Share News

Supreme Court: ఆ తీర్పుతో తెలుగు రాష్ట్రాలకు అన్యాయం

ABN , Publish Date - Aug 02 , 2025 | 04:21 AM

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో తాజా నియోజకవర్గాల పునర్విభజన డీలిమిటేషన్ రాజ్యాంగ విరుద్ధం అంటూనే, జమ్మూకశ్మీర్‌కు

Supreme Court: ఆ తీర్పుతో తెలుగు రాష్ట్రాలకు అన్యాయం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో తాజా నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) రాజ్యాంగ విరుద్ధం అంటూనే, జమ్మూకశ్మీర్‌కు మాత్రం ప్రత్యేకంగా చట్టబద్ధమని సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు అసంతృప్తి కలిగించింది. ఈ తీర్పు ద్వారా భారత న్యాయవ్యవస్థ రాష్ట్రాల మధ్య సమానత్వం అనే తత్వాన్ని విస్మరించిందా? అనిపించింది. 2014లో రాష్ట్ర విభజన తరువాత తెలుగు రాష్ట్రాల్లో జిల్లాలు, నియోజకవర్గాలు, అభివృద్ధి ప్రాంతాలు అన్నీ కొత్తగా ఏర్పడ్డాయి. ప్రజల జనాభా, నగరీకరణ, ప్రజా అవసరాలు వంటివన్నీ మారిపోయాయి. కానీ ఇప్పటికీ 2008లో చేసిన డీలిమిటేషన్ ఆధారంగానే ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదాహరణకు– హైదరాబాద్ మౌలికంగా మారిపోయినా, ఒక నియోజకవర్గంలో ఎక్కువ జనాభా, మరొక నియోజకవర్గంలో తక్కువ జనాభా ఉంది. అలాగే తెలంగాణలోని రంగారెడ్డి, మేడ్చల్, వరంగల్, కరీంనగర్, ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, గుంటూరు వంటి ప్రాంతాల్లో జనాభా వేగంగా పెరిగినా, ఇప్పటికీ పాత నియోజకవర్గ లెక్కలకే పరిమితమవుతున్నారు. ఈ పరిస్థితిలో సమానమైన ప్రజాప్రాతినిధ్యం ఉండడం లేదు.


జమ్మూకశ్మీర్‌లో ఒక ప్రత్యేక చట్టం (Reorganisation Act, 2019) పేరిట డీలిమిటేషన్ చేసిన కేంద్రం, దేశంలో ఉన్న ఇతర రాష్ట్రాలకు మాత్రం ఇది రాజ్యాంగ వ్యతిరేకమని చెప్పడం రెండు రకాల న్యాయం కాదా? ఇది రాజ్యాంగ సమానత్వానికి (ఆర్టికల్‌ 14) విఘాతం. ప్రత్యేక చట్టం తీసుకొచ్చి, రాజకీయ అవసరాల కోసం జమ్మూకశ్మీర్‌లో డీలిమిటేషన్ చేస్తే, అదే విధంగా తెలుగు రాష్ట్రాల పునర్విభజన నేపథ్యంలో ప్రత్యేక చట్టం తీసుకురావడం ఎందుకు సాధ్యం కాదు? 84వ రాజ్యాంగ సవరణ ద్వారా 2026 వరకు డీలిమిటేషన్‌ను ఫ్రీజ్ చేయాలని చెప్పినా, రాష్ట్రాలు విడిపోయాక ఏర్పడిన అసమానతలు మాత్రం రాజ్యాంగం చెప్పిన సమయంలో కలుగలేదు. తెలుగు రాష్ట్రాల పునర్విభజన తర్వాత ఏర్పడిన కొన్ని సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కాలేదు. 2026 వరకు ప్రజల ప్రాతినిధ్య హక్కులను ఇలా మూగబోయించడం న్యాయమా? సుదీర్ఘకాలంగా దక్షిణ భారతదేశం– ముఖ్యంగా తమిళనాడు, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ – జనాభా నియంత్రణలో ముందుండగా, ఉత్తర భారతదేశంలో జనాభా పెరుగుతోంది. 2026 తర్వాత డీలిమిటేషన్ చేస్తే ఎంపీ సీట్లు ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువ, దక్షిణ రాష్ట్రాలకు తక్కువ వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో, 2026లో డీలిమిటేషన్‌తో దక్షిణ రాష్ట్రాల ప్రాధాన్యత తగ్గించాలన్న రాజకీయ ఎజెండా ముందుగానే రూపొందిందా? తెలుగు రాష్ట్రాలు నష్టపోతున్నాయని తెలిసీ, ఎందుకు ఇప్పటికీ కేంద్రం ప్రత్యేక చట్టాన్ని తీసుకురావడం లేదు? జమ్మూకశ్మీర్‌లో ఉన్న ‘‘జాతీయ భద్రత, ప్రత్యేక పరిస్థితులు’’ లాజిక్, బైఫర్‌కేషన్ వల్ల సంక్లిష్టంగా మారిన తెలుగు రాష్ట్రాలకు ఎందుకు వర్తించకూడదు? సుప్రీంకోర్టు ప్రజల ప్రాథమిక హక్కులు, సమర్థమైన ప్రాతినిధ్యం వంటి అంశాలను ఎంతమేరకు గౌరవించింది? ఈ తీర్పు ద్వారా ప్రజాస్వామ్యంలోని అసమానతలు మరింత పెరుగుతాయి. సుప్రీంకోర్టు నిర్ణయం రాజ్యాంగంలో చెప్పిన నిబంధనల ప్రకారం సరైనదిగా అనిపించవచ్చు. కానీ ప్రజాస్వామ్యంలో ప్రజల అభిప్రాయాలకు, అవసరాలకు అనుగుణంగా స్పందించాలి. ప్రజల ప్రాతినిధ్యం అనేది ప్రాథమిక హక్కు. దీన్ని కాలపరిమితి, రాజకీయ అజెండాల పేరుతో వాయిదా వేయడం అనైతికం.

– నాగేందర్‌రెడ్డి కాసర్ల,

ప్రెసిడెంట్, బీఆర్‌ఎస్ ఆస్ట్రేలియా

Updated Date - Aug 02 , 2025 | 10:25 AM