు మసూద్ అజర్, హిజ్బుల్ ముజాహిదీన్‌కు చెందిన సలావుద్దీన్ ఏ రహస్య స్థావరాల్లో దాక్కున్నారు? వారిని అప్పగించేందుకు పాకిస్థాన్ సిద్ధపడిందా? భారతదేశం కొన్ని స్థావరాలను ధ్వంసం చేసిన మాట నిజమే. పాకిస్థాన్‌కు మనం తీవ్ర నష్టం చేశామని మన సైనిక దళాలు వివరాలు ఇచ్చాయి. కాని మనకు జరిగిన నష్టం గురించి తెలిసేందుకు ఆస్కారం లేదు. మన యుద్ధ విమానాలను కూల్చివేయడం గురించి పాక్ చెప్పుకోవడంపై ప్రశ్నించినప్పుడు ‘యుద్ధం అన్న తర్వాత నష్టాలు జరగక తప్పదు’ అని భారతీయ వైమానిక దళం ప్రకటించింది కాని వివరాలు చెప్పలేదు. పాకిస్థాన్‌కు ఎంత నష్టం జరిగినా, కొంత గాయపరిచినా, వందమందిని పైగా హతమార్చామని చెప్పుకున్నా, పాక్‌లో ఉగ్రవాద నెట్‌వర్క్‌ను పూర్తిగా ధ్వంసం చేయడం, ఆక్రమిత కశ్మీర్‌ను అప్పగించడం, కశ్మీర్‌లో పూర్తిగా శాంతి నెలకొనడం అనే భారత దీర్ఘకాలిక లక్ష్యాలు ఇంకా నెరవేరాల్సి ఉన్నది. ముఖ్యంగా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌ను ప్రపంచ దేశాల్లో ఏకాకి చేయడం, దౌత్య, ఆర్థిక సహాయం అందకుండా చేయడం అంత సులభం కాదని తాజా పరిణామాలతో స్పష్టమైంది. నిజానికి నేరుగా యుద్ధం చేయకుండా పాకిస్థాన్ మాదిరే ఆ దేశంలో అల్లకల్లోలం సృష్టించడం, అంతర్గత భద్రతా పరిస్థితులను ఏర్పర్చడం సులభం. కాని దీనివల్ల ప్రచారం లబించదు కదా! ఇజ్రాయిల్‌లో నెతన్యాహుకు ప్రతికూల పరిస్థితులు ఏర్పడి అరెస్టయ్యే దశలో హమాస్‌పై దాడి చేసి తనకు తిరుగులేని పరిస్థితిని కల్పించుకున్నారు. భారతదేశంలో నరేంద్రమోదీ కూడా తన ప్రాబల్యాన్ని పెంచుకునేందుకు పహల్గాం ఘటన దోహదం చేసింది. పాకిస్థాన్ గురించి, ఉగ్రవాద శక్తుల గురించి ఆయన మాట్లాడిన ఒక్కొక్క మాటకూ దేశ ప్రజలు ఉప్పొంగిపోయారు. నాలుగు రోజుల పాటు మన యుద్ధ విమానాలు పాక్ గగనతలంలో స్వైర విహారం చేసినట్లు వచ్చిన వార్తలు విన్నప్పుడు,
మన టీవీ యాంకర్లు టెలివిజన్ తెరలపై యుద్ధాన్ని ఉచ్ఛైస్వరాలతో త్రీడీలో ఆవిష్కరించినప్పుడు ప్రజలు ఉత్కంఠలో మునిగిపోయారు. ఇప్పుడు ఆకస్మికంగా యుద్ధం ఆగిన తర్వాత మోదీ ప్రజల్లో ఆ వేడిని కొనసాగించేందుకు విశ్వయత్నాలు చేస్తున్నారు. దేశ ప్రజలను, సైన్యాన్ని ఉద్దేశించి ఆయన వీరోచితంగా ప్రసంగాలు చేయడం, ఆపరేషన్ సిందూర్ విజయవంతమైనదంటూ దేశ వ్యాప్తంగా బీజేపీ తిరంగా యాత్ర నిర్వహించడం ఇందుకు నిదర్శనం. ప్రశ్నలకు తావివ్వకుండా ప్రచారం చేయడం ఒకరకంగా మంచిదే. కాని ప్రచారం సద్దుమణిగిన తర్వాత మళ్లీ ప్రశ్నలకు ఆస్కారం కలగక తప్పదు. అందువల్ల ‘ధీరుల్ విఘ్న నిహన్య మానులగుచున్ ధ్రుత్యున్నతోత్సాహులై’ అని భర్తృహరి అన్నట్లు మన ప్రధానమంత్రి నరేంద్రమోదీ తాను ప్రారంభించిన కార్యాన్ని ఇంకా పూర్తిచేయాల్సి ఉన్నది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే పాకిస్థాన్‌ను రెండు ముక్కలు చేసిన ఇందిరాగాంధీకి, ఇతర దేశాల జోక్యాన్ని వ్యతిరేకిస్తూ ఆమె గతంలో చేసిన ప్రకటనలపై అంతటా చర్చ జరుగుతోంది!
ఎ. కృష్ణారావు
(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)
ఈ వార్తలు కూడా చదవండి..
Sravan Rao: చీటింగ్ కేసులో శ్రవణ్ రావు అరెస్ట్
CM Chandrababu: ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌తో సీఎం చంద్రబాబు భేటీ
Suryapet DSP Parthasarathy: డీఎస్పీ ఇంట్లో అక్రమంగా 100 బుల్లెట్లు..