Share News

Muppavarapu Venkaiah Naidu: నిరంకుశత్వం రాజ్యమేలిన వేళ..

ABN , Publish Date - Jun 24 , 2025 | 03:46 AM

యాభై సంవత్సరాల క్రితం 1975లో అప్పటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ 21 నెలల పాటు దేశంలో అత్యయికస్థితిని (ఎమర్జెన్సీని) విధించారు. ఆమె తీసుకున్న ఈ నిరంకుశ నిర్ణయం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది.

Muppavarapu Venkaiah Naidu: నిరంకుశత్వం రాజ్యమేలిన వేళ..

యాభై సంవత్సరాల క్రితం 1975లో అప్పటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ 21 నెలల పాటు దేశంలో అత్యయికస్థితిని (ఎమర్జెన్సీని) విధించారు. ఆమె తీసుకున్న ఈ నిరంకుశ నిర్ణయం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. ప్రజాస్వామ్యవాదుల్లో ఆందోళనలు రేకెత్తించింది. భారతదేశం వలస పాలన సంకెళ్లను తెంచుకున్న తర్వాత, మన ప్రజాస్వామ్యానికి ఎమర్జెన్సీ రూపంలో తీవ్రమైన ముప్పు ఎదురైంది. రాజకీయ నాయకులు, కార్యకర్తలతో పాటు ప్రజలందరి జీవితాలలో అది చేదు సమయం. ప్రతిపక్ష నాయకులను అణచివేయడమే లక్ష్యంగా ఇందిరాగాంధీ యంత్రాంగం పనిచేసింది. వందలాది ప్రతిపక్ష నేతలను, వేల మంది కార్యకర్తలను కారాగారాల్లో నిర్బంధించింది. పౌరహక్కులకు, ప్రాథమిక హక్కులకు పాతరేసింది. భావప్రకటన స్వేచ్ఛను, వాక్ స్వాతంత్ర్యాన్ని హరించివేసింది. శాంతియుతంగా నిరసనలు తెలియజేయడానికి కూడా ఎక్కడా ఎవరూ గుమిగూడడానికి వీల్లేకుండా చేసింది. పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు వేసింది. సెన్సార్‌షిప్ విధించింది. ఆఖరుకు న్యాయవ్యవస్థ స్వతంత్రతకు కూడా కళ్లెం వేయడానికి ప్రయత్నించింది. చెప్పినట్లు నడచుకునే న్యాయమూర్తులను, సీనియారిటీని కాదని ఎంచుకుంది. ఇవన్నీ మునుపెన్నడూ లేని నిరంకుశ చర్యలు. ప్రజాస్వామ్యానికి పెనుముప్పుగా పరిణమించే ఒక ప్రమాదకర ధోరణికి ఇందిరాగాంధీ మార్గం వేశారు. యాభై సంవత్సరాల క్రితం మన ప్రజాస్వామ్య వ్యవస్థ పునాదులను కదిలించిన అత్యయిక స్థితి నేటి తరానికి చరిత్రలో ఒక చిన్న అంశం మాత్రమే అనిపించవచ్చు. అయితే, యువతకు ఆ నాటి చీకటి అధ్యాయం గురించి, దాని పర్యవసానాల గురించి తప్పకుండా తెలియజేయాలి. అధికారాన్ని ఏ విధంగానైనా అట్టిపెట్టుకోవడానికి కంకణం కట్టుకున్న ఒక స్వార్థపూరిత నాయకురాలి నిరంకుశ మనస్తత్వం వల్ల భారత ప్రజాస్వామ్యపు మౌలిక స్వభావానికి తూట్లు పడే పరిస్థితి ఎదురయిందన్న సంగతి యువతరానికి తెలియాలి.


ముందుగా, ఏ కారణాల వల్ల భారత రాష్ట్రపతి జాతీయ అత్యయికస్థితిని ప్రకటించవచ్చో తెలుసుకుందాం. రాజ్యాంగంలోని 352 అధికరణం ప్రకారం, దేశ భద్రతకు లేదా దేశంలోని ఏదైనా ప్రాంతం భద్రతకు యుద్ధం, దండయాత్రలు, సాయుధ తిరుగుబాటు వల్ల ముప్పు వాటిల్లినప్పుడు భారత రాష్ట్రపతి జాతీయ అత్యయికస్థితిని ప్రకటించవచ్చు. 1975లో శ్రీమతి గాంధీ అత్యయిక స్థితి విధించినప్పుడు అటువంటి ప్రమాదకరమైన పరిణామాలు ఏవీ లేవు. ఆ కాలంలో పాలక కాంగ్రెస్ నేతల అవినీతి, అక్రమాలపై ప్రజల్లో ఆగ్రహం ఉంది. అదే సమయంలో గుజరాత్‌లోని నవ్ నిర్మాణ్ విద్యార్థి ఉద్యమం, బిహార్ ఛాత్ర సంఘర్ష్ సమితి చేపట్టిన విద్యార్థి ఉద్యమం (జేపీగా సుపరిచితులైన గాంధేయ సోషలిస్ట్ జయప్రకాశ్‌ నారాయణ్ ఈ ఉద్యమానికి మద్దతు ఇచ్చారు) ప్రజల్లోకి బాగా వెళ్లాయి. ముఖ్యంగా యువతలో కాంగ్రెస్ పట్ల ఆగ్రహాన్ని మరింత పెంచాయి. అవినీతి వ్యతిరేక ఉద్యమం దేశవ్యాప్తంగా విస్తరించింది. దానికి నాయకత్వం వహిస్తున్న జేపీ, ఏప్రిల్ 1974లో పట్నాలో ‘‘సంపూర్ణ విప్లవం–అన్ని రంగాల్లో సమగ్ర మార్పుల’’ కోసం పిలుపునిచ్చారు. దీంతో ఉద్యమం మరింత ఊపందుకుంది. విద్యార్థులు, రైతులు, కార్మిక సంఘాలు భారత సమాజంలో మార్పును తీసుకురావాలని, అది అహింసాయుతంగా ఉండాలని జేపీ పిలుపునిచ్చారు. రోజురోజుకూ ఆయనకు ప్రజాదరణ పెరగడం ప్రారంభమైంది. ఈ నిరసనలు ఉధృతమవుతున్న సమయంలోనే, అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జగన్‌మోహన్‌లాల్ సిన్హా ఒక తీర్పును వెలువరించారు.


ఎన్నికల్లో అవకతవకల కారణంగా ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ లోక్‌సభ ఎన్నిక చెల్లదని స్పష్టం చేశారు. దీంతో ఆమె లోకసభ సభ్యత్వం రద్దయింది. అంతేకాకుండా, మరో ఆరేళ్ళ పాటు ఆమె ఎన్నికల్లో పోటీ చేయకుండా ఈ తీర్పు నిషేధించింది. హైకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ ఇందిరాగాంధీ సుప్రీంకోర్టుకు వెళ్లారు. అక్కడ జస్టిస్ వి.ఆర్. కృష్ణయ్యర్ 1975 జూన్ 25న హైకోర్టు తీర్పును సమర్థించారు. అయితే ఇందిరాగాంధీ చేసుకున్న అప్పీల్ పరిష్కారం అయ్యే వరకు ఆమె ప్రధానమంత్రిగా కొనసాగవచ్చని సుప్రీంకోర్టు పేర్కొంది. ప్రధానమంత్రి పదవిని నిలబెట్టుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్న శ్రీమతి గాంధీ, 1975 జూన్ 25 రాత్రి భారత రాజ్యాంగంలోని అధికరణం 352(1) ప్రకారం ‘అంతర్గత అలజడి’ అని కారణం చూపుతూ, రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ జారీ చేసిన ప్రకటన ద్వారా అత్యయిక స్థితిని విధించారు. ఇది మునుపెన్నడూ దేశం కనీవినీ ఎరుగని చర్య. ప్రభుత్వం ప్రాథమిక పౌర హక్కులను, అంటే వాక్ స్వాతంత్ర్యం, పత్రికా స్వాతంత్ర్యం, హెబియస్ కార్పస్ వంటి వాటిని నిలిపివేసింది. ప్రభుత్వాన్ని విమర్శించే మీడియా సంస్థలను బలవంతంగా మూసివేశారు. వార్తాపత్రిక కార్యాలయాలకు విద్యుత్ సరఫరాను ఆకస్మికంగా నిలిపివేశారు. ఈ విధంగా నిరసన హక్కులను హరించే చర్యల ద్వారా రాత్రికి రాత్రే అసమ్మతి గళాన్ని వినిపించకుండా చేశారు. జయప్రకాశ్‌ నారాయణ్, అటల్ బిహారీ వాజ్‌పేయి, లాల్‌కృష్ణ అద్వానీ, మొరార్జీ దేశాయ్, జార్జ్ ఫెర్నాండెజ్, జ్యోతిర్మయ్ బసు, చరణ్ సింగ్, జె.బి. కృపలానీ సహా మరెంతో మందిని నిర్బంధంలోకి తీసుకున్నారు. నిర్బంధంలో ఉండగానే జేపీ ఆరోగ్యం క్షీణించి, మూత్ర పిండాలు పాడైపోయాయి. ఆయన జీవితాంతం డయాలసిస్ చేయించుకోవాల్సి వచ్చింది. చివరకు ఆ సమయంలో కూడా ఆయన్ను గృహనిర్బంధం చేశారు. ఇందిరాగాంధీ ఆ సమయంలో అధికారాన్ని విచక్షణారహితంగా ఉపయోగించి, 42వ సవరణ ద్వారా లోక్‌సభ, రాష్ట్ర శాసనసభల పదవీకాలాన్ని ఐదు సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరాలకు పొడిగించారు.


జనతా హయాంలో 44వ సవరణ ద్వారా ఈ పదవీకాలాన్ని తిరిగి ఏర్పాటు చేశారు. అసమ్మతిని అణచివేయడానికి ప్రభుత్వం దేశవ్యాప్తంగా కఠినమైన ముందస్తు నిర్బంధ (ప్రివెంటివ్ డిటెన్షన్) నిబంధనలను ప్రయోగించింది. దేశవ్యాప్తంగా అన్ని స్థాయిలలో ప్రతిపక్ష నాయకులను నిర్బంధించారు. కార్యకర్తలు, విద్యార్థులను వివిధ రాష్ట్రాలలో నిరవధికంగా నిర్బంధంలోకి తీసుకున్నారు. నేను ఆ సమయంలో యువ విద్యార్థి నాయకుడిని. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సుమారు ఏడాదిన్నర పాటు అరెస్టయి కారాగారంలో ఉన్నాను. ఆంధ్రప్రదేశ్‌లోని తెన్నేటి విశ్వనాథం, గౌతు లచ్చన్న వంటి ప్రముఖ నాయకులను కారాగారంలో పెట్టారు. నిర్బంధంలో నేను గడిపిన పదిహేడున్నర నెలల కాలం నా రాజకీయ, ప్రజా జీవిత ప్రస్థానంలో ఒక కీలక మలుపు. విద్యార్థి నాయకుడిగా నేను చేపట్టిన కార్యకలాపాల కారణంగా జైలుకు వెళ్ళకపోయి ఉంటే, బహుశా మా అమ్మ కోరిక నెరవేర్చడానికి న్యాయవాదిగా మారేవాడిని. అత్యయిక స్థితి నా ఆలోచనా తీరును మాత్రమే కాకుండా నా జీవిత గమనాన్ని, వృత్తిని, గమ్యాన్ని ఒక్కసారిగా మార్చివేసింది. అత్యయిక స్థితికి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలు, విద్యార్థుల ఆందోళనలు తీవ్రమయ్యాయి. శక్తిమంతమైన ప్రతిఘటన ఉద్యమాన్ని నిర్మించాయి. మీడియా చాలా వరకు ప్రభుత్వానికి పూర్తిగా లొంగిపోయి తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. అయితే కొన్ని పత్రికలు ప్రభుత్వ దాష్టీకానికి ఎదురొడ్డాయి. రామనాథ్ గోయెంకా నేతృత్వంలోని ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’, సి.ఆర్. ఇరానీ నేతృత్వంలోని ‘ది స్టేట్స్‌మన్’, నిఖిల్ చక్రవర్తి నేతృత్వంలోని ‘ది మెయిన్‌స్ట్రీమ్’ ప్రభుత్వ నిరంకుశ ధోరణిని తూర్పారబట్టాయి. అత్యయిక స్థితి ఎత్తివేసిన తర్వాత పాత్రికేయులతో ఎల్.కె. అద్వానీ అన్న మాటలు నాకు గుర్తుకొస్తుంటాయి. ‘‘మిమ్మల్ని వంగమని మాత్రమే అడిగారు. కానీ మీరు మోకాళ్లపై పాకారు’’ అని ఆయన అన్నారు. 1977లో జరిగిన చరిత్రాత్మక సార్వత్రిక ఎన్నికలు ఒక కీలక ఘట్టంగా నిలిచాయి.


ఎందుకంటే అవి ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ ఒక పెద్ద పరివర్తనను తీసుకువచ్చాయి. జనతా పార్టీ విజయం అత్యయిక స్థితికి ముగింపు పలికింది. ప్రజాస్వామ్య విలువలు గెలిచాయి. బ్యాలెట్ (ఓటు)దే పై చేయి అని ఆ ఎన్నికలు పునరుద్ఘాటించాయి. పరివర్తన సాధించడానికి శాంతియుతమైన, సమర్థమైన సాధనం ప్రజా భాగస్వామ్యమే అని నిరూపించాయి. ఒక శక్తిమంతమైన నియంతృత్వ పాలనను పడగొట్టడం ఒక గొప్ప పరివర్తన. బహుశా మన ఇటీవలి చరిత్రలో బ్యాలెట్ శక్తికి అత్యంత గొప్ప ఉదాహరణ ఇదే. ఆ చీకటి కాలం నుంచి మనం నేర్చుకున్న పాఠాలను భారతదేశ యువతరానికి అందించాలి. ప్రజాస్వామ్య సూత్రాలను కాపాడటానికి, పౌర స్వేచ్ఛను రక్షించడానికి, అధికార సమతౌల్యం ఉండేలా పటిష్ఠమైన వ్యవస్థ మనగలగడానికి వారు గట్టిగా నిలబడాలి. న్యాయవ్యవస్థ పోషిస్తున్న పాత్రపైన, మీడియా స్వాతంత్ర్యంపైనా ఆనాటి క్రూర పాలన కన్ను పడిందన్న సంగతిని మనం మర్చిపోకూడదు. చివరికి, అత్యయిక స్థితి మనకు గుర్తుచేసిన విషయం ఏమిటంటే– ‘‘స్వేచ్ఛకు మనం చెల్లించాల్సిన మూల్యం నిరంతర జాగరూకతే’’.

- ముప్పవరపు వెంకయ్యనాయుడు

పూర్వ ఉపరాష్ట్రపతి (ఎమర్జెన్సీకి రేపటికి 50 ఏళ్లు)

Updated Date - Jun 24 , 2025 | 03:48 AM