Share News

Digital Violence: డిజిటల్ లైంగిక నేరాలపై చట్టమేదీ?

ABN , Publish Date - Apr 29 , 2025 | 05:44 AM

స్మార్ట్‌ఫోన్లు, ఇంటర్నెట్, సోషల్ మీడియాను వాడుకుని మహిళలపై డిజిటల్‌ హింస పెరుగుతున్నది. మహిళలు, బాలికల అభ్యంతరకర ఫొటోలను, వీడియోలను వారి అనుమతి లేకుండా వ్యాప్తిచేయడం లైంగిక వేధింపుల కంటే...

Digital Violence: డిజిటల్ లైంగిక నేరాలపై చట్టమేదీ?

స్మార్ట్‌ఫోన్లు, ఇంటర్నెట్, సోషల్ మీడియాను వాడుకుని మహిళలపై డిజిటల్‌ హింస పెరుగుతున్నది. మహిళలు, బాలికల అభ్యంతరకర ఫొటోలను, వీడియోలను వారి అనుమతి లేకుండా వ్యాప్తిచేయడం లైంగిక వేధింపుల కంటే తీవ్రంగా విస్తరిస్తున్నది. ఈ తరహా నేర విధానం (మోడస్ ఒపెరాండి)పై ఉక్కుపాదం మోపి ఈ నేరాలను అరికట్టాలి. ఇందుకు తక్షణ కర్తవ్యంగా– ఈ నేరస్థులను కఠినంగా శిక్షించేందుకు చట్టం రూపొందించాలి. అప్‌లోడ్‌ అయిన ఫొటోలను, వీడియోలను త్వరగా తొలగించే సాధనాలను, మార్గాలను గుర్తించాలి. వాటిని బాధితులకు అందించాలి.

అభ్యంతరకర వీడియోలను అప్‌లోడ్ చేస్తున్నప్పుడే గుర్తించి, తొలగించగలిగే సామర్థ్యం యూట్యూబ్ వంటి వేదికలకు ఉంది. ఈ వేదికలు కృత్రిమ మేధస్సుతో పాటు మానవ పర్యవేక్షణను కూడా ఉపయోగిస్తున్నాయి. కానీ, వాట్సాప్ వంటి వేదికలు ఎండ్–టు–ఎండ్ ఎన్‌క్రిప్షన్‌తో గోప్యతకు పెద్దపీట వేయడంతో అక్కడ అభ్యంతరకర సమాచారాన్ని ముందస్తుగా గుర్తించడం గాని, ప్రభుత్వ పర్యవేక్షణ గాని దాదాపు అసాధ్యం. ఎవరైనా ఫిర్యాదు చేస్తే తప్ప వాట్సాప్ చర్యలు తీసుకోలేదు (అప్పుడు కూడా చివరి ఐదు సందేశాలు మాత్రమే పరిశీలనకు వెళ్తాయి). దీనివల్ల ఫిర్యాదు అందని పక్షంలో హానికరమైన కంటెంట్ విచ్చలవిడిగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది.


ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం – 2000, సెక్షన్ 67ఎ ప్రకారం, అసభ్యకర ఫొటోలు, వీడియోలు షేర్ చేసినవారికి ఐదేళ్ల వరకు జైలు శిక్ష విధించవచ్చు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (మధ్యవర్తి మార్గదర్శకాలు, డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) నియమాలు –2021 ప్రకారం చట్టవిరుద్ధమైన సమాచారాన్ని తొలగించడానికి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు త్వరితగతిన చర్యలు తీసుకోవాలి. వ్యక్తిగత ఫిర్యాదుల కోసం ఫిర్యాదు అధికారిని నియమించి 24 గంటల్లోగా చర్య తీసుకోవాలి. కానీ ఇవి సరిపోవు. ప్రత్యేకంగా డిజిటల్ లైంగిక వేధింపులను అరికట్టేందుకు మరింత కఠినమైన, నిర్దిష్టమైన చట్టాల అవసరం ఉంది. సైబర్ నేరాలపై ఫిర్యాదుల కోసం ‘నేషనల్ సైబర్ క్రైమ్‌ రిపోర్టింగ్ పోర్టల్’ (నంబర్‌: 1930)ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే, దీనికి ఆర్థిక నేరాలపైనే ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయి. దానితో ఈ పోర్టల్‌ డిజిటల్‌ లైంగిక వేధింపులపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టలేకపోతోంది. డిజిటల్ వ్యక్తిగత డేటా పరిరక్షణ చట్టం–2023, సెక్షన్ 12(3) ద్వారా అభ్యంతరకర సమాచారం, ఫొటోలు, వీడియోలను ఇంటర్నెట్ నుంచి తొలగించాలని కోరే హక్కును పౌరులకు కల్పించింది. దీని ఉల్లంఘనలపై రూ.50కోట్ల వరకు జరిమానా విధించే అధికారం ‘డేటా పరిరక్షణ బోర్డు’కు ఉంటుంది. ఈ చట్టం ఇంకా అమలులోకి రావాల్సి ఉంది.

అంతర్జాతీయంగా పలు దేశాలు డిజిటల్‌ హింసను అరికట్టేందుకు మెరుగైన చర్యలు తీసుకున్నాయి. మనమూ ఆ ఉదాహరణలను పరిగణనలోకి తీసుకుని కఠినమైన చట్టాన్ని రూపొందించాలి. మెక్సికో, ఆస్ట్రేలియా తరహాలో అభ్యంతరకర వీడియోలు, ఫొటోలను మొదట పోస్ట్ చేసే వారినే కాకుండా, వాటిని ఫార్వర్డ్ చేసే వారిని కూడా కఠినంగా శిక్షించాలి. సోషల్ మీడియా సంస్థలు చట్టాలకు అనుగుణంగా నడుచుకునేలా, ఫిర్యాదులపై తక్షణమే స్పందించేలా చూడాలి. జర్మనీ తరహాలో భారీ జరిమానాలు విధించేలా నిబంధనలను కఠినతరం చేయాలి. ఆస్ట్రేలియా ‘ఇ–సేఫ్టీ కమీషనర్’ తరహాలో ఆన్‌లైన్ వేధింపులపై ఫిర్యాదులను స్వీకరించి, కంటెంట్‌ను వేగంగా తొలగించేందుకు, బాధితులకు సహాయం అందించేందుకు ప్రత్యేక వ్యవస్థలను బలోపేతం చేయాలి.


అంతేగాక పోర్నోగ్రఫీ నియంత్రణపై కూడా దృష్టిపెట్టాలి. అనేక లైంగిక నేరాల విషయంలో నిందితులపై పోర్నోగ్రఫీ ప్రభావం బైటపడింది. పశ్చిమ బెంగాల్ వైద్యురాలి హత్యాచారం కేసులో నిందితుడు పోర్నోగ్రఫీకి బానిస అని తేలింది. ఇప్పటికే బాలల పోర్నోగ్రఫీపై నిషేధం అమల్లో ఉంది. చైనా, యూఏఈ వంటి దేశాలు పోర్నోగ్రఫీపై పూర్తి నిషేధాన్ని అమలు చేస్తున్నాయి. ఈ దేశాలు మహిళలకు, బాలలకు భద్రమైనవిగా పేరు పొందాయి. కొంతకాలం పాటు మన దేశంలో కూడా పోర్నోగ్రఫీపై నిషేధం విధించి, తద్వారా ఇమేజ్ బేస్డ్ అబ్యూజ్‌ను కూడా నిరోధించవచ్చనే ఆలోచనను పరిశీలించాలి. కేవలం చట్టాలు, సాంకేతిక నియంత్రణలే కాకుండా సామాజిక దృక్పథంలో కూడా మార్పు రావాలి. పురుషులందరినీ భావి నేరస్థులుగా ఒకే గాటన కట్టే మూస ధోరణి కన్నా, మహిళలను గౌరవించే, వారి సాధికారతను కోరుకునే పురుషులను యువతకు ఆదర్శంగా చూపాలి.

శ్రీనివాస్ మాధవ్

ఇవి కూడా చదవండి

Jagga Reddy: జగ్గారెడ్డి మాస్ డైలాగ్.. రాజకీయాల్లో విలన్ మేమే, హీరోలం మేమే

Meta AI Chatbot: అశ్లీలతకు అడ్డాగా మారిన మెటా ఏఐ చాట్ బాట్స్

Updated Date - Apr 29 , 2025 | 06:49 AM