Donald Trump Presidency: వంద రోజుల్లోనే కిందకు
ABN , Publish Date - Apr 30 , 2025 | 03:36 AM
ట్రంప్ అధ్యక్షతలో అమెరికా ప్రజాస్వామ్యం క్షీణిస్తుండగా, అతని చర్యలు నియంతృత్వ శైలిని ప్రతిబింబిస్తున్నాయని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సిఎల్‌ఆర్ జేమ్స్ సూచించిన ప్రజాశక్తి భావనకు విరుద్ధంగా, బిలియనీర్ల అధిపత్యం పెరిగి సామాజిక అసమానతలు ముదురుతున్నాయి.

ప్రతి వంటవాడూ పరిపాలించగలడు (Every cook can Govern) -–ప్రాచీన గ్రీకు ప్రజాస్వామ్య స్ఫూర్తిని ట్రినిడాడ్ రచయిత, మార్క్సిస్టు చింతకుడు సిఎల్‌ఆర్ జేమ్స్ అలా స్ఫూర్తిదాయకంగా సంక్షేపించాడు. ఆయనే గత శతాబ్ది మధ్యనాళ్లలో అమెరికా వినోద పరిశ్రమ హాలీవుడ్ ధోరణులను నిశితంగా విశ్లేషిస్తూ అమెరికా ఉదారవాద సంస్కృతి క్షీణముఖం పట్టి నియంతృత్వ పాలకులు ప్రభవించవచ్చని భావించాడు. జేమ్స్ భయాలు 21వ శతాబ్దిలో, ముఖ్యంగా డోనాల్డ్ ట్రంప్ రాజకీయ రంగంలోకి వచ్చిన తరువాత నిజమవుతున్న సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ట్రంప్ రెండోసారి అధ్యక్ష పదవీ బాధ్యతలు చేపట్టి నేటితో 100 రోజులు పూర్తవుతున్న సందర్భంగా అమెరికా ప్రజానీకం, మేధో శ్రేణులు, రాజకీయ వర్గాలలోనూ అటువంటి అభిప్రాయాలే గట్టిగా వ్యక్తమవుతున్నాయి. ‘అమెరికా రాజ్యాంగం ప్రమాదంలో పడింది. పౌర, మానవ హక్కులు అణచివేయబడుతున్నాయి. ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైపోయింది. ప్రజాస్వామ్యం, ఆర్థిక వ్యవస్థ ఏమైపోయినా ట్రంప్‌కు కావాల్సింది మాత్రం అవధులు లేని సంపూర్ణ అధికారం. నియంతృత్వంలోకి అమెరికా జారిపోతోంది’ అని బిల్‌క్లింటన్ ప్రభుత్వంలో కార్మిక శాఖ కార్యదర్శిగా ఉన్న రాబర్ట్ రెయిష్ వాపోయారు. గత నవంబర్‌లో అధ్యక్ష ఎన్నికలలో అమెరికా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు ఎంతో నమ్మకంతో ట్రంప్‌ను భారీ మెజారిటీతో గెలిపించారు. అయితే పదవీ బాధ్యతలు చేపట్టిన క్షణం నుంచీ ట్రంప్ చేపడుతున్న చర్యలేవీ అత్యధికులకు ఆమోదయోగ్యంగా లేవు. పెంగ్విన్ పక్షులు మాత్రమే ఉండే ఒక దీవితో సహా ప్రపంచ దేశాలన్నిటిపైనా ఆయన ప్రారంభించిన సుంకాల యుద్ధం తమను తీవ్ర ఆర్థిక మాంద్యంలోకి నెట్టి వేస్తోందని అమెరికన్లు ఆందోళన చెందుతున్నారు. ఈ కారణంగానే గత ఎనభై సంవత్సరాలలో ఏ అధ్యక్షుడి వంద రోజుల పాలన కంటే ట్రంప్ తొలి వంద రోజులు (ఇప్పుడేకాదు, మొదటి పర్యాయం కూడా) అధ్వాన్నంగా ఉన్నట్టు అనేక సర్వేలలో వెల్లడయింది. ట్రంప్ ‘అమెరికా ఫస్ట్’ విధానంతో చిరకాలంగా నమ్మకమైన మిత్రులుగా ఉన్న యూరోపియన్ దేశాలు అమెరికాపై చిరచిరలాడుతున్నాయి.
అధికారాన్ని అప్పగిస్తే ఉక్రెయిన్ యుద్ధాన్ని 24 గంటలలో నిలిపివేస్తానన్న ట్రంప్‌ను రష్యా లెక్క చేయడం లేదు. యూరోప్‌లో శాంతి సుదూర గమ్యంగా మిగిలిపోయింది. పశ్చిమాసియాలో అమెరికా ప్రయోజనాలకే కాదు, తన సొంత కుటుంబ లబ్ధి కోసం కూడా మానవతను హతమారుస్తున్న ఇజ్రాయిల్‌ను ట్రంప్ వెనకేసుకొస్తున్నాడు. భౌగోళిక సామ్రాజ్యవాదానికి మళ్లీ ఊపిరిపోయడానికి సిద్ధమైన ట్రంప్‌కు కెనడా ఓటర్లు తమ పార్లమెంటరీ ఎన్నికలలో చెంపపెట్టు లాంటి తీర్పునిచ్చారు. కెనడా 51వ రాష్ట్రంగా అమెరికాలో చేరాలని సతాయిస్తున్న ట్రంప్‌కు వందరోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా కెనడియన్లు మంచి గుణపాఠమే చెప్పారు. అమెరికాను మళ్లీ గొప్పదేశంగా చేయాలన్న ఆరాటంతో ట్రంప్ పూర్తిగా అసంబద్ధ విధానాలను అనుసరిస్తున్నారు. ఏ రంగమూ ఆరోగ్యకరంగా అభివృద్ధి చెందేందుకు అవి తోడ్పడేవి కావు. విద్యావేత్తలు, విద్యార్థులు, పాత్రికేయులు, మేధావులు, వృత్తి నిపుణులు అందరూ ట్రంప్ ప్రభుత్వం పట్ల అసంతృప్తితో రగిలిపోతున్నారు. చివరకు ట్రంప్ నియమించిన న్యాయమూర్తులు సైతం ఆయన నిర్ణయాలను వ్యతిరేకిస్తూ తీర్పులు వెలువరిస్తున్నారు. ఇంతవరకు ఆయన తీసుకున్న నిర్ణయాలు, చేపట్టిన చర్యలపై వ్యక్తులు, ప్రభుత్వాలు, వృత్తి సంఘాలు, ప్రజాసముదాయాలు న్యాయపోరాటాలు చేస్తున్నాయి. సమీప భవిష్యత్తులోనే సుప్రీంకోర్టు తీర్పులను సైతం ధిక్కరించడానికి ట్రంప్ సాహసించవచ్చని రిపబ్లికన్ పార్టీ వర్గాలే కలవరపడుతున్నాయి. దీన్ని బట్టి అమెరికా 47వ అధ్యక్షుడు ఎంత ఏకపక్షంగా వ్యవహరిస్తున్నదీ అర్థం చేసుకోవచ్చు.
మాజీ అధ్యక్షుడు జో బైడెన్ గత జనవరిలో వైట్‌హౌజ్ నుంచి నిష్క్రమిస్తూ అమెరికా పాలనా వ్యవస్థ పూర్తిగా బిలియనీర్ల చేతుల్లోకి పోతుందని హెచ్చరించారు. అమెరికాలో ఇప్పుడు అల్పజన పాలన జరుగుతుందనడంలో సందేహం లేదు. ట్రంప్‌కు సన్నిహితులుగా ఉండి వివిధ ప్రభుత్వ విభాగాలకు ఆధ్వర్యం వహిస్తున్న ధనవంతులు అమెరికా ప్రయోజనాల కంటే సొంత లాభానికి ప్రాధాన్యమిస్తూ ప్రభుత్వ విధానాలను ప్రభావితం చేస్తున్నారు. దీంతో అమెరికా సమాజంలో అమానవీయమైన మనోవైఖరులు ప్రబలుతున్నాయి. సమాజజీవనంలో సంప్రదాయ విలువలు లుప్తమైపోతున్నాయి. అత్యున్నతస్థాయిలో అమెరికా ప్రభుత్వం తన మహోన్నత ప్రజాస్వామిక చరిత్రను విస్మరించి నిర్లజ్జగా సామ్రాజ్యవాద అభిజాత్యాలకు పోతోంది. అమెరికా ప్రభుత్వం చట్టాల చేత నడపబడేదేకాని, వ్యక్తులు నిర్వహించేదికాదని అమెరికా సంస్థాపకులలో ఒకరైన జాన్ ఆడమ్స్ ప్రవచించారు. ఆడమ్స్ భావాలకు పూర్తి భిన్నంగా ట్రంప్ ఏలుబడిలో వర్తమాన అమెరికా ఉన్నదని ప్రత్యేకంగా చెప్పాలా?