ప్రజావ్యూహం!
ABN , Publish Date - Apr 29 , 2025 | 05:28 AM
అటవీసంపద–ఖనిజాల వేటలో ప్రజా ఉద్యమాల అణచివేతలో అడవిబిడ్డల ప్రాణాలను హరించడమే– తప్ప వొడ్డుకు చేర్చలేని శస్త్రచికిత్స...

అటవీసంపద–ఖనిజాల వేటలో
ప్రజా ఉద్యమాల అణచివేతలో
అడవిబిడ్డల ప్రాణాలను హరించడమే– తప్ప
వొడ్డుకు చేర్చలేని శస్త్రచికిత్స
ఇప్పుడు కొనసాగుతున్న సైనిక ఆపరేషన్– కగార్!
ఈ అసమ అరణ్య యుద్ధంలో
క్షేత్రస్థాయి నిజాన్ని మరచి
రక్తమోడిన యాభై సంవత్సరాల
‘ప్రజాయుద్ధం’ సాధించినదెంత?
అడవిమూలాల అంచులపై
కొండలపై ఆత్మరక్షణే కావొచ్చు,
మందుపాతరలు పేలిన ఫలితం
చీలిన అవయవాలు– కండరాలు–
నేలంతా చిందిన రక్తం!
ప్రతీకార ‘కగార్’ కక్షతో
మారుమోగే తుపాకుల మోతలో
సంజాయిషీ లేని సర్కారి హింసాకాండకు
ఇకనైనా ముగింపు పలకాలి,
ఇరువైపులా శాంతి చర్చలే మార్గాంతరం,
పోరాటశక్తుల ఆత్మవిశ్వాసాన్ని
వెల్లడించడమే ప్రజావ్యూహం!!
నిఖిలేశ్వర్
ఇవి కూడా చదవండి
Jagga Reddy: జగ్గారెడ్డి మాస్ డైలాగ్.. రాజకీయాల్లో విలన్ మేమే, హీరోలం మేమే
Meta AI Chatbot: అశ్లీలతకు అడ్డాగా మారిన మెటా ఏఐ చాట్ బాట్స్