Environmental Impact Irrigation Projects: కట్టని కాళేశ్వరమే బనకచర్ల
ABN , Publish Date - Jul 31 , 2025 | 06:12 AM
జీవధార జగడాలు జటిలమైనవి. నీటి పంపకాలలో పక్షపాతాలు ఆంధ్రప్రదేశ్‌ను రెండు రాష్ట్రాలుగా విభజించాయి. వేరుపడిన దశాబ్దం అనంతరం ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించిన గోదావరి–బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు (లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్) ఉభయ...

జీవధార జగడాలు జటిలమైనవి. నీటి పంపకాలలో పక్షపాతాలు ఆంధ్రప్రదేశ్‌ను రెండు రాష్ట్రాలుగా విభజించాయి. వేరుపడిన దశాబ్దం అనంతరం ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించిన గోదావరి–బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు (లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్) ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య నదీజలాల ఘర్షణలు పునఃప్రారంభమయ్యే పరిస్థితిని కల్పించింది. రైతులు సమృద్ధ సాగునీటి వసతిని కోరుతున్నారు. వారి ఆరాటం రాజకీయవేత్తలకు మరొక మెగా ప్రాజెక్ట్ నిర్మాణాన్ని ఆరంభించేందుకు ఆలంబన అయింది. బనకచర్ల ప్రాజెక్టు ఏమిటి? అది ఆంధ్రప్రదేశ్ కాళేశ్వరం! తెలంగాణలో కట్టిన కాళేశ్వరం, ఆంధ్రలో ప్రతిపాదిత బనకచర్ల మధ్య పోలికలు కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి. తొమ్మిది దశలవారీగా నీటి పంపింగ్, ఇంచుమించు 400 కిలోమీటర్ల దూరానికి బదలాయింపు, కాలువలు, సొరంగాలు, 150 టీఎంసీలకు పైగా నీటి నిల్వ చేసే భారీ జలాశయాలు. రెండిటి నిర్మాణ వ్యయ అంచనా కూడా సమస్థాయిలో ఉన్నది. కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చే ప్రాజెక్టులివి. భారీ ప్రాజెక్టులు, వాటిని మించిన మహా భారీ ప్రాజెక్టులు నిర్మించడమనే ప్రక్రియ అప్రతిహతంగా సాగిపోతోంది. నిర్మాణ వ్యయాలు పోటా పోటీగా పెరిగిపోతున్నాయి. ఈ పోటీ సుడిలో బనకచర్ల లాంటి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు చిక్కుకున్నాయి. వ్యవస్థాపిత ప్రమాణాలు, ఆర్థిక తర్కాన్ని ఈ ప్రాజెక్టులు పరిగణనలోకి తీసుకోవు. పర్యావరణ వ్యవస్థల పరిరక్షణను పట్టించుకోవు. పుట్టని తరాల వారిపై పడుతున్న భారం గురించి కించిత్ ఆలోచన కూడా ఉండదు. ఈ పరిణామాలు మినహా యింపుగా కాకుండా ఒక సాధారణ ప్రమాణంగా వాటిల్లుతున్నాయి. ప్రాజెక్టు పరిమాణం ఎంత భారీగా ఉంటే అంత మంచిది, నిర్మాణ వ్యయం ఎంత అధికంగా ఉంటే అంత ప్రయోజనకరం. కాళేశ్వరం, బనకచర్ల కథ ఒకటే. ప్రచ్ఛన్న యుద్ధకాలంలో అమెరికాలో సైనిక– పారిశ్రామిక వర్గాల కుమ్మక్కుతో ఆయుధోత్పత్తి పరిశ్రమలు విస్తరిల్లినట్టుగా ఇప్పుడు మన దేశంలో రాజకీయ వర్గాలు– బిల్డర్లు, ఇంజనీరింగ్ సంస్థల కుమ్మక్కుతో మెగా ఇంజనీరింగ్ ప్రాజెక్టుల నిర్మాణం పెచ్చరిల్లిపోతోంది. సమస్త వ్యవస్థాపిత ప్రమాణాలు, నియమ నిబంధనలు, నదీ జల పంపకాల ఒప్పందాలు, వ్యయ ప్రయోజన తర్కాన్ని భూస్థాపితం చేసేందుకు ఆంధ్ర, తెలంగాణ, గోదావరి ఎగువ రాష్ట్రాలు, భారత ప్రభుత్వం, కేంద్ర జల సంఘం ఏకీభవిస్తేనే బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణం సుసాధ్యమవుతుంది.
ఈ ప్రాజెక్టు ఎప్పటికైనా ఒక రూపు తీసుకుంటే, అంతర్ రాష్ట్ర ఒప్పందాలను లక్ష్య పెట్టకుండా తమకు తోచిన రీతిలో ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేపట్టేందుకు అన్ని రాష్ట్రాలనూ పురిగొల్పుతుంది. రాయలసీమ రైతుల ఆదాయాన్ని పెంపొందించేందుకు బనకచర్ల నిర్మించాల్సిన అవసరం లేదు. ఈ ప్రాజెక్టు పూర్తయ్యి, నీటి సరఫరా మొదలైనా నిర్వహణ వ్యయం పంట దిగుబడుల విలువ కంటే అధికంగా ఉంటుందని చెప్పేందుకు పెద్ద తెలివితేటలు అవసరం లేదు. నీటి సరఫరా వ్యయం ఎకరానికి రూ.50వేలకు మించి ఉంటుందని ఇప్పటికే కొంతమంది లెక్క కట్టారు. బనకచర్ల నిర్మాణ వ్యయాన్ని పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే భరించినా అది ఆంధ్రా ప్రజలకు పెద్ద భారమవుతుంది. ఈ ప్రాజెక్టుకు అవసరమైన 200 టీఎంసీల నీరు అందుబాటులో లేదు; సముద్రానికి తరలిపోయే నీరు ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రాతిపదిక కాదు; సీడబ్ల్యూసీ ఈ ప్రాజెక్టుకు ఎట్టి పరిస్థితులలోను అనుమతినివ్వబోదు; సీడబ్ల్యూసీ అనుమతి లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టలేదు; అనుమతి లేకుండానే నిర్మాణాన్ని ఆరంభించిన పక్షంలో ఎగువ రాష్ట్రాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతుంది. సముద్రం లోకి వృథాగా పోతున్నాయని చెబుతున్న 3000 టీఎంసీల నీటిలో ఎగువ రాష్ట్రాలు వివిధ కారణాల వల్ల ఉపయోగించుకోని జలాలు కూడా ఉన్నాయనేది విస్మరించకూడదు. వరద జలాలు అన్న భావనే లేదు. నదుల్లో ప్రవహించే నీటిని అడ్డుకోవడం, ఉపయోగించుకోవడం కుదరదు. ఈ కారణంగానే సీడబ్ల్యూసీ ఆయా నదుల్లో లభ్యమయ్యే నీటికి సంబంధించి అంచనాలు వేసి, పరీవాహక ప్రాంత రాష్ట్రాలకు కేటాయింపులు జరుపుతోంది. బనకచర్ల ప్రస్తుత అంచనా వ్యయం రూ.80,000 కోట్లు. అంతిమంగా ఇది రూ.1,50,000 కోట్లకు పెరగవచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ మొత్తాన్ని మరింత అర్థవంతంగా, మరింత ప్రయోజనకరమైన ప్రాజెక్టులకు వినియోగించాలి. తెలంగాణ రాష్ట్రం తప్పకుండా బనకచర్లను వ్యతిరేకిస్తుంది. అయితే అది తమ న్యాయబద్ధమైన వ్యతిరేకతలను సీడబ్ల్యూసీ అధికార పరిధిలో వ్యక్తం చేయాలి. ప్రజల వద్దకు ఈ సమస్యను తీసుకుపోయి భావావేశాలను రెచ్చగొట్టడం మంచిది కాదు. బనకచర్లపై వ్యతిరేకత వ్యక్తం చేసేందుకు వ్యవస్థాపిత ప్రమాణాలు, వేదికలు ఉన్నాయి.
ఈ సమస్య తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజల మధ్య కాదు. తెలంగాణ రాష్ట్రం గోదావరి నదీజలాల ట్రిబ్యునల్ తమకు కేటాయించిన నీటిలో సగభాగాన్ని కూడా ఉపయోగించుకోవడం లేదు. ఆంధ్రప్రదేశ్ తన వాటాను ఇప్పటికే పూర్తిగా వినియోగించుకుంటోంది. బనకచర్లపై ముందస్తు సాధ్యాసాధ్యాల నివేదికకు సంబంధించి సీడబ్ల్యూసీ తెలంగాణ ప్రభుత్వానికి రాసిన లేఖలో సూచించిన విధంగా ఆంధ్రకు అదనపు జలాలు సమకూరుస్తామని తెలంగాణ ప్రభుత్వం లిఖిత పూర్వకంగా హామీ ఇవ్వడమనేది జరగని విషయం. తనకు కేటాయించిన నీటి వాటా, భావి ప్రాజెక్టులపై తన హక్కును వదులుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం అంగీకరిస్తే తప్ప, దాని నుంచి ఆంధ్రప్రదేశ్ 200 టీఎంసీల నీటిని వాడుకునేందుకు తమకు అభ్యంతరం లేదనే లిఖితపూర్వక హామీ పొందడమనేది జరగదు. సీడబ్ల్యూసీ బాధ్యతలు, అధికారాలు రాజ్యాంగ నిర్దేశితమైనవి. తమకు కేటాయించిన నదీజలాల ఆధారంగా కాకుండా ఇతరత్రా నిర్మించేందుకు తలపెట్టిన కొత్త ప్రాజెక్టులకు అనుమతిని నిర్ద్వంద్వంగా నిరాకరించేందుకు సీడబ్ల్యూసీకి అధికారమున్నది. నీటి కేటాయింపులు పొంది, ప్రస్తుతం ఆ జలాలను ఉపయోగించుకోలేకపోతున్న రాష్ట్రాల భావి ప్రయోజనాలను పరిరక్షించే బాధ్యత కూడా సీడబ్ల్యూసీపై ఉన్నది. ఎగువ రాష్ట్రాలు ఏవైనా తమ వాటా నీటిని ఉపయోగించుకోలేకపోతే దిగువ రాష్ట్రాలు వాటిని ఉపయోగించుకునేందుకు వీలులేదు. ఉమ్మడి పరీవాహక ప్రాంతంలోని ఇతర రాష్ట్రాల అవసరాలు, ఆకాంక్షలను తప్పక గుర్తించి, గౌరవించాలి. ఈ దృష్ట్యా వరద జలాలు, సముద్రానికి వృథాగా వెళుతున్న నీరు అనే భావనలు బనకచర్ల తరహా అదనపు ప్రాజెక్టుల నిర్మాణానికి ఆలంబన కాబోవు. సముద్రంలోకి ప్రవహిస్తున్న నీరు వృథా అయిపోతుందనేది పూర్తిగా కాలం చెల్లిన భావన. నదీ ప్రవాహాలను అడ్డుకుంటే పర్యావరణ విపత్తులు సంభవిస్తాయి. నదులు స్వేచ్ఛగా సముద్రానికి ప్రవహించాలి.. ఇది పర్యావరణ అవసరం.
కోస్తా ప్రాంతాలు ఈ నీటిపైనే ఆధారపడి ఉన్నాయి. ఈ కారణంగానే వరద జలాల భావన అనేదే లేదని సీడబ్ల్యూసీ స్పష్టం చేసింది. ఏ ప్రాజెక్టుకూ వరద జలాల కేటాయింపు లేదని ఖండితంగా పేర్కొంది. బనకచర్ల ముందస్తు సాధ్యాసాధ్యాల నివేదికపై సీడబ్ల్యూసీ తీసుకున్న విధానపరమైన వైఖరి అది. గోదావరీ తీరస్థ రాష్ట్రాలకు 18 ఫిబ్రవరి 2022న రాసిన లేఖలో ఇచ్చంపల్లి వద్ద 75 శాతం మిగులు జలాల లభ్యత (ఏదైనా ప్రాజెక్టు తలపెట్టినప్పుడు ఆ ప్రాజెక్టు కింద ఏర్పాటయ్యే ఆయకట్టుకు నాలుగేళ్లలో కనీసం మూడేళ్లపాటైనా నిర్దేశిత సాగునీరు అందుబాటులో ఉండే విధానాన్ని 75 శాతం లభ్యత అంటారు) లేదని కేంద్ర జలసంఘం స్పష్టం చేసింది. గోదావరి– బనకచర్ల ప్రాజెక్టు ముందస్తు సాధ్యాసాధ్యాల నివేదికపై పోలవరం వద్ద 200 టీఎంసీల నీటి లభ్యతపై కూడా స్పష్టమైన వ్యాఖ్యలు చేసింది. గోదావరి ఎగువ రాష్ట్రాలలో పూర్తయిన, నిర్మాణమవుతున్న, ప్రతిపాదిత ప్రాజెక్టులు అన్నిటినీ పరిగణనలోకి తీసుకుని ఆ వ్యాఖ్యలు చేయడం జరిగింది. బనకచర్ల ప్రాజెక్టు ముందస్తు సాధ్యాసాధ్యాల నివేదికపై ఎగువ రాష్ట్రాలయిన మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిషాలు కూడా తమ అభిప్రాయాలు చెప్పవలసిన అవసరం ఉంది. ఈ రాష్ట్రాలు తమ వాటా జలాల నుంచి కొత్త ప్రాజెక్టుకు అవసరమైన నీటిని ఆంధ్రప్రదేశ్‌కు ఇవ్వవలసి ఉన్నది. ఇది జరగడం అసంభవం. గోదావరి–బనకచర్ల ప్రాజెక్టు వంటివి ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య గందరగోళాన్ని, విభేదాలను సృష్టిస్తాయి. అటువంటి నిష్ఫల ప్రాజెక్టులను ప్రశ్నించినవారిపై అభివృద్ధి నిరోధకులు లేదా ఫలానా రాష్ట్ర వ్యతిరేకి అని ముద్ర వేయడమూ జరుగుతుంది. బనకచర్ల ప్రాజెక్టును ప్రశ్నిస్తున్నవారు ప్రత్యామ్నాయాలను సూచించవలసిన అవసరమున్నది. అన్ని ప్రత్యామ్నాయాలను అన్వేషించాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉన్నది. ఆంధ్రప్రదేశ్ పాలకులు మూడు విషయాలపై ఆలోచించవలసిన అవసరం ఉంది. బనకచర్ల ఆచరణ సాధ్యమైన ప్రాజెక్టు కాదు. ఆంధ్ర, తెలంగాణ ప్రజల మధ్య సమస్యలు తలెత్తేందుకు ఆస్కారమున్నది; ఆంధ్రప్రదేశ్‌పై ఈ ప్రాజెక్టు పెద్ద ఎత్తున ఆర్థిక భారాన్ని మోపవచ్చు; ప్రస్తుత ప్రతిపాదనల ప్రకారం బనకచర్లకు సీడబ్ల్యూసీ, పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ, అపెక్స్ కౌన్సిల్ మొదలైనవి అనుమతులు ఇవ్వబోవు; రాయలసీమ రైతులను ఆదుకునేందుకు అనేక మార్గాలు ఉన్నాయి; మరీ ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టుకు మద్దతు నివ్వలేదు. రాజకీయ కారణాలతో కేంద్ర ప్రభుత్వ తోడ్పాటు లభించినా దేశవ్యాప్తంగా నదీజలాల కేటాయింపులకు ప్రస్తుతం అనుసరిస్తున్న మార్గదర్శక సూత్రాలు, నియమ నిబంధనలు, వ్యవస్థాపిత ప్రమాణాలు సమస్తమూ సమసిపోతాయి. ఇదే సంభవిస్తే సీడబ్ల్యూసీ విశ్వసనీయత, అధికారమూ హరించిపోతాయి. దేశ జలవనరుల నిర్వహణలో కీలక పాత్ర వహిస్తున్న ఆ జాతీయ సంస్థ నిష్పాక్షికతపై ప్రజలు నమ్మకం కోల్పోతారు.
డాక్టర్ బిక్షం గుజ్జా
డాక్టర్ కె.శివకుమార్
(వ్యాసకర్తలు జలవనరుల, పర్యావరణ వ్యవహారాల నిపుణులు)
ఇవి కూడా చదవండి
చనుబాలు అమ్మి లక్షలు సంపాదిస్తున్న మహిళ..
ప్రాణం మీదకు తెచ్చిన ప్రేమ వ్యవహారం.. ఏం జరిగిందో తెలిస్తే..